Updated : 15 Jun 2021 07:48 IST

Coronavirus: కొవిడ్‌ ప్లస్‌

ఊపిరితిత్తులు, గుండె, మెదడు, కిడ్నీలు, కండరాలు, ఎముకలు.. కావేవీ కొవిడ్‌-19కు మినహాయింపు! మన శరీరంలో దీనికి ప్రభావితం కాని అవయవమంటూ ఏదీ లేదు. ఇది శరీర వ్యవస్థలన్నింటిమీదా దాడి చేస్తోంది. ఒకవైపు వైరస్‌ ప్రభావం.. మరోవైపు దీన్ని ఎదుర్కోవటానికి అతిగా ప్రేరేపితమయ్యే రోగనిరోధక వ్యవస్థ. రెండూ రెండు వైపుల నుంచీ దెబ్బ కొడుతున్నాయి. జబ్బు ఉద్ధృతంగా ఉన్నప్పుడే కాదు.. తగ్గిన తర్వాతా దీర్ఘకాలంగా వేధిస్తున్న ఇబ్బందులే దీనికి నిదర్శనం. కొవిడ్‌ మాత్రమే కాదు, తదనంతర జబ్బు.. కొవిడ్‌ ‘ప్లస్‌’ మాదిరిగానూ కొరడా ఝుళిపిస్తోంది.

ఎంతోమందికి ఎలాంటి లక్షణాలు లేకపోయి ఉండొచ్చు. చాలామందికి తేలికపాటి లక్షణాలతోనే తగ్గిపోయి ఉండొచ్చు. ఒక మాదిరిగా వేధించినా రెండు వారాల్లోనే సమసిపోయి ఉండొచ్చు. ఒకవేళ తీవ్రమైనా చికిత్సలతో కోలుకొని ఉండొచ్చు. కానీ కొవిడ్‌-19 పీడ మాత్రం వదలటం లేదు. అప్పటికి జబ్బు తగ్గినా ఎంతోమంది ఆయాసం, నీరసం, ఒళ్లు నొప్పుల వంటి ఇబ్బందులతో దీర్ఘకాలం బాధ పడుతూనే ఉన్నారు. గతంలో కొవిడ్‌-19 కారక కరోనా వైరస్‌లతోనే తలెత్తిన సార్స్‌ వంటి జబ్బుల్లో మాదిరి ధోరణే ఇప్పుడూ కనిపిస్తోంది. కొవిడ్‌ నుంచి కోలుకున్నా సుమారు 85% మంది కనీసం ఏదో ఒక ఇబ్బందితో బాధపడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. మన అనుభవంలోనూ ఇలాంటి స్థితినే ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రధానంగా నీరసం, నిస్సత్తువతో ఎంతోమంది బాధపడుతున్నారు. దగ్గు, ఆయాసం, ఒళ్లునొప్పులు, కీళ్ల నొప్పులు, ఛాతీనొప్పి, జుట్టు రాలటం, విరేచనాలు, వాసన, రుచి తెలియకపోవటం వంటివి నిత్య బాధలుగానూ మారిపోయాయి. ఎందుకీ దుస్థితి? దీనికి కారణమేంటి? పరిష్కారమేంటి?

ముప్పు ఎవరికి?
వృద్ధులకు, మహిళలకు, ఆరంభంలోనే ఐదు కన్నా ఎక్కువ లక్షణాలు కనిపించినవారికి, జబ్బు తీవ్రమై ఆక్సిజన్‌ అవసరమైనవారికి, వెంటిలేటర్‌ అమర్చినవారికి, ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నవారికి, ఇతరత్రా దీర్ఘకాలిక జబ్బులు గలవారికి, ఊబకాయులకు, మనలాంటి ఆసియా దేశాల వాసులకు, పొగ, మద్యం అలవాట్లు గలవారికి దీర్ఘ కొవిడ్‌, తదనంతర కొవిడ్‌ ముప్పు ఎక్కువ.

దీర్ఘ కొవిడ్‌ అంటే?
ఇన్‌ఫెక్షన్‌ అప్పటికి తగ్గిపోవచ్చు. కానీ దీన్ని ఎదుర్కోవటానికి ఒంట్లో మొదలైన వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) ప్రభావం దీర్ఘకాలం కొనసాగుతూ రావొచ్చు. ఇదే రకరకాల ఇబ్బందులకు కారణమవుతోంది. కొవిడ్‌-19కు దారితీసే సార్స్‌-కొవీ2 ఒంట్లోకి ప్రవేశించాక 2-14 రోజుల మధ్యలో ఎప్పుడైనా లక్షణాలు ఆరంభం కావొచ్చు. సాధారణంగా చాలామందిలో 5 రోజుల్లో లక్షణాలు మొదలవుతుంటాయి. తొలి లక్షణం కనిపించినప్పట్నుంచి 4 వారాల వరకూ కొవిడ్‌-19ను ఉద్ధృత (అక్యూట్‌) దశగానే భావించాలి. ఎందుకంటే కొందరిలో 14 రోజుల తర్వాతా లక్షణాలు కనిపించొచ్చు. ఒకవేళ ఉద్ధృత దశ దాటాక, చికిత్స తీసుకొని ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వాతా లక్షణాలు తగ్గకుండా వేధిస్తుంటే దీర్ఘ కొవిడ్‌ (సబ్‌ అక్యూట్‌/లాంగ్‌) అనుకోవచ్చు.  అదే 12 వారాల తర్వాతా లక్షణాలు కొనసాగితే తదనంతర కొవిడ్‌గా (పోస్ట్‌ కొవిడ్‌/క్రానిక్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌) పరిగణించాల్సి ఉంటుంది. కొందరిలో 9 నెలల వరకూ దీని లక్షణాలు వేధిస్తుండటం గమనార్హం. కొవిడ్‌ దశల్లో ఎప్పుడెలాంటి లక్షణాలు కనిపిస్తాయన్నది కచ్చితంగా చెప్పలేం. లక్షణాలు ఎప్పుడైనా మొదలవ్వచ్చు, ఎంతకాలమైనా కొనసాగొచ్చు. మొదట్లో లేని లక్షణాలు కొంతకాలం తర్వాతా బయటపడొచ్చు. ఉదాహరణకు- మొదట్లో జ్వరం ఒక్కటే వచ్చి తగ్గిపోయినా అనంతరం దగ్గు వంటివి మొదలు కావొచ్చు. దీంతో కొందరు మళ్లీ కొవిడ్‌ వచ్చిందేమోననీ పొరపడుతుంటారు. నిజానికిది ఇన్‌ఫెక్షన్‌ తిరగబెట్టటం కాదు. మొదట్లో వచ్చిన జబ్బు తదనంతర పరిణామమే. ఇది తెలియక చాలామంది మళ్లీ కొవిడ్‌ పరీక్షలు, సీటీ స్కాన్‌ చేయించుకుంటున్నారు. సాధారణంగా 14 రోజుల తర్వాత వైరస్‌ ఒంట్లో ఉండదు. కానీ కొందరిలో 3 నెలల వరకూ పరీక్షలో పాజిటివ్‌గా తేలొచ్చు. దీనికి కారణం వైరస్‌ అవశేషాలే. వీటిని కూడా పరీక్ష వైరస్‌గానే గుర్తిస్తుంది. ఊపిరితిత్తులు కోలుకుంటున్న విషయం సీటీ స్కాన్‌లో తేలటానికి కొంత సమయం పడుతుంది. అప్పుడప్పుడే కోలుకుంటున్న దశలో సీటీ స్కాన్‌ చేస్తే జబ్బు ఇంకా ఉన్నట్టుగానే ఫలితం కనిపిస్తుంది.


ఇబ్బందులు రకరకాలు

కొవిడ్‌ ఒక్క ఊపిరితిత్తులపైనే కాదు.. అన్ని అవయవాల మీద ప్రభావం చూపుతోంది. ఇలా దీర్ఘకాలం పాటు పలు ఇబ్బందులకు దారితీస్తోంది.

ఆయాసం

కొందరు నాలుగడుగులు వేయగానే ఆయాసంతో కూర్చోవటం చూస్తున్నాం. కొందరికి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఆక్సిజన్‌ పెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. దీనికి కారణం వైరస్‌ ప్రభావంతో ఊపిరితిత్తులు కుంచించుకుపోవటం (ఫైబ్రోసిస్‌). ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచాలకు టైప్‌2 న్యుమోసైట్స్‌ తోడ్పడతాయి. వైరస్‌ సరిగ్గా మీదే దాడిచేస్తోంది. ఇది ఊపిరితిత్తులు ముడుచుకుపోవటానికి దారితీస్తోంది. వాపు ప్రక్రియను ప్రేరేపించే కారకాలు సైతం ఊపిరితిత్తుల కణజాలాన్ని దెబ్బతీస్తున్నాయి. దీంతో శ్వాస తీసుకోవటం చాలా చాలా కష్టమవుతోంది. ఫలితంగా ఆక్సిజన్‌ సరిగా లోనికి వెళ్లదు. ఎంతో కొంత వెళ్లినా అది అవయవాలకు సరిగా అందదు. దీంతో ఆయాసం ముంచుకొస్తుంది.

చికిత్స: కొవిడ్‌తో దెబ్బతిన్న ఊపిరితిత్తులు కోలుకోవటానికి కొంత సమయం పడుతుంది. కణజాలం ముడుచుకుపోవటాన్ని తగ్గించే పర్ఫెనిడోన్‌, నింటెడానిబ్‌ మందులు ఉపయోగపడతాయి. వాపు ప్రక్రియ తగ్గటానికి స్టిరాయిడ్లు ఎక్కువ కాలం వాడుకోవాల్సి ఉంటుంది కూడా. సమస్య మరీ తీవ్రమై, ఊపిరితిత్తులు విఫలమయ్యే స్థితికి వస్తే ఊపిరితిత్తుల మార్పిడి చేయాల్సి ఉంటుంది.

గుండెదడ

కవైపు ఆందోళన, ఒత్తిడి.. మరోవైపు గుండె మీద వైరస్‌ చూపే విపరీత ప్రభావం గుండె దడకు దారితీస్తున్నాయి. దీర్ఘ కొవిడ్‌ గుండె దడ ప్రత్యేకత శరీర స్థితి మారినప్పుడు గుండె వేగం పెరగటం. దీన్నే ఆర్థోస్టాటిక్‌ పొష్చీరియల్‌ టాకీకార్డియా అంటారు. వీరిలో పడుకొని లేవగానే ఉన్నట్టుండి గుండె దడదడా కొట్టుకుంటుంది. తలతిప్పు, పడిపోవటం, తల తేలిపోవటం వంటి లక్షణాలూ కనిపించొచ్చు.

చికిత్స: గుండె వేగం తగ్గటానికి బీటా బ్లాకర్లు ఉపయోగపడతాయి. ప్రత్యేకించి గుండె మీద పనిచేసే బ్లాకర్లే వాడుకోవాలి. ఇతర రకం బీటా బ్లాకర్లు వాడితే ఆస్థమా వంటి సమస్యలు ఉద్ధృతం కావొచ్చు.

దగ్గు

ఎంతోమంది చాలాకాలం దగ్గుతో బాధపడుతున్నారు. కొందరికి మాట్లాడటం ఆరంభించగానే దగ్గు వచ్చేస్తుంటుంది. దీనికి మూలం వైరస్‌ కలగజేసిన నష్టం అలాగే కొనసాగటం. ఊపిరితిత్తుల కణజాలం ముడుచుకోవటం, నాడీ చివర్ల మీద తలెత్తే చికాకు వంటివి దీనికి దోహదం చేస్తున్నాయి.

చికిత్స: ముందుగా క్షయ, ఇతరత్రా జబ్బులేవైనా ఉన్నాయేమో చూసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే దగ్గు మందులు, యాంటీ హిస్టమిన్‌ రకం మందులు ఉపయోగపడతాయి. అవసరమైతే ఎన్‌-అసిటైల్‌ సిస్టీన్‌ ఇస్తారు. కొవిడ్‌ దగ్గు ఇన్‌ఫెక్షన్‌ వల్ల వచ్చేది కాదు. వాపు ప్రక్రియ మూలంగా వచ్చేది. అందువల్ల యాంటీబయోటిక్‌ మందులు పనిచేయవు. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల వంటివి ఉంటేనే వీటిని తీసుకోవాలి. అనవసరంగా వాడితే రోగనిరోధకశక్తి క్షీణించి ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల వంటి జబ్బులు తలెత్తొచ్చు. కొందరికి కౌన్సెలింగ్‌తోనే దగ్గు తగ్గొచ్చు.

కష్టమైన పనులు తట్టుకోలేకపోవటం

ష్టమైన పనులను, వ్యాయామాలను తట్టుకోలేకపోవటం మరో సమస్య. దీనికి కారణం ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గటం, ఊపిరితిత్తుల రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టటం (పల్మనరీ థ్రాంబోసిస్‌). అందువల్ల కొవిడ్‌ నుంచి కోలుకున్నవారు వెంటనే కష్టమైన వ్యాయామాలేవీ చేయకూడదు. గాలిని గట్టిగా పీల్చి బంధించటం వంటివి చేయకూడదు. దీంతో స్వయంచాలిత (అటానమస్‌) వ్యవస్థ దెబ్బతింటుంది. కొవిడ్‌ మూలంగా విడిగా ఉండాల్సి వచ్చినప్పుడు ఎక్కువెక్కువగా తింటుంటారు. దీంతో బరువు పెరిగిందని వెంటనే వ్యాయామాలు ఆరంభిస్తుంటారు. ఇది తప్పు. శరీర సామర్థ్యాన్ని బట్టి వ్యాయామాలు పెంచుకుంటూ రావాలి. వెంటనే కష్టమైన వ్యాయామాలు  చేయకూడదు. మామూలు వేగంతో నడిస్తే చాలు. 

నీరసం, నిస్సత్తువ

రీరానికి ఆక్సిజనే ఇంధనం. ఇది తగినంత అందకపోవటం నీరసం, నిస్సత్తువకు దారితీస్తోంది. ఊపిరితిత్తులు దెబ్బతినటం, కండరాలు బలహీనపడటం, నాడీ సమస్యలు, గుండె సమస్యలు, నిద్రలేమి, మానసిక ఒత్తిడి, నిరాసక్తత, నొప్పుల వంటివన్నీ వీటికి దారితీయొచ్చు. కొవిడ్‌ నుంచి కోలుకున్నాక ఎంతోమంది 3-6 నెలల వరకూ తీవ్రమైన నీరసంతో బాధపడుతున్నారు. రుచి, వాసన తెలియకపోవటం వల్ల సరిగా తీసుకోకపోవటంతోనూ నీరసం రావొచ్చు.

చికిత్స: పోషకాహారం, ద్రవాలు చాలా ముఖ్యం. నీరసానికి కారణమవుతున్న కారణాలను గుర్తించి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు- గుండెజబ్బుతో నీరసం వస్తుందనుకోండి. ఇది తగ్గటానికి మందులు వాడితే నీరసమూ తగ్గుతుంది. కొన్నిసార్లు రక్తహీనతతోనూ నిస్సత్తువ తలెత్తొచ్చు. ఇలాంటి కారణాలేవైనా ఉన్నాయేమో కూడా చూసుకోవాల్సి ఉంటుంది.

ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు

న్‌ఫెక్షన్‌ మూలంగా కండరాలు బలహీనం కావటం, వైరస్‌ను ఎదుర్కోవటానికి పుట్టుకొచ్చిన వాపు ప్రక్రియ వీటికి కారణం. కండరాలు కోలుకోవటానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి నొప్పులూ ఎక్కువ కాలం వేధిస్తుంటాయి.

చికిత్స: ఐబూప్రొఫెన్‌ వంటి నొప్పి మందులు ఉపయోగపడతాయి. వీటిని డాక్టర్ల సలహా మేరకే వాడుకోవాలి.

ఛాతీనొప్పి

గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడటం, ఊపిరితిత్తుల్లో బ్లాక్‌ఫంగస్‌, న్యుమోథొరాక్స్‌ వంటి సమస్యలు ఛాతీనొప్పికి దారితీయొచ్చు. గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డల మూలంగా గుండెపోటు వచ్చే అవకాశం ఆరు రెట్లు ఎక్కువవుతోందని గుర్తించాలి. కొందరికి ఎలాంటి కారణం లేకుండానూ రావొచ్చు.
* ఛాతీనొప్పి వస్తే ఈసీజీ, 2డీఎకో, గుండె ఎంజైమ్‌ పరీక్షలను బట్టి తగు చికిత్స చేయాల్సి ఉంటుంది.

ఛాతీలోకి గాలి చేరటం (న్యుమోథొరాక్స్‌)

వాపుప్రక్రియ మూలంగా ఊపిరితిత్తుల సాగే గుణం తగ్గిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో విపరీతంగా దగ్గటం, ఒత్తిడి మూలంగా కొన్నిసార్లు ఊపిరితిత్తుల చుట్టూరా పొరలకు చిల్లుపడి, గాలి బయటకు వచ్చి ఛాతీ కుహరంలోకి చేరుతుంది. ఫలితంగా శ్వాస తీసుకోవటం చాలా కష్టమై పోతుంది. అత్యవసరంగా చికిత్స చేయకపోతే ప్రాణాపాయం తలెత్తొచ్చు. 

చికిత్స: బయటి నుంచి ఛాతీకి రంధ్రం చేసి లోపలికి గొట్టాన్ని (ఐసీడీ) పంపించాల్సి ఉంటుంది. దీంతో లోపలి గాలి బయటకు వచ్చి, సత్వర ఉపశమనం లభిస్తుంది.

గుండె కండరం మందం కావటం

కొందరికి వాపు ప్రక్రియ మూలంగా గుండె కండరం మందం (మయోకార్డయిటిస్‌) కావొచ్చు. ఇది కొవిడ్‌ ఉన్నప్పుడే కాదు, తర్వాతా రావొచ్చు. ఫలితంగా గుండె సామర్థ్యం తగ్గిపోతుంది. చాలామందికి ఈ విషయమే తెలియకపోవచ్చు. ఇలాంటి స్థితిలో కష్టమైన పనులు, వ్యాయాయాలు చేస్తే గుండె చేతులెత్తేయొచ్చు. రక్తం గడ్డలు ఏర్పడి ఉంటే అవి గుండె రక్తనాళాల్లోకి వెళ్లి అడ్డుపడొచ్చు. ఇది హఠాన్మరణానికి దారితీయొచ్చు. అందువల్ల క్రీడాకారులు, జిమ్‌లలో వ్యాయామాలు చేసేవారు గుండె పరీక్షలు చేయించుకున్నాక డాక్టర్‌ సలహా మేరకే వ్యాయామాలు ఆరంభించాలి.

చికిత్స: గుండె కండరం మందమైనట్టు అనుమానిస్తే ఎంఆర్‌ఐ పరీక్ష చేసి నిర్ధరించుకోవాల్సి ఉంటుంది. ఏసీఈ ఇన్‌హిబిటార్స్‌, బీటా బ్లాకర్లు, మూత్రం ఎక్కువగా వచ్చేలా చేసే మాత్రల వంటివి ఉపయోగపడతాయి.

మెదడు మొద్దుబారటం

కొందరికి మెదడు మొద్దుబారి (బ్రెయిన్‌ ఫాగ్‌) ఆలోచనలు అస్తవ్యస్తం కావొచ్చు. తికమక, మరచిపోవటం, ఏమీ తెలియకపోవటం, కాస్త మగతగా ఉండటం వంటివీ ఇబ్బంది పెట్టొచ్చు. మెదడులో వాపు ప్రక్రియ దీనికి మూలం. రక్తనాళాల్లో రక్తం గడ్డల మూలంగా పక్షవాతం బారినపడుతున్నవారూ ఉన్నారు.

చికిత్స: మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ ఎక్కువ గలవారికి దీని ముప్పు ఎక్కువ. ఇతరత్రా సమస్యలేవీ లేవని నిర్ధరించుకున్నాక ఎంఆర్‌ఐ చేయాల్సి ఉంటుంది. మెదడులో రక్తం గడ్డల వంటివి ఉంటే రక్తాన్ని పలుచబరచే మందులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటి వాడకంలో జాగ్రత్త అవసరం. రక్తం గడ్డకట్టే తీరును తెలిపే డీడైమర్‌ పరీక్ష ఫలితాలు మామూలు కన్నా రెండు రెట్లు మించితేనే వీటిని ఆరంభించాల్సి ఉంటుంది. మందుల మోతాదు పెరిగితే రక్తం లీకై పక్షవాతానికి దారితీయొచ్చు.

పునరుత్తేజ చికిత్స: ఊపిరితిత్తుల ఇబ్బందులు తగ్గటానికి పునరుత్తేజ (పల్మనరీ రిహాబిలిటేషన్‌) చికిత్స అవసరం. నెమ్మదిగా శ్వాస తీసుకోవటం, పోషకాహారం, క్రమంగా వ్యాయామాలు పెంచుకుంటూ రావటం, ధ్యానం, యోగా వంటివన్నీ ఇందులో భాగమే.


కౌన్సెలింగ్‌ ప్రధానం: అన్నింటికన్నా భరోసా, మానసిక ధైర్యాన్ని కల్పించటం ముఖ్యం. కొవిడ్‌ మూలంగా అప్పటికే చాలా ఆందోళనకు గురై ఉంటారు. లక్షణాలు విడవకుండా వేధిస్తుంటే మరింత భయానికి లోనవుతుంటారు. తమకేదో అయిపోతుందేమోనని గాబరా పడుతుంటారు. దీన్ని తొలగించటం ప్రధానం. ఇందుకు కౌన్సెలింగ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. వైద్యులు కూడా లక్షణాలు పూర్తిగా తగ్గేంతవరకు ఉపశమనం కలిగించే, ధైర్యాన్నిచ్చే మాటలు చెబుతుండాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని