కాలేయ మేహం

మధుమేహంపై మన ఆలోచనా ధోరణి మారుతోంది. ఇన్నాళ్లూ మధుమేహానికి మూలం క్లోమగ్రంథే అనుకుంటున్నాం. నిజానికి కాలేయమే అసలు సిసలు కారణమనే భావన పుంజుకుంటోంది. కాలేయానికి కొవ్వు పట్టటం (ఫ్యాటీ లివర్‌) వల్ల గ్లూకోజు స్థాయులు పెరుగుతుండటం.. కొవ్వు తగ్గితే గ్లూకోజు అదుపులోకి వస్తుండటం పరిశోధకులనూ ఆలోచింపజేస్తోంది. మధుమేహం, ఫ్యాటీ లివర్‌ రెండూ కలిస్తే కాలేయ క్యాన్సర్‌

Updated : 23 Nov 2021 06:34 IST

మధుమేహంపై మన ఆలోచనా ధోరణి మారుతోంది. ఇన్నాళ్లూ మధుమేహానికి మూలం క్లోమగ్రంథే అనుకుంటున్నాం. నిజానికి కాలేయమే అసలు సిసలు కారణమనే భావన పుంజుకుంటోంది. కాలేయానికి కొవ్వు పట్టటం (ఫ్యాటీ లివర్‌) వల్ల గ్లూకోజు స్థాయులు పెరుగుతుండటం.. కొవ్వు తగ్గితే గ్లూకోజు అదుపులోకి వస్తుండటం పరిశోధకులనూ ఆలోచింపజేస్తోంది. మధుమేహం, ఫ్యాటీ లివర్‌ రెండూ కలిస్తే కాలేయ క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అందుకే ఇప్పుడు మధుమేహ చికిత్సలో కాలేయం తీరుతెన్నులకు రోజురోజుకీ ప్రాధాన్యం పెరుగుతోంది. ఫ్యాటీ లివర్‌ తగ్గటానికీ మధుమేహ మందులు తోడ్పడుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో మధుమేహానికీ కాలేయానికీ గల సంబంధంపై సమగ్ర కథనం అందిస్తోంది సుఖీభవ.

ధుమేహం అనగానే ముందుగా క్లోమగ్రంథే (పాంక్రియాస్‌) గుర్తుకొస్తుంది. దీన్నుంచి విడుదలయ్యే ఇన్సులిన్‌ హార్మోన్‌ కణాల్లోకి గ్లూకోజు వెళ్లేలా చేస్తూ.. రక్తంలో గ్లూకోజు నియంత్రణలో ఉండటానికి తోడ్పడుతుంది. తగినంత ఇన్సులిన్‌ ఉత్పత్తి కాకపోయినా, కణాలు ఇన్సులిన్‌కు స్పందించకపోయినా (ఇన్సులిన్‌ నిరోధకత) గ్లూకోజు కణాల్లోకి చేరుకోదు. ఫలితంగా రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరుగుతూ వస్తుంటాయి. ఇన్సులిన్‌ నిరోధకత మూలంగానే చాలామంది మధుమేహం బారినపడుతున్నారు. ఈ ప్రక్రియ ముందుగా కాలేయంలోనే మొదలవుతుండటం.. దీనికి కాలేయంలో కొవ్వు పోగుపడటం (ఫ్యాటీ లివర్‌) బీజం వేస్తుండటం గమనార్హం. కణాలు, కణజాలాలు, కండరాలు పని చేయటానికి శక్తి అవసరం. ఇది గ్లూకోజు నుంచే లభిస్తుంది. మూడింట రెండొంతుల గ్లూకోజును తయారుచేసేది కాలేయమే. ఇది గ్లూకోజుతో పాటు కొవ్వు, మాంసకృత్తులనూ విడుదల చేస్తుంది. రోజులో 18 గంటల పాటు కాలేయం ఈ పనిలోనే నిమగ్నమై ఉంటుంది. మనం శరీర అవసరాల కన్నా ఎక్కువగా తినటం, అంతగా శారీరక శ్రమ చేయకపోవటం వల్ల కండరాలు తగినంత శక్తిని వినియోగించుకోవు. దీంతో శరీరం గ్లూకోజును కొవ్వుగా మార్చుకొని, కాలేయంలో దాచుకోవటం ఆరంభిస్తుంది. శరీరంలోని చాలా కణజాలాల్లో కొవ్వు నిల్వ ఉంటుంది గానీ ప్రధానంగా కాలేయంలోనే పోగుపడుతుంది. కాలేయ కణాల్లో ఎంతో కొంత కొవ్వు ఉండటం సహజమే. కాలేయం సుమారు 1200 గ్రాముల బరువుంటుంది. ఇందులో కొవ్వు పదార్థం 5% లోపే. కానీ మనదేశంలో మధుమేహం ఉన్నా లేకపోయినా దాదాపు ప్రతి నలుగురిలో ఒకరికి కాలేయంలో కొవ్వు 5% కన్నా ఎక్కువగానే ఉంటోంది. మధుమేహుల్లోనైతే ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఫ్యాటీ లివర్‌ గలవారే! అధిక బరువు, ఊబకాయం గలవారిలోనూ ఇది ఎక్కువే. కొవ్వు పోగుపడుతున్నకొద్దీ కాలేయం బరువు, పరిమాణం పెరుగుతూ వస్తాయి. మధుమేహంలో మొట్టమొదటి అవ లక్షణం ఇదే. కొవ్వు మూలంగా కాలేయ కణాలు ఇన్సులిన్‌కు స్పందించవు. దీంతో కణాల్లోకి గ్లూకోజు చేరుకోవటం తగ్గుతుంది. లోపల నిల్వ ఉంచుకోవాల్సిన గ్లూకోజును కాలేయం బయటకు పంపించేస్తుంది. ఫలితంగా రక్తంలో గ్లూకోజు పెరుగుతుంది. మరోవైపు- కొవ్వు 10% కన్నా మించితే కాలేయం దాన్ని అక్కడ్నుంచి బయటకు పంపిస్తుంది. క్లోమంలో, కండరాల్లో, రక్తనాళాల లోపలి పొరల్లో.. ఎక్కడైనా ఈ కొవ్వు పోగుపడొచ్చు. దీంతో వీటి పనితీరూ అస్తవ్యస్తమవుతుంది. కండరాల్లో ఇన్సులిన్‌ నిరోధకత తలెత్తి, గ్లూకోజును స్వీకరించటం తగ్గుతుంది. రక్తనాళాల్లో కొవ్వు పూడికలతో గుండెజబ్బులు, పక్షవాతం, కిడ్నీ జబ్బుల వంటివీ బయలుదేరతాయి. అందుకే మధుమేహుల్లో కాలేయం పనితీరుపై ఇప్పుడు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.

కాలేయ క్యాన్సర్‌ పెద్ద ముప్పు

ఫ్యాటీ లివర్‌తో ఇన్సులిన్‌ పెరగటం, ఇతర భాగాల్లో కొవ్వు పేరుకోవటం ఒక ఎత్తయితే కాలేయ క్యాన్సర్‌ తలెత్తటం మరో ఎత్తు. కాలేయంలో కొవ్వు ఎక్కువైనప్పుడు కణజాలం మృదుత్వం కోల్పోతుంది. పోచలుగా మారటం (ఫైబ్రోసిస్‌) ఆరంభమవుతుంది. ఒకరకంగా దీన్ని రక్షణ ఏర్పాటనే అనుకోవచ్చు. కాలేయ కణాల్లోని కొవ్వును శరీరం తనది కాని పదార్థంగా భావిస్తుంది. దీన్ని ఎలాగైనా బయటకు నెట్టాలనే ప్రయత్నంలో రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుంది. తెల్ల రక్తకణాలను పురమాయించి కొవ్వు మీద దాడికి దిగుతుంది. ఇది కాలేయ కణాలనూ దెబ్బతీస్తుంది. దీని ప్రభావాన్ని తప్పించుకోవటానికే కాలేయం గట్టిపడటం ఆరంభిస్తుంది. ఇది ముదిరితే రాయిలా మరింత గట్టిపడుతుంది (సిర్రోసిస్‌). దీంతో కాలేయ క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుంది. మనదేశంలో కాలేయం దెబ్బతినటానికి 70% వరకు హెపటైటిస్‌ బి, హెపటైటిస్‌ సి ఇన్‌ఫెక్షన్లే కారణం. మిగతా కాలేయ జబ్బులకు మద్యం, ఫ్యాటీ లివర్‌ కారణమవుతున్నాయి. ఫ్యాటీ లివర్‌తో చిక్కేటంటే- దీంతో 30-50% మందికి క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉండటం. మధుమేహం గలవారికి మద్యం అలవాటూ ఉంటే కాలేయ క్యాన్సర్‌ ముప్పు 9 రెట్లు ఎక్కువవుతుంది. మధుమేహంతో పాటు హెపటైటిస్‌ సి ఉంటే 9 రెట్లు.. హెపటైటిస్‌ బి ఉంటే 3 రెట్లు ఎక్కువగా క్యాన్సర్‌ వచ్చే అవకాశముంది.

ఎప్పుడో గుర్తించినా..

మధుమేహానికీ కాలేయానికీ అవినాభావ సంబంధం ఉంటోందనే సంగతి యాబై ఏళ్ల క్రితమే బయటపడింది. ప్రపంచంలో తొలిసారిగా 1960ల్లోనే మనదేశంలో మధుమేహంతో మరణిస్తున్నవారి సమాచారాన్ని విశ్లేషించారు. వీరిలో 9% మంది కాలేయ జబ్బుతో మరణిస్తున్నట్టు అప్పట్లోనే గుర్తించారు. మన వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు అప్పుట్నుంచే దీనిపై నిశితంగా దృష్టి సారించారు. అనంతరం విదేశీ శాస్త్రవేత్తలు సైతం క్లోమం, కాలేయం, కొవ్వు కణాలు.. ఈ మూడింటి మార్పులతో మధుమేహం వస్తున్నట్టు గుర్తించారు. దీన్నే ‘ట్రెడిషనల్‌ ట్రయాడ్‌’ అని పిలుచుకునేవారు. ప్రస్తుతం వీటితో పాటు పదకొండుకు పైగా అవయవాల్లో తలెత్తే మార్పులకు సంబంధించిన జబ్బుగా (ఎగ్రిగియస్‌ ఎలెవన్‌) మధుమేహాన్ని పరిగణిస్తున్నారు. వీటిల్లో అన్నింటికన్నా ప్రధానమైనవి కాలేయ మార్పులే. అయినా వీటికి అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. మధుమేహాన్ని గుండె, రక్తనాళాలతో ముడిపడిన జీవక్రియల (కార్డియో మెటబాలిక్‌) జబ్బుగానే భావిస్తూ వస్తున్నారు. ఇప్పుడిప్పుడే కాలేయ జీవక్రియ (హెపటో మెటబాలిక్‌) జబ్బుగా గుర్తిస్తున్నారు. అధునాతన పరీక్షలు అందుబాటులోకి రావటం దీనికి మార్గం సుగమం చేసింది. అల్ట్రాసౌండ్‌ పరీక్షతో కాలేయం ఉపరితలాన్ని పరిశీలించటం.. క్రమంగా కాలేయ పరిమాణం, రూపురేఖలు, బరువు, లోపల చేరిన కొవ్వును కొలిచే సామర్థ్యం అబ్బింది. అప్పటివరకూ కాలేయం దెబ్బతినటానికి మద్యం కారణమనే భావనే ఉండేది. పిత్తాశయ,  పైత్యరస సమస్యలూ కారణాలుగా భావిస్తుండేవారు. అల్ట్రాసౌండ్‌ పరీక్ష అందుబాటులోకి వచ్చాక కొవ్వు పేరుకోవటంతోనూ కాలేయం దెబ్బతింటున్నట్టు.. నాన్‌ ఆల్కహాటిక్‌ ఫ్యాటీ లివర్‌ జబ్బు (ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ), నాన్‌ ఆల్కహాలిక్‌ స్టియాటిక్‌ హెపటైటిస్‌ (నాష్‌) సమస్యలు తలెత్తుతున్నట్టు గుర్తించటం సాధ్యమైంది. అల్ట్రాసౌండ్‌ పరీక్షను మరింత మెరుగులు దిద్ది ‘ఫైబ్రో స్కాన్‌’నూ రూపొందించారు. ఇది కాలేయం మృదుత్వాన్ని కొలుస్తుంది. దీంతోనూ కొత్త కొత్త విషయాలు తెలవటం మొదలైంది.

పసిగట్టొచ్చా?

కాలేయం దెబ్బతింటున్న విషయాన్ని ముందుగా గుర్తించే అవకాశం లేకపోలేదు. అల్ట్రాసౌండ్‌, ఫైబ్రోస్కాన్‌ పరీక్షలతో తొలిదశలోనే దీని ఆనవాళ్లను పట్టుకోవచ్చు. కాలేయ సామర్థ్య పరీక్షతోనూ దీన్ని గుర్తించొచ్చు. కాలేయం దెబ్బతింటోందనటానికి కాలేయ ఎంజైమ్‌లు (ఎస్‌జీఓటీ, ఎస్‌జీపీటీ) పెరగటమే మొట్టమొదటి లక్షణం. కాలేయం మీద రోగనిరోధకశక్తి దాడి చేస్తున్నప్పుడు ముందుగా పెరిగేవి ఇవే. ఇప్పుడు ఎస్‌జీపీటీని ఏఎల్‌టీ, ఎస్‌జీఓటీని ఏఎస్‌టీ అని అంటున్నారు. ఏఎల్‌టీ 40 యూనిట్ల వరకు ఉండొచ్చని అనుకునేవారు. కాలేయంలో కొవ్వు సమస్యను గుర్తించాక ఇది 30 యూనిట్ల కన్నా మించకూడదనే భావిస్తున్నారు. అంతకన్నా పెరిగితే కాలేయ జబ్బు వచ్చే ప్రమాదముందనే అర్థం. ముఖ్యంగా మధుమేహుల్లో కాలేయ ఎంజైమ్‌లు ఎక్కువైతే లివర్‌ క్యాన్సర్‌ ఉందేమోనని అనుమానించాల్సి ఉంటుంది. ఏఎల్‌టీ 30 దాటితే జాగ్రత్త పడాల్సిందే.
 ఫిబ్‌-4 పరీక్ష: అల్ట్రాసౌండ్‌, ఫైబ్రోస్కాన్‌ పరికరాలు అందుబాటులో లేకపోయినా కాలేయ సామర్థ్య పరీక్ష, సంపూర్ణ రక్త పరీక్ష ఫలితాలతోనూ ప్యాటీ లివర్‌ ముప్పును తెలుసుకోవచ్చు. ఇందులో ఏఎస్‌టీ, ఏఎల్‌టీ, ప్లేట్‌లెట్లు, వయసు ఆధారంగా స్కోరును లెక్కిస్తారు. ఇది 1.3 కన్నా తక్కువుండాలి. అంతకన్నా మించితే ఫ్యాటీ లివర్‌ తలెత్తుతోందనే అర్థం.


చికిత్స

గ్లూకోజు తగ్గటానికి తోడ్పడే నియమాలు, మందులు కాలేయంలో కొవ్వు కరగటానికీ ఉపయోగపడతాయి. 

* తిండి తగ్గించటం: నాలుగు వారాల పాటు రోజుకు 600-850 కేలరీల శక్తినిచ్చేంత ఆహారమే తీసుకోవటం ద్వారా కాలేయ కొవ్వును తగ్గించుకోవచ్చు. కాలేయంలో 30% కొవ్వు గలవారు కూడా ఇలాంటి ఆహార పద్ధతిని పాటిస్తే కొవ్వు మోతాదు 2 శాతానికి పడిపోతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. కేలరీల లెక్కన ఎక్కడ కొలుచుకొని తింటామని అనుకుంటున్నారేమో. ఆహారాన్ని తగ్గించుకుంటే చాలు. సాధారణంగా మనం రోజుకు 1800 కేలరీల శక్తినిచ్చే ఆహారం తింటుంటామని అంచనా. ఆహారాన్ని మూడో వంతుకు తగ్గించుకుంటే ఆ మేరకు కేలరీలూ తగ్గుతాయి. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు.. ఇలా అన్నింటినీ నిష్పత్తులు పాటిస్తూ  ఆహారాన్ని తగ్గించుకోవటం మంచిది.

* బరువు తగ్గటం: ఫ్యాటీ లివర్‌ గలవారు తమ శరీర బరువులో 5 శాతం తగ్గించుకుంటే మధుమేహంతో పాటు అధిక రక్తపోటు కూడా నియంత్రణలోకి వస్తుంది. అదే 15% బరువు తగ్గితే మధుమేహాన్ని వెనక్కు మళ్లించుకోవచ్చు కూడా. అంటే వంద కిలోల బరువున్నా దాన్ని 85 కిలోలకు తగ్గించుకుంటే  మధుమేహం వెనక్కి మళ్లే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు.

* వ్యాయామం: దీంతో కాలేయంలో కొవ్వు తగ్గుతుంది. ఫ్యాటీ లివర్‌ గలవారు అరగంట సేపైనా వ్యాయామం చేస్తే కండరాల్లోని కొవ్వు తగ్గుముఖం పడుతుండటం గమనార్హం.

* మందులు: రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేసే పెంటాక్సిఫిలిన్‌ మందు కాలేయంలో కొవ్వు తగ్గటానికీ తోడ్పడుతుంది. అలాగే గ్లూకోజును తగ్గించే సారాగ్లిటజార్‌, పయోగ్లిటజోన్‌, సెమాగ్లుటైడ్‌ మాత్రలూ కాలేయ కొవ్వును తగ్గిస్తాయి. మధుమేహం లేనివారిలోనూ సెమాగ్లుటైడ్‌ బాగా పనిచేస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని