ముప్పు పసిగట్టండి

ఎక్కడో అక్కడ, ఎప్పుడో అప్పుడు వినిపించే మాట ఇప్పుడు మన చుట్టుపక్కలా మార్మోగుతోంది. ఎంతోమంది మహిళలను కలవరపెడుతోంది. అదే రొమ్ముక్యాన్సర్‌. మనదేశంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను అధిగమించి ఇప్పుడిది అగ్రస్థానానికీ చేరుకుంది. మహిళల్లో తలెత్తుతున్న క్యాన్సర్లలో 35% క్యాన్సర్లు రొమ్ముకు సంబంధించినవే. ఈ నేపథ్యంలో దీనిపై అవగాహన పెంచుకోవటం ఎంతైనా అవసరం.

Updated : 16 Sep 2022 14:52 IST

ఇది రొమ్ముక్యాన్సర్‌ అవగాహన మాసం

ఎక్కడో అక్కడ, ఎప్పుడో అప్పుడు వినిపించే మాట ఇప్పుడు మన చుట్టుపక్కలా మార్మోగుతోంది. ఎంతోమంది మహిళలను కలవరపెడుతోంది. అదే రొమ్ముక్యాన్సర్‌. మనదేశంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను అధిగమించి ఇప్పుడిది అగ్రస్థానానికీ చేరుకుంది. మహిళల్లో తలెత్తుతున్న క్యాన్సర్లలో 35% క్యాన్సర్లు రొమ్ముకు సంబంధించినవే. ఈ నేపథ్యంలో దీనిపై అవగాహన పెంచుకోవటం ఎంతైనా అవసరం.

న ఒంట్లో ప్రతి కణం ఒక నిర్ణీత క్రమంలో వృద్ధి చెందుతూ వస్తుంది. కొన్ని కణాలు మరణిస్తుంటే మరికొన్ని పుట్టుకొస్తుంటాయి. కొన్ని కొంతవరకు పెరిగి ఆగిపోతాయి. ఎందుకనో గానీ కొన్నిసార్లు ఈ ప్రక్రియ గాడి తప్పుతుంది. అవసరం లేకపోయినా కణాలు తామరతంపరగా వృద్ధి చెందుతూ.. కణితిలా, గడ్డలా తయారవుతాయి. ఇదే క్యాన్సర్‌. ఇది రొమ్ముల్లోనూ తలెత్తొచ్చు. ప్రస్తుతం మహిళలను ఆందోళనకు గురిచేస్తున్న పెద్ద సమస్య ఇదే. ప్రపంచవ్యాప్తంగా ఏటా 23 లక్షల మంది రొమ్ము క్యాన్సర్‌ బారినపడుతుండగా.. 6.85 లక్షల మంది మరణిస్తున్నారు. మనదేశంలో ఏటా 1.62 లక్షల మంది రొమ్ముక్యాన్సర్‌ బారినపడుతున్నారు. ఇది 2030 నాటికి 2 లక్షలకు ఎగబాకొచ్చని అంచనా. ప్రతి 8 నిమిషాలకు ఒకరు రొమ్ముక్యాన్సర్‌కు బలై పోతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మనదగ్గర చిన్నవయసులోనే రొమ్ముక్యాన్సర్‌ దాడి చేస్తుండటం, దీనిపై అంతగా అవగాహన లేకపోవటం, చాలామందిలో బాగా ముదిరాకే బయటపడుతుంటం వంటివన్నీ ఇందుకు దోహదం చేస్తున్నాయి.

ముప్పు కారకాలు- రకరకాలు

రొమ్ముక్యాన్సర్‌ ఎవరికి వస్తుంది, ఎందుకొస్తుందనేది చెప్పలేం. ఏ ఒక్క కారణాన్నీ పట్టి చూపలేం. జీవనశైలి, జన్యువులు, పరిసరాల ప్రభావం వంటివెన్నో క్యాన్సర్‌కు దారితీయొచ్చు. వయసు, రజస్వల ఆరంభం, ముట్లుడగటం (మెనోపాజ్‌) వంటి ముప్పు కారకాల విషయంలో మనమేమీ చేయలేకపోవచ్చు. కానీ జీవనశైలి, అలవాట్ల వంటివి మార్చుకోవచ్చు. కొందరికి ముప్పు కారకాలేవీ లేకపోయినా రొమ్ముక్యాన్సర్‌ వస్తున్నప్పటికీ చాలామందిలో ఏదో ఒకటి కారణమవుతున్న మాట నిజం. కాబట్టి వీటి గురించి తెలుసుకుంటే ముందే జాగ్రత్త పడొచ్చు.

1 వయసు

రొమ్ముక్యాన్సర్‌ ప్రధానమైన ముప్పు కారకం ఇదే. వయసు పెరుగుతున్నకొద్దీ దీని బారినపడే అవకాశం ఎక్కువవుతుంటుంది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మనదేశంలో ఇంకాస్త ముందుగానే రొమ్ముక్యాన్సర్‌ ముంచుకొస్తోంది. అక్కడ 50 ఏళ్లు పైబడినవారిలో కనిపిస్తుంటే మనదగ్గర 50 ఏళ్ల లోపే బయటపడుతోంది. రొమ్ముక్యాన్సర్‌ ఆడవారికే పరిమితం కాదు. మగవారికీ రావొచ్చు. రొమ్ముక్యాన్సర్లలో ఒక శాతం మగవారిలోనే కనిపిస్తుంటాయి.

2 త్వరగా రజస్వల, ఆలస్యంగా మెనోపాజ్‌

అమ్మాయిల్లో కొందరు 12 ఏళ్లలోపే రజస్వల అవుతుంటారు. ఇలా చిన్న వయసులోనే నెలసరి ఆరంభం కావటంతోనూ స్వల్పంగా రొమ్ము క్యాన్సర్‌ ముప్పు పెరగొచ్చు. అలాగే 50 ఏళ్లు దాటినా ముట్లుడుగని వారికీ ముప్పు ఎక్కువ కావొచ్చు.

3 రొమ్ము కణజాలం దళసరిగా ఉండటం

కొందరికి కొవ్వు కణజాలం కన్నా రొమ్ము కణజాలం మందంగా ఉంటుంది. దీంతోనూ కొందరికి క్యాన్సర్‌ ముప్పు పెరగొచ్చు.

4 కొన్ని రొమ్ము సమస్యలు

క్షీరనాళాల్లో లేదా క్షీరగ్రంథుల గోడల్లో కణాలు ఎక్కువగా, అసాధారణ ఆకృతిలో పెరగటం (అటిపికల్‌ హైపర్‌ప్లేసియా లేదా లోబ్యులర్‌ నియోప్లేసియా) మూలంగానూ క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉండొచ్చు.

5 అధిక బరువు

నెలసరి నిలిచాక అధిక బరువు, ఊబకాయంతో రొమ్ముక్యాన్సర్‌ ముప్పు పెరిగే అవకాశముంది. అంతకు ముందు నుంచే అధిక బరువు గలవారికి ముప్పు ఇంకాస్త ఎక్కువ. సాధారణంగా ముట్లుడిగాక అండాశయాలు ఈస్ట్రోజెన్‌ ఉత్పత్తిని నిలిపేస్తాయి. అయితే అధిక బరువు గలవారిలో నెలసరి నిలిచిన తర్వాతా ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ స్థాయులు ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే అండాశయాలే కాదు.. కొవ్వు కణజాలమూ ఈస్ట్రోజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది రొమ్ముక్యాన్సర్‌ వృద్ధిలో పాలు పంచుకుంటుంది. ఊబకాయంతో ఇన్సులిన్‌ వంటి ఇతర హార్మోన్ల మోతాదులూ అస్తవ్యస్తమవుతాయి. ఇవీ క్యాన్సర్‌ ముప్పు పెరిగేలా చేయొచ్చు.

* ఏ వయసులోనైనా బరువు అదుపులో ఉంచుకోవటం కీలకం. నెలసరి నిలిచాక బరువు పెరగకుండా చూసుకోవటం మరింత ముఖ్యం.

6 బద్ధక జీవనశైలి

శారీరక శ్రమ, వ్యాయామం చేయకపోవటమూ రొమ్ముక్యాన్సర్‌కు దారితీయొచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారికి క్యాన్సర్లు వచ్చే అవకాశం తక్కువని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అంతగా కదలకుండా బద్ధకంగా ఉండిపోతే బరువు పెరుగుతుంది. దీంతో హార్మోన్ల మోతాదులు అస్తవ్యస్తమవుతాయి. రోగనిరోధక వ్యవస్థ కూడా గాడి తప్పుతుంది. ఫలితంగా క్యాన్సర్‌ ముప్పూ పెరుగుతుంది.

* క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మంచిది. రోజుకు కనీసం 20-30 నిమిషాల చొప్పున.. వారానికి 150 నిమిషాల సేపు వ్యాయామం చేయాలని మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. ఇందులో 10 నిమిషాల సేపు పక్కవారితో మాట్లాడితే ఆయాసం వచ్చేంత తీవ్రంగా, శరీరం వేడెక్కెలా వ్యాయామం చేయాలి. వేగంగా నడవటం, పరుగెత్తటం, ఈత వంటి వ్యాయామాలేవైనా చేయొచ్చు. టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌, రింగ్‌బాల్‌, వాలీబాల్‌ వంటి ఆటలూ ఆడొచ్చు.

7 పొగ, మద్యం అలవాట్లు

పొగ తాగటమూ రొమ్ముక్యాన్సర్‌కు దోహదం చేయొచ్చు. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా రొమ్ముక్యాన్సర్‌ వచ్చి ఉంటే పొగ అలవాటుతో ముప్పు ఇంకాస్త ఎక్కువవుతుంది కూడా. ఎంత ఎక్కువ కాలం నుంచి సిగరెట్లు కాలుస్తుంటే అంత ప్రమాదం ఎక్కువ. పొగ అలవాటు మానేసిన 20 ఏళ్ల తర్వాతా ముప్పు పొంచి ఉంటుంది. అలాగే మద్యంతోనూ క్యాన్సర్‌ తలెత్తే అవకాశముంది. దీనికి కారణమేంటన్నది తెలియదు గానీ మద్యం మూలంగా ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ వంటి హార్మోన్లు అస్తవ్యస్తమవుతాయి. ఇది రొమ్ముక్యాన్సర్‌ ముప్పు పెరగటానికి దారితీస్తుంది. ఇటీవలి కాలంలో యువతుల్లోనూ పొగ, మద్యం అలవాట్లు పెరుగుతున్న నేపథ్యంలో వీటిని గుర్తుంచుకోవటం ముఖ్యం.

* సిగరెట్లు, మద్యం జోలికి వెళ్లకపోవటం ఉత్తమం. ఒకవేళ అలవాటుంటే వెంటనే మానెయ్యాలి. ఇతరులు వదిలిన పొగను పీల్చకుండా చూసుకోవాలి.

8 ఆలస్యంగా సంతానం, సంతాన రాహిత్యం

పిల్లలను ఎప్పుడు కనాలనేది ఇష్టాన్ని బట్టి ఉండొచ్చు గానీ ఆలస్యంగా సంతానం కనేవారికి, అసలు సంతానమే కలగనివారికి రొమ్ముక్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువ. ఇలాంటివారిలో రొమ్ముకణజాలం ఈస్ట్రోజెన్‌ ప్రభావానికి అధికంగా గురవుతుంది. ఫలితంగా రొమ్ముక్యాన్సర్‌ ముప్పు పెరుగుతుంది. గర్భధారణతో ఇది తగ్గే అవకాశముంది. గర్భధారణ సమయంలో తలెత్తే హార్మోన్ల మార్పులు సైతం రొమ్ము కణజాలానికి చాలాకాలం రక్షణగా నిలుస్తాయి. అంతేకాదు.. గర్భం ధరించినప్పుడు మంచి పోషకాహారం తినటం, దురలవాట్లకు దూరంగా ఉండటమూ మేలు చేస్తాయి. అయితే వయసుతో నిమిత్తం లేకుండా కాన్పు తర్వాత తాత్కాలికంగా రొమ్ముక్యాన్సర్‌ ముప్పు పెరగొచ్చనీ కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాకపోతే ఇది చాలా స్వల్పం. కాలం గడుస్తున్నకొద్దీ తగ్గుతూ వస్తుంది కూడా.

* వీలైనంతవరకు 30 ఏళ్లు, అంతకన్నా ముందు సంతానం కలిగేలా చూసుకోవటం మంచిది.

9 బిడ్డకు పాలు పట్టకపోవటం

కొందరు బిడ్డకు చనుబాలు పట్టటాన్ని నామోషీగా భావిస్తుంటారు. ఇది మంచిది కాదు. చనుబాలు పట్టటం ద్వారా రొమ్ముక్యాన్సర్‌ ముప్పును కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఎంత ఎక్కువ కాలం పాలు పడితే అంత ముప్పు తగ్గుతుంది. దీనికి కారణం ఒంట్లో హార్మోన్ల మోతాదులు సమతులంగా ఉండటమేనని భావిస్తున్నారు. చనుబాలు పట్టటం వల్ల రొమ్ము కణజాలంలో క్యాన్సర్‌ బారినపడకుండా కాపాడే మార్పులు సంభవిస్తున్నట్టూ తేలింది. 

* శిశువులకు ఆర్నెల్ల వరకు తల్లిపాలు తప్ప మరేవీ ఇవ్వకూడదని మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఆర్నెల్ల తర్వాత ఘనాహారం ఆరంభించినా రెండేళ్ల వరకూ తల్లిపాలు పట్టాలి.

10 గర్భనిరోధక మాత్రలు, హార్మోన్ల చికిత్స

ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్లు రెండూ కలిసి ఉండే గర్భనిరోధక మాత్రలు (పిల్‌) సురక్షితమే అయినా వీటితో కొద్దిగా రొమ్ముక్యాన్సర్‌ ముప్పు పెరగొచ్చు. అయితే వీటి వాడకం ఆపేసిన కొద్ది సంవత్సరాల తర్వాత ముప్పు చాలావరకు తగ్గిపోతుంది. నెలసరి నిలిచాక కొందరికి వేడి ఆవిర్ల వంటి ఇబ్బందులు మొదలవుతుంటాయి. ఇవి తగ్గటానికి హార్మోన్ల భర్తీ చికిత్స ఉపయోగ పడుతుంది. కానీ దీంతో స్వల్పంగా రొమ్ముక్యాన్సర్‌ ముప్పు పెరగొచ్చు. ఒక్క ఈస్ట్రోజెన్‌ తీసుకునేవారితో పోలిస్తే ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ రెండూ తీసుకునేవారికిది మరింత ఎక్కువ. హార్మోన్‌ చికిత్స ఆపేశాక ముప్పు మునుపటి స్థితికి చేరుకోవటానికి కనీసం పదేళ్లయినా పడుతుంది. ఎంతకాలం చికిత్స తీసుకున్నారనేదీ ముప్పు పెరగటంపై ప్రభావం చూపుతుంది.

* గర్భనిరోధక మాత్రలు వాడే ముందు విధిగా డాక్టర్‌ సలహా తీసుకోవాలి. హార్మోన్‌ చికిత్స తీసుకునేటప్పుడూ లాభనష్టాలు బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలి.

11 కుటుంబ చరిత్ర

రక్త సంబంధీకుల్లో ఎవరైనా రొమ్ముక్యాన్సర్‌ బాధితులు ఉంటే తమకూ వస్తుందేమోనని కొందరు భయపడుతుంటారు. ఇది పూర్తిగా నిజం కాదు. దీని బారినపడుతున్న చాలామందికి ఎలాంటి జన్యుపరమైన చరిత్రా ఉండటం లేదు. అయితే కొందరికి వచ్చే అవకాశముంది. ముఖ్యంగా బ్రాకా-1, బ్రాకా-2 జన్యువులు గలవారికి ముప్పు ఎక్కువ. ఈ జన్యువులు ఉన్నా కూడా అందరికీ రావాలనేమీ లేదు. రక్త సంబంధీకుల్లో- ఒకరు, ఒకరికన్నా ఎక్కువమంది 40 ఏళ్లు లోపే రొమ్ముక్యాన్సర్‌ బారినపడ్డా.. ఏ వయసులోనైనా ఇద్దరు, అంతకన్నా ఎక్కువమందికి రొమ్ముక్యాన్సర్‌ వచ్చినా.. ఎవరైనా ఒకరు రొమ్ముక్యాన్సర్‌, మరొకరు అండాశయ క్యాన్సర్‌ బారినపడ్డా.. ఎవరికైనా రెండు రొమ్ముల్లో క్యాన్సర్‌ లేదా రొమ్ముక్యాన్సర్‌, అండాశయ క్యాన్సర్‌ రెండూ తలెత్తినా.. మగవారిలో ఎవరికైనా రొమ్ముక్యాన్సర్‌ వచ్చినా ముప్పు పెరిగే ప్రమాదముంది.

* రొమ్ముక్యాన్సర్‌కు దారితీసే జన్యువులను గుర్తించటానికి తేలికైన రక్తపరీక్ష అందుబాటులో ఉంది. కాకపోతే ఖరీదు ఎక్కువ. ఈ పరీక్ష పాజిటివ్‌గా ఉంటే జీవితకాలంలో రొమ్ముక్యాన్సర్‌, అండాశయ క్యాన్సర్‌ ముప్పు ఎక్కువుందనే అర్థం. ఇలాంటివారికి ముందు జాగ్రత్తగా మెనోపాజ్‌కు ముందే శస్త్రచికిత్సతో రొమ్ములు, అండాశయాలు, ఫలోపియన్‌ గొట్టాలు తొలగించే పద్ధతి ఉన్నప్పటికీ.. మందులు, నిశిత పరిశీలన వంటివీ మేలు చేస్తాయి. టామోక్సిఫెన్‌ మందును ఐదేళ్ల వరకు తీసుకుంటే ముప్పు చాలావరకు తగ్గుతుంది. రొమ్ముక్యాన్సర్‌ హార్మోన్‌ రిసెప్టర్‌ పాజిటివ్‌గా ఉన్నవారికి దీన్ని చాలాకాలంగా వాడుతున్నారు. మనదగ్గర రొమ్ముక్యాన్సర్‌ జన్యు క్లినిక్‌లు, కేంద్రాలు అంతగా అందుబాటులో లేకపోవటం వల్ల నిశిత పరిశీలనే చాలా ముఖ్యం. దీంతో ముప్పును తగ్గించుకోలేకపోవచ్చు గానీ క్యాన్సర్‌ను ముందే పట్టుకోవచ్చు. క్యాన్సర్‌ జన్యు స్వభావం గలవారు 25 ఏళ్ల వయసు నుంచి రొమ్ముల ఎంఆర్‌ఐ, మామోగ్రామ్‌ పరీక్షలు చేయించుకోవాలి. ఎంఆర్‌ఐ చేసిన 6 నెలలకు మామోగ్రామ్‌.. ఆ తర్వాత 6 నెలలకు ఎంఆర్‌ఐ.. ఇలా మార్చి మార్చి చేయించుకోవాలి. ఒకవేళ రక్త సంబంధీకుల్లో ఎవరికైనా చిన్నవయసులోనే రొమ్ముక్యాన్సర్‌ వస్తే- వారిలో ఏ వయసులో జబ్బు నిర్ధరణ అయితే అంతకన్నా పదేళ్ల ముందు నుంచే నిశిత పరిశీలన ఆరంభించాలి.


రొమ్ముల తీరుపై కన్ను

రొమ్ముకాన్సర్‌ను ఎదుర్కొనే సమర్థమైన మార్గం వీలైనంత త్వరగా గుర్తించటమే. అందువల్ల ముప్పు కారకాలు ఉన్నా లేకపోయినా రొమ్ముల తీరును గమనిస్తూ ఉండటం మంచిది.

* రొమ్ములు, చనుమొనల సైజు, ఆకారంలో మార్పులు.. చర్మం మీద, చనుమొనల చుట్టూ ఎరుపు లేదా దద్దు.. కొత్తగా ఎక్కడైనా మందంగా, గట్టిగా తగలటం.. చనుమొనలు లోపలికి లాక్కుపోవటం, మొనల నుంచి రక్తం రావటం.. రొమ్ముల మీద సొట్ట/గుంట.. చంకల్లో లేదా కంటె ఎముక చుట్టూరా గడ్డల్లాంటి వాపు.. రొమ్ముల్లో లేదా చంకల్లో విడవకుండా నొప్పి వంటివి కనిపిస్తే నిర్లక్ష్యం  చేయొద్దు.


ముందస్తు పరీక్షలు కూడా

నలబై ఏళ్లు దాటిన మహిళలంతా ఏటా.. కనీసం రెండేళ్లకు ఒకసారైనా మామోగ్రామ్‌ పరీక్ష చేయించుకోవటం మంచిది. దీంతో క్యాన్సర్‌ ఆనవాళ్లను ముందే పట్టుకోవచ్చు.


గడ్డలున్నా..

రొమ్ములో గడ్డలన్నీ క్యాన్సర్‌ కాకపోవచ్చు. చేత్తో తాకి పరిశీలించటం.. మామోగ్రామ్‌, అల్ట్రాసౌండ్‌.. అల్ట్రాసౌండ్‌ సాయంతో సూది ద్వారా గడ్డలోంచి చిన్న ముక్క తీసి పరీక్షించటం.. ఇలా మూడు పద్ధతుల్లో (ట్రిపుల్‌ అసెస్‌మెంట్‌) క్యాన్సర్‌ను నిర్ధారించాల్సి ఉంటుంది. దీంతో అనవసర శస్త్రచికిత్సలను తప్పించుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని