Updated : 24 Sep 2019 00:25 IST

జుట్టంత బెంగ!

వెంట్రుకతో సమానమని గిట్టనివాళ్లను హేళన చేస్తుండొచ్చు గానీ అది రాలిపోతే తెలుస్తుంది దాని గొప్పతనమెంతో! తల మీద నిగనిగలాడుతూ.. సహజ కిరీటంలా భాసిల్లుతూ..  ముఖ సౌందర్యాన్ని ఇనుమడింపజేసే వెంట్రుకలు ఏదో పంతం పట్టినట్టుగా ఒక్కొక్కటీ ఊడి పడిపోతుంటే మనసులో రేగే కలవరం అంతా ఇంతా కాదు.
జుట్టెందుకు ఊడుతుందో? ఊడింది మళ్లీ వస్తుందో, రాదో? అని వగచే ‘బెంగ తలలు’ ఎన్నో.
చిట్కాలతో, మందులతో ఫలితం కనిపించక చివరికింతే అని సరిపెట్టుకునే ‘బోడి తలలు’ ఇంకెన్నో.
అపోహలతో, అవాస్తవాలతో సతమతమయ్యే ‘అనుమాన తలలు’ మరెన్నో.
అన్నింటికీ సమాధానం అందించే ప్రయత్నమే ఈ వారం సుఖీభవ కథనం.

నకు నచ్చకపోయినా ఊడిపోవటం జుట్టు నైజం. మొలవటం ఎంత సహజమో, ఊడటమూ అంతే. నిజానికి ఎంతో కొంత రాలిపోవటమే మేలు. ఊడకుండా అలా పెరుగుతూ వస్తుంటే శుభ్రం చేసుకోవటం, దువ్వుకోవటం, ముడేసుకోవటం ఎంత కష్టమయ్యేదో! తల మీద నిరంతరం పెద్ద బరువును మోయాల్సి వచ్చేది. అదృష్టవశాత్తు ప్రకృతి మనకు అలాంటి ‘కష్టాలు’ పెట్టదలచుకోలేదు. కొన్ని వెంట్రుకలను కొంత కాలానికి రాలిపోయే ‘వరం’ ప్రసాదించింది! కాకపోతే అతిగా, అదేపనిగా రాలిపోవటమే కలవరం కలిగిస్తుంది. వెంట్రుకలు ఒక క్రమ పద్ధతిలో ఎదుగుతూ, ఆగుతూ, రాలిపోతూ వస్తుంటాయి. ఇది మూడు దశలుగా సాగుతుంది. 1. ఎదిగే (అనాజెన్‌) దశ. ఇది 3-6 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఇందులో వెంట్రుకల కుదుళ్లలోని కణాలు చాలా వేగంగా వృద్ధి చెందుతుంటాయి. 2. స్తబ్ధ (కెటాజెన్‌) దశ. సుమారు 2-3 వారాల పాటు సాగే ఇందులో వెంట్రుకలు పెరగటం ఆగిపోతుంది. ఏ సమయంలోనైనా మొత్తం వెంట్రుకల్లో దాదాపు 3% ఈ దశలో ఉంటాయి. 3. విశ్రాంతి (టిలోజెన్‌) దశ. ఇది దాదాపు 100 రోజుల వరకు కొనసాగుతుంది. వెంట్రుకలు రాలిపోయేది ఇందులోనే. సుమారు 6-8% జుట్టు ఈ దశలో ఉంటుంది. ఇదంతా ఒక చట్రంలా అత్యంత సహజంగా, నిరంతరంగా సాగిపోయే ప్రక్రియ. మగవారికి సుమారు లక్ష, ఆడవారికి లక్షన్నర వెంట్రుకలు ఉంటాయి. వీటిల్లో రోజుకు 50-100 వరకు వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఒకవైపు రాలేవి రాలుతున్నా పెరిగేవి పెరుగుతుండటం వల్ల పెద్ద తేడా ఏమీ కనిపించదు. కొందరికి రోజూ కాకుండా వారానికి సరిపడా ఒకరోజే ఊడిపోవచ్చు. దీంతో ఏదో అయిపోయిందని, బట్టతల వచ్చేస్తోందని భయపడిపోతుంటారు. ఇలాంటి భయాలేవీ అవసరం లేదు. విశ్రాంతి దశ తర్వాత ఊడిపోయే వెంట్రుకలు తిరిగి మొలుస్తాయి. వెంట్రుకల ఎదుగుదల, విశ్రాంతి దశలు అస్తవ్యస్తమైతే మాత్రం జుట్టు ఎక్కువగా రాలిపోవటం మొదలెడుతుంది.

బట్టతల- ప్రత్యేక సమస్య

ట్టతల వంశపారంపర్యంగా వచ్చే సమస్య. జన్యు ప్రభావాలతో హార్మోన్లు అస్తవ్యస్తం కావటం దీనికి మూలం. అందుకే దీన్ని ఆండ్రోజెనెటిక్‌ అలోపేషియా అంటారు. ఒకప్పుడు 40 ఏళ్ల తర్వాత మొదలయ్యే బట్టతల ఇప్పుడు 20ల్లోనే మొదలవుతోంది. జన్యువులు త్వరగా వ్యక్తీకరణ కావటం ఇందుకు దోహదం చేస్తోంది. మన ఆహార అలవాట్లు మారటం, పెరుగుతున్న కాలుష్యం వంటివన్నీ దీనికి పురికొల్పుతున్నాయి. తండ్రి, తాతలకు బట్టతల ఉంటేనే తర్వాతి తరానికి వస్తుందని భావిస్తుంటారు. తల్లి, అమ్మమ్మలకు బట్టతల ఉన్నా రావొచ్చు. తండ్రికి, తల్లికి ఇద్దరికీ బట్టతల ఉంటే మరింత త్వరగా వచ్చే అవకాశముంది. సాధారణంగా బట్టతల మగవారికే వస్తుందని భావిస్తుంటారు గానీ ఆడవారికీ వస్తుంది. కాకపోతే వేరుగా ఉంటుంది. మగవారిలో ఆయా భాగాల్లో జుట్టు మొత్తం ఊడిపోతే.. ఆడవారిలో మధ్యమధ్యలో వెంట్రుకలు ఊడిపోయి, జుట్టు పలుచగా అవుతుంది. మగవారిలో కణతల దగ్గర్నుంచి వెంట్రుకలు ఊడిపోవటం మొదలై.. క్రమంగా నుదురు మీది వరకు ‘ఎం’ ఆకారంలో వెంట్రుకలు రాలిపోతుంటాయి. కొందరికి కేవలం మాడు మధ్యలో గుండ్రంగా జుట్టు మొత్తం పోవచ్చు. తల వెనక భాగంలోని వెంట్రుకలు బలంగా ఉంటాయి. ఇవి త్వరగా ఊడిపోవు. అందుకే చాలామందిలో తల వెనక గుర్రపు నాడా ఆకారంలో జుట్టు మిగులుతుంటుంది.

కారణాలు- రకరకాలు

జుట్టు ఊడటం సహజమే అయినా.. ఇతరత్రా సమస్యలూ దీనికి ఆజ్యం పోస్తుంటాయి. చర్మం మీద మచ్చ (స్కార్‌) పడని మామూలు సమస్యలతో ఊడిపోయే జుట్టు మళ్లీ వస్తుంది. అదే మచ్చ పడేలా చేసే సమస్యలతో రాలిన జుట్టు తిరిగి మొలవదు. వీటి గురించి తెలుసుకొని ఉండటం మంచిది.
* ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు: పిల్లల్లో జుట్టు ఊడిపోవటానికి ప్రధాన కారణం ఇవే. పిల్లలు తరగతిలో దగ్గర దగ్గరగా కూర్చుంటారు. ఒకరినొకరు తాకుతుంటారు. ఇతరుల దువ్వెనలనూ వాడుతుండొచ్చు. వీరిలో ఎవరికైనా ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉంటే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. దీంతో జుట్టు ఊడిపోవచ్చు (టీనియా క్యాపిటస్‌). యాంటీ ఫంగల్‌ మందులతో ఇన్‌ఫెక్షన్‌ పూర్తిగా నయమైపోతుంది. జుట్టు తిరిగి వస్తుంది.
* పేను కొరుకుడు (అలోపీషియా ఏరియేటా): ఇందులో అక్కడక్కడా గుండ్రంగా జుట్టు ఊడిపోయి, నున్నగా అవుతుంది. పేలు కొరకటం వల్ల ఇది వస్తుందని భావిస్తుంటారు. నిజానికి పేలు వెంట్రుకలను కొరకవు. దీనికి మూలం రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మన మీదే దాడి చేయటం. దీంతో వెంట్రుకల కుదుళ్లు దెబ్బతిని, రాలిపోతాయి. థైరాయిడ్‌ సమస్యలు, ఎండు గజ్జి, మధుమేహం, మానసిక ఒత్తిడి గలవారిలో ఇది ఎక్కువ. కొందరికి దీని మూలంగా పెద్ద మొత్తంలోనూ జుట్టు ఊడిపోవచ్చు (అలోపీషియా టోటాలిస్‌). వీరిలో కనుబొమలు, కనురెప్పల వెంట్రుకలూ రాలిపోతాయి. పేను కొరుకుడుతో రాలిపోయిన వెంట్రుకలు మూడు, నాలుగు నెలల తర్వాత తిరిగి మొలుస్తాయి.
* చుండ్రు: ఇందులో తలలో నూనె ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది ఎండిపోయి, పొలుసులుగా లేచి దురద తలెత్తుతుంది. అంతేకాదు ఫంగస్‌, బ్యాక్టీరియా వృద్ధి చెందొచ్చు. ఫలితంగా వెంట్రుకలు ఊడిపోవచ్చు.
* పేలు: కొందరికి పేలు ఎక్కువగా ఉండటంతోనూ ఇన్‌ఫెక్షన్లు మొదలై జుట్టు ఊడిపోవచ్చు.
* జుట్టు లాగటం (ట్రైకో టిల్లోమేనియా): కొందరు పిల్లలు వెంట్రుకలను గట్టిగా పట్టుకొని లాగేస్తుంటారు. ఇదీ జుట్టు ఊడిపోవటానికి దారితీస్తుంది. దీనికి మూలం మానసిక సమస్యలు. వీరిలో వెంట్రుకలు మధ్యలో తెగిపోయి ఉంటాయి. కొన్ని పొడుగ్గా, కొన్ని చిన్నగా కనిపిస్తాయి. అక్కడక్కడా వెంట్రుకలు ఊడి ఉంటాయి.
* గట్టిగా జడ బిగించటం (ట్రాక్షన్‌ అలోపీషియా): కొందరు జడ గట్టిగా బిగించి వేస్తుంటారు. దీంతోనూ జుట్టు ఊడిపోవచ్చు.
* ఒత్తిడి: దీని బారినపడ్డవారిలో జుట్టు పలుచగా అవుతుంటుంది (డిఫ్యూజ్‌ హెయిర్‌లాస్‌). ఒకేచోట కాకుండా తలంతా వెంట్రుకలు ఊడిపోతుంటాయి. జ్వరం, కాన్పు, సర్జరీల వంటివీ శరీరాన్ని ఒత్తిడికి గురిచేస్తాయి. అందుకే కొందరికి జ్వరం తగ్గాక, మహిళల్లో కాన్పు అయ్యాక రెండు మూడు నెలల తర్వాత జుట్టు ఊడిపోతుంటుంది (అక్యూట్‌ టిలోజెన్‌ ఎఫ్లూవియమ్‌). చాలామంది భయపడుతూ వస్తుంటారు గానీ ఇది కొద్దిరోజులకు తిరిగి మొలుస్తుంది. చికిత్స తీసుకోవాల్సిన పనేమీ లేదు.
* పోషకాల లోపం: మనదేశంలో పోషకాల లోపం.. ముఖ్యంగా ఐరన్‌ లోపం ఎక్కువ. బి విటమిన్లు, విటమిన్‌ డి లోపాలు సైతం తరచూ కనిపిస్తుంటాయి. వీటితోనూ వెంట్రుకలు పలుచబడొచ్చు. బరువు తగ్గటానికి ఆహార నియమాలు పాటించేవారిలో, బేరియాట్రిక్‌ సర్జరీ చేయించుకున్నవారిలోనూ పోషకాల లోపంతో క్రమంగా జుట్టు ఊడిపోవచ్చు (క్రానిక్‌ టిలోజెన్‌ ఎఫ్లూవియమ్‌).
* సౌందర్య సాధనాలు: కొందరు వెంట్రుకలను తిన్నగా చేయటానికి వేడిని పుట్టించే పరికరాలతో ‘ఐరన్‌’ చేస్తుంటారు. దీంతో జుట్టు ఊడిపోయే ప్రమాదముంది. వంకర్లు తిప్పటంతోనూ వెంట్రుకలు ఊడిపోవచ్చు.
* మందులు: కొన్ని రకాల మందులతోనూ జుట్టు రాలిపోవచ్చు. క్యాన్సర్‌తో మామూలుగానే జుట్టు ఊడిపోతుంటుంది. కీమోథెరపీ మందులతోనూ వెంట్రుకలు ఊడిపోవచ్చు. కొన్నిరకాల మానసిక సమస్యలు, నొప్పి, అధిక రక్తపోటు తగ్గటానికి.. రోగనిరోధకశక్తిని అణచి పెట్టటానికి వేసుకునే మందులతోనూ రాలిపోవచ్చు.
* హార్మోన్ల అస్తవ్యస్తం: థైరాయిడ్‌ హార్మోన్లు ఎక్కువైనా, తక్కువైనా వెంట్రుకలు పెరిగే ప్రక్రియ దెబ్బతిని, రాలిపోవచ్చు. ఆడవారిలో పీసీఓడీ సమస్య మూలంగా  టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌ ఎక్కువగా విడుదలవుతుంది. ఇది ఒకవైపు తల మీద జుట్టు రాలిపోయేలా చేస్తే.. మరోవైపు మిగతా భాగాల్లో వెంట్రుకలు పెరిగేలా చేస్తుంది. పీసీఓడీకి చికిత్స తీసుకుంటే జుట్టు రాలటమూ తగ్గుతుంది. ఇటీవల జిమ్‌కు వెళ్లేవారు ‘వే ప్రోటీన్‌’ వంటివి వాడుకోవటం ఎక్కువైంది. దీంతో టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌ ఉత్పత్తి పెరుగుతుంది.
* చర్మ సమస్యలు: చర్మం మీద మచ్చ (స్కార్‌) పడేలా చేసే చర్మ సమస్యలతోనూ జుట్టు ఊడిపోతుంది. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది డిస్కాయిడ్‌ ల్యూపస్‌ ఎరీథెమటోసస్‌, లైకెన్‌ ప్లేనస్‌ పైలారిస్‌, సార్కాయిడోసిస్‌, జుట్టుకు వచ్చే దీర్ఘకాల ఇన్‌ఫెక్షన్లు. వీటిల్లో కుదుళ్లు మొత్తంగా ఊడి వచ్చేస్తాయి. అందువల్ల వెంట్రుకలు తిరిగి రావటమనేది ఉండదు.

భవిష్యత్తు ఆశ

ప్రస్తుతం కుదుళ్లతో పాటు ఫైబ్రోబ్లాస్ట్‌లు, ఎపిడెర్మల్‌ కణాలను కలిపి ప్రయోగశాలలో వృద్ధి చేయటానికి ప్రయత్నిస్తున్నారు. వీటిని తల చర్మంలో ప్రవేశపెడితే కేశాలు వృద్ధి చెందుతాయి. ఇది సఫలీకృతమైతే జుట్టు కష్టాలు పూర్తిగా తొలగిపోయినట్టే! వచ్చే పదేళ్లలో ఈ పద్ధతి అందుబాటులోకి రావొచ్చు. అప్పుడు హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ప్రక్రియా కనుమరుగు కావొచ్చు.

చికిత్సలు ఉన్నాయి

జుట్టు తీరు తెన్నులను, ఇతరత్రా సమస్యలను విశ్లేషించి సమస్యను గుర్తిస్తారు. అవసరమైతే టైక్రోగ్రామ్‌ పరీక్ష చేస్తారు. చిన్న చర్మం ముక్క తీసి పరీక్షిస్తారు (బయాప్సీ). ఫంగస్‌ ఆనవాళ్లను తెలుసుకోవటానికి స్క్రేపింగ్‌ చేస్తారు. సమస్యలను బట్టి చికిత్స చేస్తారు.
* మందులు: మామూలు సమస్యలతో ఊడినవారికి మినాక్సిడిల్‌ లోషన్‌, పెప్టైడ్‌ లోషన్లతో పాటు ఐరన్‌, బి విటమిన్లు, విటమిన్‌ డి3 బాగా ఉపయోగపడతాయి. అవసరమైతే మగవారికి ఫినాస్టైడ్‌, ఆడవాళ్లకు అల్డక్టోమిన్‌ మాత్రలు ఇస్తారు. ఫినాస్టైడ్‌ మాత్రలతో జుట్టు పెరుగుతుంది గానీ శృంగారాసక్తి తగ్గిపోయే అవకాశముంది. అందువల్ల వీటిని డాక్టర్‌ పర్యవేక్షణలోనే వాడుకోవాలి.
* ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా థెరపీ: ఇందులో ఆయా వ్యక్తుల రక్తాన్ని తీసి.. ప్లేట్‌లెట్లు దండిగా ఉండే ప్లాస్మా ద్రవాన్ని వేరు చేసి.. ఇంజెక్షన్‌ సాయంతో తలలో ఎక్కిస్తారు. ప్లేట్‌లెట్లలోని వృద్ధి కారకాలు వెంట్రుకలు పెరిగేలా చేస్తాయి.
* మూలకణ చికిత్స: ఇందులో వెంట్రుకల కుదుళ్లను ప్రయోగశాలలో వృద్ధి చేసి మూలకణాలను సేకరిస్తారు. వీటిని తల మీద ప్రవేశపెడతారు. దీంతో వెంట్రుకలు వృద్ధి చెందుతాయి.
* స్వల్ప లేజర్‌ కాంతి చికిత్స: లేజర్‌ కాంతితో వెంట్రుకల వృద్ధి కారకాలు ఉత్తేజితం అవుతాయి. దీంతో వెంట్రుకలు పెరుగుతాయి.

శాశ్వత పరిష్కారం- జుట్టు మార్పిడే!

ట్టతలకు ఇతరత్రా చికిత్సలు, పద్ధతులేవైనా తాత్కాలికమే. ఉత్తమమైన, శాశ్వతమైన పరిష్కారం హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషనే. ఇందులో తలలో ఒక చోట ఉన్న వెంట్రుకలను తీసి బట్టతల ఉన్న భాగంలో నాటుతారు. సాధారణంగా తల వెనక ఉన్న వెంట్రుకలను నాటుతారు. అవసరమైతే గడ్డం, ఛాతీ వంటి భాగాల నుంచి తీసి అమర్చొచ్చు. బట్టతల మామూలుగా ఉన్నట్టయితే ఒక రోజులోనే ప్రక్రియ పూర్తవుతుంది. మరీ ఎక్కువగా ఉంటే నెల తర్వాత మరోసారి నాటాల్సి ఉంటుంది. మన వెంట్రుకలు ఒకవైపునకు వాలి ఉంటాయి. నాటేటప్పుడూ అలాగే అమరుస్తారు. దీంతో సహజంగా కనిపిస్తుంది. తల వెనక జుట్టు బలంగా ఉంటుంది కాబట్టి నాటిన చోటా అలాగే ఉంటుంది, పెరుగుతుంది. చికిత్స అనంతరం జుట్టు త్వరగా, మందంగా పెరగటానికి మందులిస్తారు.

రెండు పద్ధతులు

* స్ట్రిప్‌ (ఎఫ్‌యూటీ) పద్ధతి: ఇందులో ఒక్కొక్క వెంట్రుకను తీసి బట్టతల మీద నాటుతారు. తల వెనక ఆక్సిపిటల్‌ భాగంలో వెంట్రుకలు ఉన్నచోట సుమారు 5-15 సెంటీమీటర్ల చర్మం ముక్కను కత్తిరించి,  పక్కన పెడతారు. కుట్లు వేసి కోతను మూసేస్తారు. తర్వాత పక్కన పెట్టిన చర్మంలోని వెంట్రుకలను ఒక్కొక్కటిగా తీసుకొని బట్టతల ఉన్న చోట నాటుతారు.
* ఎఫ్‌యూఈ (ఫాలిక్యులార్‌ యూనిట్‌ ఎక్స్‌ట్రాక్షన్‌) పద్ధతి:వెంట్రుకల కుదుళ్లను విడివిడిగా నాటడం దీని ప్రత్యేకత. మన వెంట్రుకల కుదుళ్లలో 2-5 వెంట్రుకలు గుంపుగా ఉంటాయి. ఇలాంటి గుంపులను అక్కడక్కడ్నుంచి తీసి, ప్రత్యేక ద్రవంలో భద్రపరుస్తారు. అనంతరం బట్టతల ఉన్న చోట అమరుస్తారు. ఇందులో చర్మాన్ని కత్తిరించటమనేది ఉండదు. అందువల్ల మచ్చ పడదు. నొప్పి తక్కువ. ప్రస్తుతం రోబోటిక్‌ పద్ధతిలోనూ దీన్ని చేస్తున్నారు. అవసరమైతే కొందరికి ఈ రెండు పద్ధతులతోనూ వెంట్రుకలను నాటుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు