వస్తున్నాయ్‌.. ఆరోగ్యనవ చక్రాల్‌!

కాలంతో పాటు ఆరోగ్య చక్రమూ గిర్రున తిరుగుతోంది. చూస్తుండగానే ఒక ఏడాది, ఒక దశకం ముగిసిపోతోంది. ఏడాదిని పలికేటప్పుడు ఇప్పటివరకూ వినిపించిన ‘టీన్‌’ శబ్దం మూగబోనుంది. ఉత్సుకత, మెరుపు ఫలితాలకు మారుపేరైన ట్వంటీ20 మాత్రమే ధ్వనించనుంది. ఆరోగ్య పరిరక్షణలోనూ అలాంటి ఉత్సుకతే నెలకొంది. ఎప్పట్నుంచో ఊరిస్తున్న కొత్త చికిత్సలెన్నో నవ దశాబ్దిలో సాకారం కావటానికి ఉవ్విళ్లూరుతున్నాయి....

Published : 31 Dec 2019 07:24 IST

కాలంతో పాటు ఆరోగ్య చక్రమూ గిర్రున తిరుగుతోంది. చూస్తుండగానే ఒక ఏడాది, ఒక దశకం ముగిసిపోతోంది. ఏడాదిని పలికేటప్పుడు ఇప్పటివరకూ వినిపించిన ‘టీన్‌’ శబ్దం మూగబోనుంది. ఉత్సుకత, మెరుపు ఫలితాలకు మారుపేరైన ట్వంటీ20 మాత్రమే ధ్వనించనుంది. ఆరోగ్య పరిరక్షణలోనూ అలాంటి ఉత్సుకతే నెలకొంది. ఎప్పట్నుంచో ఊరిస్తున్న కొత్త చికిత్సలెన్నో నవ దశాబ్దిలో సాకారం కావటానికి ఉవ్విళ్లూరుతున్నాయి. పాత ‘అనుభవాల’ స్ఫూర్తిని పెనవేసుకొని.. శాస్త్ర, సాంకేతిక అధ్యయనాల దన్నుతో సరికొత్త అవతారం దాల్చనున్నాయి. మానవాళి క్షేమం కోసం ‘మేము సైతం’ అంటూ ఆరోగ్యాన్ని బిగిస్తున్నాయి.

డిజిటల్‌ అవయవాలు

గుండెజబ్బులను అనుమానించినప్పుడు యాంజియోగ్రామ్‌ పరీక్ష చేసి, నిర్ధారించటం తప్పనిసరి. స్టెంట్‌ వేయాలా? బైపాస్‌ చేయాలా? అన్నదీ దీంతోనే నిర్ణయిస్తారు. కాకపోతే ఇందుకోసం రక్తనాళం ద్వారా గొట్టాన్ని పంపించి, రంగు ద్రావణాన్ని ఎక్కించి, స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సమస్య లేకపోతే చేసిన పరీక్ష అంతా వృథా అయినట్టే. ఖర్చూ తప్పదు. మున్ముందు ఇలాంటి ఇబ్బందులేవీ ఎదుర్కోవాల్సిన అవసరం ఉండకపోవచ్ఛు తెర మీద ప్రత్యక్షమయ్యే డిజిటల్‌ గుండెతోనే అన్నింటినీ వివరంగా చూడొచ్ఛు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ హార్ట్‌ఫ్లో 3డీ గుండె. స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయ మాజీ ప్రొఫెసర్‌ చార్లెస్‌ టేలర్‌ దీని ఆవిష్కర్త. ఆయా వ్యక్తుల గుండెను ఉన్నది ఉన్నట్టుగా 3డీ రూపంలో చూపించటం దీని ప్రత్యేకత. తెర మీద గుండెను ఎటు కావాలంటే అటు తిప్పుకొని చూడొచ్ఛు ఎక్కడెక్కడ పూడికలు ఉన్నాయి? ఎంత పెద్దగా ఉన్నాయి? గట్టిగా ఉన్నాయా? మెత్తగా ఉన్నాయా? అనేవి తెలుసుకోవచ్ఛు ఎలాంటి చికిత్సలు చేయాలన్నదీ నిర్ణయించుకోవచ్ఛు అసలు యాంజియోప్లాస్టీ అవసరమా? లేదా? అన్నదీ కచ్చితంగా తేల్చుకోవచ్ఛు దీంతో అనవసరంగా ఆపరేషన్‌ చేయటమూ తప్పుతుందన్నమాట. ఇలాంటి పద్ధతులు ఒక గుండెతోనే ఆగిపోయేవి కావు. ఇతరత్రా అన్ని అవయవాల చికిత్సల కోసం ఇలాంటి ప్రక్రియలు అందుబాటులోకి వచ్చే రోజు మరెంతో దూరంలో లేదు.

పరికర సాయం!

రోగ్యానికో పరికరం! వేసే అడుగులు, తీసే కునుకు, తినే తిండి.. సమస్త కార్యకలాపాలను ఓ కంట కనిపెడుతూ, ఆ సమాచారాన్నంతా నిక్షిప్తం చేసుకుంటూ, అవసరమైనప్పుడు అందిస్తూ ఫిట్‌బిట్‌ వంటి పరికరాలు చేస్తున్న సేవ అంతా ఇంతా కాదు. ఒంటికి ధరించగలిగే ఇలాంటివి నయా ఆభరణాలుగానూ మారిపోయాయి. ఇవి శరీర కదలికలను పసిగట్టటంతోనే ఆగిపోవటం లేదు. శ్వాస తీరుతెన్నులను బట్టి ఆస్థమా ఎప్పుడు దాడిచేయొచ్చో హెచ్చరిస్తున్నాయి. గుండె లయ ఆధారంగా గుండెజబ్బులను అనుమానిస్తున్నాయి. శ్వాసలో హైడ్రోజన్‌ స్థాయులను గమనిస్తూ జీర్ణకోశ సమస్యలనూ పట్టుకుంటున్నాయి. కదల్లేని స్థితిలో ఉన్నవారికీ ఉడతా భక్తి సాయం చేస్తున్నాయి. ఉదాహరణకు- కంట్రోల్‌ కిట్‌ వాచ్‌నే తీసుకోండి. చేతులను ఏమాత్రం కదిలించలేని స్థితిలో ఉన్నా మెదడులోని ఆలోచనల ద్వారానే మౌస్‌ను కదిలించటం వంటి పనులెన్నో చేసి పెడుతుంది. మన మెదడులో కదలికలను నియంత్రించే నాడుల నుంచి చేతులకు చేరుకునే సంకేతాలను పసిగట్టటమే కాదు. మెరుపు వేగంతో ఆయా ఆలోచనలకు అనుగుణంగా కదలికలు సాధ్యమయ్యేలా చేస్తుంది. ఈ పరిజ్ఞానాన్ని పక్షవాతం, పార్కిన్సన్స్‌, మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ వంటి సమస్యలతో బాధపడేవారికి, కాళ్లు చేతులు కోల్పోయినవారికి అనుగుణంగానూ వినియోగించుకునే వీలుండటం గమనార్హం. ఇలాంటివి మున్ముందు మరింత వినూత్నంగానూ దర్శనమివ్వనున్నాయి. విస్తృతమైన సమాచారాన్ని, ఆరోగ్య ధోరణులను సమన్వయం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రాణాంతక జబ్బులను, ముప్పులను ముందుగానే గుర్తించి మానవాళి క్షేమానికి పాటు పడనున్నాయి. మరో దశాబ్దంలోపే మనమంతా కొంగొత్త పరికర భూషణాలతో ఆరోగ్యంగా వెలిగిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు.

వయో రక్షకాల ఆశ!

గుండెజబ్బులు, క్యాన్సర్‌, డిమెన్షియా వంటి ఎన్నెన్నో జబ్బులకు పెద్ద ముప్పు వృద్ధాప్యమే. వయసు ముంచుకొస్తున్నకొద్దీ రకరకాల జబ్బుల బారినపడే అవకాశమూ పెరుగుతుంది. అందుకేనేమో వృద్ధాప్యాన్ని జయించటం, ఆయుష్షును పెంచుకోవటం మీద మనిషి మొదట్నుంచీ ఆసక్తి చూపుతూనే ఉన్నాడు. నిజానికి వృద్ధాప్యాన్ని ఒక జబ్బుగా పరిగణించాలనే వాదనా బలంగానే వినిపిస్తోంది. వయసు మీద పడటం సహజ ప్రక్రియే కావొచ్ఛు అయినా దీన్ని మార్చుకునే అవకాశం లేకపోలేదు. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, వ్యాయామం, శారీరక శ్రమ, సామాజికంగా, మానసికంగా చురుకుగా ఉండటం, ఆత్మీయమైన అనుబంధాల వంటివన్నీ ఆయుష్షును పెంచి పోషించేవే. ఇందుకు ఇతరత్రా ఔషధాలేవైనా తోడ్పడతాయా? శాస్త్రరంగం వీటి గురించి లోతుగానే అన్వేషిస్తోంది. ఫలితాలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆశలను రేకెత్తిస్తూనే ఉన్నాయి. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది వయో రక్షకాల (జెరోప్రొటెక్టర్లు) గురించి. జబ్బులు త్వరగా రాకుండా చూడటానికి, శరీర పటుత్వం పెంచటానికివి దోహదం చేస్తాయి. ప్రస్తుతం సుమారు 250 రకాలకు పైగా వయో రక్షకాలున్నాయి గానీ చాలావరకు చికిత్సలో ఉపయోగించటానికి నోచుకోవటం లేదు. కణాలు సజీవంగా ఉండటంలో కీలకపాత్ర పోషించే నికోటినమైడ్‌ అడినైన్‌ డైన్యూక్లియోటైడ్‌ (ఎన్‌ఏడీ ప్లస్‌) అనే సహ ఎంజైమ్‌ ఉత్పత్తిని రాపామైసిన్‌, మెట్‌ఫార్మిన్‌, నికోటినమైడ్‌ రైబోసైడ్‌ వంటి మందులు పెంపొందిస్తాయి. ఇక వృద్ధాప్య కణాలను నిర్మూలించే సెనోలిటిక్స్‌- శుక్లాలు, కీళ్లవాపులు, ఎముక క్షీణత, అధిక రక్తపోటు, మతిమరుపు, కండర క్షీణత వంటివి త్వరగా ముంచుకురాకుండా చేస్తాయి. కాకపోతే వీటితో తలెత్తే దుష్ప్రభావాలే వెనకడుగు వేయిస్తున్నాయి. ప్రస్తుతం వీటిని సురక్షిత రూపంలోకి మార్చటంపై జీవవైద్య శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. మరో దశాబ్దంలోనే ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంటే వృద్ధాప్యాన్ని, వృద్ధాప్యంతో ముంచుకొచ్చే సమస్యలను వాయిదా వేసుకునే రోజులు ఇంకెంతో దూరంలో లేవన్నమాట.

ద్రవ బయాప్సీ

క్యాన్సర్లను నిర్ధారించటానికి కణితి నుంచి చిన్న ముక్క తీసి పరీక్ష (బయాప్సీ) చేయటం తెలిసిందే. సూదిని లోపలికి పంపించి ముక్కను తీయటం, న్యూక్లిక్‌ ఆమ్లంలో వేసి క్యాన్సర్‌ కణాలను వేరు చేయటం, మైక్రోస్కోప్‌ ద్వారా కణాలను పెద్దగా చేసి చూడటం.. ఇదంతా పెద్ద ప్రక్రియ. సమయంతో కూడుకున్న పని. ఇలాంటి బయాప్సీ పరీక్షలు ఇంకెంతో కాలం కొనసాగకపోవచ్ఛు ఎందుకంటే ద్రవ బయాప్సీ విధానం శరవేగంతో విస్తరిస్తోంది. ఒక్క రక్త పరీక్షతోనే క్యాన్సర్ల ఆనవాళ్లను పోల్చుకోవటం, నిర్ధారించటం దీని ప్రత్యేకత. క్యాన్సర్‌ కణితుల నుంచి వెలువడే కణాలు, వాటి జన్యు పదార్థం రక్తంలో తిరుగాడుతూ ఉంటాయి. ప్రత్యేకమైన రక్త పరీక్ష ద్వారా వీటిని పట్టుకోవచ్ఛు దీన్నే ‘లిక్విడ్‌ బయాప్సీ’ అనీ పిలుచుకుంటున్నారు. ఇందులో సూదితో కణితి వరకూ వెళ్లాల్సిన పనిలేదు. ఒక్క రక్తనమూనాతోనే కణితి ఎలా ఉంది? ఎంత తీవ్రంగా ఉంది? అనేది త్వరగా, తేలికగా తెలుస్తాయి. చికిత్సలు ఎలా పనిచేస్తున్నాయన్నదీ కచ్చితంగా తెలుసుకోవచ్ఛు ప్రస్తుతం ద్రవ బయాప్సీని క్యాన్సర్‌ను ప్రేరేపిస్తున్న అంశాలను తెలుసుకోవటానికి, చికిత్సలను ఎంచుకోవటానికి ఉపయోగిస్తున్నారు. మున్ముందు దీని విస్తృతి గణనీయంగా పెరగొచ్ఛు క్యాన్సర్‌ తిరగబెట్టే ముప్పును నిర్ధారించటానికి, ఒకవేళ తిరగబెడితే సీటీ స్కాన్‌ కన్నా ముందే గుర్తించటానికి, ఎలాంటి మందులను కలిపి ఇవ్వాలో నిర్ణయించుకోవటానికి సైతం దోహదం చేయొచ్ఛు ఒకవేళ జన్యు మార్పులు క్యాన్సర్‌ను ప్రేరేపిస్తుంటే వాటిని సరిదిద్దటానికి అవసరమైన సమాచారాన్నీ ముందుగానే తెలుసుకోవచ్ఛు రక్త నమూనా విశ్లేషణతోనే క్యాన్సర్‌ ముదురుతున్న తీరునూ పసిగట్టొచ్ఛు.

మూలంలోనే చికిత్సలు

పుట్టుకతో వచ్చే జన్యు సమస్యలు ఎప్పుడూ పెద్ద సమస్యే. వీటిని జీవితాంతం భరించటం తప్ప చేయగలిగిందేమీ లేదు. జబ్బుల కారణాలను మూలాలలోనే.. అంటే జన్యువులోనే సరిదిద్దగలిగితే? ఇది చాలా సంక్లిష్టమైన, సున్నితమైనదే అయినా క్రిస్ప్‌ఆర్‌ వంటి అధునాతన జన్యు సవరణ చికిత్సలతో మున్ముందు మరింత సులువు కానుంది. ప్రస్తుతానికిది ప్రయోగదశలోనే ఉన్నా కొంగొత్త ఆశలను రేకెత్తిస్తోంది. ఇటీవలే అమెరికా వైద్యులు క్రిస్ప్‌ఆర్‌ పద్ధతిలో సికిల్‌ సెల్‌ జబ్బు బాధితురాలికి విజయవంతంగా చికిత్స చేయటం గమనార్హం. ఒకే జన్యులోపంతో ముడిపడిన సిస్టిక్‌ ఫైబ్రోసిస్‌, హిమోఫిలియా వంటి జబ్బులకే కాదు. క్యాన్సర్‌, గుండెజబ్బు, మానసిక సమస్యలు, హెచ్‌ఐవీ వంటి సంక్లిష్ట సమస్యల నివారణకు, చికిత్సకూ ఇది ఉపయోగపడగలదని భావిస్తున్నారు. మరోవైపు మన రోగనిరోధక కణాలనే అస్త్రాలుగా మార్చి జబ్బుల మీద ప్రయోగించే రోగనిరోధక చికిత్సలూ వెల్లువెత్తటం ఖాయంగా కనిపిస్తోంది. కొన్నిరకాల క్యాన్సర్ల కోసం కిమ్రియా, యెస్‌కార్టా అనే రోగనిరోధక చికిత్సలకు అమెరికా ఎఫ్‌డీఏ ఇప్పటికే ఆమోదం తెలిపింది. కొత్త క్యాన్సర్‌ ఔషధాలు, చికిత్సల వెల్లువకు పునాదులు పడుతున్నాయనటానికి ఇవే నిదర్శనాలు. మరోవైపు పునరుత్తేజిత.. అదే మూలకణ చికిత్సలూ కొంగొత్త ఆశలు కల్పిస్తున్నాయి. దెబ్బతిన్న మృదులాస్థి వంటి కణజాలాన్ని మరమ్మతు చేసి తిరిగి సమర్థంగా పనిచేయించటం వీటి ప్రత్యేకత. ఇప్పటికే వీటి ఫలితాలను చూస్తున్నాం. అవయవాల మార్పిడి చికిత్సలనూ ఇవి పూర్తిగా మార్చేయనున్నాయి. అవయవాల మార్పిడికి బదులు మూలకణాలనే వినియోగించుకోవాలన్నది భవిష్యత్‌ వ్యూహం. ఇది సాధ్యమైతే జబ్బుల నివారణ, చికిత్సలు కొత్త మలుపు తిరగటం ఖాయం. త్వరలోనే వీటి ఫలితాలను మనం చూడబోతున్నామన్నది వైద్య పరిశోధకుల ధీమా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని