నవ వైద్య లోకానికి..

కొత్త సంవత్సరం. కొత్త ఆశలు. కొత్త కలలు. పాతకాలం ఎంత భయపెట్టినా మన పయనం నవలోకానికే. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరికొత్త శిఖరాలు అందుకోవటమే లక్ష్యం. దీన్ని సాధించేలా మానవాళి ఆరోగ్యాన్ని ఇనుమడింపజేయాలన్నదే శాస్త్రవేత్తల తపన. ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలతో సరికొత్త చికిత్సలను...

Published : 05 Jan 2021 00:36 IST

కొత్త సంవత్సరం. కొత్త ఆశలు. కొత్త కలలు. పాతకాలం ఎంత భయపెట్టినా మన పయనం నవలోకానికే. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరికొత్త శిఖరాలు అందుకోవటమే లక్ష్యం. దీన్ని సాధించేలా మానవాళి ఆరోగ్యాన్ని ఇనుమడింపజేయాలన్నదే శాస్త్రవేత్తల తపన. ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలతో సరికొత్త చికిత్సలను ఆవిష్కరించటం మీదే దృష్టి. అలా వారి ఆలోచనల్లో పురుడు పోసుకొన్న, మున్ముందు వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల కొన్ని చికిత్సలు మీకోసం.


కరోనా వరం!

సంక్షోభంలో సంబరం! కొవిడ్‌-19 నివారణకు పుట్టుకొచ్చిన ఎంఆర్‌ఎన్‌ఏ టీకా గురించైతే ఇలాగే చెప్పుకోవాలి. చాలాకాలంగా ఊరిస్తున్న ఎంఆర్‌ఎన్‌ఏ పరిజ్ఞాన వినియోగాన్ని సుసాధ్యం చేయటమే కాదు, మున్ముందు అసాధ్యమైన జబ్బుల చికిత్సలకూ ఇది భూమికగా నిలిచే అవకాశముండటం విశేషం.

న శరీరాన్ని నడిపించేవి కణాల్లోని ప్రొటీన్లే. శరీరంలో జరిగే అన్ని పనులను.. అవి మామూలువైనా, జబ్బులకు సంబంధించినవైనా.. ఇవే నిర్వరిస్తుంటాయి. వీటి తయారీకి అవసరమైన జన్యు సంకేతాలన్నీ డీఎన్‌ఏ(డీఆక్సీరైబోన్యూక్లిక్‌ యాసిడ్‌)లో నిక్షిప్తమై ఉంటాయి. వీటిని శరీరం వాడుకోవటానికి తోడ్పడేది ఎంఆర్‌ఎన్‌ఏ (మెసెంజర్‌ రైబోన్యూక్లిక్‌ యాసిడ్‌). ఇది లేకపోతే కణాల్లో ప్రొటీన్లే తయారుకావు. కొవిడ్‌ టీకా తయారీలో శాస్త్రవేత్తలను ఆకర్షించింది ఇదే. ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలో వైరస్‌ లేదా వైరస్‌ భాగాల వంటివేవీ ఉండవు. హానికారక వైరస్‌కు సంబంధించిన ప్రొటీన్‌ను (ఉదాహరణకు కరోనా ముల్లు ప్రొటీన్‌) తయారుచేసుకోవటానికి కణాలకు అవసరమైన జన్యు సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. ఈ ప్రొటీన్లు జబ్బును కలగజేయవు. రోగనిరోధకశక్తి ప్రతిస్పందనను ప్రేరేపించి, యాంటీబాడీలు పుట్టుకొచ్చేలా చేస్తాయి. అంటే ఎంఆర్‌ఎన్‌ఏ పరిజ్ఞానం కణాలనే టీకా ఫ్యాక్టరీగా మార్చేస్తుందన్నమాట.
చాలాకాలం నుంచే..
ఎంఆర్‌ఎన్‌ఏ పరిజ్ఞానంతో మేలు చేసే ప్రొటీన్లను ఉత్పత్తి చేసి, చికిత్సలో వినియోగించుకోవాలనే ప్రయత్నం చాలాకాలంగానే సాగుతోంది. కాకపోతే మామూలు ఎంఆర్‌ఎన్‌ఏ తక్కువ స్థాయిలోనే ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తుంది. చాలా త్వరగా క్షీణిస్తుంది. అందుకే పెద్దగా ముందడుగు పడలేదు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఇది మరోసారి తెరపైకి వచ్చింది. చాలా వేగంగా, సురక్షితంగా టీకాను రూపొందించే అవకాశాలపై దృష్టి సారించారు. ముందుగా కరోనా వైరస్‌ ముల్లు ప్రొటీన్‌లోని ఎంఆర్‌ఎన్‌ఏ జన్యుక్రమాన్ని కృత్రిమంగా రూపొందించారు. దీన్ని లిపిడ్‌ నానోపార్టికల్స్‌ (ఎల్‌ఎన్‌పీ) అనే సూక్ష్మ కొవ్వు బుడగల్లో జొప్పిస్తే త్వరగా క్షీణించదని, కణాల్లోకి వెళ్లే ప్రక్రియ పుంజుకుంటుందని గుర్తించారు. ఇదే టీకా విజయానికి దోహదం చేసింది. ఈ పరిజ్ఞానం దీనికే పరిమతమయ్యేది కాదు. ఎప్పుడైనా కరోనా వంటి మహమ్మారులు విజృంభించినప్పుడు త్వరగా టీకా తయారుచేయటానికి వేదికగా ఉపయోగపడగలదని భావిస్తున్నారు. క్యాన్సర్లు, గుండెజబ్బులు, జన్యుపరమైన జబ్బుల చికిత్సల్లోనూ కొత్త మార్పులు తీసుకురాగలదని ఆశిస్తున్నారు. శరీరాన్నే ఔషధ కర్మాగారంగా మార్చగలిగే ఇది మున్ముందు వైద్యరంగాన్ని కొత్తపుంతలు తొక్కిస్తుందనటం నిస్సందేహం.


ఇన్సులిన్‌ మాత్ర ఆశలు

ఇన్సులిన్‌ మాత్ర కోసం ఎదురుచూస్తున్న మధుమేహుల కల సాకారమయ్యే రోజులు ఎంతో దూరంలో లేవనే అనిపిస్తోంది. ఇన్సులిన్‌ మాత్ర తుది దశ ప్రయోగ పరీక్షలు ఇటీవలే మొదలయ్యాయి మరి.

తీవ్ర మధుమేహంతో బాధపడేవారికి ఇన్సులిన్‌ ఇవ్వటం తప్ప మరో మార్గం లేదు. దీన్ని ఇంజెక్షన్‌ రూపంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం తరచూ సూదితో పొడుచుకోవాల్సి వస్తుంది. దీంతో ఎంతోమంది ఇన్సులిన్‌ అంటేనే భయపడిపోతుంటారు. మారుమూల ప్రాంతాల్లో నివసించేవారు, అంతగా అవగాహనలేనివారు దీన్ని సరిగ్గా తీసుకోవటమూ కష్టమే. ఇన్సులిన్‌ చెడిపోకుండా భద్రపరచటమూ అన్నిచోట్లా సాధ్యం కాకపోవచ్చు. అదే మాత్ర రూపంలో ఉంటే? ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు కదా. శాస్త్రవేత్తలు ఇందుకోసం చాలాకాలం నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్సులిన్‌ మాత్ర తయారీలో ఇప్పటివరకూ ఎదురవుతున్న పెద్ద సమస్య- జీర్ణకోశ వ్యవస్థ ఇన్సులిన్‌ను దెబ్బతీయటం. ఇది కాలేయానికి చేరుకునేలోపే జీర్ణాశయంలోని ఆమ్లం దెబ్బతీస్తుంది. ఇలాంటి ఇబ్బందిని తొలగించటానికే శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన పొరతో కూడిన మాత్రను రూపొందించారు. ఇది కాలేయానికి చేరుకుంటున్న సమయంలో ఇన్సులిన్‌ విడుదలయ్యేలా చేస్తుంది. దీనికి అమెరికా ఎఫ్‌డీఏ అనుమతించటంతో ప్రయోగ పరీక్షలూ ఆరంభమయ్యాయి. మనదేశంలోనూ ఇన్సులిన్‌ మాత్ర తయారీకోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. మామూలుగా ఇంజెక్షన్‌ ద్వారా తీసుకునే ఇన్సులిన్‌.. ముందుగా రక్తంలో కలుస్తుంది. శరీరమంతటా తిరుగుతూ కాలేయానికి చేరుకుంటుంది. మాత్రల రూపంలోనైతే పేగుల ద్వారా రక్తంలోకి, అక్కడ్నుంచి గ్లూకోజును ఉత్పత్తి చేసే కాలేయానికి చేరుకుంటుంది. అంటే దాదాపుగా ఒంట్లో ఉత్పత్తయ్యే ఇన్సులిన్‌ మాదిరిగానే పనిచేస్తుందన్నమాట. దీంతో అసలు కాలేయంలోనే గ్లూకోజు ఎక్కువగా ఉత్పత్తి కావటం ఆగిపోతుంది. ఫలితంగా బరువు పెరగటం వంటి దుష్ప్రభావాలూ తగ్గుతాయి. ఈ మాత్రలతో మూడు నెలల సగటు గ్లూకోజును తెలిపే హెచ్‌బీఏ1సీ స్థాయులు గణనీయంగా తగ్గినట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.  అన్నీ సవ్యంగా జరిగితే మరో మూడేళ్లలోనే ఇన్సులిన్‌ మాత్ర విరివిగా అందుబాటులోకి వచ్చే అవకాశముంది.


మొండి ఇన్‌ఫెక్షన్లపై వైరస్‌ అస్త్రం

సూక్ష్మక్రిములను సూక్ష్మక్రిములతోనే అరికడితే? బ్యాక్టీరియాను తినే వైరస్‌ చికిత్స ఇలాంటిదే. నిజానికిది పాత ఆలోచనే అయినా మళ్లీ ప్రాచుర్యం పొందుతోంది. మొండి ఇన్‌ఫెక్షన్ల భరతం పట్టే దిశగా కొత్తరూపు సంతరించుకుంటోంది. దీనిపై మొదలైన ప్రయోగ పరీక్షల ఫలితాలు ఈ సంవత్సరంలోనే వెల్లడి కానున్నాయి.

వటానికి వైరస్‌లే గానీ హాని చేయవు. పైగా మనకు  చేటు చేసే బ్యాక్టీరియాను తినేస్తాయి. ఇవే బ్యాక్టీరియోఫేజెస్‌. బ్యాక్టీరియా కణాలకు అంటుకుపోయి, వాటి లోపలికి తమ జన్యువులను జొప్పించటం వీటి ప్రత్యేకత. ఇలా బ్యాక్టీరియా జన్యుక్రమం మొత్తం తుడిచిపెట్టేస్తాయి. దీంతో బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ ఆగిపోతుంది. అందుకే వీటితో యాంటీబయోటిక్‌ మందులను తట్టుకొనే బ్యాక్టీరియాను అడ్డుకోవచ్చన్నది శాస్త్రవేత్తల భావన. నిజానికి వందేళ్ల క్రితమే ఫెలిక్స్‌ డిహెరెలే బ్యాక్టీరియోఫేజెస్‌ చికిత్సను రూపొందించారు. వైరస్‌ల గురించి పెద్దగా ఎవరికీ తెలియని రోజుల్లోనే వీటితో జంతువుల్లో బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లకు చికిత్స చేసేవారు. పిల్లల్లో బంక విరేచనాలకూ చికిత్స చేయొచ్చని నిరూపించారు. అప్పట్లో ఇది అద్భుత ఔషధంగానూ పేరొందింది. పెన్సిలిన్‌ వంటి యాంటీబయోటిక్‌ మందులు అందుబాటులోకి రావటంతో పూర్తిగా విస్మరించారు. కొంతకాలం నిషేధించారు కూడా. మొండి బ్యాక్టీరియా రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవలే దీనిపై ప్రయోగాలు ఊపందుకున్నాయి. జన్యుపరంగా మార్పు చేసిన మూడు వైరస్‌లతో 2018లో ఒక బ్రిటన్‌ అమ్మాయికి తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ను నయం చేయటం అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో 2020లో ప్రయోగ పరీక్షలు ఆరంభించారు. ఈ సంవత్సరమే వీటి ఫలితాలు వెలువడనున్నాయి. అధునాతన డీఎన్‌ఏ విశ్లేషణ ప్రక్రియల పుణ్యమాని ఇప్పుడు ఆయా వ్యక్తులకు సరిపోయిన వైరస్‌లను ఎంచుకోవటమూ సాధ్యపడుతోంది. దీంతో ఎలాంటి హాని కలగకుండా సురక్షిత చికిత్సలను రూపొందించొచ్చని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. మున్ముందు ఎదుర్కోబోయే అతిపెద్ద మహమ్మారి మొండి బ్యాక్టీరియానే అనే హెచ్చరికలు వినిపిస్తున్న తరుణంలో ఇది మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది.


డిజిటల్‌ స్టెతస్కోప్‌ ముచ్చట

కృత్రిమ మేధ (ఏఐ) ఆరోగ్యరంగాన్నీ కొత్త పుంతలు తొక్కిస్తోంది. ముఖ్యంగా నిర్ధారణ పరీక్షలు, పరికరాల్లో కొంగొత్త మార్పులకు శ్రీకారం చుడుతోంది. జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ రూపొందించిన డిజిటల్‌ స్టెతస్కోప్‌ అలాంటిదే.

డాక్టర్‌ అనగానే ముందుగా గుర్తొచ్చేది స్టెతస్కోపే. గుండె, ఊపిరితిత్తుల వంటి అవయవాల చప్పుళ్లను వినటం ద్వారా ఎన్నో సమస్యలను గుర్తించటానికిది తోడ్పడుతుంది. ఆవిష్కరించినప్పట్నుంచీ ఇది పెద్దగా మారిందేమీ లేదు. కృత్రిమ మేధతో కూడిన డిజిటల్‌ స్టెతస్కోప్‌ ఆవిష్కరణతో ఇకపై దీని పనితీరు పూర్తిగా మారిపోనుంది. ఇది చుట్టుపక్కల శబ్దాలను పక్కనపెట్టేసి, అవయవాల చప్పుళ్లను అత్యంత స్పష్టంగా వినిపిస్తుంది మరి. దీంతో లోపలి మార్పులను కచ్చితంగా పసిగట్టొచ్చు. అంతేకాదు, ఆయా చప్పుళ్లను రికార్డు చేసి, దూరంగా ఉండే డాక్టర్లకూ చేరవేస్తుంది. దీన్ని ఉపయోగించటానికి ప్రత్యేకమైన నైపుణ్యమేమీ అక్కర్లేదు. అందువల్ల మారుమూల ప్రాంతాల్లో నివసించేవారు, కదల్లేని పరిస్థితుల్లో ఉన్నవారు అక్కడ్నుంచే డాక్టర్లకు సమాచారాన్ని అందించటానికీ వీలుంటుంది. ప్రయాణాలు, ఖర్చులు తగ్గుతాయి. ప్రపంచ ఆరోగ్యసంస్థ మార్గదర్శకాలతో పోలిస్తే ఇది పిల్లల్లో న్యుమోనియాను 17% ఎక్కువ కచ్చితత్వంతో గుర్తించటం విశేషం. ఇలా అనవసరంగా మందులు వాడుకోవటాన్నీ తప్పిస్తుంది. దీన్ని ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని గుర్తించే స్పైరోమెట్రీకి అదనపు పరికరంగానూ వాడుకునే వీలుండటం గమనార్హం. ప్రస్తుతం మరింత అధునాతనంగా, చవకగా, అందరికీ అన్నిచోట్లా అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతున్నారు కూడా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని