యుక్తి శక్తి విముక్తి

కరోనా మెడకు చుట్టుకుంది. కరవకుండా ఉంటుందా? ప్రపంచమంతా ఇప్పుడిలాంటి విపత్కర పరిస్థితిలోనే చిక్కుకుంది. అయినా ఒకింత యుక్తిని ప్రదర్శిస్తే దీంతో కలిసి జీవించటం అలవరచుకోవచ్ఛు దీని కాటు నుంచి తప్పించుకోవచ్ఛు రోగనిరోధక శక్తిని కాపాడుకుంటే కాటేసినా గట్టిగా ఎదుర్కోవచ్ఛు ప్రస్తుతం మనకు కావాల్సింది అలాంటి యుక్తి, శక్తులే. మున్ముందు మనల్ని కాపాడగలిగేవి ఇవే.

Published : 02 Jun 2020 01:34 IST

కరోనా మెడకు చుట్టుకుంది. కరవకుండా ఉంటుందా? ప్రపంచమంతా ఇప్పుడిలాంటి విపత్కర పరిస్థితిలోనే చిక్కుకుంది. అయినా ఒకింత యుక్తిని ప్రదర్శిస్తే దీంతో కలిసి జీవించటం అలవరచుకోవచ్ఛు దీని కాటు నుంచి తప్పించుకోవచ్ఛు రోగనిరోధక శక్తిని కాపాడుకుంటే కాటేసినా గట్టిగా ఎదుర్కోవచ్ఛు ప్రస్తుతం మనకు కావాల్సింది అలాంటి యుక్తి, శక్తులే. మున్ముందు మనల్ని కాపాడగలిగేవి ఇవే. వీటి దన్నుతో కరోనా నుంచి పూర్తిగా విముక్తి పొందనూవచ్చు!


ఇల్లు పదిలం!

ఎంతకాలమని ఇంట్లో కూర్చుంటాం? అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న. దిగ్బంధం ఆంక్షలు సడలించాక.. దుకాణాలు, ఆఫీసులు, కర్మాగారాలు, బడులు, గుడులు తెరచుకున్నాక అవసరాల కోసమో, పనుల కోసమో, చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో అంతా బయటకు వచ్చేవారే. సరిగ్గా ఇక్కడే జాగ్రత్త అవసరం. ఆంక్షలు తొలగించినంత మాత్రాన కరోనా పీడ విరగడైనట్టు కాదు. వైరస్‌ మన చుట్టూ తిరుగాడుతూనే ఉంటుంది. ఆదమరిస్తే అంటుకోవటానికి కాచుకునే ఉంటుంది. మన నుంచి ఇంట్లో వాళ్లకూ సోకే ప్రమాదముంది. బయట తిరిగివచ్చిన వారి మూలంగానే చాలామంది ఇన్‌ఫెక్షన్‌ బారినపడుతుండటం గమనార్హం. అంటే ఇంటిని, ఇంట్లో వాళ్లను పదిలంగా కాపాడుకోవటం చాలా ముఖ్యమని, అది మన చేతుల్లోనే ఉందని గుర్తుంచుకోవాలి.

నలువైపులా ప్రమాదం

ఇన్‌ఫెక్షన్‌ తలెత్తటమనేది ఎంత వైరస్‌ మోతాదుకు (వైరస్‌, దాని రేణువుల సంఖ్య) గురయ్యామనే దాన్ని బట్టి ఉంటుంది. కరోనా ఇన్‌ఫెక్షన్‌ తలెత్తటానికి 1,000 వైరస్‌ రేణువులైనా చాలు. కరోనా బాధితులు ఒక్కసారి దగ్గినా, తుమ్మినా వెలువడే తుంపర్లలో 20 కోట్ల వైరస్‌ రేణువులుంటాయి! ఇవి చుట్టుపక్కల పరిసరాల్లోకి విస్తరించొచ్ఛు దగ్గు తుంపర్లు గంటకు 80 కిలోమీటర్లు, తుమ్ము తుంపర్లు గంటకు 321 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. పెద్ద తుంపర్లు చాలావరకు కింద పడిపోతాయి. సమీపంలో ఉన్నవారికే వీటితో ప్రమాదం పొంచి ఉంటుంది. అలాగని చిన్న తుంపర్లతో ముప్పు లేకపోలేదు. ఇవి గాలిలో కొద్దిసేపు అలాగే తేలియాడుతుండొచ్ఛు ఆ సమయంలో ఇవి శ్వాస ద్వారా ముక్కులోకి చేరుకోవచ్ఛు తుంపర్లు అంటుకున్న వస్తువుల మీద పెట్టిన చేయితో కళ్లు, ముక్కు రుద్దుకోవచ్ఛు గమనించాల్సిన విషయం ఏంటంటే- లక్షణాలు లేనివారి నుంచీ వైరస్‌ వ్యాపించే అవకాశముండటం. ఇలాంటివారు లక్షణాలు ఆరంభం కావటానికి 5 రోజుల ముందు నుంచే ఇతరులకు వైరస్‌ వ్యాపింపజేసే ప్రమాదముంది. సుమారు 44% మంది ఇలాంటివారి మూలంగానే ఇన్‌ఫెక్షన్‌ బారినపడుతున్నారు. అందువల్ల దుకాణాలు, ఆఫీసులు, కర్మాగారాలు, హోటళ్లు, వివాహాలు, అంతిమయాత్రలకు ఎక్కడికి వెళ్లినా ఎవరి జాగ్రత్తలో వారుండటం తప్పనిసరి.●

* తరచూ చేతులను సబ్బుతో రద్దుకొని, శుభ్రంగా కడుక్కోవాలి. వీలుంటే శానిటైజర్‌ రాసుకోవాలి.

* అనవసరంగా బయటకు వెళ్లొద్ధు మధుమేహం, అధిక రక్తపోటు, ఆస్థమా, క్యాన్సర్‌ వంటి సమస్యలతో బాధపడేవారికిది మరింత ముఖ్యం.

* పిల్లలను, వృద్ధులను అవసరముంటే తప్ప బయటకు తీసుకెళ్లరాదు.

* బయటకు ఎక్కడికి వెళ్లినా ముక్కు, నోరు, చెంపలు, గదమ కింది భాగం పూర్తిగా కప్పి ఉండేలా మాస్కు ధరించాలి. దగ్గు, తుమ్ముల వంటి లక్షణాలు గలవారికిది తప్పనిసరి. అవసరమైతే ఇంట్లోనూ మాస్కు ధరించాలి.

* బయట ఎక్కడైనా సరే ఇతరులకు కనీసం మీటరు దూరంలో ఉండాలి. రెండు మీటర్ల దూరంలో ఉంటే ఇంకా మంచిది.

* చెప్పులు ఇంట్లోకి తేవొద్ధు బయటే విడవాలి. కరోనా లక్షణాలు గలవారికి సన్నిహితంగా మెలిగినట్టు అనుమానిస్తే ఇంట్లోకి రాగానే స్నానం చేయాలి. ఆ తర్వాతే ఇతర పనులు చేయాలి.

* తరచూ ముట్టుకునే తలుపు పిడి, గొళ్లాలు, ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్‌, మౌజ్‌, పెన్‌, కారు హ్యాండిల్‌, మెట్ల రెయిలింగ్‌ వంటివి తరచూ శుభ్రం చేయాలి.


‘బలం’ సుసంపన్నం!

కోట గోడ బలంగా ఉంటే శత్రువు లోపలికి ప్రవేశించటం అసాధ్యం. ఒకవేళ ప్రవేశించినా సైన్యం సాయుధ సంపత్తితో సంసిద్ధంగా ఉంటే ఎదుర్కోవటం, ఓడించటం తేలిక. మనలోనూ అలాంటి కోట గోడ ఉంది. అదే రోగనిరోధకశక్తి. ఇది బలంగా ఉన్నంతవరకూ హానికారక సూక్ష్మక్రిములేవీ మనలోకి ప్రవేశించలేవు. ఒకవేళ ప్రవేశించినా శరీరం గట్టిగా ఎదుర్కొంటుంది. ఇన్‌ఫెక్షన్‌గా మారకముందే తిప్పికొడుతుంది. దురదృష్టవశాత్తు- కొవిడ్‌-19 కారక సార్స్‌-సీవోవీ-2 వైరస్‌ కొత్తది కావటం, దీన్ని మన శరీరం మునుపెన్నడూ ఎదుర్కొనకపోవటం వల్ల తీవ్రంగా దాడి చేస్తోంది. అయినా కూడా కొందరు దీన్ని సమర్థంగా తట్టుకోగలుగుతున్నారు. లక్షణాలూ అంత తీవ్రంగా ఉండటం లేదు. దీనికి ప్రధాన కారణం రోగనిరోధకశక్తి బలంగా ఉండటం. అందువల్ల దీన్ని కాపాడుకోవటం అన్ని విధాలా మంచిది. ఇందుకు మంచి జీవనశైలి, పోషకాహారం వంటివి ఎంతగానో తోడ్పడతాయి.


వ్యాయామం: క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కదలకుండా పనిచేసే ఉద్యోగాలు చేసేవారికిది మరింత ముఖ్యం. వ్యాయామం, శారీరక శ్రమ మూలంగా రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీంతో రోగనిరోధక కణాలు చురుకుగా, తేలికగా శరీమంతా విస్తరిస్తాయి. సమర్థంగా పనిచేస్తాయి. వ్యాయామం చేస్తున్నప్పుడు, ఆపిన వెంటనే శరీర ఉష్ణోగ్రత కాస్త పెరుగుతుంది. ఇది సూక్ష్మక్రిముల వృద్ధిని అడ్డుకుంటుంది, ఇన్‌ఫెక్షన్‌తో పోరాడటానికి తోడ్పడుతుంది. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం సైతం రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి.●


పోషకాహారం: రోగనిరోధక కణాలు వృద్ధి చెందటానికి, అవి సజావుగా పనిచేయటానికి విటమిన్‌ సి, విటమిన్‌ డి, జింక్‌, సెలీనియం, ఐరన్‌, ప్రొటీన్‌ వంటివి ఎంతగానో తోడ్పడతాయి. అందువల్ల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. పసుపు, జిలకర, కొత్తిమీర, అల్లం వంటి దినుసులూ వాడుకోవాలి. రోజూ కాసేపు ఎండకు ఉండే చర్మం విటమిన్‌ డిని తయారుచేసుకుంటుంది. మన పేగుల్లోని బ్యాక్టీరియా రోగనిరోధకశక్తిలో కీలకపాత్ర పోషిస్తుంది. పెరుగు, మజ్జిగ వంటి పులిసిన పదార్థాలు మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి, అస్తవ్యస్తం కాకుండా ఉండటానికి దోహదం చేస్తాయి. ఉప్పు, చక్కెర, కొవ్వు అధికంగా ఉండే పదార్థాలకు, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఇవి పేగుల్లో వాపు ప్రక్రియను ప్రేరేపిస్తాయి. రోగనిరోధకశక్తిని తగ్గిస్తాయి.●


కంటి నిండా నిద్ర: నిద్ర పోతున్నప్పుడు మన రోగనిరోధకశక్తి సైటోకైన్లనే ప్రొటీన్లను విడుదల చేస్తుంది. ఇవి ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికి తోడ్పడతాయి. నిద్రలేమితో సైటోకైన్ల ఉత్పత్తి తగ్గుతుంది. అంతేకాదు, ఇన్‌ఫెక్షన్లతో పోరాడే యాంటీబాడీలు, తెల్లరక్తకణాల సంఖ్యా పడిపోతుంది. అందువల్ల కంటి నిండా నిద్ర, తగినంత విశ్రాంతి చాలా కీలకం. పెద్దవాళ్లకు రాత్రిపూట 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. యుక్తవయసు పిల్లలు 9-10 గంటలు, బడికి వెళ్లే పిల్లలు 10 గంటలు, అంతకన్నా ఎక్కువసేపు నిద్రపోవాలి.


బరువు నియంత్రణ: ఊబకాయం మూలంగా ఇన్‌ఫెక్షన్‌తో పోరాడే బి కణాల సామర్థ్యం తగ్గుతుంది. యాంటీబాడీల ఉత్పత్తీ క్షీణిస్తుంది. మరోవైపు కొవ్వు కణజాలం అనవసరంగా సైటోకైన్లను ఉత్పత్తి చేస్తుంటుంది. దీంతో ఒంట్లో నిరంతరం వాపు ప్రక్రియ కొనసాగుతూ వస్తుంటుంది. ఇది ఒకవైపు ఇన్‌ఫెక్షన్‌తో పోరాడే ఇతర రోగనిరోధక కణాల పనితీరును దెబ్బతీస్తుంది. మరోవైపు రోగనిరోధకశక్తిని విపరీతంగా ప్రేరేపించి, సైటోకైన్ల ఉప్పెనకు దారితీస్తుంది. కాబట్టి బరువు అదుపులో పెట్టుకోవాలి.


జబ్బులపై కన్ను

కొవిడ్‌-19తో మరణిస్తున్నవారిలో ఇంతకుముందు ఎలాంటి జబ్బులు లేనివారు 1% కన్నా తక్కువే. ఆరోగ్యవంతులను ఇది పెద్దగా ఇబ్బంది పెట్టటం లేదని, ఇతరత్రా సమస్యలే చాలావరకు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయనటానికిదే నిదర్శనం. 65 ఏళ్లు పైబడినవారికి.. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్లు, కాలేయ జబ్బులు, కిడ్నీ జబ్బులు, ఊబకాయం గలవారికి, కొవిడ్‌-19 ముప్పు అధికం. ఇన్‌ఫెక్షన్‌ తీవ్రతా ఎక్కువగానే ఉంటోంది. కాబట్టి ఇతరత్రా జబ్బులు గలవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.

మధుమేహం: మధుమేహంతో బాధపడేవారిలో రోగనిరోధకశక్తి మందగిస్తుంది. రక్తంలో గ్లూకోజు మోతాదులు ఎక్కువగా ఉన్నవారిలోనే కాదు, చాలాకాలంగా మధుమేహంతో బాధపడుతూ గ్లూకోజు స్థాయులు మామూలుగా ఉన్నవారిలోనూ రోగనిరోధకశక్తి సామర్థ్యం తగ్గిపోవచ్ఛు ముఖ్యంగా హానికారక క్రిములను ముందుగా తుదముట్టించే తెల్ల రక్తకణాల చురుకుదనం తగ్గుతుంది. యాంటీబాడీల ఉత్పత్తీ ఆలస్యమవుతుంటుంది. మధుమేహుల్లో అప్పటికే రక్తప్రసరణ దెబ్బతినటమూ ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ఇది కరోనా ఇన్‌ఫెక్షన్‌ ముప్పు పెరగటానికి దారితీస్తుంది. అందువల్ల తగు జాగ్రత్త అవసరం. ఆహార, వ్యాయామ నియమాలు.. మందులతో గ్లూకోజును కచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి. మూడు నెలల గ్లూకోజు సగటును తెలిపే హెచ్‌బీఏ1సీ 7% కన్నా మించకుండా చూసుకోవాలి. మధుమేహులు తక్కువ మోతాదులో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను అనుబంధ ఔషధంగా వాడుకోవచ్ఛు ఇది కరోనా ఇన్‌ఫెక్షన్‌ తగ్గటానికీ తోడ్పడుతుందని భావిస్తున్నారు.

గుండెజబ్బులు: అధిక రక్తపోటు, గుండెజబ్బులు గలవారికి కొవిడ్‌-19 ఇంకాస్త ఎక్కువ చిక్కులు తెచ్చిపెడుతుంది. ఇన్‌ఫెక్షన్‌ మూలంగా గుండె మరింత బలంగా పంప్‌ చేయాల్సి వస్తుంది. దీంతో గుండె వేగం పెరుగుతుంది. అప్పటికే గుండెజబ్బులు గలవారికిది ప్రమాదకరంగా పరిణమిస్తుంది. గుండె తగినంత రక్తాన్ని పంప్‌ చేయలేకపోతే అవయవాలు విఫలమై ప్రాణాపాయానికి దారితీయొచ్ఛు కాబట్టి గుండెజబ్బులు గలవారు అప్రమత్తంగా ఉండాలి. రక్తపోటును కచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి. ఆహారంలో ఉప్పు తగ్గించటం, క్రమం తప్పకుండా మందులు వేసుకోవటం ముఖ్యం. కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూసుకోవాలి. సిగరెట్లు, మద్యం జోలికి వెళ్లకూడదు.

శ్వాసకోశ సమస్యలు: దీర్ఘకాల శ్వాసకోశ సమస్య సీవోపీడీ, ఆస్థమా వంటి జబ్బులు గలవారికి కొవిడ్‌-19 మరింత చేటు చేస్తుంది. ఇలాంటి సమస్యలు గలవారు మందుల విషయంలో నిర్లక్ష్యం చేయరాదు. నోటితో పీల్చే లేదా మాత్రల రూపంలోని కార్టికోస్టిరాయిడ్లను మానరాదు. ఇంట్లో నెబ్యులైజర్‌ ద్వారా తీసుకోవాల్సిన మందులను కొనసాగించాలి. కొవిడ్‌-19లోనూ సీవోపీడీలో మాదిరిగా ఆయాసం వస్తుంటుంది. దీనికి వెంటనే కంగారు పడాల్సిన పనిలేదు గానీ జ్వరం, విరేచనాలు, వికారం, కండరాల నొప్పి, నిస్సత్తువ, ఆకలి, వాసన తగ్గటం వంటి లక్షణాలుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. పొగ తాగే అలవాటుంటే వెంటనే పూర్తిగా మానెయ్యాలి.

క్యాన్సర్లు: వయసుతో నిమిత్తం లేకుండా క్యాన్సర్‌ బాధితులందరికీ కొవిడ్‌-19 ముప్పు ఎక్కువగా ఉంటోంది. కీమోథెరపీ, రేడియేషన్‌ వంటి క్యాన్సర్‌ చికిత్సలు తీసుకునే సమయంలో రోగనిరోధకశక్తి తగ్గుతుంది. ఇది ఇన్‌ఫెక్షన్ల ముప్పు పెరిగేలా చేస్తుంది. కాబట్టి ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. కీమోథెరపీతో వాంతులు, విరేచనాలు కావొచ్ఛు దీంతో ఒంట్లో నీటిశాతం తగ్గొచ్ఛు ఇది ప్రమాదకరంగా పరిణమిస్తుంది. కాబట్టి తగినన్ని నీళ్లు, ద్రవాలు తీసుకోవాలి. ఉప్పు కలిపిన మజ్జిగైతే ఇంకా మంచిది. చికిత్సలు పూర్తిగా తీసుకున్నవారు మాటిమాటికి ఆసుపత్రికి వెళ్లటం తగదు. ఏవైనా ఇబ్బందులుంటే ఫోన్‌ ద్వారా డాక్టర్‌ను సంప్రదించాలి. అవసరమైతేనే ఆసుపత్రికి వెళ్లాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని