అక్షయ వ్యధ

కొవిడ్‌(19)లా కొత్తదేమీ కాదు. చికిత్స తెలియకా కాదు. అయినా క్షయ అనాదిగా పట్టి పీడిస్తూనే ఉంది. దీని నిర్మూలన ఇంకా కలగానే మిగిలిపోతోంది. పైగా రోజురోజుకీ మొండిగానూ తయారవుతోంది. ఎందుకిలా? ప్రపంచవ్యాప్తంగా క్షయతో బాధ పడుతున్నవారిలో పావు వంతు కన్నా ఎక్కువమంది మనవాళ్లే. దీంతో మరణిస్తున్నవారిలోనూ 21% మంది మనవాళ్లే.

Published : 24 Mar 2020 01:17 IST

నేడు ప్రపంచ క్షయ దినం

కొవిడ్‌(19)లా కొత్తదేమీ కాదు. చికిత్స తెలియకా కాదు. అయినా క్షయ అనాదిగా పట్టి పీడిస్తూనే ఉంది. దీని నిర్మూలన ఇంకా కలగానే మిగిలిపోతోంది. పైగా రోజురోజుకీ మొండిగానూ తయారవుతోంది. ఎందుకిలా?

ప్రపంచవ్యాప్తంగా క్షయతో బాధ పడుతున్నవారిలో పావు వంతు కన్నా ఎక్కువమంది మనవాళ్లే. దీంతో మరణిస్తున్నవారిలోనూ 21% మంది మనవాళ్లే. తక్షణం దీన్ని కట్టడి చేయటం అత్యవసరం. ప్రపంచ క్షయ దినం ఇదే నినదిస్తోంది. క్షయ నిర్మూలనకిదే తరుణమని గుర్తుచేస్తోంది.

క్షయ మనదేశానికి పెనుశాపంగా తయారైంది. ఏటా 3 లక్షల మంది దీనికి బలైపోతున్నారు. ఒకప్పుడు ఇదెందుకు వస్తుందో ఎవరికీ తెలిసేది కాదు. మనిషిని క్రమంగా క్షీణింపజేస్తుండటం వల్ల క్షయ (కన్‌సంప్షన్‌) అని పిలుచుకునేవారు గానీ కారణమేంటో తెలిసేది కాదు. జర్మనీ శాస్త్రవేత్త రాబర్ట్‌ కాక్‌ 1882, మార్చి 24న క్షయకు ఒక బ్యాక్టీరియా కారణమవుతోందని కనుగొనేంతవరకూ రహస్యం అలాగే ఉండిపోయింది. క్షయ బ్యాక్టీరియా ఒంట్లో స్థిరపడిన చోట అక్కడి కణజాలాన్ని తినేస్తూ.. చిన్న చిన్న ఉండలను (ట్యూబర్‌కుల్స్‌) సృష్టిస్తుంది. అందుకే దీనికి ట్యూబర్‌క్యులోసిస్‌ అని, దీనికి కారణమవుతున్న బ్యాక్టీరియాకు మైకోబ్యాక్టీరియమ్‌ ట్యూబర్‌క్యులోసిస్‌ అని పేరు పెట్టారు. కాక్‌ కృషికి గుర్తుగానే మార్చి 24న ప్రపంచ క్షయ దినాన్ని నిర్వహించటం మొదలైంది. కారణాన్ని గుర్తించారు సరే. మరి చికిత్సో? మరో 65 ఏళ్లకు గానీ తొలి మందు స్ట్రెప్టోమైసిన్‌ అందుబాటులోకి రాలేదు. ఇది బాగా పనిచేస్తుండటంతో ఇక తిరుగేలేదని అనుకున్నారంతా. కానీ అప్పట్నుంచే క్షయ క్రిమి మందులను తట్టుకునే సామర్థ్యాన్ని సంతరించుకోవటం ఆరంభించింది. స్ట్రెప్టోమైసిన్‌ను విరివిగా వాడేస్తుండటంతో క్రమేపీ బ్యాక్టీరియాలో జన్యుమార్పులు మొదలై మందు ప్రభావాన్ని తట్టుకోవటం నేర్చుకుంది. ఆ తర్వాత కొత్త కొత్త మందులెన్ని వస్తున్నా పరిస్థితి మారటం లేదు. రోజురోజుకీ మొండి సమస్యగా మారుతూనే వస్తోంది. నాలుగు మందులతో తగ్గే సమస్య ఆరేడు మందులను వాడినా లొంగని స్థితికి చేరుకుంటోంది. దీనికి ప్రధాన కారణం మన నిర్లక్ష్యమే. మందులను మధ్యలో మానెయ్యటం, అరకొర మోతాదుల్లో తీసుకోవటం, నివారణ కోసం తగు జాగ్రత్తలు తీసుకోకపోవటం. ఇదేమంత మంచి పరిణామం కాదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎలాంటి మందులకూ లొంగని విధంగా తయారుకావటం తథ్యం. ఇప్పటికే అలాంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా మేల్కొనకపోతే ఒకనాటి శానిటోరియం రోజులే గతి అవటం ఖాయం.

నిద్రాణంగానూ ఉండొచ్చు

‘ద సీడ్‌ ఈస్‌ నథింగ్‌, ద సాయిల్‌ ఈస్‌ ఎవ్రీ థింగ్‌’ అన్నది లూయూ పాశ్చర్‌ మహాశయుడి సూక్తి. అంటే విత్తనం ఎంత మంచిదైనా అది మొలకెత్తటానికి నేల చాలా ముఖ్యం అని. ఇది క్షయకు అతికినట్టు సరిపోతుంది. క్షయతో బాధపడేవారు దగ్గినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా బ్యాక్టీరియా ఎదుటివారికి అంటుకుంటుంది. ఇది ఒంట్లోకి ప్రవేశించినా అందరికీ క్షయగా మారాలనేమీ లేదు. మంచి ఆరోగ్యంగా ఉన్నవారిని, మధుమేహం లేనివారిని, పొగ, మద్యం అలవాట్లు లేనివారిని ఇదేమీ చేయదు. నిద్రాణంగానే ఉండిపోతుంటుంది (లేటెంట్‌ టీబీ). ఎప్పుడైనా రోగనిరోధకశక్తి తగ్గుముఖం పడితే 10% మందిలో బ్యాక్టీరియా పుంజుకొని పూర్తిస్థాయి క్షయగా మారొచ్ఛు మ్యాంటూ, టీబీ ఫెరాన్‌ లేదా క్వాంటి ఫెరాన్‌ టీబీ పరీక్షల ద్వారా ఒంట్లోకి బ్యాక్టీరియా ప్రవేశించిందా లేదా అన్నది తెలుసుకోవచ్ఛు లేటెంట్‌ టీబీకి రెండు నెలలపాటు చికిత్స తీసుకుంటే సరిపోతుంది.

ప్రధానంగా ఊపిరితిత్తులకే

గోళ్లు, వెంట్రుకలకు తప్పించి క్షయ ఒంట్లో ఎక్కడైనా రావొచ్ఛు కాకపోతే ఊపిరితిత్తుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం క్షయ కేసుల్లో 80% వరకూ ఇదే.

దగ్గు, కళ్లె, రాత్రి జ్వరం..

ఊపిరితిత్తుల క్షయలో ప్రధాన లక్షణం దగ్గు. దగ్గుతో పాటు కళ్లె పడటం. కొందరికి రక్తమూ పడొచ్ఛు ఒక్కసారి దగ్గుతో రక్తం పడినా విస్మరించటానికి లేదు. వీటితో పాటు నీరసం, నిస్సత్తువ, త్వరగా అలసిపోవటం, ఉత్సాహం కొరవడటం, క్రమేపీ ఆకలి, బరువు తగ్గటం, సాయంత్రం పూట జ్వరం, చెమటలు రావటం వంటి లక్షణాలూ కనిపిస్తాయి.

* క్షయ బారినపడ్డా సుమారు 10% మందిలో ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్ఛు అంతా బాగానే ఉంటుండొచ్ఛు ఏదైనా సమస్య కోసం ఎక్స్‌రే తీస్తే జబ్బు బయటపడుతుండొచ్ఛు

కళ్లె పరీక్ష, ఎక్స్‌రే

క్షయను నిర్ధారించటానికి కళ్లె పరీక్ష ముఖ్యం. ఉదయం నిద్ర లేచిన తర్వాత మొదటిసారి వచ్చే కళ్లెను సీసాలో పట్టి పరీక్ష చేయటం ప్రధానం. బ్యాక్టీరియా ఉంటే ఇందులో బయటపడుతుంది. కొందరికి కళ్లెలో బ్యాక్టీరియా కనిపించకపోవచ్ఛు అంతమాత్రాన క్షయ లేదనుకోవటానికి లేదు. ముఖ్యంగా ఇతర భాగాల్లో క్షయ ఉంటే కళ్లెలో బ్యాక్టీరియా ఉండదు. ఊపిరితిత్తులకు క్షయ వచ్చినా కొన్నిసార్లు తెమడలో క్రిములు కనిపించకపోవచ్ఛు అందువల్ల క్షయ లక్షణాలు ఉన్నప్పుడు ఒకసారి ఛాతీ ఎక్స్‌రే తీసి పరిశీలించటం చాలా ముఖ్యం.

బీసీజీతో తొలి ఐదేళ్లు రక్షణ

పిల్లలకు క్షయ నివారణ కోసం పుట్టిన వెంటనే బీసీజీ టీకా ఇస్తుంటారు. దీన్ని ఇప్పిస్తే జీవితంలో ఇంకెప్పుడూ క్షయ రాదనే చాలామంది భావిస్తుంటారు. అంత నిర్లక్ష్యం పనికిరాదు. బీసీజీ టీకా ఐదేళ్ల వరకూ పిల్లలకు ఎలాంటి క్షయ రాకుండా కాపాడుతుందని చంగల్‌పట్‌ అధ్యయనంలో తేలింది. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే పిల్లల్లో వచ్చే క్షయ చాలా ప్రమాదకరంగా ఉంటుంది. హఠాత్తుగా మెదడుకు, వెన్నెముకకు క్షయ రావటం కనిపిస్తుంటుంది. ఊపిరితిత్తుల్లో వస్తే చాలా ఉద్ధృతంగా వ్యాపిస్తుంది. ఇలాంటి క్షయలను బీసీజీ టీకా సమర్థంగా అడ్డుకుంటుంది. కానీ ఐదేళ్లు దాటిన తర్వాత వచ్చే టీబీ నుంచి మాత్రం కాపాడటం లేదు. అలాగని నిరాశ పడటానికీ లేదు. బీసీజీ టీకా మున్ముందు ఎముకలకు, మెదడుకు, వెన్నెముకకు వచ్చే ప్రమాదకరమైన క్షయ బారినపడకుండా కాపాడుతుండటం విశేషం.

* బీసీజీ టీకా మీద ఇప్పుడు కొత్త ప్రయోగాలు నడుస్తున్నాయి. చర్మంలోకి ఇచ్చే టీకాను నేరుగా రక్తనాళంలోకి ఇస్తే ఇంకా సమర్థంగా పనిచేస్తున్నట్టు ప్రయోగ పరీక్షల్లో తేలింది. ఇది ఎంతవరకు సురక్షితమనేది తెలుసుకోవటానికి అధ్యయనాలు సాగుతున్నాయి. అవి ఫలిస్తే టీకాను నేరుగా రక్తనాళంలోకే ఇవ్వచ్ఛు దీన్ని పిల్లలకే కాదు, పెద్దవాళ్లకూ ఇచ్చే అవకాశముంది.

క్షయ నివారణ సాధ్యమే

* క్షయకు మందుల వాడకాన్ని మొదలెట్టిన తర్వాత ఇతరులకు బ్యాక్టీరియా వ్యాపించటం తగ్గుతుంది. అంటే క్షయ బాధితులను ముందుగానే గుర్తిస్తే చాలావరకు నివారించుకోవచ్చన్నమాట. ఒకరిని ముందుగా పట్టుకున్నా 15 మందికి సోకకుండా చూసుకోవచ్ఛు

* క్షయ బాధితులు ఆరుబయట ఎక్కడా ఉమ్మకపోవటం ముఖ్యం.

* అన్ని పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు తగినంతగా తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇవి రోగనిరోధకశక్తి పెరగటానికి దోహదం చేస్తాయి.

* దురలవాట్లకూ దూరంగా ఉండాలి. పొగ తాగేవారికి క్షయ ముప్పు నాలుగు రెట్లు ఎక్కువ. మితిమీరిన మద్యం అలవాటుతో పోషణ లోపం తలెత్తి, రోగనిరోధకశక్తి తగ్గి క్షయ వచ్చే అవకాశం పెరుగుతుంది.

* మధుమేహులు రక్తంలో గ్లూకోజు మోతాదులను కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. మధుమేహం గలవారికి క్షయ ముప్పు నాలుగు రెట్లు ఎక్కువని తెలుసుకోవాలి. చాలామందిలో మధుమేహం, క్షయ రెండూ ఒకేసారి బయటపడుతుండటం గమనార్హం.

* విటమిన్‌ డి లోపంతో క్షయ ముప్పు ఎక్కువవుతుంది. ఒంటికి ఎండ తగలకపోతే విటమిన్‌ డి తయారు కాదు. రోజుకు 10, 15 నిమిషాలైనా ఎండ తగిలేలా చూసుకోవాలి.


ఒంట్లోకి క్షయ క్రిమి ప్రవేశించినా రోగనిరోధక కణాలు వాటి చుట్టూ గోడ కట్టి (కాల్సిఫికేషన్‌) కట్టడి చేసేస్తాయి. ఈ ప్రక్రియ విఫలమైతే క్రిమి వృద్ధి చెందుతూ ఆయా భాగాలను తినేయటం మొదలెడుతుంది. ఊపిరితిత్తుల్లోనైతే చిన్న చిన్న రంధ్రాలూ పడతాయి.


మొండి క్షయ మహా ప్రమాదం!

ప్పుడు క్షయ మందులకు లొంగకుండా మొండిగా తయారవటం పెద్ద ప్రమాదంగా మారుతోంది. మనదేశంలో 1.35 లక్షల మంది మొండి క్షయ బాధితులున్నారని అంచనా. ప్రతి 10 లక్షల మందిలో ఒకరు దీంతో బాధపడుతున్నవారే. చాలామంది 25-45 ఏళ్ల వయసులోనే దీని బారినపడుతున్నారు. ఇది కుటుంబానికే కాదు, దేశానికీ నష్టమే. మందులను మధ్యలో మానెయ్యటం, బరువుకు తగిన మోతాదు ఇవ్వకపోవటం, డాక్టర్‌ చెప్పిన జాగ్రత్తలను పాటించకపోవటం వంటివన్నీ దీనికి దారితీస్తున్నాయి. చికిత్సను మధ్యలో మానేసినవారిలో సుమారు 12% మందిలో సమస్య మొండిగా మారుతుండటం గమనార్హం. రిఫాంపిసిన్‌, ఐఎన్‌హెచ్‌.. ఈ రెండు మందులకు బ్యాక్టీరియా లొంగకపోతుంటేనే మొండి క్షయగా (ఎండీఆర్‌టీబీ) నిర్ధారిస్తారు. ఇప్పుడు మొండి క్షయకు వాడే మందులు సైతం కొందరికి పనిచెయ్యటం లేదని బయటపడుతోంది. దీన్నే మరీ తీవ్ర క్షయ (ఎక్స్‌డీఆర్‌టీబీ) అంటున్నారు.

* నిజానికి క్షయ నిర్ధారణ అయినప్పుడే మామూలు బ్యాక్టీరియానా? మొండి బ్యాక్టీరియానా? అన్నది తెలుసుకొని చికిత్స ఆరంభించాలి. తేలికైన, వెంటనే ఫలితాన్ని చెప్పే క్యాప్సూల్‌ బేస్డ్‌ న్యూక్లిక్‌ యాసిడ్‌ యాంప్లిఫికేషన్‌ పరీక్షతో దీన్ని గుర్తించొచ్ఛు సుమారు 3% మందికి ఆరంభంలోనే మొండి క్షయ బయటపడుతున్న తరుణంలో ఇది తప్పనిసరి. మొండి క్షయకు చికిత్స కష్టమే. మామూలు క్షయకు ఇచ్చే ప్రధానమైన మందులు పనిచేయవు. రెండో శ్రేణి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. సుమారు 9, 10 మందులు అవసరమవుతాయి. వీటితో దుష్ప్రభావాలు ఎక్కువ. ఖరీదూ ఎక్కువే. మామూలు క్షయకు 6 నెలలు మందులిస్తే దీనికి 24 నెలల పాటు చికిత్స చేయాలి. అయినా అందరికీ తగ్గుతుందని చెప్పలేం. సుమారు 50-60% వరకు ఫలితం కనిపిస్తున్నట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. వీరిలో మరణాల రేటూ ఎక్కువే.

* మామూలు క్షయకు తొలి రెండు నెలల చికిత్స తీసుకున్నాక, మొత్తం ఆర్నెల్ల చికిత్స తర్వాత కూడా కళ్లెలో క్రిములు కనిపిస్తుంటే మొండి క్షయగా అనుమానించాలి. మందులను మధ్యలో మానేసినా, అప్పటికే ఎండీఆర్‌టీబీతో బాధపడే కుటుంబంలో ఎవరికైనా క్షయ వచ్చినా, పూర్తి చికిత్స తర్వాత సమస్య మళ్లీ తిరగబెట్టినా, మందులు వేసుకుంటున్నప్పటికీ గ్రంథుల సైజు పెరుగుతున్నా మొండి క్షయ ఉందేమోనని తప్పకుండా పరీక్షించాలి.


చికిత్స- క్రమం తప్పొద్దు

పిరితిత్తుల్లో క్షయ తొలిసారిగా నిర్ధారణ అయితే మొదటి 2 రెండు నెలల పాటు 4 మందులు (రిఫాంపిసిన్‌, ఐసోనికోటినిక్‌ యాసిడ్‌ హైడ్రజైడ్‌ (ఐఎన్‌హెచ్‌), ఇథెంబుటాల్‌, పైరజినమైడ్‌) వేసుకోవాలి. తర్వాత మరో నాలుగు నెలల పాటు ఐఎన్‌హెచ్‌, రిఫాంపిసిన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. మందులు ఆరంభించిన తర్వాత వారం, పదిరోజుల్లోనే లక్షణాలు తగ్గుముఖం పడతాయి. దీంతో చాలామంది క్షయ తగ్గిపోయిందని మందులు మానేస్తుంటారు. ఇది చాలా ప్రమాదం. జబ్బు తగ్గదు సరికదా రెండు, మూడు నెలల తర్వాత మరింతగా ఉద్ధృతమవుతుంది. చివరికి మందులకు లొంగని విధంగానూ మారుతుంది.

* మందులు ఆరంభించిన తర్వాత 15 రోజుల వరకూ విధిగా ముఖానికి మాస్కు ధరించాలి. లేదా గుడ్డ అడ్డం పెట్టుకోవాలి. ఆఫీసుకు, స్కూళ్లకు వెళ్లకూడదు. తాజా కూరగాయలు, పండ్లు, పాలు, గుడ్లు అన్నీ తీసుకోవచ్ఛు వీలైతే చికెన్‌, మాంసం వంటివి తినొచ్ఛు.


ఆలస్యమే పెద్ద సమస్య

మనదగ్గర జబ్బు మొదలైన దగ్గర్నుంచి సమస్యను నిర్ధారించి మందులు ఆరంభించేనాటికి సుమారు 3 నెలలు పడుతుండటం గమనార్హం. క్షయ మీద సరైన అవగాహన లేకపోవటమే దీనికి కారణం. చాలామంది దగ్గు వంటి లక్షణాలు కనిపించగానే ఏదో మందు కొనుక్కొని వేసుకుంటారు. అప్పటికీ తగ్గకపోతే దగ్గర్లోని డాక్టర్‌ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఫలితం కనిపించకపోతే మరో డాక్టర్‌కు చూపించుకుంటారు. డాక్టర్లు ఎవరైనా అనుమానించి ఎక్స్‌రే తీస్తే అసలు విషయం బయటపడుతుంది. అప్పటికే సమయం మించిపోతుంది. సమస్య తీవ్రమైపోతుంది. మరో చిక్కేంటంటే- ఈ సమయంలోనే సుమారు 15 మందికి వారి నుంచి జబ్బు సంక్రమించే అవకాశం ఉంటుండటం. క్షయను ముందుగానే గుర్తించగలిగితే చాలావరకు వ్యాపించకుండా అరికట్టొచ్ఛు రెండు వారాల కన్నా ఎక్కువరోజులు దగ్గు వేధిస్తుంటే క్షయ కావొచ్చని అనుమానించాలి. ఒకసారి మందులు మొదలెడితే వారి నుంచి ఇతరులకు వ్యాపించే అవకాశం తగ్గుతుందని తెలుసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని