పసిగుడ్డుకు ‘నవ’ రక్షణ!

పిల్లలంటేనే కుసుమ కోమలాలు. నవజాత శిశువులైతే ఇంకా కోమలం. నెలలు నిండక ముందే పుట్టినవారైతే మరింత సున్నితం. కంటికి రెప్పలా జాగ్రత్తగా కాపాడుకుంటేనే గానీ బతికించుకోవటం కష్టం. ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్లు తలెత్తకుండా చూసుకోవటం చాలా కీలకం. ఇన్‌ఫెక్షన్‌ రక్తంలోకి చేరి

Published : 18 Feb 2020 01:25 IST

వైద్యం-శాస్త్ర సాంకేతికం

పిల్లలంటేనే కుసుమ కోమలాలు. నవజాత శిశువులైతే ఇంకా కోమలం. నెలలు నిండక ముందే పుట్టినవారైతే మరింత సున్నితం. కంటికి రెప్పలా జాగ్రత్తగా కాపాడుకుంటేనే గానీ బతికించుకోవటం కష్టం. ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్లు తలెత్తకుండా చూసుకోవటం చాలా కీలకం. ఇన్‌ఫెక్షన్‌ రక్తంలోకి చేరి ఒళ్లంతా వ్యాపిస్తే (సెప్సిస్‌) మహా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. సమస్య మొదలవుతున్నప్పుడే గుర్తించి, చికిత్స ఆరంభించటం.. ఇందుకోసం బిడ్డను నిరంతరం కనిపెట్టుకొని ఉండటం ఎంతైనా అవసరం. మానవ మాత్రులమైన మనకు ఇది అన్నిసార్లూ సాధ్యపడకపోవచ్చు. అందుకే వైద్యరంగం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వైపు చూస్తోంది. ప్రత్యేకించి కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) సాయంతో సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తోంది.
బిడ్డను ఇంక్యుబేటర్‌లో పెట్టారు, ఏం చేస్తున్నారో ఏమో? మాకేం తెలవటం లేదు’- నెలలు నిండకముందే పుట్టిన పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఇలా బెంగపడటం చూస్తూనే ఉంటాం. అతి సున్నితమైన ఇలాంటి పిల్లల సంరక్షణ చాలా కష్టమైన పని అనే విషయం చాలామందికి తెలియదు. బిడ్డను వెచ్చగా ఉంచాలి. శ్వాస సరిగా తీసుకునేలా, రక్తపోటు పడిపోకుండా, గుండె వేగం మరీ పెరగకుండా చూసుకోవాలి. శరీరంలోని అన్ని అవయవాలు, వ్యవస్థలు సరిగా పనిచేస్తున్నాయా? జీవక్రియలు ఎలా సాగుతున్నాయి? గ్లూకోజు, పోషకాలు, ఖనిజ లవణాల మోతాదులేమైనా తగ్గుతున్నాయా? ఇన్‌ఫెక్షన్‌ తలెత్తుతోందా? అనేవి గమనిస్తూ నిరంతరం కనిపెట్టుకుంటూ ఉండాలి. లేకపోతే చూస్తుండగానే పరిస్థితి చేయి దాటిపోవచ్చు. బిడ్డ ప్రాణాలకే ముప్పు వాటిల్లొచ్చు. ఇదంతా శ్రమతో కూడుకున్న పనే కాదు, ఖర్చు కూడా ఎక్కువే. ఇలాంటి ఇబ్బందులను అధిగమించటానికే కృత్రిమ మేధ, దాంతో కూడిన పరికరాలు, వ్యవస్థలు మేమున్నామంటూ చేయి అందిస్తున్నాయి. మన కంటికి సాధ్యం కాని నిరంతర నిఘాతో ప్రమాద సంకేతాలను ముందే గుర్తించి, హెచ్చరించటం దగ్గర్నుంచి పరిష్కార మార్గాలను సూచించే విధంగానూ రూపుదిద్దుకుంటున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే వీటిని వాడుకుంటూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఇప్పుడు మన హైదరాబాద్‌లోని కొన్ని ఆసుపత్రుల్లోనూ వీటిని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. కాలి బొటనవేలుకు తగిలించే చిన్న చిప్‌లాంటి పరికరంతోనే ఎన్నెన్నో ప్రయోజనాలు కనిపిస్తుండటం విశేషం. దీన్ని సరిగ్గా వినియోగించుకోగలిగితే శిశు సంరక్షణ గణనీయంగా మెరుగవుతుంది. మరణాలు తగ్గుతాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా శిశు మరణాలను 12కు (ప్రతి వెయ్యి జననాల్లో) తగ్గించుకోవాలనేది మన ఆశయం. కేంద్ర ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో, పెద్ద పట్టణాల్లో నెలకొల్పిన ప్రత్యేక నవజాత సంరక్షణ కేంద్రాల్లో కృత్రిమ మేధ పరికరాలను వాడుకుంటే ఈ లక్ష్యాన్ని తేలికగా, చవకగా, త్వరగా సాధించొచ్చు. మన జాతి భవిష్యత్తు అయిన పిల్లలను కాపాడుకోవటమే కాదు, మున్ముందు ఎలాంటి అవకరాలు లేకుండా హాయిగా జీవించేలా చూసుకోవచ్చు.
సెప్సిస్‌ పెద్ద సమస్య
నవజాత శిశువుల మరణాలకు అతిపెద్ద కారణం- ఇన్‌ఫెక్షన్‌ రక్తం ద్వారా ఒళ్లంతా వ్యాపించటమే. దీన్నే సెప్టిసీమియా అంటారు. నెలలు నిండక ముందే పుట్టే పిల్లలకు దీని ముప్పు ఎక్కువ. ఇలాంటి పిల్లల్లో రోగనిరోధక వ్యవస్థ సరిగా అభివృద్ధి చెందదు. దీంతో ఏమాత్రం బ్యాక్టీరియా ప్రభావానికి గురైనా ఇన్‌ఫెక్షన్‌ ఒళ్లంతా విస్తరించే ప్రమాదముంది. ఉమ్మనీటిలో ఇన్‌ఫెక్షన్‌, తల్లి జననాంగ మార్గంలో ఇన్‌ఫెక్షన్‌.. లేదూ ఆసుపత్రిలో, ఇంట్లో ఇన్‌ఫెక్షన్‌ వంటివేవైనా సెప్సిస్‌కు దారితీయొచ్చు. వీరిలో గుండె వేగంగా కొట్టుకోవటం, జ్వరం, శ్వాస వేగంగా తీసుకోవటం, పాలు తాగలేకపోవటం, కాలేయం వాపు, మగత వంటి లక్షణాలు వేధిస్తాయి. సమస్య తీవ్రమైతే అవయవాలు విఫలమై ప్రాణాపాయం సంభవించొచ్చు. అందువల్ల సెప్సిస్‌ తొలిదశలోనే మార్పులను, లక్షణాలను ముందుగానే గుర్తించి, చికిత్స చెయ్యటం చాలా ముఖ్యం. ఈ విషయంలో కృత్రిమ మేధతో అనుసంధానమయ్యే పరికరాలు మనకన్నా ముందు ఉంటుండటం గమనార్హం. ఇవి 24-48 గంటల ముందే సెప్సిస్‌ వచ్చే అవకాశాలను పసిగడుతుండటం, అదీ కచ్చితంగా అంచనా వేస్తుండటం విశేషం. అందువల్ల వీటి వాడకంతో సరైన సమయంలో తగు యాంటీబయోటిక్స్‌ ఇచ్చి పిల్లలను కాపాడుకోవటానికి వీలవుతుంది. సమస్య తీవ్రమయ్యాక, అవయవాలు దెబ్బతినటం మొదలయ్యాక యాంటీబయోటిక్స్‌ మొదలెడితే అంత ఫలితం కనిపించకపోవచ్చు. కొందరికి ప్రాణాపాయం ముంచుకురావొచ్చు. బతికి బట్టకట్టినా అవకరాలు తలెత్తొచ్చు.
అనవసర మందులు తప్పించుకోవచ్చు
నెలలు నిండకముందే, తక్కువ బరువుతో పుట్టిన పిల్లల విషయంలో ప్రతి నిమిషమూ అమూల్యమే. అందుకే ఆసుపత్రుల్లో వీరికి ముందు జాగ్రత్త పేరుతో ఇన్‌ఫెక్షన్‌ రాకుండా అనవసరంగా యాంటీబయోటిక్స్‌ ఇస్తుంటారు. ఒంట్లో ఇన్‌ఫెక్షన్‌ ఉంటే ఇబ్బందేమీ లేదు. మరి ఇన్‌ఫెక్షన్‌ లేకపోయినా యాంటీబయోటిక్స్‌ ఇస్తే? ఎలాంటి ఉపయోగం ఉండదు. దుష్ప్రభావాలూ పొడసూపుతాయి. ఒంట్లోని మంచి బ్యాక్టీరియా అస్తవ్యస్తమవుతుంది. ఇతరత్రా బ్యాక్టీరియా మందులను తట్టుకునే సామర్థ్యాన్నీ సంతరించుకోవచ్చు. మున్ముందు అలాంటి సూక్ష్మక్రిములతో ఇన్‌ఫెక్షన్‌ వస్తే యాంటీబయోటిక్స్‌ ఇచ్చినా పనిచేయవు. అంటే కృత్రిమ మేధ సాయంతో అనవసరంగా మందులు ఇవ్వకుండా, వాటి దుష్ప్రభావాల బారినపడకుండా చూసుకోవచ్చన్నమాట.
శ్వాస ఆగిపోకుండానూ..
నెలలు నిండకముందే పుట్టిన పిల్లల్లో ఒకోసారి హఠాత్తుగా కొద్దిసేపు శ్వాస ఆగిపోవచ్చు (అప్నియా). దీంతో రక్తంలో ఆక్సిజన్‌ మోతాదులు పడిపోతాయి. ఫలితంగా మెదడు, గుండె వంటి అవయవాలకు ఆక్సిజన్‌ అంతగా అందక దెబ్బతినొచ్చు. అందుకే శ్వాస ఆగినట్టు అనిపించగానే శిశువును కాస్త తడితే కదిలి, తిరిగి శ్వాస తీసుకుంటుంది. కాకపోతే దీన్ని వెంటనే గుర్తించాలి. ఇందుకోసం నిరంతరం కనిపెట్టుకొని ఉండటం అవసరం. అన్నిసార్లూ ఇది కుదరకపోవచ్చు. కృత్రిమ మేధ పరికరాలు దీన్ని సైతం పసిగడతాయి. రక్తంలో ఆక్సిజన్‌ మోతాదులు తగ్గుతున్నట్టు గమనించగానే శ్వాస ఏమైనా ఆగుతోందా? అని పరిశీలిస్తాయి. అలాంటి సూచనలు కనిపించగానే అలారంతో హెచ్చరిస్తాయి. అప్పుడు వెంటనే శిశువును తట్టి లేపితే తిరిగి శ్వాస తీసుకోవటానికి వీలుంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లోనైతే ఇంక్యుబేటర్‌కే ప్రత్యేకమైన వైబ్రేటర్లనూ అమర్చుతున్నారు. శ్వాస ఆగుతోందనే హెచ్చరిక అందగానే ఇవి తమకు తామే కంపించి, శిశువును కదిలేలా చేస్తాయి. దీంతో శిశువు తిరిగి శ్వాస తీసుకోవటానికి వీలవుతుంది.

ఇతర ప్రయోజనాలు
* ఏడుస్తుందా? లేదా?:  పిల్లలంతా పుట్టగానే ఏడుస్తుంటారు గానీ కొందరు ఏడ్వకుండా ఉండిపోతుంటారు. ఇలాంటివారిని ముందుగా కాలిని గీకటం, చేత్తో తట్టటం వంటివి చేసి ఏడ్చేలా చేస్తారు. అయినా ఏడ్వకపోతే సక్షన్‌ పంప్‌ ద్వారా నోరు, ముక్కులో అడ్డుపడిన స్రావాలను వెలికి తీస్తారు. అప్పటికీ ఫలితం లేకపోతే అంబూ బ్యాగ్‌ ద్వారా కృత్రిమ శ్వాస కల్పించాల్సి ఉంటుంది. అవసరమైతే వెంటిలేటర్‌ అమర్చాల్సి వస్తుంది. పరిస్థితి అంతవరకు రాకుండా పిల్లలు ఏడ్చే అవకాశం లేదనే విషయాన్ని పుట్టకముందే గుర్తిస్తే? ఇందుకోసమూ కృత్రిమ మేధ ఉపయోగపడుతోంది. ఇది గర్భిణి, పిండం ఆరోగ్య పరిస్థితి, తీరుతెన్నులను ముందుగానే విశ్లేషించి పుట్టగానే శిశువు ఏడ్చి, శ్వాస తీసుకుంటుందా? లేదా? అనేది ముందుగానే చెబుతుంది. కొన్నిదేశాల్లో దీన్ని వాడుకుంటున్నారు కూడా. పుట్టగానే ఏడ్చే అవకాశం లేదని తెలిస్తే ముందే జాగ్రత్త పడొచ్చు. పుట్టిన వెంటనే క్షణమైనా ఆలస్యం చేయకుండా బిడ్డ ఏడ్చేలా ఏర్పాట్లు చేసుకోవచ్చు. అమూల్యమైన మెదడు కణాలను సంరక్షించుకోవచ్చు.
* బతుకుతుందా? లేదా?: నెలలు నిండకముందే పుట్టిన పిల్లల్లో బతికి బట్ట కట్టే అవకాశం ఎంత ఉందనేదీ కృత్రిమ మేధ సాయంతో అంచనా వేయొచ్చు. తల్లి కడుపులో శిశువు ఎన్ని రోజులుంది? పుట్టినప్పుడు బరువెంత? ఆడా? మగా? సహజ కాన్పా? సిజేరియనా? గర్భిణి తీసుకున్న జాగ్రత్తలేంటి? తల్లికి రక్తపోటు ఎంతుంది? వంటి వివరాలన్నింటినీ క్రోడీకరించుకొని శిశువు జీవించే అవకాశాన్ని తెలుసుకోవచ్చు.
* ఊపిరితిత్తులెలా ఉన్నాయి?: వెంటిలేటర్‌ పెట్టినప్పుడు కొన్నిసార్లు ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదముంది. ఈ పిల్లలు మున్ముందు తరచూ ఆయాసంతో బాధపడొచ్చు. ఊపిరితిత్తులు దెబ్బతినటాన్ని ముందుగానే గుర్తించగలిగితే దీన్ని నివారించుకోవచ్చు. ఇలాంటి పరిస్థితిని అంచనా వేయటానికీ కృత్రిమ మేధ ఉపయోగపడుతుంది.
* పేగులు చచ్చుబడ్డాయా?: నెలలు నిండకముందు పుట్టిన పిల్లల్లో కొందరికి పెద్దపేగులో వాపు ప్రక్రియ తలెత్తి కొంతభాగం చచ్చుబడిపోవచ్చు (నెక్రోటైజింగ్‌ ఎంటెరోకొలైటిస్‌). పేగుల్లోని బ్యాక్టీరియా తీరుతెన్నుల ఆధారంగా కృత్రిమ మేధ ఇలాంటి సమస్యనూ ముందుగానే గుర్తించి హెచ్చరిస్తుంది.
* మెదడు ఎలా ఉంది?: ఈఈజీ (ఎలెక్ట్రో ఎన్‌సెఫలోగ్రామ్‌) తీరుతెన్నులను బట్టి మెదడు ఎలా పనిచేస్తోందనేదీ కృత్రిమ మేధతో అంచనా వేయొచ్చు.
మనకే ఎక్కువ అవసరం
మన జనాభాలో సుమారు 45% మంది పిల్లలే. ఎక్కువ జబ్బులు వచ్చేది, ఎక్కువ మరణాలు సంభవించేది పిల్లల్లోనే. ఐదేళ్లలోపు పిల్లల మరణాలు మనదేశంలోనే అధికం. పుట్టే ప్రతి 1,000 మందిలో 37 మంది ఆరో ఏడు చూడకుండానే మృత్యువాత పడుతున్నారు. ఈ విషయంలో మనం జపాన్‌ (2), స్వీడన్‌ (2), బ్రిటన్‌ (4), అమెరికా (6) వంటి అభివృద్ధి ్ధచెందిన దేశాలతోనే కాదు పొరుగున ఉన్న శ్రీలంక (8), బంగ్లాదేశ్‌ (28), నేపాల్‌ (32)వంటి దేశాలతోనూ వెనకబడి పోవటం విచారకరం. వీటిని అధిగమించటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పూర్తి విజయం సాధించలేకపోతున్నాం. నవజాత శిశు మరణాలను తగ్గించగలిగితే దీన్ని చాలావరకు చేరుకోవచ్చు. ఎందుకంటే ఐదేళ్ల లోపు మరణిస్తున్న పిల్లల్లో సింహభాగం (37 మందిలో 25 మంది) నవజాత శిశువులే. చాలామంది నెలలోపే మరణిస్తున్నారు. దీనికి ప్రధాన కారణాలు- నెలలు నిండకముందే పుట్టటం, ఇన్‌ఫెక్షన్‌ రక్తంలోకి వ్యాపించటం (సెప్సిస్‌), పుట్టగానే ఏడ్వకపోవటం. నెలలు నిండకుండా పుట్టినప్పుడు ఊపిరితిత్తులు, మెదడు, కాలేయం, కిడ్నీలు, రోగనిరోధక వ్యవస్థ సరిగా తయారుకావు. ఊపిరితిత్తులు సరిగా పనిచేయకపోతే ఆక్సిజన్‌ అందక మెదడు దెబ్బతింటుంది. ఇది ప్రాణాపాయానికి దారితీయొచ్చు. శ్వాస సరిగా తీసుకోలేక, మెదడు దెబ్బతినటం మూలంగానే 50% మంది చనిపోతుంటారు. మిగిలిన 50% మరణాలకు ఇన్‌ఫెక్షన్లు కారణమవుతున్నాయి. వీటిని అధిగమించటానికే ఇంక్యుబేటర్‌, వెంటిలేటర్‌ వంటి పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇంక్యుబేటర్‌ బిడ్డను వెచ్చగా ఉంచితే, వెంటిలేటర్‌ శ్వాస ఆడేలా చేస్తుంది. కాకపోతే వీటితో కొన్ని దుష్ప్రభావాలు లేకపోలేదు. పిల్లలు చాలా నాజూకుగా ఉంటారు. కృత్రిమ శ్వాస ఒత్తిడి ఎక్కువైతే ఊపిరితిత్తుల్లోని శ్వాసమార్గాల్లో లోపలి పైపొర, దాని రక్షణ వ్యవస్థ దెబ్బతినొచ్చు (బ్రాంకో పల్మనరీ డిస్‌ప్లేషియా). ఆక్సిజన్‌ ఎక్కువైనా ఇబ్బందే. ఆక్సిజన్‌ ఎక్కువైతే కళ్లు దెబ్బతినొచ్చు, రెటీనా విడిపోవచ్చు. కొందరికి చెవులు దెబ్బతినొచ్చు. అందువల్ల నిరంతరం కనిపెట్టుకొని ఉండటం అత్యవసరం. ఇందుకోసం ఇప్పుడు రకరకాల పరికరాలు అందుబాటులో ఉన్నాయి. రక్తపోటు, ఆక్సిజన్‌ స్థాయులు, శ్వాస వేగం వంటి వాటి వివరాలను ఎప్పటికప్పుడు కంప్యూటర్‌ తెర మీద చూపిస్తుంటాయి. కృత్రిమ మేధ వీటికి కొనసాగింపే అనుకోవచ్చు. ఇది ఆయా గ్రాహకాల ద్వారా సమాచారాన్ని సంగ్రహించటమే కాదు.. దాన్ని అతివేగంగా విశ్లేషిస్తుంది. ప్రమాద సంకేతాలను గుర్తించి హెచ్చరిస్తుంది. వాటికి తగిన పరిష్కార మార్గాలనూ సూచిస్తుంది. తమంతట తామే ఆయా పరికరాల పనితీరునూ మారుస్తుంది. ఉదాహరణకు- శ్వాస వేగం పెరిగితే తగ్గిస్తుంది. ఆక్సిజన్‌ తగ్గితే పెంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను బట్టి ఇంక్యుబేటర్‌ లోపలి వేడిని నియంత్రిస్తుంది. అదీ చాలా వేగంగా. నిజానికి నర్సుల వంటి వైద్య సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్న మనలాంటి దేశాల్లోనే వీటి అవసరం ఎక్కువ. ఎందుకంటే ఒక్క నర్సుతోనే వార్డులో ఉన్న పిల్లలందరినీ కంటికి రెప్పలా కనిపెట్టుకొని ఉండటానికి వీలవుతుంది.

మనదేశంలో జాతీయ టీకా కార్యక్రమం ఆరంభమై నాలుగు దశాబ్దాలు దాటినా 65% మంది పిల్లలకే టీకాల భాగ్యం దక్కుతోంది. దీన్ని నూటికి నూరు శాతం సాధించటానికీ కృత్రిమ మేధను ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు దాదాపు 80% మందికి మొబైల్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. యాప్‌ల ద్వారా ఎప్పటికప్పుడు టీకాల వివరాలను తెలియజేస్తూ అందరికీ టీకాలు అందేలా చూడొచ్చు.
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని