‘వ్రణ’రంగాన విజయం మనదే!

క్యాన్సర్‌ విషయంలో ఇప్పుడిలాంటి చొరవే అవసరమని ప్రపంచ క్యాన్సర్‌ దినం సూచిస్తోంది. క్యాన్సర్‌ బారినపడకుండా ఉండటానికైనా, క్యాన్సర్‌ మరణాలను తగ్గించుకోవటానికైనా వ్యక్తిగా, సమాజంగా, సంస్థగా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, చేద్దామని నినదిస్తోంది.

Published : 04 Feb 2020 01:58 IST

నేడు ప్రపంచ క్యాన్సర్‌ దినం

నేను తెలుసుకుంటాను
నేను జాగ్రత్తగా మసలుకుంటాను
ముప్పు కారకాలను తగ్గించుకుంటాను
నివారణ కోసం ప్రయత్నిస్తాను

క్యాన్సర్‌ విషయంలో ఇప్పుడిలాంటి చొరవే అవసరమని ప్రపంచ క్యాన్సర్‌ దినం సూచిస్తోంది. క్యాన్సర్‌ బారినపడకుండా ఉండటానికైనా, క్యాన్సర్‌ మరణాలను తగ్గించుకోవటానికైనా వ్యక్తిగా, సమాజంగా, సంస్థగా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, చేద్దామని నినదిస్తోంది.
ఒకప్పటిలా క్యాన్సర్‌ అంటే బెంబేలెత్తిపోయే పరిస్థితి లేదు. క్యాన్సర్‌ వస్తే మరణమే గతి అన్న దశ నుంచి అత్యాధునిక పరీక్షలు, సమర్థ చికిత్సల సాయంతో జయించే స్థితికి చేరుకున్నాం. మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యల స్థాయికి క్యాన్సర్‌ను తీసుకురాగలిగామన్నా అతిశయోక్తి కాదు. అయినా కూడా ఏదో వెలితి. ఎక్కడో లోపం. ప్రతి సంవత్సరం 96 లక్షల మంది క్యాన్సర్లకు బలైపోతుండటమే దీనికి నిదర్శనం. వీరిలో 37 లక్షల మందిని కాపాడుకునే అవకాశమున్నా ఎందుకీ దుస్థితి? మనం ఎక్కడ వెనకపడిపోతున్నాం? అందరమూ వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. చిత్తశుద్ధితో సమాధానాలు వెతకాల్సిన సమయమిది. క్యాన్సర్లు జన్యుమార్పులతోనే తలెత్తటం నిజమే అయినా వీటి పాత్ర 5-10 శాతమే. పొగాకు, మద్యంతో ముడిపడిన క్యాన్సర్లు 27 శాతానికి పైనే. మన ఆహార విహారాల్లో మార్పుల వంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, ఒకింత శ్రద్ధ వహిస్తే క్యాన్సర్లను నివారించుకోవటం అసాధ్యమేమీ కాదనే విషయాన్ని ఇది చెప్పకనే చెబుతోంది. అందువల్ల క్యాన్సర్‌పై అవగాహన ఏర్పరచుకోవటం, ముప్పు కారకాలు, నివారణ మార్గాలను తెలుసుకొని ఆచరించటం మనందరి విధి.
ఏంటీ క్యాన్సర్‌?
ఒక్కమాటలో చెప్పాలంటే- కణజాలం అనవసరంగా, ఆగకుండా, విపరీతంగా విభజన చెందటం. సాధారణంగా మన ఒంట్లో కణాలు అవసరమైనప్పుడు విభజన చెందుతూ వస్తాయి. అవసరం తీరిన తర్వాత ఆగిపోతాయి. ఎప్పుడు విభజన చెందాలో, ఎప్పుడు ఆగిపోవాలో కణాలే నిర్ణయించుకోవటం విశేషం. ఇందుకు అవసరమైన సంకేతాన్నీ (మాలిక్యులర్‌ స్విచ్‌- కణ మీట) తామే రూపొందించుకుంటాయి. కణం రెండుగా విడిపోయినప్పుడు వాటిల్లో ఒకటి ప్రత్యేక నైపుణ్య కణంగా మారిపోతుంది. ఇది తిరిగి విభజన చెందదు. మరో కణమే విభజన చెందుతుంది. దీన్నే తల్లికణం లేదా మూలకణం అంటాం. ఇది చనిపోదు. ఒకవేళ విడిపోయిన కణాలు రెండూ విభజన చెందుతుంటే వాటికి చావనేదే ఉండదు. ఇవే క్యాన్సర్‌ కణాలు. విభజన చెందొద్దు అని చెప్పే సంకేతం ఏదీ వీటిల్లో ఉండదు. దీంతో అదేపనిగా పెరిగిపోతూ వస్తాయి. వీటి నుంచి పుట్టుకొచ్చిన కణాల్లోనూ దెబ్బతిన్న విభజన క్రమమే కొనసాగుతూ వస్తుంటుంది. ఫలితంగా కణాలు తామరతంపరగా వృద్ధి చెందుతూ.. పక్కనున్న కణాలన్నింటినీ ఛేదించుకుంటూ విస్తరిస్తుంటాయి. ఇదే క్యాన్సర్‌.
ఎందుకీ అనవసర విభజన?
కణ విభజన ప్రక్రియను పర్యవేక్షించటానికి ప్రతి కణంలోనూ నియంత్రణ జన్యువులుంటాయి. వీటినే యాంటీ క్యాన్సర్‌ లేదా ఆంకో జన్యువులు అంటారు. ఇవి కణ విభజన సాఫీగా సాగేలా చూడటంతో పాటు విభజనకు పనికిరాని కణాలు వాటంతటవే చనిపోయేలానూ పురికొల్పుతుంటాయి. క్యాన్సర్‌ కణాలు ముందుగా వీటిని నిర్వీర్యం చేసేస్తాయి. అంటే తమ విభజనను నియంత్రించే వ్యవస్థ లేకుండా ‘జాగ్రత్త’ పడతాయన్నమాట. దీంతో అవి  నిరంతరాయంగా అడ్డూ ఆపూ లేకుండా వృద్ధి చెందుతూ వస్తుంటాయి.
* క్రోమోజోముల్లో చీలికలూ క్యాన్సర్లకు దారితీయొచ్చు. చీలికల మూలంగా క్రోమోజోములు తిరిగి కలుసుకున్నప్పుడు సరిగ్గా అతుక్కోవు. కొన్ని జన్యువులు స్థానభ్రంశమై మరోచోట స్థిరపడొచ్చు. ఫలితంగా జన్యు వ్యక్తీకరణ తీరు మారిపోయి కణాలు వేగంగా వృద్ధి చెందొచ్చు.


* కణ విభజన చెందిన ప్రతిసారీ క్రోమోజోమ్‌ల చివర తోక (టిలోమియర్‌) పొట్టిగా అవుతుంది. దీన్ని పొడవుగా చేయటానికి టిలోమెరేజ్‌ ఎంజైమ్‌ తోడ్పడుతుంది. క్యాన్సర్‌ కణాల్లో టిలోమెరేజ్‌ ఎంజైమ్‌ చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో కణ విభజన ఆగకుండా సాగుతూ వస్తుంది.


నివారణ మార్గముంది
* రోజుకు 250 గ్రాముల కూరగాయలు, 150 గ్రాముల పండ్లు తినాలి. పండ్లు రోజూ తినటం వీలు కాకపోతే వారానికి మూడు నాలుగు రోజులైనా తీసుకోవాలి. ఆహారంలో తగినంత పీచు ఉండేలా చూసుకోవాలి. మాంసాహారులు మాంసంతో పాటు పండ్లు, కూరగాయలూ తీసుకోవాలి.
* రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం, శారీరక శ్రమ చేయాలి. వ్యాయామంతో వాపు ప్రక్రియను (ఇన్‌ఫ్లమేషన్‌) అడ్డుకునే రసాయనాలు విడుదలవుతాయి. ఇవి క్యాన్సర్‌ నివారణకు తోడ్పడతాయి. వ్యాయామంతో బరువూ అదుపులో ఉంటుంది. ఇదీ క్యాన్సర్‌ రాకుండా చూసేదే.
* మద్యం అలవాటుకు దూరంగా ఉండాలి. ఒకవేళ మద్యం అలవాటుంటే పరిమితం చేసుకోవాలి.
* సిగరెట్లు, బీడీలు, చుట్టల వంటివి తాగటం మానెయ్యాలి. పొగాకు నమలటం ఏమాత్రం మంచిది కాదు.
* హెపటైటిస్‌ బి టీకాతో కాలేయ క్యాన్సర్‌ను నివారించుకోవచ్చు.
* యుక్తవయసు ఆడపిల్లలకు హెచ్‌పీవీ టీకా వేయిస్తే గర్భాశయ ముఖద్వార, జననాంగ క్యాన్సర్ల వంటివి తప్పించుకోవచ్చు.
* ముందస్తు పరీక్షలతో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ ఆనవాళ్లను ముందే పట్టుకోవచ్చు.
కొత్త చికిత్సల ఆశ
క్యాన్సర్‌ చికిత్సలతో బాగా నీరస పడిపోతారని, బలహీనమైపోతారని, జుట్టు ఊడిపోతుందని, బాధాకరంగా ఉంటుందని, తట్టుకోలేమని, ఒంట్లో వేడి పుడుతుందని, వాంతులవుతాయని, అన్నం తినలేమని కొందరు జంకుతుంటారు. దీని మూలంగానే చాలామంది క్యాన్సర్‌ చికిత్సలకు వెనకాడుతుంటారు. ఇలాంటి భయాలేవీ పెట్టుకోవద్దు. ఇప్పుడు అంతగా దుష్ప్రభావాలేవీ లేని, సమర్థంగా పనిచేసే మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. పైగా ఇప్పుడు క్యాన్సర్‌ చికిత్సలో టార్గెటెడ్‌ థెరపీ సరికొత్త ఆశలను కల్పిస్తోంది. క్యాన్సర్‌కు కారణమవుతున్న జన్యుమార్పులను తుదముట్టించే ఇది కణ విభజనకు తోడ్పడే మీటను (మాలిక్యులర్‌ స్విచ్‌) స్విచాఫ్‌ చేసేస్తుంది. ఇదొక్కటే కాదు.. ఇమ్యూనోథెరపీ సైతం కొంగొత్త ఆశలను రేకెత్తిస్తోంది. మన రోగనిరోధక వ్యవస్థలో భాగమైన టి కణాలు క్యాన్సర్‌ కణాలను హతమారుస్తుంటాయి. క్యాన్సర్‌ మూలంగా ఇవి చతికిల పడిపోతుంటాయి. వీటిని ప్రేరేపించి, కొత్త జవసత్వాలు కల్పించి క్యాన్సర్‌ కణాల పనిపట్టేలా తీర్చిదిద్దటం ఇమ్యూనోథెరపీలో కీలకాంశం. ఇందులో ముందుగా క్యాన్సర్‌ మూలంగా నిర్వీర్యమైన టి కణాలను బయటకు తీసి వృద్ధి చేస్తారు. వాటికి కొన్ని మందులను జోడించి కోల్పోయిన రోగనిరోధకశక్తిని తిరిగి సంతరించుకునేలా చేస్తారు. ఇలాంటి కణాలను పెద్దఎత్తున వృద్ధి చేసి మళ్లీ శరీరంలో ప్రవేశపెడతారు. దీంతో మన శరీరమే క్యాన్సర్‌ కణాలను వెతికి పట్టుకొని, వాటిని నిర్మూలించేస్తుంది. ఇమ్యూనోథెరపీ ఇప్పుడిప్పుడే బాగా ప్రాచుర్యం పొందుతోంది.


ఇవీ హెచ్చరిక సంకేతాలు
* మలమూత్ర విసర్జనలో మార్పులు
* పుండ్లు మానకుండా దీర్ఘకాలంగా వేధించటం
* ఎక్కడైనా ఒంట్లోంచి అసహజంగా రక్తస్రావం
* అకారణంగా బరువు, ఆకలి తగ్గటం
* ముద్ద మింగటం కష్టంగా ఉండటం
* అజీర్ణం తగ్గకుండా వేధించటం
* పుట్టుమచ్చలు, పులిపిర్లలో కొత్తగా అసహజ మార్పులు
* దగ్గు తగ్గకుండా రావటం, గొంతు బొంగురు వీడకపోవటం
* ఒంట్లో ఎక్కడైనా గడ్డలు.. ముఖ్యంగా నొప్పి లేకుండా సైజు పెరుగుతూ రావటం
* నిస్సత్తువ, తీవ్రమైన అలసట, బలహీనత
* రొమ్ముల ఆకారంలో మార్పులు, గడ్డలు, నొప్పి
* రాత్రిపూట తీవ్రమైన చెమట్లు


ముప్పు కారకాలపై కన్నేయండి
క్యాన్సర్‌ నాకెందుకు వస్తుందని అనుకోవద్దు. ఇది ఎవరికైనా రావొచ్చు. కుటుంబంలో ఎవరైనా క్యాన్సర్‌ బాధితులుంటే ముప్పు పెరిగే మాట నిజమే అయినా కుటుంబంలో ఎవరికీ లేకపోయినా రాకూడదనేమీ లేదు. నిజానికి క్యాన్సర్‌ రావటమనేది (ప్రోనెస్‌) మనలోనే ఉంటుంది. జన్యువుల్లో మార్పులే కాదు.. మనం తినే ఆహారం, అధిక బరువు, బయటి వాతావరణంలోని అతి నీలలోహిత కిరణాలు, వైరస్‌లు, రసాయనాలు, కాలుష్యం, సిగరెట్లు, మద్యం వంటివెన్నో కణ విభజన క్రమాన్ని, యంత్రాంగాన్ని అస్తవ్యస్తం చేయొచ్చు. ఇలా జన్యు వ్యక్తీకరణ ప్రక్రియను దెబ్బతీసేవన్నీ క్యాన్సర్‌ కారకాలుగా పరిణమిస్తాయి (కార్సినోజెనెసిస్‌). ఇందులో మన జీవనశైలే కీలకం. మూడింట రెండొంతుల క్యాన్సర్లు జీవనశైలితో ముడిపడినవే కావటం గమనార్హం.

* అధిక బరువు: ఒక వయసు వచ్చాక అదేపనిగా బరువు పెరగటమనేది మంచిది కాదు. ఊబకాయం మూలంగా ఒంట్లో నిరంతరం స్వల్పస్థాయిలో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) కొనసాగుతుంటుంది. ఇది జన్యువుల్లో డీఎన్‌ఏ దెబ్బతినటానికి దారితీస్తుంది. ఊబకాయుల్లో ఇన్సులిన్‌, ఇన్సులిన్‌ వంటి గ్రోత్‌ హార్మోన్‌ స్థాయులూ అధికంగా ఉంటాయి. మరోవైపు ఒంట్లోని కొవ్వు ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఎక్కువగా ఉత్పత్తయ్యేలా చేస్తుంది. ఇవన్నీ పెద్దపేగు, రొమ్ము, గర్భాశయ, అండాశయ, క్లోమ, కాలేయ, అన్నవాహిక, కిడ్నీ, ప్రొస్టేట్‌, పిత్తాశయ క్యాన్సర్ల ముప్పు పెరిగేలా చేస్తాయి.
* మద్యం: మద్యం ఒంట్లోకి ప్రవేశించాక అసిటాల్డిహైడ్‌ రసాయనంగా మారుతుంది. ఇది డీఎన్‌ఏను దెబ్బతీస్తుంది, కణాల మరమ్మతు ప్రక్రియను అడ్డుకుంటుంది. మద్యం మూలంగా ఈస్ట్రోజెన్‌, ఇన్సులిన్‌ వంటి హార్మోన్ల స్థాయులు పెరుగుతాయి. అంతేకాదు, మద్యం తాగటం వల్ల నోరు, గొంతు మధ్యలోని కణాలు దెబ్బతింటాయి. ఇవన్నీ క్యాన్సర్లకు దారితీసేవే. మద్యంతో నోరు, గొంతు, స్వరపేటిక, అన్నవాహిక, పెద్దపేగు, కాలేయ, రొమ్ము క్యాన్సర్ల ముప్పు పెరుగుతుంది.


* పొగాకు: క్యాన్సర్లలో 22% పొగాకు మూలంగా సంభవిస్తున్నవే. మామూలు కణాన్ని పొగాకు చాలా తేలికగా క్యాన్సర్‌ కణంగా మారేలా చేస్తుంది. పొగాకులో సుమారు 7వేల రకాల విషతుల్యాలుంటే.. వీటిల్లో 400 రకాల రసాయనాలు క్యాన్సర్‌ కారకాలుగా పరిణమిస్తున్నాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. పొగాకుతో నోరు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు వస్తాయనే చాలామంది భావిస్తుంటారు గానీ దీంతో మెడ, గొంతు, అన్నవాహిక, జీర్ణాశయం, క్లోమం, కిడ్నీ, మూత్రాశయ క్యాన్సర్ల వంటి ఎన్నో క్యాన్సర్లు పుట్టుకొస్తాయి.


* వైరస్‌లు: హెపటైటిస్‌ బి, హెపటైటిస్‌ సి వైరస్‌లు కాలేయ క్యాన్సర్‌కు దారితీయొచ్చు. హెచ్‌పీవీ వైరస్‌తో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ రావొచ్చు. అలాగే జననాంగ క్యాన్సర్‌, మలద్వార క్యాన్సర్‌, రెక్టల్‌ క్యాన్సర్‌, నోటి క్యాన్సర్‌, గొంతు క్యాన్సర్లు సైతం రావొచ్చు.
* ఆహార అలవాట్లు: మాంసాహారం, కొవ్వు పదార్థాలు మితిమీరితే క్యాన్సర్‌ ముప్పు పెరగొచ్చు. శాకాహారం మాత్రమే తినేవారిలో ప్రతి వెయ్యిమందిలో 15-35 మందికి.. శాకాహారం, మాంసాహారం రెండూ తినేవారిలో 35-75 మందికి క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉంటుండగా.. పూర్తిగా మాంసాహారమే తినేవారిలో ఏకంగా 195-210 మందికి క్యాన్సర్‌ వచ్చే అవకాశముండటం గమనార్హం. కొవ్వు, ఉప్పు, చక్కెరలు అధికంగా ఉండే పదార్థాలు (హెచ్‌ఎఫ్‌ఎస్‌ఎస్‌ ఫుడ్స్‌) సైతం క్యాన్సర్లకు దారితీయొచ్చు.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని