Published : 09 Jun 2020 02:41 IST

అమ్మో.. నొప్పి!

‘నీ కడుపు చల్లగుండ’. ఇలా పెద్దలు దీవించటం తెలిసిందే. ఉద్దేశం ఏదైనా కడుపు చల్లగా.. అంటే ఇబ్బందులేవీ లేకుండా ఉంటేనే ప్రాణానికి హాయి. చిన్నపాటి అసౌకర్యమైనా చికాకు పరుస్తుంది. ఇక ఉన్నట్టుండి లోపలేదో పొడుస్తున్నట్టు, మండినట్టు తీవ్రమైన నొప్పి మొదలైతే? లోకం తలకిందులైనట్టే అనిపిస్తుంది. దీనికి కారణాలేంటి? ఎలాంటి చికిత్స అవసరం?

రీరానికి కడుపే కేంద్రం. ఇది బాగుంటేనే అంతా బాగుంటుంది. మనమంతా ఎప్పుడో అప్పుడు కడుపునొప్పిని ఎదుర్కొన్నవాళ్లమే. కలుషితాహారం మూలంగా నొప్పి, విరేచనాలు తరచూ చూసేవే. ఇవి ప్రమాదకరమైనవేవీ కావు. చాలావరకు వాటంతటవే తగ్గుతాయి. కానీ కొన్ని నొప్పులను తేలికగా తీసుకోవటానికి లేదు. ముఖ్యంగా ఉన్నట్టుండి పుట్టుకొచ్చే నొప్పిని నిర్లక్ష్యం చేయటం తగదు. దీనికి రకరకాల సమస్యలు దోహదం చేస్తుండొచ్చు. కొందరికి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి రావొచ్చు. లేకపోతే ప్రాణాంతకంగా పరిణమించొచ్చు. నిజానికి కడుపునొప్పి కారణాలను గుర్తించటం అన్నిసార్లూ అంత తేలిక కాదు. నోటి నుంచి మొదలుకొని జీర్ణాశయం, కాలేయం, క్లోమం, చిన్నపేగులు, పెద్దపేగుల వరకూ విస్తరించిన జీర్ణకోశ వ్యవస్థ.. మూత్రపిండాలు, మూత్రాశయం, మూత్రమార్గం, జననాంగాలతో కూడిన మూత్ర జననాంగ వ్యవస్థ అన్నీ కడుపులోని భాగాలే! గుండె నుంచి రక్తాన్ని తీసుకొని వెళ్లే ప్రధాన రక్తనాళం, కాలేయానికి సంబంధించిన రక్తనాళం, జీర్ణకోశానికి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం కూడా కడుపులోనే ఉంటాయి. వీటిల్లో ఎక్కడ ఇబ్బంది తలెత్తినా కడుపునొప్పి రూపంలోనే బయటపడొచ్చు. మధుమేహుల్లో తలెత్తే కీటోఅసిడోసిస్‌ కూడా కడుపునొప్పిగా బయటపడొచ్చు. అందువల్ల ఏది తీవ్రం? ఏది మామూలు సమస్య? నొప్పి ఎక్కడ్నుంచి, ఎప్పట్నుంచి వస్తోంది? తీరుతెన్నులేంటి? అన్నది తెలుసుకోవటం ముఖ్యం.


సమస్యలు- రకరకాలు

హఠాత్తుగా తలెత్తే నొప్పికి రకరకాల సమస్యలు దోహదం చేస్తుంటాయి.
అపెండిక్స్‌ వాపు: దీనికి మూలం పెద్ద పేగుకు అతుక్కొని ఉండే ఉండుకం (అపెండిక్స్‌) ఉబ్బటం. కొన్నిసార్లు ఇన్‌ఫెక్షన్‌కు గురికావొచ్చు. దీంతో కడుపు కిందిభాగాన, కుడివైపున తీవ్రమైన నొప్పి తలెత్తుతుంది. దీనికి సత్వర చికిత్స అవసరం. ఆలస్యమైతే ఉండుకం పగిలి, ప్రాణాంతకంగా పరిణమించొచ్చు. అపెండిక్స్‌ వాపు 10-30 ఏళ్ల  వయసువారిలో తరచూ కనిపిస్తుంటుంది.
చికిత్స: అపెండిక్స్‌ వాపును నిశితంగా గమనిస్తుండాలి. అవసరమైతే వెంటనే ఆపరేషన్‌ చేసి అపెండిక్స్‌ను తొలగించాలి.


క్లోమగ్రంథి వాపు : జీర్ణాశయం వెనకాల, చిన్నపేగుల సమీపంలోని క్లోమగ్రంథి (పాంక్రియాస్‌) జీర్ణక్రియలో కీలకపాత్ర పోషిస్తుంది. మనం తిన్న ఆహారం జీర్ణం కావటానికి వీలుగా చిన్నపేగుల్లోకి శక్తిమంతమైన జీర్ణరసాలను విడుదల చేస్తుంది. ఇన్సులిన్‌, గ్లూకగాన్‌ను విడుదల చేస్తూ రక్తంలో గ్లూకోజు స్థాయులు నియంత్రణలో ఉండటానికి తోడ్పడుతుంది. కొన్నిసార్లు క్లోమగ్రంథిలోని జీర్ణరసాలు చిన్నపేగుల్లోకి విడుదల కాకముందే పనిచేయటం మొదలెడుతుంటాయి. దీంతో క్లోమగ్రంథి లోపల్లోపలే దెబ్బతిని, వాపు (అక్యూట్‌ పాంక్రియాటైటిస్‌) తలెత్తొచ్చు. దీంతో తీవ్రమైన నొప్పి వేధిస్తుంది. నొప్పి వీపు వైపునకూ పాకుతుంటుంది. పాంక్రియాటైటిస్‌కు ప్రధాన కారణాలు పైత్యరస నాళంలో రాళ్లు, మద్యం అలవాటు. కొందరిలో ఎలాంటి కారణమూ కనిపించకపోవచ్చు.
చికిత్స: నొప్పి మొదలైన 24 గంటల్లో చికిత్స ఆరంభించకపోతే కొందరికి ప్రాణాంతకంగా పరిణమించొచ్చు. రక్తనాళం ద్వారా ద్రవాలు ఇవ్వాల్సి ఉంటుంది. నొప్పి మందులు ఉపయోగపడతాయి. పైత్యరస నాళంలో రాళ్లతో వాపు వస్తే ఎండోస్కోపిక్‌ రెట్రోగ్రేడ్‌ కొలాంజియో పాంక్రియాటోగ్రఫీ (ఈఆర్‌సీపీ) లేదా శస్త్రచికిత్స ద్వారా రాళ్లను తొలగిస్తారు. అవసరమైతే క్లోమగ్రంథిలోని చీము, చచ్చుబడిన కణజాలాన్నీ తొలగించాల్సి ఉంటుంది.


పేగు తోసుకురావటం (హెర్నియా) : ఇది చాలా తీవ్రమైన సమస్య. దీనికి మూలం కడుపుగోడ కండరాలు బలహీనంగా ఉన్నచోటు నుంచి కొవ్వు కణజాలం గానీ చిన్నపేగు గానీ బయటకు తోసుకొని రావటం. కొందరికి చుట్టుపక్కల కండరాలు బిగుసుకుపోవటం వల్ల తోసుకొచ్చిన పేగు చిక్కుపడిపోవచ్చు. దీంతో రక్త సరఫరా ఆగిపోయి కుళ్లిపోవచ్చు, రంధ్రాలు పడొచ్చు. కొందరు షాక్‌లోకీ వెళ్లిపోవచ్చు.
చికిత్స: శస్త్రచికిత్స చేసి సరిదిద్దటం ముఖ్యం. లేకపోతే ప్రాణాంతకంగా పరిణమించొచ్చు.


పేగుల్లో అడ్డంకి : చిన్నపేగుల్లో, పెద్దపేగులో కణితులు లేదా ఎక్కడైనా ఉబ్బటం ద్వారా అడ్డంకి తలెత్తొచ్చు. పేగు చుట్టుపక్కల అవయవాలు లేదా కణజాలం బిగుసుకుపోవటం, మెలి తిరగటం, గతంలో పేగుల శస్త్రచికిత్సతో మచ్చ ఏర్పడి పేగు భాగం అతుక్కుపోవటం వంటివీ సమస్యాత్మకంగా పరిణమించొచ్చు. ఫలితంగా కడుపునొప్పి, వాంతులు, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి ఇబ్బందులు మొదలవుతాయి.
చికిత్స: దీనికి అత్యవసరంగా శస్త్రచికిత్స చేసి సరిదిద్దటం తప్ప మరో మార్గం లేదు.


కీటో అసిడోసిస్‌ : మధుమేహుల్లో కొందరికి ఒంట్లో ఆమ్లస్థాయులు బాగా పెరిగిపోయి ప్రాణాంతకంగా పరిణమిస్తుంటుంది. ఇది అత్యవసర సమస్య. కొందరిలో ఇది కడుపునొప్పితోనే బయట పడుతుంటుంది. అందుకే కడుపునొప్పితో అత్యవసర చికిత్స విభాగానికి వచ్చినవారికి విధిగా రక్తంలో గ్లూకోజు, మూత్రంలో కీటోన్లు, రక్తంలో వాయువుల పరీక్షలు చేయాల్సి ఉంటుంది.
చికిత్స: గ్లూకోజు స్థాయులు తగ్గించటం అవసరం. సాధారణంగా ఇన్సులిన్‌ ఇస్తారు. రక్తనాళం ద్వారా ఎలెక్ట్రోలైట్లతో కూడిన ద్రవాలు ఇవ్వటమూ ముఖ్యమే.


గర్భసంచి ఆవల గర్భం: మహిళల్లో కొందరికి గర్భసంచిలో కాకుండా ఫలోపియన్‌ గొట్టాల్లో గర్భధారణ జరుగుతుంటుంది (ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ). ఇది తీవ్రమైన కడుపు నొప్పికి దారితీస్తుంది. సాధారణంగా నొప్పి కడుపులో ఒక వైపున వస్తుంటుంది. సంతానాన్ని కనే వయసు మహిళలకు కడుపునొప్పి వస్తుంటే హిమోగ్లోబిన్‌, గర్భధారణ, కడుపు అల్ట్రాసౌండ్‌ పరీక్షలు చేసి నిర్ధారించుకోవటం మంచిది.
చికిత్స: అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణానికే ముప్పు రావొచ్చు.


కామెర్లు : కామెర్లు అనగానే కళ్లు, చర్మం పచ్చబడటమే గుర్తుకొస్తాయి. కొందరికి కడుపునొప్పీ ఉండొచ్చు. దీనికి మూలం పైత్యరస నాళంలో రాళ్లు ఏర్పడటం. క్లోమ క్యాన్సర్‌, పైత్యనాళ క్యాన్సర్‌, పైత్యరస నాళం, క్లోమనాళం కలిసి డ్యుయోడినమ్‌లోకి ప్రవేశించే చోట (యాంపుల్లా) క్యాన్సర్ల వంటివీ దీనికి దారితీయొచ్చు.
చికిత్స: ఈఆర్‌సీపీ ద్వారా రాళ్లను తొలగించటం, స్టెంట్‌ వేయటం చేయాల్సి ఉంటుంది.


కిడ్నీలో రాళ్లు : కిడ్నీలో రాళ్లతోనూ.. ముఖ్యంగా మూత్రమార్గం, మూత్రాశయంలో రాయి చిక్కుకుపోయినప్పుడూ హఠాత్తుగా కడుపునొప్పి రావొచ్చు. ఇలాంటి నొప్పి వస్తూ పోతుంటుంది. లోపలేదో ఉన్నట్టుండి పొడుస్తున్నట్టుగా నొప్పి వస్తుంటుంది. నొప్పి వీపు వైపునకు, కిందికి, గజ్జలోకీ పాకుతుంటుంది. మాటిమాటికీ మూత్రం పోయాలని అనిపించటం, మూత్రంలో రక్తం పడటం వంటివీ ఉండొచ్చు.
చికిత్స: మందులతో తగ్గకపోతే శస్త్రచికిత్స చేసి రాళ్లను తొలగించాల్సి ఉంటుంది.


ఎప్పుడు తీవ్రంగా పరిగణించాలి?

తీవ్రంగా, హఠాత్తుగా మొదలయ్యే కడుపునొప్పికి వెంటనే చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అసలే తాత్సారం చేయరాదు.
* ఏమాత్రం కదల్లేనంతగా తీవ్రమైన నొప్పి  
* కదిలితే నొప్పి ఎక్కువ కావటం
* నొప్పి మూలంగా కూర్చోలేకపోవటం, స్థిమితంగా ఉండలేకపోవటం.
* జ్వరం * బరువు తగ్గిపోవటం
* మలంలో రక్తం పడుతుండటం
* విడవకుండా వాంతులు, వికారం
* చర్మం పసుపురంగులో కనిపించటం (కామెర్లు)
* కడుపును ముట్టుకుంటే తీవ్రమైన నొప్పి
* కడుపు ఉబ్బరం తగ్గకపోవటం


* ఇతర కారణాలు: జీర్ణాశయంలో పుండ్ల మూలంగా రంధ్రాలు పడటం, పిత్తాశయ వాపు (అక్యూట్‌ కోలెసిస్టైసిస్‌), పిల్లల్లో చిన్నపేగు కడుపు కింది భాగానికి అతుక్కొని ఉండే చోట వాపు (కంజెనటల్‌ పైలోరిక్‌ స్టినోసిస్‌), పెద్దపేగులో తిత్తులు (డైవర్టిక్యులోసిస్‌) వంటివీ కడుపునొప్పికి దారితీయొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని