Published : 14 Apr 2020 00:27 IST

కవచాన్నికరగనీయొద్దు

చేతులు కడుక్కుంటున్నాం. దగ్గినా, తుమ్మినా మోచేతిని అడ్డుపెట్టుకుంటున్నాం. ముఖాన్ని తాకకుండా చూసుకుంటున్నాం. మనిషికీ మనిషికీ మధ్య దూరం పాటిస్తున్నాం. మాస్కులు ధరిస్తున్నాం. ఒక్కటేమిటి? కరోనా వైరస్‌ బారినపడకుండా ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వీటన్నింటికన్నా అతి ముఖ్యమైంది మరోటి ఉంది. మనలోని శక్తిని.. అదే రోగనిరోధక శక్తిని కాపాడుకోవటం. కొవిడ్‌-19 ప్రపంచాన్ని కుదిపేస్తున్న ప్రస్తుత తరుణంలో ఇది మరింత ముఖ్యం. ఎందుకంటే రోగనిరోధకశక్తి ఎప్పుడూ ఒకేలా ఉండదు. వయసుతో పాటు తగ్గిపోతుంటుంది. మరి దీన్ని కాపాడుకోవటమెలా? పెంపొందించుకోవటమెలా?

న్నీ ఒకవైపు. రోగనిరోధకశక్తి ఒకవైపు. ఇన్‌ఫెక్షన్ల విషయంలో ఇది ముమ్మాటికీ నిజం. రోగనిరోధకశక్తి సరిగా ఉంటే ఇన్‌ఫెక్షన్లేవీ దరిజేరవు. ఇది తగ్గటం మూలంగానే ప్రస్తుతం ఎంతోమంది వృద్ధులు కొవిడ్‌-19 బారిన పడుతున్నారు. తీవ్రతా ఎక్కువగానే ఉంటోంది. మరణాలు సైతం వీరిలోనే ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే ఇప్పుడు అందరి చూపూ రోగనిరోధక వ్యవస్థ మీదే పడింది. ఇది మనం తల్లి కడుపులో ఉండగానే రూపొందటం మొదలవుతుంది. తల్లి మాయ నుంచి గర్భస్థ శిశువుకు ఇమ్యూనోగ్లోబులిన్ల రూపంలో నిరోధక శక్తి అందుతుంది. ఇది తల్లికి అంతకుముందు వచ్చిన జబ్బులు, తీసుకున్న టీకాలకు ఏర్పడ్డ నిరోధకతను బట్టి ఆధారపడి ఉంటుంది. తల్లిపాలతోనూ కొన్ని ఇమ్యునోగ్లోబులిన్లు బిడ్డకు సంక్రమిస్తాయి. వీటితో లభించిన నిరోధకశక్తి కొన్ని నెలల పాటు కాపాడుతుంటుంది. ఆ తర్వాత ఎదుర్కొన్న ఇన్‌ఫెక్షన్లు, తీసుకున్న టీకాలు, పేగుల్లోని బ్యాక్టీరియాను బట్టి ఒంట్లో సహజ నిరోధక వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది. ఇదే మనల్ని కాపాడుతూ వస్తుంటుంది. కాకపోతే ఇది క్రమంగా క్షీణిస్తుంటుంది. కౌమార దశ నుంచే దీని క్షీణత మొదలవుతుంది. ఇలా వయసు పెరుగుతున్నకొద్దీ క్రమంగా తగ్గుతూ వస్తుంటుంది. 60ల్లోకి అడుగుపెట్టాక క్షీణత వేగం మరింత పెరుగుతుంది. అలాగని ఈ సూత్రం అందరికీ వర్తించాలని లేదు. వయసుతో నిమిత్తం లేకుండా కొందరికి రోగనిరోధక సామర్థ్యం ఎక్కువగా ఉండొచ్ఛు కొందరికి తక్కువగానూ ఉండొచ్ఛు మంచి విషయం ఏంటంటే- కొన్ని తేలికైన జాగ్రత్తలతో రోగనిరోధక శక్తి ‘గడియారాన్ని’ సరిదిద్దుకునే అవకాశం ఉండటం. ఎప్పుడో 1918లో వచ్చిన స్పానిష్‌ ఫ్లూ తర్వాత కొవిడ్‌-19ను అతిపెద్ద మహమ్మారిగా పరిగణిస్తున్న నేపథ్యంలో దీనికి మరింత ప్రాధాన్యం పెరిగింది. కరోనా ఇప్పుడప్పుడే పోయేది కాదు. ఇప్పుడు పోయినా మళ్లీ తిరిగి రాదనే భరోసా ఏదీ లేదు. అందువల్ల రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవటం చాలా ముఖ్యం. దీంతో కరోనాను మాత్రమే కాదు. ఎలాంటి వైరస్‌నైనా సమర్థంగా నిలువరించొచ్చు, ఎదుర్కోవచ్ఛు నిరోధకశక్తిని పెంచుకోవటమనేది ఒక్కరోజుతో సాధ్యమయ్యేది కాదు. ఇదో నిరంతర సాధన. మున్ముందు మనం చేయబోయే సుదీర్ఘ యుద్ధాన్ని ఈ దీర్ఘకాల సాధనతోనే గెలవగలమని గుర్తుంచుకోవాలి.

థైమస్‌ కీలకం..

రోగనిరోధకశక్తిలో థైమస్‌ గ్రంథి కీలకపాత్ర పోషిస్తుంది. ఇది ఛాతీ మధ్యభాగంలో ఉంటుంది. టి కణాలు పరిపక్వమయ్యేది ఇందులోనే. బాల్యంలో చురుకుగా ఉండే థైమస్‌ గ్రంథి వయసు పెరుగుతున్నకొద్దీ క్షీణిస్తుంటుంది. కౌమారం మొదలయ్యాక ఏటా 3% చొప్పున సైజు తగ్గుతూ వస్తుంది. మధ్యవయసు వచ్చేసరికి చిన్న పోచల్లా మిగిలిపోతుంది. వృద్ధాప్యంలో దాదాపు పూర్తిగా కనుమరుగైపోతుంది. వృద్ధాప్యంలో కొత్త హానికారక క్రిములను ఎదుర్కోవటం కష్టం కావటానికి ఇదీ ఒక కారణమే. ప్రస్తుతం పిల్లల్లో కరోనా వైరస్‌ ప్రభావం తక్కువగా ఉండటం ఒకరకంగా థైమస్‌ గ్రంథి చలవేనని చెప్పుకోవచ్చు.

ఏంటీ రోగనిరోధక వ్యవస్థ?

మన ఒంట్లో మెదడు తర్వాత అత్యంత సంక్లిష్టమైంది రోగనిరోధక వ్యవస్థే. ఇది వందలాది రకాల కణాలు, వాటికి సూచనలిచ్చే కణ సంకేతాలు, వీటన్నింటినీ నడిపించే 8వేల జన్యువులతో ముడిపడి ఉంటుంది. దీన్ని స్థూలంగా రెండు భాగాలుగా విభజించుకోవచ్ఛు 1. సహజ వ్యవస్థ. ముందువరుసలో ఉండేది ఇదే. ఒంట్లోకి ఏవైనా ప్రవేశిస్తే దీనిలో భాగమైన నూట్రోఫిల్స్‌, మాక్రోఫేజస్‌ వంటి రక్తకణాలు వెంటనే స్పందించి, చంపటానికి ప్రయత్నిస్తాయి. 2. సముపార్జిత వ్యవస్థ. టి కణాలు, బి కణాలు, యాంటీబాడీలన్నీ దీనిలోని భాగాలే. ఇవి ప్రత్యేకమైనవి. ఆయా సూక్ష్మక్రిముల మీదే దాడి చేస్తాయి. కాస్త నెమ్మదిగా స్పందిస్తాయి. బి కణాలకు జ్ఞాపకశక్తి కూడా ఉంటుంది. మనం ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డప్పుడు దానికి కారణమైన సూక్ష్మక్రిములను గుర్తుంచుకుంటాయి. అవి ఎప్పుడైనా మళ్లీ దాడిచేస్తే గుర్తుపట్టి, యాంటీబాడీలను పురమాయించి వాటి పని పడతాయి. ఫ్లూ వంటి కొన్నివైరస్‌లు బి కణాల కంట పడకుండా తమ జన్యు నిర్మాణాన్ని మార్చేసుకుంటూ ఉంటాయి. కొత్త కరోనా వైరస్‌ సైతం ఇలాగే ప్రవర్తిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇది రోగనిరోధక వ్యవస్థకు మరింత పని పెడుతోంది. అందుకే ఏమాత్రం నిర్వీర్యమైనా తీవ్ర చిక్కులు కలిగిస్తోంది.

ఎందుకు తగ్గుతుంది?

వయసుతో పాటు రోగనిరోధకశక్తి క్షీణిస్తుండటాన్ని చాలామంది పెద్దగా పట్టించుకోరు. అప్పటికప్పుడు దీంతో ముంచుకొచ్చే ముప్పేమీ లేదనే భావిస్తుంటారు. ఇది పెద్ద తప్ఫు నిజానికి కౌమారంలోనే రోగనిరోధకశక్తి తగ్గటం మొదలవుతుంది. మన జీవనశైలితో ముడపడిన రకరకాల అంశాలు దీన్ని మరింత వేగంగా తగ్గిస్తుంటాయి. ఉదాహరణకు- పొగతాగేవారు, ఊబకాయులు, శారీరక శ్రమ అంతగా చేయనివారిలో రోగనిరోధక సామర్థ్యం ఆయా వయసుల్లో ఉండాల్సిన దాని కన్నా తక్కువగా ఉంటుంది. సాధారణంగా ఒంట్లోకి క్రిముల వంటివేవైనా ప్రవేశించినప్పుడు నూట్రోఫిల్స్‌ అనే తెల్లరక్తకణాలు వెంటనే గుర్తించి, చుట్టుముట్టేస్తాయి. సైటోకైన్ల వంటి రసాయనాలను పెద్దఎత్తున విడుదల చేసి వాటి మీద చల్లుతాయి. లేదూ వాటి చుట్టూ దడి కట్టేస్తాయి. వయసు మీద పడుతున్నకొద్దీ ఈ ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. ‘వృద్ధ’ న్యూట్రోఫిల్స్‌ క్రిములను గుర్తించినా సరిగా వేటాడలేవు. దారి తప్పుతుంటాయి కూడా. దీంతో ఒకవైపు రక్షణ వ్యవస్థ వేగం, సామర్థ్యం క్షీణిస్తుంటే.. మరోవైపు వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) మొదలవుతుంటుంది. దారితప్పిన న్యూట్రోఫిల్స్‌ చేసే అనర్థం అంతా ఇంతా కాదు. ఇవి కాస్తో కూస్తో పనిచేసే న్యూట్రోఫిల్స్‌కూ హాని చేస్తాయి. ఇలాంటివన్నీ ప్రస్తుతం వృద్ధులకు కరోనా ముప్పు పెరగటానికి దారితీస్తున్నాయి.

పెంచుకునే మార్గముంది..

వయసు పెరుగుతున్నకొద్దీ గతితప్పే న్యూట్రోఫిల్స్‌ను సరిదిద్దుకునే మార్గం లేకపోలేదు. వీటికి మార్గనిర్దేశం చేసే ఎంజైమ్‌ను నియంత్రిస్తే తిరిగి దారిలోకి తెచ్చుకోవచ్ఛు ఇందుకు కొలెస్ట్రాల్‌ను తగ్గించే స్టాటిన్స్‌ ఉపయోగపడుతున్నట్టు తేలింది గానీ వీటితో దుష్ప్రభావాలు లేకపోలేదు. అందువల్ల ఇతరత్రా మార్గాల్లోనే రోగనిరోధకశక్తిని పెంచుకోవటం ఉత్తమం. ఇదేమీ ఊరికే లభించేది కాదు. కొంత త్యాగం అవసరం. మనం ఆరోగ్యంగా, ఎక్కువ కాలం జీవించాలనే ఉద్దేశంతో చూస్తే ఇది పెద్ద కష్టమైందేమీ కాదు కూడా.

1. వ్యాయామం: దీంతో గుండె వేగం పెరుగుతుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది. హానికారక క్రిముల పనిపట్టే తెల్ల రక్తకణాలు, ఇమ్యునోగ్లోబులిన్లు శరీరంలోని అన్ని భాగాలకు త్వరగా విస్తరిస్తాయి. బాగా వ్యాయామం చేసేవారిలో నూట్రోఫిల్స్‌ యువతీ యువకుల్లో మాదిరిగానే పనిచేస్తుండటం గమనార్హం. న్యూట్రోఫిల్స్‌ వైరస్‌లను అంతగా అరికట్టలేకపోవచ్చు గానీ వాటి మూలంగా పుట్టుకొచ్చే ఇతరత్రా బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లను సమర్థంగా అడ్డుకుంటాయి. కరోనా జబ్బుతో ముంచుకొస్తున్న పెద్ద ప్రమాదం న్యుమోనియానే. ఇది బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షనే. వ్యాయామం చేయటం వల్ల థైమస్‌ క్షీణించే వేగమూ తగ్గుతుంది. అంతేకాదు.. ఎముకలకు అంటుకొని ఉండే కండరాలు వృద్ధి చెందటం వల్ల వాపు ప్రక్రియను అడ్డుకునే మాక్రోఫేజెస్‌ కణాల సంఖ్యా పెరుగుతుంది. అందువల్ల రోజుకు 10వేల అడుగులైనా నడవటం మంచిదన్నది శాస్త్రవేత్తల సూచన.

2. ఆహారం: మనమేం తింటున్నామన్నదీ కీలకమే. ముఖ్యంగా పేగుల్లో మంచి బ్యాక్టీరియా మీద దృష్టి సారించాల్సిన సమయమిది. ఇది అస్తవ్యస్తమైతే వృద్ధాప్యం త్వరగా ముంచుకొస్తుంది. అదే ఆరోగ్యంగా ఉంటే ఆయుష్షుతో పాటు రోగనిరోధక సామర్థ్యమూ పెరుగుతుంది. పెరుగు, మజ్జిగ వంటి పులిసిన పదార్థాలు పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి దోహదం చేస్తాయి. అలాగే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినటం మంచిది. వీటిల్లోని పీచు పేగుల్లో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. ఇక యాంటీ ఆక్సిడెంట్లు, సూక్ష్మ పోషకాలు నిరోధకశక్తి పెంపొందటానికి దోహదం చేస్తాయి. అలాగే కరివేపాకు, బొప్పాయి, పాలకూర, బత్తాయి పుల్లటి పండ్లు.. అల్లం, వెల్లుల్లి, మిరియాలు, పసుపు వంటి మసాలా దినుసుల వంటివీ నిరోధక శక్తి బలోపేతం కావటానికి తోడ్పడతాయి.

3. ఉపవాసం: ఆహారం ద్వారా లభించే కేలరీలు తగ్గించుకున్నా రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఇలాంటివారు సన్నగా, ఫిట్‌గా, శారీరకంగా, మానసికంగా మరింత ఆరోగ్యంగా ఉండటమే కాదు.. వీరిలో రోగనిరోధక ప్రతిస్పందన సైతం బలంగా ఉంటుండటం విశేషం. కేలరీలు తగ్గించుకోవటానికి పరిమిత కాల ఉపవాసం (ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌) పాటించొచ్ఛు ఇందులో రకరకాల పద్ధతులున్నాయి. ఉదాహరణకు- రోజులో 16 గంటల పాటు ఏమీ తినకుండా ఉండటం, మిగతా 8 గంటల సమయంలోనే టిఫిన్‌, భోజనం వంటివన్నీ ముగించెయ్యటం చేయొచ్చు.

4. బరువు అదుపు: అధిక బరువును తగ్గించుకోవటమూ రోగనిరోధకశక్తి పెంపొందటానికి తోడ్పడుతుంది. వయసుతో పాటు బి కణాల సామర్థ్యం క్షీణిస్తుంది. టీకాలకు యాంటీబాడీలు ఉత్పత్తి కావటమూ తగ్గుతుంది. ఊబకాయుల్లోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి. కొవ్వు కణజాలం యాంటీబాడీల ప్రతిస్పందననూ తగ్గిస్తుండటమే దీనికి కారణం. కాబట్టి బరువు అదుపులో ఉంచుకోవటం ఎంతైనా మంచిది. దీంతో రోగనిరోధకశక్తిని అణచివేసే మధుమేహం వంటి జబ్బుల ముప్పూ తగ్గుతుంది. ప్రస్తుతం కరోనా బాధితులకు మధుమేహం మరింత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుండటం చూస్తున్నదే.

5. విటమిన్లు: న్యూట్రోఫిల్స్‌ నుంచి సంకేతాలు సరిగా అందకపోవటం, వాపు ప్రక్రియ తలెత్తటం వల్ల రోగనిరోధక వ్యవస్థలో భాగమైన టి కణాల పనితీరూ దెబ్బతింటుంది. దీన్ని సరిదిద్దటానికి విటమిన్‌ ఇ తోడ్పడుతుంది. వృద్ధులు దీన్ని తక్కువ మోతాదులో (200 ఐయూ) తీసుకుంటే రోగ నిరోధకశక్తి పుంజుకునేలా చూసుకోవచ్ఛు విటమిన్‌ డి సైతం రోగనిరోధకశక్తిలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది తెల్లరక్తకణాలు చురుకుగా పనిచేయటానికి తోడ్పడుతుంది. దీన్ని సుమారు 1000 ఐయూ మోతాదులో తీసుకోవచ్ఛు పెద్ద మొత్తంలో తీసుకుంటే టి కణాలను పనితీరు మందగించే ప్రమాదముంది.

6. జింక్‌: రోగనిరోధకశక్తి పెంపొందటంలో జింక్‌ది ప్రత్యేక స్థానం. వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా బాగా కాపాడుతుంది. అలాగని మరీ ఎక్కువగా తీసుకోవటం తగదు. రోజుకు 50 మి.గ్రా. చాలు. చప్పరించటానికి వీలైన జింక్‌ బిళ్లలు వాడుకుంటే ఇంకా మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని