ప్రకృతే దిక్కు!

ఏదైనా దెబ్బ తగిలితే ‘అమ్మా’ అని అరుస్తాం. ఏ ప్రమాదం ముంచుకొచ్చినా ‘అమ్మా’ అనే అర్థిస్తాం. అమ్మ భరోసా అలాంటిది. అమ్మ రక్షణ అలాంటిది. ఇప్పుడు మనమంతా అలాంటి భరోసా, రక్షణ కోసమే ఎదురుచూస్తున్నాం. మందూ మాకూ లేని కరోనా విలయంలో చిక్కుకొని, చిన్న ఆలంబనైనా దొరక్కపోతుందా అని నిరీక్షిస్తున్నాం. దొరకాలని ప్రార్థిస్తున్నాం. కానీ ఇదంతా మనం చేసిన ‘తప్పుల’ ఫలితమేనని తెలుసుకోలేకపోతున్నాం. తినకూడనివి తినటం, తిరగకూడని ...

Published : 21 Apr 2020 00:28 IST

ఇన్‌ఫెక్షన్లు- ప్రకృతి వైద్యం

ఏదైనా దెబ్బ తగిలితే ‘అమ్మా’ అని అరుస్తాం. ఏ ప్రమాదం ముంచుకొచ్చినా ‘అమ్మా’ అనే అర్థిస్తాం. అమ్మ భరోసా అలాంటిది. అమ్మ రక్షణ అలాంటిది. ఇప్పుడు మనమంతా అలాంటి భరోసా, రక్షణ కోసమే ఎదురుచూస్తున్నాం. మందూ మాకూ లేని కరోనా విలయంలో చిక్కుకొని, చిన్న ఆలంబనైనా దొరక్కపోతుందా అని నిరీక్షిస్తున్నాం. దొరకాలని ప్రార్థిస్తున్నాం. కానీ ఇదంతా మనం చేసిన ‘తప్పుల’ ఫలితమేనని తెలుసుకోలేకపోతున్నాం. తినకూడనివి తినటం, తిరగకూడని తిరుగుళ్లు తిరగటం, చేయాల్సిన శ్రమ చేయకపోవటం, తీసుకోవాల్సిన విశ్రాంతి తీసుకోకపోవటం వంటివన్నీ తప్పులు కాక మరేంటి? కొత్త ఇన్‌ఫెక్షన్లయినా, పాత జబ్బులైనా అన్నీ వీటి ఫలితాలే! ప్రకృతి వైద్యం చెబుతున్నదిదే. ‘తప్పులకు’ పాల్పడకపోతే జబ్బులే రావని, ఒకవేళ వచ్చినా మందులతో పనిలేకుండా నయం చేసుకోవచ్చని సూచిస్తోంది. మరింకేం? ప్రస్తుత అనిశ్చిత పరిస్థితిలో అమ్మలకే అమ్మ అయిన ‘ప్రకృతి’నే కాపాడమని వేడుకుందాం.

ప్రకృతి వైద్యం ఓ సహజ చికిత్స పద్ధతి మాత్రమే కాదు. జీవన విధానం కూడా. ఆసాంతం ఆరోగ్యంగా, ఆనందంగా, హాయిగా జీవించటానికి తోడ్పడే సాధనం. జబ్బులను సమూలంగా.. అదీ అంతటా, ఉచితంగా లభించే గాలి, మట్టి, నీరు, ఎండ వంటి సహజ వనరులతోనే నయం చేయటం ప్రకృతి వైద్యం విశిష్టత. మన శరీరం పంచ భూతాల (నేల, నీరు, గాలి, కాంతి, ఆకాశం) సమాహారం. వీటి సాయంతోనే శరీరంలోని ప్రాణశక్తిని (వైటల్‌ ఫోర్స్‌) ఉత్తేజితం చేయటం, జబ్బులను మూలం నుంచీ తొలగించటం ప్రకృతి వైద్యం ప్రత్యేకత. ఇది అందరూ ఆచరించటానికి వీలైనదీ, చవకైనదీనూ. ఉన్నట్టుండి తలెత్తే ఇన్‌ఫెక్షన్లు నయం కావటానికీ ఇది వర్తిస్తుంది. నిజానికి కరోనా జబ్బులాంటి మహమ్మారులు మనకు కొత్త కాదు. ఒకప్పుడు ప్లేగు, కలరా వంటివెన్నో విజృంభించాయి. వీటికి ప్రపంచం మొత్తమేమీ తుడిచిపెట్టుకుపోలేదు కదా. ఎంతోమంది బతికి బట్టకట్టగలిగారు. కొందరు మహమ్మారులకు బలి కావటానికి, కొందరు వాటిని జయించటానికి కారణమేంటి? ఆయా వ్యక్తుల ప్రాణశక్తే. మన రోగనిరోధకశక్తి, శరీర సామర్థ్యం దీని మీదే ఆధారపడి ఉంటాయి. తీసుకునే ఆహారం, తాగే నీరు, మానసిక స్థితి వంటి వాటి ద్వారా ప్రాణశక్తి ఒళ్లంతా విస్తరిస్తుంది. దీని సాయంతోనే శరీరం తనను తాను కాపాడుకోవటానికి, ఏవైనా జబ్బులు వస్తే నయం చేసుకోవటానికి ప్రయత్నిస్తుంది. మందులతో ఏమాత్రం పనిలేని ప్రకృతి వైద్యం ఉద్దేశమూ ఇదే. సహజ వనరుల సాయంతో ప్రాణశక్తిని ప్రేరేపించి, శరీరం తనకు తానుగా జబ్బులను నయం చేసుకునేలా తోడ్పడుతుంది మరి.

సంపూర్ణ ఆరోగ్య మార్గం

ఆరోగ్యమంటే ఏంటి? శారీరకంగా ఎలాంటి జబ్బులు లేకపోవటమే కాదు.. మానసికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండటమే సంపూర్ణ ఆరోగ్యమన్నది ప్రపంచ ఆరోగ్యసంస్థ నిర్వచనం. మనిషిని ఇలా అన్నిరకాలుగా ఆరోగ్యవంతుడిని చేయటమే ప్రకృతి వైద్య విధానం లక్ష్యం. మనిషి ఆరోగ్యంగా, బలంగా పుడతాడు. ప్రకృతి నియమాలకు అనుగుణంగా జీవించినంత కాలం ఆరోగ్యంగానే ఉంటాడు. ఈ ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు శరీరంలో ఏర్పడే అస్తవ్యస్థ స్థితినే ప్రకృతి వైద్యం జబ్బుగా పేర్కొంటుంది. అందుకే స్వచ్ఛమైన గాలి, ఎండ, సమతులాహారం, క్రమబద్ధ వ్యాయాయం, శాస్త్రబద్ధ విశ్రాంతి, నిర్మాణాత్మక ఆలోచన, స్థిరమైన మానసిక ధోరణితో పాటు ప్రార్థన, ధ్యానం వంటి వాటికి విశేష ప్రాధాన్యం ఇస్తుంది. ఇవన్నీ శరీరం, మనసు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడతాయని బలంగా విశ్వసిస్తుంది.

ఐదు సూత్రాల ఆలంబన

‘విత్తనం కాదు, నేల ముఖ్యం’. జబ్బులు, ఇన్‌ఫెక్షన్ల విషయంలో ప్రకృతి వైద్యం భావన ఇదే. మన ఒంట్లో వైరస్‌, బ్యాక్టీరియాకు అనుకూలమైన వాతావరణం ఉంటేనే వృద్ధి చెందుతాయి. ప్రజ్వలిస్తాయి, ప్రతాపాన్ని చూపుతాయి. అనుకూలమైన వాతావరణం లేకపోతే శరీరానికి లొంగిపోయి, నిర్వీర్యమైపోతాయి. అంటే ఇన్‌ఫెక్షన్లు తలెత్తటానికి బ్యాక్టీరియా, వైరస్‌ల బలం కన్నా మన శరీర సామర్థ్యమే కీలకమన్నమాట. కరోనా జబ్బులో ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంది. ఇన్‌ఫెక్షన్‌ ఎంత వేగంగా, ఉద్ధృతంగా విస్తరిస్తున్నప్పటికీ కొందరిలోనే తీవ్ర సమస్యగా మారుతుండటం చూస్తున్నదే. దీనికి ప్రధాన కారణం ప్రాణశక్తి తగ్గటం. ప్రకృతి నియమాల ఉల్లంఘన మన ఒంట్లో రకరకాల రూపాల్లో బయటపడుతుంది. ప్రాణశక్తి తగ్గటం.. రక్తం, లింఫ్‌ వ్యవస్థలు అస్తవ్యస్తం కావటం.. ఒంట్లో మలినాలు, విషతుల్యాలు పేరుకుపోవటం వంటివన్నీ దీని ఫలితాలే. ఇవే జబ్బులకు మూలాలు. వీటిని నిర్మూలించటమే ప్రకృతి వైద్యం లక్ష్యం. ఇది ఐదు సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. ఇవి చికిత్సలుగానే కాదు, జబ్బుల నివారణకూ తోడ్పడతాయి.

మలిన నిర్మూలన: ఒంట్లోని మలినాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లకపోవటమే జబ్బులన్నింటికీ మూలం. మన ఒంట్లో కణాలన్నీ నిరంతరం పని చేసుకుంటూ పోతుంటాయి. ఈ క్రమంలో కొన్ని మలినాలు పుట్టుకొస్తుంటాయి. తిన్న ఆహారంలో కొంత మలంగా తయారవుతుంది. రక్తం శుద్ధి అయ్యే క్రమంలో మూత్రం తయారవుతుంది. శ్వాస ప్రక్రియలోనూ కొన్ని మలినాలు పోగుపడుతుంటాయి. ఇవన్నీ ఊపిరితిత్తులు, చర్మం, మూత్రపిండాలు, పేగుల ద్వారా ఎప్పటికప్పుడు బయటకు పోతుంటాయి. ఈ ప్రక్రియ అస్తవ్యస్తమైతే మలినాలు పోగుపడుతూ క్రమంగా విషతుల్యాలుగా (టాక్సిన్స్‌) మారి, జబ్బులకు దారితీస్తాయి. వీటిని బయటకు పంపిస్తే జబ్బు దానంతటదే నయమవుతుంది. ప్రకృతి చికిత్సలన్నీ దీన్ని దృష్టిలో పెట్టుకొని చేసేవే. ఎనీమా, మర్దన, చర్మానికి చెమట పట్టేలా చేయటం, మట్టి పట్టీల వంటివన్నీ ఇందుకోసమే.


ఆహార శ్రద్ధ: ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు తినటం ప్రాణశక్తిని దెబ్బతీస్తుంది. సరైన ఆహార నియమాలు పాటించకపోవటం ఒక్క జీర్ణవ్యవస్థనే కాదు ఇతర అవయవాలనూ అస్తవ్యస్తం చేస్తుంది. మలినాలు, వాటి నుంచి పుట్టుకొచ్చే విషతుల్యాలు పేరుకుపోవటం పేగులు, కిడ్నీలు, చర్మం, ఊపిరితిత్తుల మీద విపరీత ప్రభావం చూపుతుంది. అందువల్ల ఆహారం మీద ప్రకృతి వైద్యం ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది. దీన్ని చికిత్సగానూ భావిస్తుంది. ప్రతి ఒక్కరూ సమతులాహారం, తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవటం.. ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్ల సమయంలో ఎంతైనా అవసరం. ఆయా ప్రాంతాల్లో, ఆయా కాలాల్లో దొరికే పదార్థాలు తినటం తప్పనిసరి. ఎప్పుడూ ఒకేరకం కాకుండా వారానికి ఒకసారైనా గుమ్మడికాయ, సొరకాయ, పొట్లకాయ, కాకరకాయ వంటివి తినటం మంచిది. పాలకూర, చుక్కకూర, తోటకూర వంటివాటితో పాటు గట్ల మీద దొరికే పొన్నగంటి, గంగవాయిలు, తెల్లగలిజేరు/అటికమామిడి (పునర్నవ) వంటి ఆకుకూరలూ తినటం మేలు.


చలన శక్తి: శరీరం కదలాలి. ఇందుకోసం శ్రమ చేయాలి. శారీరక శ్రమ లేకపోతే రక్త ప్రసరణ దెబ్బతింటుంది. ఆహారం ద్వారా లభించిన పోషకాలు కణాలకు సరిగా అందవు. దీంతో శారీరక సామర్థ్యం తగ్గిపోతుంది. కాబట్టే వ్యాయామానికి.. ముఖ్యంగా యోగాసనాలకు ప్రకృతి వైద్యం విశేష ప్రాధాన్యమిస్తుంది. ప్రతి ఒక్కరూ సూర్యనమస్కారాల్లో ఉన్న ఒక్కో ఆసనాన్ని కనీసం 30 సెకండ్ల పాటు చేయగలిగే స్థితిలో ఉండాలి. ఇలా మొత్తం ఆరుసార్లు సూర్య నమస్కారాలు చేయగలగాలి. దీంతో శరీరం ఉత్తేజితమవుతుంది. రోగనిరోధకశక్తి పెంపొందుతుంది.


ఉపవాస ఊరట: మన ఒంట్లో ప్రతి కండరానికీ, కణానికీ కొంత విశ్రాంతి అవసరం. ఇందుకు ప్రశాంతంగా కూర్చోవటం, నిద్ర వంటి వాటితో పాటు ఉపవాసమూ ఎంతగానో తోడ్పడుతుంది. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు శరీరం మీద భారం తగ్గుతుంది. అందువల్ల వారానికి ఒకరోజైనా ఉపవాసం ఉండటం మేలు. ఈ సమయంలో అవసరాన్ని బట్టి నీళ్లు, నిమ్మరసం కలిపిన నీరు, పండ్ల రసాల వంటివి తీసుకోవచ్ఛు ఉపవాసం చేయలేనివారు భోజనానికి బదులు పండ్లు, ఉడికించిన కూరగాయల వంటివైనా తినొచ్ఛు ఇవేవీ చేయలేనివారు సూర్యాస్తమయం నుంచి తెల్లారాక 8 గంటల వరకు ఏమీ తినకుండా ఉన్నా చాలు. కావాలంటే నీళ్ల వంటివి తాగొచ్ఛు మధుమేహం, గుండెజబ్బుల వంటి సమస్యలతో బాధపడేవారు నిపుణుల సలహా తీసుకున్నాకే ఉపవాసం పాటించాలి.


భావోద్వేగాల నియంత్రణ: బయటి ఒత్తిళ్లే కాదు, శరీరంలోంచి పుట్టుకొచ్చే ఒత్తిళ్లూ భావోద్వేగాలను దెబ్బతీస్తాయి. మలినాల నిర్మూలన, ఆహారం, వ్యాయామ, విశ్రాంతి పద్ధతులు అస్తవ్యస్తమైనా భావోద్వేగాల మీద పట్టు తప్పుతుంది. ఇవన్నీ ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటాయి. అందువల్ల మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. రోజుకు కనీసం 15 నిమిషాల సేపైనా ప్రాణాయామం, ధ్యానం చేయటం మంచిది. ఇవి మానసిక ప్రశాంతతను కలగజేస్తాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుతాయి.

- ఈ సూత్రాలను కచ్చితంగా పాటిస్తే జీవితాంతం ఆరోగ్యంగా, హాయిగా ఉండొచ్ఛు ఇన్‌ఫెక్షన్లు, జబ్బుల బారినపడకుండా చూసుకోవచ్ఛు ఒకవేళ వచ్చినా త్వరగా బయటపడొచ్చు.

శరీరమే ఔషధ కారాగారం

మన శరీరం గొప్ప ఔషధ కారాగారం! అవసరమైన మందులను తనే తయారు చేసుకుంటుంది. కాకపోతే దానికో అవకాశం ఇవ్వాలి. అలా చేయలేకపోతేనే మందులు అవసరమవుతాయి. నిజానికి మందులేసుకున్నా జబ్బును నయం చేసేది శరీరమే. మందులు శరీరానికి సహాయం చేస్తాయే తప్ప అవే జబ్బును నయం చేయలేవు. చివరికి శరీరమే తనకు తాను చికిత్స చేసుకుంటుంది.

సూర్యరశ్మి కీలకం!

మన ఆరోగ్యంలో ఎండ కీలకపాత్ర పోషిస్తుంది. విటమిన్‌ డి లోపంతో ఇన్‌ఫెక్షన్ల ముప్పు పెరుగుతుందన్నది తెలిసిందే. సూర్యరశ్మి సమక్షంలోనే మన చర్మం విటమిన్‌ డిని తయారుచేసుకుంటుంది. అందువల్ల రోజూ 15-20 నిమిషాల సేపు ఎండ తగిలేలా చూసుకోవాలి. దీంతో శరీరంలోని జీవకణాలన్నీ ఉత్తేజితమై ఆహారం ద్వారా లభించిన పోషకాలను బాగా గ్రహిస్తాయి. లేకపోతే నిస్తేజమవుతాయి.

తేలికైన చికిత్స

ఇన్‌ఫెక్షన్ల వంటివి ఉన్నట్టుండి దాడిచేసే సమస్యలు. వీటితో తలెత్తే జ్వరాలు, జలుబు, వాపులు, వాంతులు, విరేచనాలు, దద్దుర్ల వంటివన్నీ మన శరీరం మలినాలను బయటకు వెళ్లగొట్టే ప్రయత్నమే. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవటం, మందులు వేసుకోవటం తప్పనిసరి. పరిస్థితి అంతవరకూ రాకుండా లక్షణాలు ఒక మాదిరిగా ఉన్నప్పుడే కొన్ని సహజ పద్ధతులు పాటిస్తే సమస్యను అదుపులో ఉంచుకోవచ్ఛు తీవ్రం కాకుండా చూసుకోవచ్చు.

తగు విశ్రాంతి: వీలైనంతవరకు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవటం చాలా ముఖ్యం. ఇది శరీరం ఇన్‌ఫెక్షన్‌తో పోరాడటానికి వీలు కల్పిస్తుంది. ఇతరులకు జబ్బు వ్యాపించకుండానూ కాపాడుతుంది.

మంచి గాలి: శరీర ఉష్ణోగ్రత ఒక డిగ్రీ పెరిగితే ఆక్సిజన్‌ అవసరం 13% వరకు పెరుగుతుంది. అందువల్ల ఇంట్లోకి గాలి బాగా వచ్చేలా చూసుకోవాలి.

తేలికైన ఆహారం: జ్వరం వచ్చినప్పుడు ఒంట్లో పుట్టుకొచ్చే రసాయనాలు జీర్ణశక్తిని దెబ్బతీస్తాయి. ఆలస్యంగా జీర్ణమయ్యే పదార్థాలు తింటే జ్వరం మరింత ఎక్కువవుతుంది. కాబట్టి జ్వరం 99 డిగ్రీల ఫారన్‌హీట్‌ కన్నా ఎక్కువుంటే ఘనాహారం తినకపోవటమే మంచిది. నీళ్లు, ద్రవాలు తీసుకోవాలి. జ్వరం తగ్గుతున్నకొద్దీ ఘనాహారం ఆరంభించాలి. ఉడికించిన కూరగాయల వంటివి తీసుకోవాలి. ఆకలి ఉంటేనే భోజనం చేయాలి. భోజనానికి భోజనానికీ మధ్య కనీసం 8 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత ఉడికించిన ఘనాహారమేదీ తీసుకోకపోవటం ఉత్తమం. దీంతో శరీరం మీద భారం తగ్గుతుంది. ఆహారాన్ని జీర్ణం చేసుకోవటానికి వినియోగించాల్సిన శక్తిని శరీరం మరమ్మతు చేయటానికి వాడుకుంటుంది. ఇన్‌ఫెక్షన్లలో మాంసాహారం నిషిద్ధం. పప్పులను బాగా నానబెట్టి, ఉడికించిన తర్వాతే తీసుకోవాలి. ఇంట్లోనే వండిన ఆహారాన్ని తీసుకోవాలి. చల్లటి పదార్థాలు, ఫ్రిజ్‌లో పెట్టినవి తీసుకోవద్ధు ప్రస్తుతం అంతా ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి సూర్యాస్తమయానికి ముందే భోజనం ముగించెయ్యటం ఉత్తమం. సాయంత్రం తర్వాత పండ్లు, గడ్డపెరుగు వంటివి అసలే తినొద్ధు వీలైతే జ్వరం తగ్గేంతవరకు ఉపవాసం పాటించాలి.

నీళ్లు, ద్రవాలు: తరచూ నీళ్లు తాగాలి. గోరువెచ్చటి నీళ్లయితే ఇంకా మంచిది. నీటిలో తులసి ఆకులు లేదా మిరియాలు వేసి మరిగించి తీసుకోవచ్ఛు ఇవి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు తగ్గటానికి తోడ్పడతాయి. ఉత్త నీళ్లు తాగటం ఇష్టం లేకపోతే నిమ్మరసం, తేనె కలుపుకోవచ్ఛు నీటిలో ఓఆర్‌ఎస్‌ పొడిని కలిపి తాగితే చలి తగ్గటానికి తోడ్పడుతుంది. ఓఆర్‌ఎస్‌ పొడి లేకపోతే గ్లాసు నీటిలో చారెడు పంచదార, చిటికెడు ఉప్పు అయినా కలుపుకోవచ్ఛు ఉప్పు నీటిని, తులసి కషాయాన్ని నోట్లో పోసుకొని కాసేపు పుక్కిలిస్తుంటే మామూలు దగ్గు తగ్గుతుంది.

నీటి చికిత్స ప్రత్యేకం

ఇన్‌ఫెక్షన్లలో కంగారు పెట్టేది జ్వరమే. కాస్త ఒళ్లు వెచ్చబడగానే అంతా వెంటనే జ్వరం మాత్రలు వేసుకుంటుంటారు. వీటితో మేలు కన్నా కీడే ఎక్కువని, జ్వరాన్ని సహజ పద్ధతిలో తగ్గించటం మంచిదని ప్రకృతి వైద్యం చెబుతుంది. ఇందుకు తడి రుమాలు/వస్త్రాన్ని శరీరానికి చుట్టటం వంటి చికిత్సలు బాగా ఉపయోగపడతాయి. వీటిని నిపుణుల సలహా మేరకు ఇంట్లోనే చేసుకోవచ్ఛు ఇవి శరీరం ఇన్‌ఫెక్షన్‌తో పోరాడటానికి వీలు కల్పిస్తాయి. జ్వరంతో బాధపడేవారు నిద్రపోయేంత వరకు లేదా జ్వరం తగ్గేంతవరకు వీటిని చేయొచ్ఛు ఇలా జ్వరం మరీ ఎక్కువ కాకుండా, తీవ్ర దుష్ప్రభావాలకు గురికాకుండా చూసుకోవచ్చు.

జ్వరం మరీ ఎక్కువగా లేకపోతే (99.5 డిగ్రీల ఫారన్‌హీట్‌ లోపు) కాటన్‌ సాక్స్‌ను తడిపి, గట్టిగా పిండి పాదాలకు ధరించాలి. వాటి మీద ఉన్ని సాక్స్‌ తొడగాలి. ఇలా 20 నిమిషాల సేపు లేదా సాక్స్‌ శరీర వేడికి సమానంగా అయ్యేంతవరకు ఉంచి తీయాలి. మళ్లీ సాక్స్‌ను తడిపి తొడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తుంటే జ్వరం నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది.

జ్వరం ఒక మాదిరిగా ఉంటే (99.6-102 డిగ్రీల ఫారన్‌హీట్‌) పలుచటి తువ్వాలును చల్లటి నీటిలో తడిపి, పిండాలి. దీన్ని రెండు మడతలుగా సగానికి మడిచి ఛాతీ నుంచి తుంటి వరకూ ఒంటికి చుట్టేయాలి. దీనిపై కంబళి లేదా బ్లాంకెట్‌ను గట్టిగా చుట్టాలి. సుమారు 10-20 నిమిషాల వరకు అలాగే ఉంచాలి.

జ్వరం ఎక్కువగా ఉంటే (102-104 డిగ్రీల ఫారన్‌హీట్‌) పలుచటి కాటన్‌ వస్త్రాన్ని చల్లటి నీటిలో తడిపి, పిండేసి చంకల దగ్గర్నుంచి పిరుదుల వరకు చుట్టేయాలి. మీది నుంచి మందం బ్లాంకెట్‌ను చుట్టాలి. లోపల గాలి తగలకుండా చూసుకోవాలి. తడి వస్త్రం వెచ్చబడితే తిరిగి నీటిలో పిండి చుట్టేయాలి.

జ్వరం మరీ ఎక్కువగా ఉంటే (104 డిగ్రీల ఫారన్‌హీట్‌, అంతకన్నా ఎక్కువ) తడిపిన నూలు వస్త్రాన్ని భుజాల దగ్గర్నుంచి మడమల వరకూ ఒంటి చుట్టూ చుట్టేయాలి. దాని మీద మందం బ్లాంకెట్‌ను చుట్టాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని