Updated : 03 Aug 2021 02:36 IST

సంపూర్ణ ఆహారం అమృత సమానం

అందరికీ తెలిసిన విషయమే కావొచ్చు. కొత్తదేమీ కాకపోవచ్చు. అయితేనేం? మంచి విషయమైతే మళ్లీ మళ్లీ చెప్పుకొన్నా తప్పులేదు. తల్లిపాల సంగతి అలాంటిదే. శిశువుకు తొలి నుంచీ రక్షణ, భద్రత కలిగిస్తూ.. భావి ఆరోగ్య జీవితానికి బాటలు వేసే చనుబాల గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నిసార్లు చెప్పుకొన్నా కొత్తే. అందుకే చనుబాలు పట్టటాన్ని ప్రోత్సహించటం, ఇది కొనసాగేలా చూడటం అందరి బాధ్యతని నినదిస్తోంది తల్లిపాల వారోత్సవం. ఈ సందర్భంగా ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆబ్‌స్టెట్రిక్‌ అండ్‌ గైనకాలాజికల్‌ సొసైటీస్‌ ఆఫ్‌ ఇండియా (ఫాగ్సీ) అధ్యక్షురాలు డాక్టర్‌ ఎస్‌.శాంతకుమారితో సుఖీభవ ముచ్చటించింది. తల్లిపాల విశిష్టత, ప్రాముఖ్యత, ప్రయోజనాల వంటి అంశాలపై ఆమె సమగ్రంగా వివరించారు.

చనుబాలు సంపూర్ణ ఆహారం. శిశువులకు ఇవే  అత్యుత్తమ ఆహారం. బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన కొవ్వులు, పిండి పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్ల వంటి పోషకాలన్నీ తల్లిపాలలో సమతూకంలో ఉంటాయి. తేలికగానూ జీర్ణమవుతాయి. కాన్పు తర్వాత మొదటి రెండు, మూడు రోజుల్లో వచ్చే ముర్రుపాలైతే అమృతంతో సమానం. భావి ఆరోగ్యానికి తొలి బీజం వేసేవి ఇవే. వీటిని తొలి టీకా అనీ అనుకోవచ్చు. చిక్కగా, కాస్త పసుపుపచ్చ రంగులో ఉండే ముర్రుపాలలో ఇమ్యునోగ్లోబులిన్లు పెద్దమొత్తంలో ఉంటాయి. ఇవి రోగనిరోధకశక్తి పెంపొందటానికి తోడ్పడతాయి. ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా కాపాడతాయి. ఐదారు రోజులకు పాలు కాస్త పలుచబడినప్పటికీ వీటిల్లో కొవ్వులు, ల్యాక్టోజ్‌ దండిగా ఉంటాయి. ఇవి బిడ్డకు మరింత శక్తినిస్తాయి. రెండు వారాల సమయంలో పాలు పరిపక్వ దశకు చేరుకుంటాయి. ఇందులో 90% నీరు.. 8% పిండి పదార్థాలు, కొవ్వులు, ప్రొటీన్లు.. 2% ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. ఇలా బిడ్డ అవసరాలకు అనుగుణంగా మారిపోయే తల్లిపాలను మించిన ఆహారం మరేముంటుంది? అదీ అతి శుభ్రంగా, ఎలాంటి ఖర్చు లేకుండా అందుబాటులో ఉంటే ఇక చెప్పేదేముంది? అందువల్ల వీటి గొప్పతనం తెలుసుకొని, మసలుకోవటం ఎంతైనా అవసరం.

సహజంగా, సిద్ధంగా..

తల్లిపాలు ఎప్పుడంటే అప్పుడు సహజ సిద్ధంగా, తగు ఉష్ణోగ్రతలో అందుబాటులో ఉంటాయి. చాలా సురక్షితం. అదే పోతపాలైతే కలుపుకోవటం, వేడి చేసుకోవటం, సీసా శుభ్రం చేసుకోవటం వంటి ఇబ్బందులెన్నో ఉంటాయి. సీసా, పాల పీక సరిగా శుభ్రం చేయకపోతే బిడ్డకు విరేచనాలు, వాంతుల వంటి జబ్బులూ పట్టుకుంటాయి. చనుబాలతో అలాంటి ఇబ్బందులేవీ ఉండవు. తల్లిపాలతో శిశు మరణాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు.

మొదటి గంటలోనే

సహజ కాన్పు అయినా, సిజేరియన్‌ కాన్పు అయినా పుట్టిన తొలిగంటలోనే శిశువుకు తల్లిపాలు పట్టించటం అత్యవసరం. గ్లూకోజు నీళ్లు, తేనె, ప్యాకెట్‌ పాలు, ఆవుపాలు నాకించటం వంటివేవీ చేయొద్దు. మనదేశంలో కేవలం 44% మంది శిశువులే పుట్టిన తొలిగంటలో తల్లిపాలకు నోచుకుంటున్నారు. తల్లిపాల ప్రయోజనాలపై అవగాహన లేకపోవటమే దీనికి కారణం. ఏవైనా సమస్యలతో శిశువును ఇంక్యుబేటర్‌లో పెట్టాల్సి వచ్చినా తల్లిపాలను పిండి తాగించటానికే ప్రయత్నించాలి.

* శిశువుకు తొలి ఆరు నెలల్లో తల్లిపాలు తప్ప ఇతరత్రా ఎలాంటి ఆహారమూ ఇవ్వకూడదు. ఎండకాలమైనా నీళ్లు తాగించాల్సిన అవసరమూ లేదు. ఆరు నెలల తర్వాత ఉగ్గు, పండ్ల గుజ్జు, ఘనాహారం వంటివి ఆరంభించినా రెండేళ్ల వయసు వచ్చేవరకూ తల్లిపాలు పట్టటం అవసరం.

* ఉద్యోగాలకు వెళ్లే మహిళలైతే చనుబాలను పిండి ఇంట్లో భద్రపరచుకోవచ్చు.

సరిపోవని అనుకోవద్దు

తల్లి రొమ్ముకు బిడ్డ పెదాలు తాకగానే చనుబాలు రావటం ఆరంభమవుతుంది. కాన్పయిన వెంటనే కొన్ని చుక్కల పాలే వచ్చినా క్రమంగా పుంజుకుంటాయి. పుట్టినప్పుడు శిశువు జీర్ణాశయం చిన్నగానే ఉంటుంది. ఒక మిల్లీలీటరు ముర్రుపాలు తాగినా సరిపోతాయి. క్రమంగా జీర్ణాశయం పెద్దగా అవుతూ వస్తుంది. తల్లికీ పాలు ఎక్కువవుతూ వస్తాయి. కొందరు పాలు సరిపోవటం లేదని భావిస్తుంటారు. ఇది కేవలం అపోహే. ఆరు నెలల వరకు బిడ్డ అవసరాలకు సరిపడిన పాలు తప్పకుండా వస్తాయి. బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉంటూ.. హాయిగా నిద్రపోతూ.. మూత్రం మామూలుగా వస్తుంటే పాలు సరిపోతున్నట్టే. పాలు పడితే వస్తాయి, పట్టకపోతే రావనే సంగతిని గుర్తించాలి.

* మంచి పోషకాహారం, తగినన్ని ద్రవాలు తీసుకుంటే పాలు బాగా పడతాయి. బాదం, జీడి పప్పుల వంటి గింజపప్పులు.. కూరగాయలు.. ప్రొటీన్లు దండిగా ఉండే పప్పులు, చిక్కుళ్లు ఎక్కువగా తినాలి. మాంసాహారులైతే గుడ్డు, చేపలు తినొచ్చు. పాలు పట్టటానికి 10 నిమిషాల ముందు ద్రవాలు తీసుకుంటే పాలు ఎక్కువగా రావటానికి వీలుంటుంది. ఇవన్నీ చేసినా పాలు అంతగా రావటం లేదని అనిపిస్తే విటమిన్లు, ఖనిజాల మాత్రల వంటివి అవసరమవుతాయి. వీటితోనూ ఫలితం కనిపించకపోతేనే పోత పాల గురించి ఆలోచించాలి.

ఎప్పుడు పట్టాలి?

పాలు పట్టటానికి కచ్చితమైన సమయమేమీ లేదు. ఇది బిడ్డ పాలు తాగే తీరు మీద ఆధారపడి ఉంటుంది. కొందరు పిల్లలు కొంచెం సేపటికే ముఖం తిప్పేయొచ్చు. కొందరు మాటిమాటికీ పాలు కోసం ఎదురు చూస్తే.. కొందరు చాలా సేపటి వరకూ ఆగొచ్చు. సాధారణంగా ప్రతి గంట లేదా గంటన్నరకు పాలు ఇవ్వాల్సి రావొచ్చు. బిడ్డ ఎదుగుతున్నకొద్దీ పాలు పట్టే అవసరం మారుతూ వస్తుంటుంది. రెండు నెలల శిశువులకు 3-4 గంటలకు ఒకసారి అవసరపడొచ్చు. అదే 6 నెలల పిల్లలకైతే 4-5 గంటలకోసారి పట్టొచ్చు. పగటి పూటే కాదు. రాత్రుళ్లూ మధ్యమధ్యలో పాలు పట్టటం మంచిది.

ఏడిస్తేనే పట్టాలనేమీ లేదు

కొందరు బిడ్డ ఏడ్చినప్పుడే పాలిస్తుంటారు. ఏడుపు ఒక్కటే ఆకలికి చిహ్నం కాదు. నాలుకతో పెదాలను చప్పరించటం, నాలుకను బయటకు చాచటం.. దవడలు, నోరు, తలను తల్లిరొమ్ము కోసం వెదుకుతున్నట్టు అటూఇటూ తిప్పటం.. నోట్లో చేయి పెట్టుకోవటం, చేతికి అందిన వస్తువులను నోట్లో పెట్టుకోవటం వంటివన్నీ ఆకలి వేస్తోందనటానికి సూచికలే. దాహం వేసినప్పుడూ తల్లిపాల కోసం ఏడుస్తుంటారు. అమ్మ ప్రేమ కావాల్సి వచ్చినప్పుడు, తల్లిని చూడాలని అనుకున్నప్పుడు, ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడూ చనుబాలు కావాలని కోరుకుంటారు.

ఎలా ఇవ్వాలి?

వీలైనంత వరకు కూర్చొని చనుబాలు పట్టటం మంచిది. పడుకొని ఇస్తే కొన్నిసార్లు ఊపిరితిత్తుల్లోకి పాలు వెళ్లే ప్రమాదముంది. కాబట్టి జాగ్రత్త అవసరం. పాలిచ్చిన తర్వాత బిడ్డను భుజం మీద వేసుకొని, త్రేన్పు వచ్చేంతవరకు నెమ్మదిగా వీపు మీద తట్టాలి. దీంతో పాలు కక్కుకోవటం తగ్గించుకోవచ్చు.  


అందరి బాధ్యత

పిల్లలకు చనుబాలు పట్టటం తల్లి బాధ్యతే కాదు, అందరి బాధ్యత కూడా. కుటుంబ సభ్యులు తల్లిని పాలు పట్టేలా ప్రోత్సహించాలి. డాక్టర్లు, ఆరోగ్యసిబ్బంది తల్లిపాల ప్రయోజనాల గురించి తల్లికి, కుటుంబ సభ్యులకు విధిగా వివరించి చెప్పటం, అవగాహన పెంపొందించటం ముఖ్యం. బిడ్డతో తల్లి ఎప్పుడైనా బయటకు వెళ్లినప్పుడు, ఆఫీసులకు వెళ్లినప్పుడు ఆయా చోట్ల పాలు  పట్టటానికి అనువైన ఏర్పాట్లు చేయాలి. బలమైన సమాజ నిర్మాణానికిది ఎంతైనా అవసరం.


బిడ్డకు ఎన్నో లాభాలు

* పాలు తాగుతున్నప్పుడు తల్లి ఒంటికి తగిలి ఉండటం, తల్లి కళ్లలోకి కళ్లు పెట్టి చూడటం వల్ల పిల్లల్లో తాము భద్రంగా ఉన్నామనే భావన కలుగుతుంది.

* చనుబాలతో పిల్లలకు ఆస్థమా, అలర్జీల ముప్పు తగ్గుతుంది. నిద్రలో ఉన్నట్టుండి మరణించటమూ (సడెన్‌ ఇన్‌ఫాంట్‌ డెత్‌) తగ్గుతుంది. 6 నెలల పాటు పూర్తిగా తల్లిపాలు తాగిన పిల్లలకు చెవి, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు.. విరేచాల ముప్పు తక్కువ. ఆసుపత్రుల చుట్టు తిరగటమూ తగ్గుతుంది.

* తల్లిపాలతో జీర్ణకోశ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. రోగనిరోధకశక్తి, విషయ గ్రహణ సామర్థ్యం ఇనుమడిస్తాయి.

* తల్లిపాలు తాగి పెరిగిన పిల్లలు పెద్దయ్యాక మరింత ఆరోగ్యంగా, చురుకుగా ఉంటారు. వీరికి ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ల వంటి ముప్పులు తక్కువని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

* తల్లిపాలు తాగిన పిల్లల్లో తెలివితేటలు (ఐక్యూ) కూడా ఎక్కువగానే ఉంటున్నాయి.


తల్లికీ లాభమే

* చనుబాలు పట్టటం మూలంగా తల్లికి బిడ్డకు మధ్య బలమైన మానసిక బంధం ఏర్పడుతుంది.

* బిడ్డ రొమ్ము పట్టినప్పుడు ఆక్సిటోసిన్‌ హార్మోన్‌ విడుదలవుతుంది. ఇది గర్భాశయం సంకోచించటానికి తోడ్పడుతుంది. దీంతో కాన్పు తర్వాత రక్తస్రావం తగ్గుతుంది.

* బిడ్డకు పాలు పడుతుంటే కేలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి. గర్భం ధరించినప్పుడు పెరిగిన బరువు త్వరగా తగ్గటానికి వీలుంటుంది.

* రొమ్ముక్యాన్సర్‌, గర్భాశయ క్యాన్సర్‌ వంటి క్యాన్సర్ల ముప్పులూ తగ్గే అవకాశముంది. ఎముకలు గుల్లబారే ముప్పూ తగ్గుతుంది.

* చనుబాలు పట్టే తల్లులకు కాన్పు తర్వాత తలెత్తే కుంగుబాటు ముప్పు తక్కువ.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని