కరోనా తగ్గినా...

ఇప్పుడు కొవిడ్‌-19 మనకు కొత్తదేమీ కాదు. అలాగని పూర్తిగా అవగతమైనదీ కాదు. దీనికి కారణమయ్యే సార్స్‌-కొవీ-2 జ్ఞానేంద్రియాలైన ముక్కు, నాలుక, కళ్లు, చెవులు, చర్మం మీద విపరీత ప్రభావమే చూపుతోంది. అదీ ఇన్‌ఫెక్షన్‌ తగ్గిన చాలా రోజుల వరకూ. కాకపోతే వీటితో ముడిపడిన సమస్యలు కొవిడ్‌ దుష్ప్రభావాలన్న సంగతే చాలామందికి అవగతం కావటం లేదు.

Published : 19 Oct 2021 01:21 IST

కొవిడ్‌ - దుష్పరిణామాలు

ఇప్పుడు కొవిడ్‌-19 మనకు కొత్తదేమీ కాదు. అలాగని పూర్తిగా అవగతమైనదీ కాదు. దీనికి కారణమయ్యే సార్స్‌-కొవీ-2 జ్ఞానేంద్రియాలైన ముక్కు, నాలుక, కళ్లు, చెవులు, చర్మం మీద విపరీత ప్రభావమే చూపుతోంది. అదీ ఇన్‌ఫెక్షన్‌ తగ్గిన చాలా రోజుల వరకూ. కాకపోతే వీటితో ముడిపడిన సమస్యలు కొవిడ్‌ దుష్ప్రభావాలన్న సంగతే చాలామందికి అవగతం కావటం లేదు.

యటి ప్రపంచంతో మనల్ని అనుసంధానం చేసేవి జ్ఞానేంద్రియాలే. కళ్లతో దృశ్యాలు, చుట్టుపక్కల జరుగుతున్న సంఘటనలను గుర్తిస్తాం. మాటలు, పాటలు.. ఒక్కటేమిటి సమస్త శబ్ద ప్రపంచాన్ని పరిచయం చేసేవి చెవులే. పూవుల పరిమళం కావొచ్చు, కమ్మటి భోజనమైనా కావొచ్చు. ఎలాంటి వాసనలనైనా ఆఘ్రాణించటానికి ముక్కు తోడ్పడితే.. నాలుక అన్ని రుచులనూ ఆస్వాదింపజేస్తుంది. చర్మం ఒక్క స్పర్శతోనే అమ్మ గుండె వెచ్చదనం, అమ్మమ్మ చేతి ఆత్మీయత వంటి వాటిని తెలియజేస్తుంది. ఇంతటి కీలకమైనవైనా మనం జ్ఞానేంద్రియాలను ప్రత్యేకించి పట్టించుకోం. చూపు, వినికిడి వంటి వాటిని ఆయాచిత వరాలుగానే భావిస్తుంటాం. ఏదైనా సమస్య మొదలైతే గానీ వీటి గొప్పతనమేంటో తెలిసిరాదు. కొవిడ్‌-19 బారినపడ్డ చాలామందికిది అవగతమయ్యే ఉంటుంది. ఉన్నట్టుండి రుచి, వాసన పోయి ఎంతమంది ఇబ్బంది పడ్డారో. ఇవే కాదు.. చాలామందిలో వినికిడి, స్పర్శ, చూపు సైతం మందగిస్తున్నాయి. కొందరికివి శాశ్వతంగానూ పోతుండటం ఆందోళనకరం. జ్ఞానేంద్రియాలు దెబ్బతింటే చుట్టుపక్కల వారితో, సమాజంతో సంబంధ బాంధవ్యాలూ అస్తవ్యస్తమవుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే- కొవిడ్‌-19 మనం లోకాన్ని చూసే తీరును, అర్థం చేసుకునే విధానాన్నీ మార్చేస్తోందన్నమాట. జ్ఞానేంద్రియాలు దెబ్బతినటం వల్ల తలెత్తే సమస్యలు ప్రాణాంతకం కాకపోవచ్చు. కానీ వినికిడి, చూపు వంటివి ఏమాత్రం తగ్గినా నిత్య జీవితంలో ఇబ్బందులు తప్పవు. ఒక్కసారి కళ్లు మూసుకొని ఇంట్లో నడవటానికి ప్రయత్నించి చూడండి. చెవులు మూసుకొని టీవీ చూడండి. ఎదుటి వారు చెప్పేది సరిగా వినిపించకపోతే తలెత్తే బాధ అంతా ఇంతా కాదు. రుచీ పచీ లేని భోజనం ఎవరికైనా సహిస్తుందా? అసలు వాసన తెలియకపోతే గ్యాస్‌ లీకవ్వటం వంటి ప్రమాదాలను గుర్తించగలమా? పాదాలు మొద్దుబారిపోయి, నడుస్తుంటే ఏవో సూదులు పొడుస్తున్నట్టు అనిపిస్తే ఎవరికి మాత్రం బాగుంటుంది? కాబట్టి కొవిడ్‌-19 మూలంగా తలెత్తుతున్న ఇలాంటి జ్ఞానేంద్రియ సమస్యల గురించి తెలుసుకొని ఉండటం మంచిది.


వినికిడి తగ్గటం

తీవ్ర కొవిడ్‌-19 నుంచి బయటపడినప్పటికీ కొందరికి దాని దుష్ప్రభావాలు దీర్ఘకాలం వెంటాడుతూనే వస్తున్నాయి. వినికిడి తగ్గటం వీటిల్లో ఒకటి. ఒకప్పుడు స్పష్టంగా వినిపించే మాటలు మంద్రమైపోతున్నాయి. కొందరికి చెవుల్లో నిరంతరం రింగుమనే మోత (టినిటస్‌) కూడా వినిపిస్తోంది. ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండటం లేదు. కొవిడ్‌-19 బారినపడ్డవారిలో సుమారు 8% మందిలో వినికిడి తగ్గుతున్నట్టు, సుమారు 15% మందిలో టినిటస్‌ తలెత్తుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. వీటికి కారణమేంటన్నది పూర్తిగా తెలియటం లేదు. మధ్య చెవిని, గొంతును అనుసంధానం చేసే యూస్టేషియన్‌ గొట్టం ప్రభావితం కావటం దీనికి కారణమని భావిస్తున్నారు. ఈ గొట్టం చెవిలో పీడనాన్ని నియంత్రిస్తుంది. మధ్య చెవిలో అధికంగా ఉండే ద్రవాలను గొంతులోకి వచ్చేలా చేస్తుంది. ఒక్క కొవిడ్‌ అనే కాదు.. ఏ వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌తోనైనా దీని పనితీరు అస్తవ్యస్తం కావచ్చు. దీంతో మధ్యచెవిలో నీరు పోగుపడి.. కర్ణభేరి మీద ఏదో పెద్ద బరువు పెట్టినట్టు, చెవి దిబ్బడ వేసినట్టు అనిపిస్తుంది. ఇన్‌ఫెక్షన్‌ తగ్గాక యూస్టేషియన్‌ గొట్టంలోంచి ద్రవం బయటకు వచ్చేస్తుంది. వినికిడి మామూలు స్థాయికి చేరుకుంటుంది. ఇందుకు కొన్ని వారాలు పట్టొచ్చు. దిబ్బడ తొలగించే మాత్రలు, ముక్కులోకి కొట్టుకునే స్టిరాయిడ్‌ స్ప్రేలతో మరింత త్వరగా కుదురుకోవటానికి వీలుంటుంది. ఒకవేళ లోపలి చెవి లేదా కాక్లియాలోని నాడులను వైరస్‌ దెబ్బతీస్తే ఉన్నట్టుండి వినికిడి తగ్గొచ్చు. కొందరికి శాశ్వతంగానూ వినికిడి పోవచ్చు. కొవిడ్‌-19లో ఈ నాడులు ఎందుకు దెబ్బతింటున్నాయనేది కచ్చితంగా తెలియటం లేదు గానీ.. వైరస్‌ ఒంట్లో వాపు ప్రక్రియను (ఇన్‌ఫ్లమేషన్‌) విపరీతంగా ప్రేరేపించటం, సూక్ష్మ రక్తనాళాలను దెబ్బతీయటం ఇందుకు కారణం కావొచ్చని అనుకుంటున్నారు. లోపలి చెవి చాలా సున్నితమైంది. ఇది వాపు ప్రక్రియ, సూక్ష్మ రక్తనాళాల సమస్యలకు త్వరగా ప్రభావితమయ్యే అవకాశముంది మరి. కాబట్టే కొవిడ్‌-19 బాధితుల్లో కొందరికిది పెద్ద సమస్యగా మారుతోంది. వినికిడి లోపం తలెత్తిన కొందరికి కాక్లియర్‌ ఇంప్లాంట్‌ అమర్చుకోవాల్సిన అవసరమూ తలెత్తుతోంది.


చూపు మందగించటం

కొవిడ్‌-19 బాధితుల్లో చూపు సమస్యలూ బయలుదేరుతున్నాయి. కాంతిని తట్టుకోలేకపోవటం, కళ్ల మంటలు, చూపు మందగించటం ప్రముఖంగా కనిపిస్తున్నాయి. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందినవారిలో సుమారు 10% మందిలో కళ్ల కలక, చూపులో మార్పులు, దురద వంటి సమస్యలు తలెత్తుతున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. వీటికి మూలం కళ్లలో వైరస్‌ సంఖ్య ఎక్కువగా ఉండటం. అదృష్టం కొద్దీ ఇవన్నీ చాలావరకు తాత్కాలికమైనవే. సార్స్‌-కొవీ-2 రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడటానికి దారితీస్తున్న విషయం తెలిసిందే. ఇవి కంట్లో రెటీనాలోని రక్తనాళాల్లోనూ ఏర్పడొచ్చు. ఇదీ కొంతవరకు చూపు తగ్గేలా చేయొచ్చు. అందువల్ల కొవిడ్‌ నుంచి కోలుకుంటున్న తరుణంలో చూపులో ఎలాంటి మార్పులను గమనించినా వీలైనంత త్వరగా కంటి డాక్టర్‌ను సంప్రదించి పరీక్షించుకోవటం మంచిది. కొన్నిరకాల చూపు సమస్యలు మందులతో నయమయ్యే అవకాశముంది. కాకపోతే ఇది రెటీనా ఎంతవరకు దెబ్బతిన్నదనే దానిపై ఆధారపడి ఉంటుంది.


మొద్దుబారటం

కొవిడ్‌-19 నాడులకూ కష్టాలు తెచ్చిపెడుతోంది. ఇది స్పర్శ తీరునూ దెబ్బతీస్తోంది. ఎంతోమంది చర్మం మొద్దుబారినట్టు, సూదులు పొడుస్తున్నట్టు అనిపించటం, తిమ్మిర్ల వంటి సమస్యల బారినపడుతున్నారు. ఆసుపత్రిలో చేరని వారిలోనూ ఇలాంటివి కనిపిస్తుండటం గమనార్హం. కొవిడ్‌ నుంచి కోలుకున్నాక 6-9 నెలల తర్వాత కూడా సుమారు 60% మందిలో చర్మం మొద్దుబారటం, సూదులతో పొడుస్తున్నట్టు అనిపించటం వంటివి కొనసాగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరికివి కాళ్లు, చేతులకే పరిమితమైతే.. కొందరికి శరీరమంతా ఉంటున్నాయి. ఆయా భాగాల్లోని నాడుల్లో వాపు ప్రక్రియ, ఇన్‌ఫెక్షన్‌ వీటికి కారణమని భావిస్తున్నారు. చాలామందిలో రాన్రానూ మొద్దుబారటం తగ్గుతూ వస్తోంది. కొందరికి త్వరగా తగ్గితే, కొందరికి ఎక్కువ సమయం పడుతోంది. కొందరికి మందుల అవసరమూ ఉంటోంది. మూర్ఛ, నాడుల నొప్పులు తగ్గటానికి తోడ్పడే గాబాపెంటిన్‌ వంటి మందులతో మంచి ఫలితం కనిపిస్తోంది. అందువల్ల కొవిడ్‌ అనంతరం కాళ్లు, చేతులు మొద్దుబారటం.. పాదాల్లో సూదులు పొడుస్తున్నట్టు అనిపించటం వంటివి కనిపిస్తే తాత్సారం చేయటం తగదు.


రుచి, వాసన తగ్గటం

కొవిడ్‌ బారినపడ్డ చాలామందిలో రుచి, వాసన తగ్గటం చూస్తున్నదే. ఇవి కొవిడ్‌ ముఖ్య లక్షణాలుగానూ మారిపోయాయి. ఇన్‌ఫెక్షన్‌ తగ్గినా కొందరికివి దీర్ఘకాలం కొనసాగుతూ వస్తున్నాయి కూడా. వైరల్‌ ఇన్‌ఫెక్షన్లతో వాసన తగ్గటం కొత్త విషయమేమీ కాదు. అయితే ఇతర ఇన్‌ఫెక్షన్లతో పోలిస్తే కొవిడ్‌లో ఇది చాలా ఎక్కువగా ఉంటుండటం గమనార్హం. కొవిడ్‌ బాధితుల్లో దాదాపు 41% మందిలో వాసన, 38% మందిలో రుచి తగ్గుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఘ్రాణశక్తి తగ్గటాన్ని అనాస్మియా అంటారు. కొవిడ్‌లో ఒకే సమయంలో రకరకాల వాసనలు పోతున్నాయి. కొందరికి అసలు ఎలాంటి వాసనలూ తెలియటం లేదు. ఇది రెండు రకాలుగా తలెత్తొచ్చు. ముక్కు దిబ్బడ మూలంగా వాసనలకు కారణమయ్యే అణువులు ముక్కు మార్గంలోకి వెళ్లకపోవచ్చు. దీంతో వాసన తెలియకపోవచ్చు (కండక్టివ్‌ అనాస్మియా). ముక్కు పైభాగంలోని నాడులు దెబ్బతినటం, వీటి పనితీరు అస్తవ్యస్తం కావటంతోనూ వాసనలు పోవచ్చు (సెన్సరీన్యూరల్‌ అనాస్మియా). కొవిడ్‌ బాధితుల్లో చాలామందిలో ముక్కు లక్షణాలేవీ పెద్దగా ఉండటం లేదు. అయినా ఘ్రాణశక్తి గణనీయంగా తగ్గుతుండటం విచిత్రం. దీనికి కారణం ముక్కు పైభాగంలో వాసనలు పసిగట్టే నాడులు దెబ్బతినటమే. కొవిడ్‌ నుంచి కోలుకుంటున్నకొద్దీ పునరుత్తేజిత నాడీ కణాలు ప్రేరేపితమవుతాయి. ఇవి కొత్త నాడీ కణాలు పుట్టుకొచ్చేలా చేస్తాయి. దీంతో వాసన శక్తి తిరిగి వస్తుంది. ఇందుకు 6-8 వారాలు పట్టొచ్చు.  కొందరికి ఇంకాస్త ఎక్కువ కాలమూ పట్టొచ్చు. ఇలాంటివారికి స్టిరాయిడ్‌ మాత్రలు, ముక్కులోకి కొట్టుకునే స్టిరాయిడ్‌ స్ప్రేలు ఉపయోగపడతాయి. కొందరికి వివిధ రకాల సుగంధ తైలాలను వాసన చూపించే చికిత్స అవసరమవ్వచ్చు. దీంతో మెదడులో కొత్త అనుసంధానాలు ఏర్పడతాయి. క్రమంగా ఘ్రాణ శక్తి పుంజుకుంటుంది. వాసన, రుచి ఒకదాంతో మరోటి ముడిపడి ఉంటాయి. వాసన తగ్గితే రుచీ తగ్గుతుంది. వాసన తిరిగి వస్తే రుచీ మెరుగవుతుంది. నాడులు తీవ్రంగా దెబ్బతింటే కొందరికి మందులు, చికిత్సలేవీ పనిచేయకపోవచ్చు. ఘ్రాణశక్తి తిరిగి రాకపోవచ్చు. దీంతో వంటింట్లో గ్యాస్‌ వెలువడటం వంటివి పసిగట్ట లేకపోవచ్చు. ఆయా పదార్థాలను ఆస్వాదించలేకపోవటం వల్ల కుంగుబాటుకూ లోనవ్వచ్చు. కాబట్టి ముందుగానే మేల్కోవటం మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని