కరోనా టీకా సామర్థ్యం కథేంటి?

కరోనా టీకా ప్రయోగ పరీక్షలు ముగుస్తున్నకొద్దీ ఉత్కంఠా పెరుగుతోంది. టీకాల సామర్థ్యం వెలువడుతున్నకొద్దీ ఆసక్తీ ఎక్కువవుతోంది. రేపో మాపో టీకాలు అందుబాటులోకి వచ్చే తరుణం ఆసన్నమవుతున్నకొద్దీ కొత్త సందేహాలూ పుట్టుకొస్తున్నాయి. ఒకో టీకా ఒకోరకం సామర్థ్యం కలిగి ఉండటమేంటి? దీన్ని ప్రభావితం చేసే అంశాలేంటి?

Updated : 08 Dec 2020 01:23 IST

కరోనా టీకా ప్రయోగ పరీక్షలు ముగుస్తున్నకొద్దీ ఉత్కంఠా పెరుగుతోంది. టీకాల సామర్థ్యం వెలువడుతున్నకొద్దీ ఆసక్తీ ఎక్కువవుతోంది. రేపో మాపో టీకాలు అందుబాటులోకి వచ్చే తరుణం ఆసన్నమవుతున్నకొద్దీ కొత్త సందేహాలూ పుట్టుకొస్తున్నాయి. ఒకో టీకా ఒకోరకం సామర్థ్యం కలిగి ఉండటమేంటి? దీన్ని ప్రభావితం చేసే అంశాలేంటి? టీకాల్లో రకాల మతలబులేంటి? కరోనా టీకాలు అందరికీ అవసరమా? ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలి? ఇప్పటికే కరోనా సోకినవారికీ ఇవ్వాలా? ఇలాంటి ప్రశ్నలెన్నో ముంచెత్తుతున్నాయి. వీటికి సమాధానాలు అందించే ప్రయత్నమే నేటి సుఖీభవ కథనం.

కొవిడ్‌-19 టీకా సామర్థ్యాల మీద రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. కొన్ని 90%, మరికొన్ని 95%, ఇంకొన్ని100% సామర్థ్యాన్ని కలిగి ఉంటున్నట్టు ప్రకటనలు వెలువడుతున్నాయి. ఇంతకీ ఏంటీ సామర్థ్యం? దీని అర్థం ఏంటి? టీకా సామర్థ్యం సంఖ్యలను చూసి ఇలాంటి సందేహాలు రావటం సహజమే. వీటిల్లో ఏ టీకా మంచిది? దేని తీసుకుంటే ఎక్కువ రక్షణ కలుగుతుంది? అనే గందరగోళానికీ గురిచేయొచ్చు. టీకా సామర్థ్యాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా కొత్త కరోనా జబ్బుకు దారితీసే అంశాలను అవగతం చేసుకోవటం అవసరం. కొవిడ్‌-19 ముప్పు కారకాలు చాలానే ఉన్నాయి. వీటిల్లో ప్రధానమైంది రోగనిరోధకశక్తి. ఇది తగ్గితే ఎలాంటి ఇన్‌ఫెక్షన్ల ముప్పయినా పెరుగుతుందన్నది తెలిసిందే. రోగనిరోధకశక్తిలోనూ సహజ సిద్ధ రోగనిరోధకశక్తి కీలకమైంది. ఇది హానికారక సూక్ష్మక్రిముల వంటివి దాడి చేసినప్పుడు మన శరీరం దాన్ని నేరుగా ఎదుర్కోవటంతో పుట్టుకొచ్చే తొలి రోగనిరోధక ప్రతిస్పందన. కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌2 వైరస్‌ను మనం ఇంతకుముందు ఎదుర్కోలేకపోవటం వల్ల మొదట్లో ఇలాంటి రోగనిరోధకశక్తి మనలో లేదు. అందుకే తొలినాళ్లలో బాగా విజృంభించింది. ఎంతోమంది ప్రాణాలను హరించింది. కొత్త కరోనా జబ్బు మొదలై ఇప్పుడిప్పుడే ఏడాది దాటుతోంది. దీని బారినపడ్డవారిలో సహజ రోగనిరోధకశక్తి ఎంతమేరకు రూపుదిద్దుకుందనే సంగతి మనకు కచ్చితంగా తెలియదు. గతంలో ఎప్పుడైనా ఇతరత్రా కరోనా వైరస్‌లకు.. అంటే మామూలు జలుబును కలగజేసే ఇతర కరోనా వైరస్‌లకు గురైనప్పుడు పుట్టుకొచ్చిన ‘సంకర’ రోగనిరోధకశక్తి పాత్ర కూడా ముఖ్యమే. ఇది కొందరిలో కొంతవరకు రక్షణ కల్పిస్తుండొచ్చు. మనపై దాడిచేసిన కరోనా వైరస్‌ సంఖ్య.. అలాగే మాస్కు ధరించటం, చేతులు శుభ్రంగా కడుక్కోవటం, ఇతరులకూ దూరం పాటించటం వంటి జాగ్రత్త చర్యలూ ముప్పును నిర్ధారిస్తాయి. ఇలాంటివన్నీ కరోనా జబ్బు ముప్పుపై ప్రభావం చూపేవే. ఇలా శరీర రక్షణ వ్యవస్థ తీరును బట్టీ టీకాల పనితీరు, సామర్థ్యం ఆధారపడి ఉంటుందని గుర్తించాలి.


సామర్థ్యాన్ని ఎలా గుర్తిస్తారు?

టీకాల ప్రభావాన్ని అంచనా వేయటానికి ఉత్తుత్తి (ప్లాసిబో) టీకాలతో పోల్చి చూస్తారు. ఉత్తుత్తి టీకాలు చూడటానికి అసలు టీకాల మాదిరిగానే ఉంటాయి గానీ వీటిల్లో రోగనిరోధకశక్తిని ప్రేరేపించే అంశాలేవీ ఉండవు. ఉదాహరణకు- ఆరోగ్యవంతులైన 20వేల మందికి నిజం టీకాను, మరో 20వేల మందికి ఉత్తుత్తి టీకాను ఇచ్చారనుకుందాం. వీరందరినీ అనుక్షణం, నిశితంగా పరిశీలిస్తారు. కొంతకాలానికి ఉత్తుత్తి టీకా తీసుకున్నవారిలో 100 మంది (0.5%), నిజం టీకా తీసుకున్నవారిలో 10 మంది (0.05%) కొవిడ్‌-19 బారినపడ్డారనుకుందాం. అంటే టీకా 90 కన్నా ఎక్కువమందిని కొవిడ్‌ బారినపడకుండా కాపాడిందన్నమాట. ఇది 90% సమర్థంగా పనిచేసిందనే అర్థం. మరో ముఖ్య సంగతి- టీకాను తీసుకున్న రెండు బృందాల్లోనూ వయసు, లింగ బేధం, ఇతరత్రా జబ్బులు, సామాజిక-ఆర్థిక హోదా, నివాస ప్రాంతం వంటి వాటినీ పరిగణనలోకి తీసుకొని చూడాల్సి ఉంటుంది.  


జాగ్రత్తలే ప్రథమ టీకా!

నదేశంలో కొవిడ్‌-19 బాధితుల సంఖ్య కోటికి చేరుకుంటోంది. చాలామందిలో ఇప్పటికే కరోనా యాంటీబాడీలు ఉంటున్నట్టూ బయటపడుతోంది. గత ఆగస్టు-సెప్టెంబరులో ఐసీఎంఆర్‌ నిర్వహించిన సర్వేలో 7 శాతానికి పైగా మందిలో కొవిడ్‌ యాంటీబాడీలు ఉంటున్నట్టు తేలింది. అప్పటికి నమోదైన కేసుల సంఖ్య సుమారు 25 లక్షలు. అంటే 40 మందికి ఇన్‌ఫెక్షన్‌ సోకితే ఒక్క పాజిటివ్‌ కేసే నమోదైందన్నమాట. చాలామందిలో ఎలాంటి లక్షణాలు లేవనే సంగతినిది తేట తెల్లం చేస్తోంది. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం నమోదైన కేసుల సంఖ్య దాదాపు నాలుగింతలకు పైగా పెరిగింది. మాస్కు ధరించటం, చేతులు కడుక్కోవటం, ఇతరులకు దూరంగా ఉండటం, జబ్బు బారినపడ్డవారిని విడిగా ఉంచటం వంటి చర్యలతో వైరస్‌ వ్యాప్తి రేటు గణనీయంగా పడిపోయింది. ఒకరకంగా వీటిని తొలి టీకా అనీ అనుకోవచ్చు. జాగ్రత్తలు పాటించటం ఇలాగే కొనసాగితే వైరస్‌ను పూర్తిగా కట్టడి చేయటానికి 30% మందికి సామూహిక రోగనిరోధకశక్తి దక్కితే చాలు. లేకపోతే 60% మందికి సామూహిక రోగనిరోధకశక్తి లభించినప్పుడే పూర్తి భరోసాతో ఉండటానికి వీలవుతుంది. ఇప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా వైరస్‌ తిరిగి విజృంభించటం తథ్యం. దేశ రాజధానిలో ఇలాంటి స్థితిని ఇప్పటికే చూస్తున్నాం.


కొవిడ్‌ బారినపడ్డవారికీ అవసరమా?

రోనా టీకాలు అందుబాటులోకి వచ్చాక ఎవరెవరికి ఇవ్వాలి? ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలి? అనేది ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కరోనా వచ్చి ఉన్నవారికి టీకా అవసరమా? అనే సందేహమూ తలెత్తుతోంది. టీకా అందుబాటులోకి వచ్చే సమయానికి కరోనా బారినపడ్డవారి సంఖ్య కూడా పెరుగుతూనే వస్తుంటుంది. ప్రయోగ పరీక్షల్లో టీకాలను కరోనా సోకనివారికే ఇచ్చారా? అప్పటికే ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డవారికి కూడా ఇచ్చారా? అన్నది ఇంకా స్పష్టంగా తెలియదు. కరోనా బాధితుల్లో రక్షణ ఎంతకాలం కొనసాగుతుందనేదీ కచ్చితంగా తెలియదు. కొన్ని అధ్యయనాలు 5 నెలల నుంచి 8 నెలల వరకు రక్షణ లభిస్తున్నట్టు చెబుతున్నాయి. రెండోసారి ఇన్‌ఫెక్షన్‌ బారినపడుతున్న దాఖలాలూ అక్కడక్కడా కనిపిస్తున్నాయి. ఏమాత్రం లక్షణాలు లేనివారిలో, స్వల్పంగా లక్షణాలు గలవారిలో యాంటీబాడీల సంఖ్య వేగంగా తగ్గిపోతున్నట్టూ తెలుస్తోంది. అంతమాత్రాన వీరిలో కరోనా రక్షణ లేనట్టు కాదు. కణ మాధ్యమ రోగనిరోధకశక్తి వంటి ఇతర రకాల రక్షణ వ్యవస్థలు రెండోసారి ఇన్‌ఫెక్షన్‌ బారిన పడకుండా కాపాడే అవకాశం లేకపోలేదు. నిజానికి టీకాలను అందరికీ సరఫరా చేయటమంటే మాటలు కాదు. ఆ మాటకొస్తే గతంలో ఎవరికి ఇన్‌ఫెక్షన్‌ సోకిందనేది తెలుసుకోవటానికి అందరికీ కొవిడ్‌-19 న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీల పరీక్షలు చేయటమూ కష్టమే. పైగా ఖర్చూ తడిసి మోపెడవుతుంది. అందుకే గతంలో ఇన్‌ఫెక్షన్‌ సోకినవారిని దృష్టిలో పెట్టుకొని ప్రాధాన్యాన్ని నిర్ణయించటం అవసరం. ఇప్పటికే కరోనా ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డవారికి ఎంతకాలం రక్షణ కొనసాగుతుంది? టీకాలతో ఎంతకాలం రక్షణ లభిస్తుంది? అనేవి కచ్చితంగా తెలిసేంతవరకు వీరిని పక్కన పెట్టటమే మంచిదన్నది నిపుణుల భావన.


టీకా రకాలూ ముఖ్యమే

టీకాల నుంచి ఎంతకాలం రక్షణ లభిస్తుందన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఇది ఆయా టీకా రకాలను బట్టీ ఆధారపడి ఉంటుంది. ఎప్పటికప్పుడు మారిపోయే వైరస్‌ జన్యువులూ వీటి పనితీరుపై ప్రభావం చూపిస్తాయి. టీకాల సరఫరా, ఉష్ణోగ్రత స్థిరత్వం, ఇచ్చే విధానం వంటివీ ముఖ్యమే.

* ఎంఆర్‌ఎన్‌ఏ టీకా: ఇవి కొత్తరకం టీకాలు. బలహీన పరచిన, నిర్వీర్యం చేసిన వైరస్‌లేవీ వీటిల్లో వాడరు. హానికారక వైరస్‌కు సంబంధించిన ప్రొటీన్‌ను తయారుచేసేలా కణాలకు తర్ఫీదు ఇవ్వటం వీటి ప్రత్యేకత. ఈ ప్రొటీన్‌ మనలో రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. ఫలితంగా యాంటీబాడీలు పుట్టుకొస్తాయి. ఇవి నిజంగా వైరస్‌ మనలోకి ప్రవేశించినప్పుడు దాన్ని ఎదుర్కొంటాయి.

* వైరస్‌ వెక్టర్‌: రసాయన చర్యలతో బలహీన పరచిన సజీవ వైరస్‌కు (మానవ లేదా సిమియన్‌ అడినోవైరస్‌) కొవిడ్‌ కారక వైరస్‌ భాగాలను జోడించి రూపొందించే టీకాలివి. ఈ భాగాలతో రోగనిరోధకశక్తిని ప్రేరేపించటం వీటి ఉద్దేశం.

* ఇన్‌యాక్టివేటెడ్‌: వైరస్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసి (ఇన్‌యాక్టివేటెడ్‌).. అంటే చనిపోయిన వైరస్‌లతో వీటిని తయారుచేస్తారు. సాధారణంగా ఇవి సజీవ వైరస్‌ టీకాలంత సమర్థంగా పనిచేయవు. అందువల్ల రోగనిరోధక శక్తి తగ్గకుండా కొంతకాలం తర్వాత అదనపు మోతాదులను (బూస్టర్‌) తీసుకోవాల్సి ఉంటుంది.

* కాంపోనెంట్‌: వైరస్‌ ప్రొటీన్‌, చక్కెర, రక్షణ కవచం వంటి భాగాలతో తయారు చేసే టీకాలివి. ఇన్‌ఫెక్షన్‌కు కారణమయ్యే ప్రత్యేకమైన భాగాలతో రూపొందించటం వల్ల ఇవి బలమైన రోగనిరోధక ప్రతిస్పందనను పుట్టిస్తాయి. ఇవి దాదాపు అందరికీ ఉపయోగపడతాయి. కాకపోతే వీటిని బూస్టర్‌ టీకాలనుగానూ తీసుకోవాల్సి ఉంటుంది.

* అటెన్యుయేటెడ్‌: ఇవి బలహీన పరచిన సజీవ వైరస్‌ టీకాలు. ఇవి నిజంగా ఇన్‌ఫెక్షన్‌ మాదిరిగా రోగ నిరోధక ప్రతిస్పందనను కలగజేస్తాయి. ఇది చాలాకాలం కొనసాగుతుంది. కేవలం ఒకట్రెండు మోతాదులతోనే జీవితాంతం రక్షణ లభించొచ్చు.


అనుభవంలోకి వస్తే గానీ..

ప్రస్తుతానికి టీకాల ప్రయోగ  పరీక్షల ఫలితాలే అందుబాటులో ఉన్నాయి. వాడకంలోకి వస్తే తప్ప వీటి పనితీరు పూర్తిగా బయటపడదు. కొవిడ్‌-19 చికిత్సలో ఇప్పటికే ఇలాంటి అనుభవాలను ఎదుర్కొంటున్నాం. మొదట్లో బాగా పనిచేస్తాయని భావించిన మందులు ఒక్కొక్కటిగా తేలిపోతుండటం చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకు- క్లోరోక్విన్‌ మందు కొవిడ్‌ నివారణకు గానీ జబ్బు  తీవ్రత తగ్గటానికి గానీ తోడ్పడడటం లేదని బయటపడింది. రెమ్‌డెసివిర్‌ మందు ఆసుపత్రిలో ఉండాల్సిన సమయాన్ని  మాత్రమే తగ్గిస్తుందని.. కృత్రిమ శ్వాస అవసరాన్ని, మరణాలనేమీ తగ్గించటం లేదని తేలింది. ప్రస్తుతానికి ఒక్క స్టిరాయిడ్లు మాత్రమే బాగా ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ మనం అనుభవ పూర్వకంగా గ్రహించిన విషయాలు. టీకా సామర్థ్యం విషయంలోనూ ఇదే మనకు గీటురాయి అవుతుందనటంలో సందేహం లేదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని