క్షయ తగ్గినా..

క్షయ. అనాదిగా పట్టి పీడిస్తున్న సమస్య. సమర్థమైన చికిత్స అందుబాటులో ఉన్నా దీన్నుంచి ఇంకా విముక్తి లభించటం లేదు. ఏటా కొత్తగా 30 లక్షల మంది క్షయ బారినపడుతుండగా.. సుమారు 8 లక్షల మంది దీనికి బలైపోతున్నారు. క్షయ మరణాలకు చాలావరకు సరైన చికిత్స తీసుకోకపోవటం, మధ్యలో మానెయ్యటమే కారణం.

Published : 14 Dec 2021 00:25 IST

క్షయ. అనాదిగా పట్టి పీడిస్తున్న సమస్య. సమర్థమైన చికిత్స అందుబాటులో ఉన్నా దీన్నుంచి ఇంకా విముక్తి లభించటం లేదు. ఏటా కొత్తగా 30 లక్షల మంది క్షయ బారినపడుతుండగా.. సుమారు 8 లక్షల మంది దీనికి బలైపోతున్నారు. క్షయ మరణాలకు చాలావరకు సరైన చికిత్స తీసుకోకపోవటం, మధ్యలో మానెయ్యటమే కారణం. ఇదే పెద్ద సమస్య అనుకుంటే చికిత్స పూర్తిగా తీసుకున్న తర్వాతా క్షయ పర్యవసానాలు వెంటాడుతూ రావటం మరో సమస్య. తరచూ దగ్గు రావటం, దగ్గుతో పాటు కళ్లె, రక్తం పడటం.. కొన్నిసార్లు రక్తం వాంతి కావటం వంటివీ ఇబ్బంది పెడుతున్నాయి. దీనికి కారణమేంటి?

క్షయతో బాధపడుతున్నప్పుడు దగ్గు రావటం, కళ్లె, రక్తం పడటం మామూలే. పూర్తికాలం చికిత్స తీసుకుంటే వీటితో పాటు జ్వరం, బరువు తగ్గటం వంటి సమస్యలూ తగ్గిపోతాయి. కానీ చికిత్స పూర్తయినా.. ఊపిరితిత్తుల్లోంచి క్షయ కారక క్రిమి తొలగిపోయిన తర్వాతా మాటిమాటికీ దగ్గు వస్తుంటే? పైగా దగ్గినప్పుడు కళ్లెతో పాటు రక్తమూ పడుతుంటే? ఆందోళనకరమే. దీంతో తమకేదో అయిపోయిందని చాలామంది భయపడిపోతుంటారు. కొన్నిసార్లు డాక్టర్లకు సైతం దీనికి కారణమేంటన్నది అంతు పట్టకపోవచ్చు. క్షయ తిరగబెట్టి ఉండొచ్చనీ భావిస్తుంటారు. తిరిగి మరో ఆర్నెల్ల వరకు క్షయ మందులు వేసుకోవాలనీ సూచిస్తుంటారు. నిజానికి అసలు కారణం క్షయ తిరగబెట్టటమో, మందులు పూర్తిగా వాడకపోవటమో కాదు. ఆస్పగిలస్‌ ఫమిగేటస్‌ అనే ఫంగస్‌! దారం మాదిరిగా ఉండే ఇది ఊపిరితిత్తుల్లో తిష్ఠ వేసుకోవటం. చికిత్స పూర్తిగా తీసుకుంటే క్షయ శాశ్వతంగా నయమవటం నిజమే. కానీ కొందరిలో ఇది పోతూ పోతూ కొన్ని అనర్థాలనూ మిగిలిస్తుంది. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఊపిరితిత్తుల్లో రంధ్రాలు పడటం. దీంతో ఆయా భాగాల్లో ఖాళీ ప్రదేశాలు ఏర్పడతాయి. ఆస్పగిలస్‌ ఫంగస్‌ ఊపిరితిత్తుల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటానికి మూలం ఇవే. సాధారణంగా ఈ ఫంగస్‌ శ్వాస మార్గాల ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటుంది. ఇది ఒకసారి లోపలికి ప్రవేశిస్తే బయటకు వెళ్లిపోవటం కష్టం. లోపలే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. చెట్టు తొర్రలో పక్షులు గూడు పెట్టుకున్నట్టుగా అన్నమాట. అనంతరం తామరతంపరగా వృద్ధి చెందుతూ వస్తుంది. దారం మాదిరిగా ఉండటం వల్ల దట్టంగా అల్లుకుపోతుంది. క్రమంగా గట్టిగా, పెద్ద బంతిలా తయారవుతుంది. ఎక్స్‌రేలో ఇది తెల్ల క్రికెట్‌ బంతిలా కనిపిస్తుంది. అందుకే దీన్ని వైద్య పరిభాషలో ‘ఫంగల్‌ బాల్‌’ అనీ అంటారు. అంటే ఫంగస్‌తో కూడిన బంతి అని. ఇది అక్కడితోనే ఆగిపోదు. ఊపిరితిత్తుల్లోని రంధ్రాల చుట్టుపక్కల రక్తనాళాలను సైతం క్రమంగా బలహీనపరుస్తుంది. దీంతో దగ్గినప్పుడు లోపలి పీడనం మూలంగా రక్తనాళాలు చిట్లి పోయి, రక్తస్రావమవుతుంది. ఇది రంధ్రాల్లోకి చేరుకుంటుంది. దగ్గినప్పుడు బయటకు వచ్చే రక్తం ఇదే. ఒక్క క్షయతోనే కాదు.. గాలిమార్గాలు వెడల్పు కావటం (బ్రాంకియెక్టాసిస్‌), దీర్ఘకాలంగా చీము ఉండటం వంటివీ ఊపిరితిత్తుల్లో రంధ్రాలు పడేలా చేస్తాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్‌, వాపుకారక కణాలు పోగుపడటం (సార్కయిడోసిస్‌), హిస్టోప్లాస్మా ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ (హిస్టోప్లాస్మోసిస్‌) వంటివీ కారణం కావొచ్చు. ఆస్పగిలస్‌ ఇన్‌ఫెక్షన్‌ మొండి సమస్య. ఒకపట్టాన తగ్గేది కాదు. అంతమాత్రాన భయపడాల్సిన పనిలేదు. శస్త్రచికిత్సతో దీన్ని శాశ్వతంగా నయం చేయొచ్చు.

ఫంగస్‌ ఎందుకు స్థిరపడుతుంది?
ఆస్పగిలస్‌ ఫంగస్‌ ఊపిరితిత్తుల్లో ఎందుకు తిష్ఠ వేసుకుంటున్నది కచ్చితంగా తెలియదు. పరిశుభ్రమైన గాలి, ఎండ కొరవడటం కొంతవరకు కారణం కావొచ్చు. క్షయ నయమైన తర్వాత కొందరు ఎంతసేపూ ఇరుకిరుకు గదుల్లో, ఆఫీసుల్లోనే ఉంటుండొచ్చు. దీంతో ఆరుబయట స్వచ్ఛమైన గాలి అందదు. ఎండ కూడా అంతగా సోకదు. ఇలాంటి పరిస్థితులు ఫంగస్‌ తేలికగా ఊపిరితిత్తుల్లోకి చేరుకోవటానికి ఆస్కారం కలిగిస్తాయి. కొన్నిసార్లు ఆసుపత్రి వాతావరణంలోని కలుషిత గాలి సైతం దీనికి దారితీయొచ్చు. అందువల్ల క్షయ చికిత్స పూర్తిగా తీసుకున్నవారు, గతంలో ఊపిరితిత్తుల్లో చీము గడ్డల వంటివి ఏర్పడ్డవారు కలుషిత వాతావరణంలోకి వెళ్లకుండా చూసుకోవటం మంచిది. అలాగే ఎండ సోకని చీకటి ప్రాంతాల్లో, తేమతో కూడిన గదుల్లో ఎక్కువసేపు ఉండకూడదు. వీలైనంతవరకు విశాలమైన గదిలో ఉండటం అలవరచుకోవాలి. రోజులో కాసేపైనా ఇంటిలోపల ఎండ పడేలా.. గాలి ధారాళంగా వచ్చి, పోయేలా చూసుకోవాలి.
* రోగనిరోధకశక్తి బలహీనపడటంతోనూ: ఇన్‌ఫెక్షన్‌తో పోరాడే సామర్థ్యం సన్నగిల్లిన వారి ఊపిరితిత్తుల మీద కూడా ఆస్పగిలస్‌ ఫంగస్‌ దాడిచేయొచ్చు. ఉదాహరణకు- అవయవ మార్పిడి చేయించుకున్నవారు రోగనిరోధకశక్తిని అణచిపెట్టే మందులు వాడుతుంటారు. కొందరు దీర్ఘకాలం స్టిరాయిడ్లు వేసుకుంటూ ఉండొచ్చు. ఇలాంటివారిలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. కొందరిలో పోషణ లోపంతోనూ రోగనిరోధక వ్యవస్థ బలహీనపడొచ్చు. ఇలాంటివన్నీ ఊపిరితిత్తుల్లోకి ఫంగస్‌ తేలికగా ప్రవేశించటానికి వీలు కల్పిస్తాయి.


గుర్తించటమెలా?

* దగ్గినప్పుడు మామూలుగా గానీ కళ్లెతో కలిసి గానీ రక్తం పడటం.
* అప్పుడప్పుడు రక్తం వాంతి కావటం.
* తరచూ ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ తలెత్తుతుండటం.
* మాటిమాటికీ జ్వరం, దగ్గు, ఆయాసం వస్తుండటం.
* శ్వాస తీసుకుంటున్నప్పుడు ఛాతీలో కుడి లేదా ఎడమవైపున నొప్పి తలెత్తుతుండటం.

*ఇలాంటి లక్షణాలన్నీ ఆస్పగిలస్‌ ఫంగల్‌ బంతులకు సూచికలే. వీటిని నిర్లక్ష్యం చేయటానికి లేదు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగు పరీక్షలు చేయించుకోవాలి.

సీటీ స్కాన్‌లో ఎడమ వైపున ఆస్పగిలస్‌ బంతి

నిర్ధరణ ఎలా?
గతంలో క్షయ చికిత్స తీసుకున్నవారిలో, ఊపిరితిత్తుల్లో చీము గడ్డలు ఏర్పడ్డవారిలో ఇన్‌ఫెక్షన్‌ నయమైన తర్వాతా మాటిమాటికీ దగ్గినప్పుడు రక్తం పడుతున్నట్టయితే ఆస్పగిలస్‌ ఫంగస్‌ ఉందేమోనని అనుమానించాలి. ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ పరీక్షల ద్వారా దీన్ని నిర్ధరిస్తారు. కళ్లె పరీక్షతో పాటు సీటీ స్కాన్‌ చేస్తూ ఊపిరితిత్తుల్లోంచి ముక్కను తీసి పరీక్షించటం చాలా ముఖ్యం. కొన్నిసార్లు వీటిల్లోనూ ఫంగస్‌ బంతి ఆనవాళ్లు ఉండకపోవచ్చు. అప్పుడు బ్రాంకోస్కోపీ, బ్రాంకియల్‌ ఆర్టరీ ఎంబోలైజేషన్‌ పరీక్షలు  చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఆధునిక పరీక్ష సదుపాయాలు గల ఆసుపత్రులకు వెళ్తే త్వరగా, కచ్చితంగా సమస్యను నిర్ధరించటానికి వీలుంటుంది.


శాశ్వత పరిష్కారం శస్త్రచికిత్స

తొలగించిన ఊపిరితిత్తిలో ఫంగల్‌ బంతిసీటీ సాసీటీ స్కాన్‌లో ఎడమ వైపున ఆస్పగిలస్‌ బంతి

ఊపిరితిత్తుల్లో ఆస్పగిలస్‌ ఇన్‌ఫెక్షన్‌కు లోబెక్టమీ శస్త్రచికిత్స సమర్థమైన మార్గం. ఇందులో ఫంగస్‌తో కూడిన ఊపిరితిత్తి భాగాన్ని పూర్తిగా తొలగిస్తారు. దీంతో సమస్య శాశ్వతంగా నయమవుతుంది. ఫంగస్‌తో దెబ్బతిన్న భాగాన్ని బయటకు తీయకపోతే దగ్గు, రక్తం పడటం నయం కావనే సంగతి గుర్తుంచుకోవాలి. ఫంగస్‌తో కూడిన కొద్ది భాగాన్ని తొలగించటం, రంధ్రాన్ని శుభ్రం చేయటం, మందులతో, కండర కణజాలంతో రంధ్రాన్ని పూడ్చటం వంటి పద్ధతులను కొన్నిచోట్ల చేస్తుంటారు గానీ అంతగా పనిచేయవు. ఇలాంటివి సమస్యను నయం చేయకపోగా మరింత తీవ్రం చేయొచ్చు. ఛాతీలో చీము, ఇన్‌ఫెక్షన్లకు దారితీయొచ్చు. ఒకవేళ శరీరం లోబెక్టమీని తట్టుకోలేని స్థితిలో ఉన్నవారికి.. అంటే చాలా బలహీనంగా ఉన్నవారికి, వృద్ధులకు, అవయవమార్పిడి చేయించుకొని పోషణలోపంతో ఆసుపత్రిలో చేరినవారికి తాత్కాలికంగా ఇలాంటివి చేయొచ్చు. అయితే శాశ్వతంగా సమస్య నుంచి విముక్తి పొందాలంటే మాత్రం లోబెక్టమీ చేయాల్సిందే.

అత్యవసర సమయాల్లో..
కొన్నిసార్లు అత్యవసర స్థితిలో ఊపిరితిత్తిలోని రక్తనాళాన్ని మూసేసే (బ్రాంకియల్‌ ఆర్టరీ ఎంబోలైజేషన్‌) చికిత్స ఉపయోగపడుతుంది. ఇందులో యాంజియోగ్రఫీ ద్వారా రక్తస్రావమవుతున్న రక్తనాళాన్ని పూర్తిగా మూసేస్తారు. దీంతో వెంటనే రక్తస్రావం ఆగిపోతుంది. ప్రాణాపాయం సంభవించకుండా కాపాడుతుంది. ప్రతి పది మందిలో ఏడుగురికి ఇది సమర్థంగా పనిచేస్తుంది. అత్యవసర సమయంలో ప్రాణ రక్షణకు బాగా ఉపకరిస్తుంది. అయితే ఇదేమీ శాశ్వత పరిష్కారం కాదు. కొద్దిరోజులు, నెలల తర్వాత తిరిగి దగ్గినప్పుడు రక్తం పడే ప్రమాదం లేకపోలేదు.

సర్జరీ సాధ్యం కాకపోతే?
కొందరికి శస్త్రచికిత్స చేయటం సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటివారికి రక్తనాళం ద్వారా వారికొనజోల్‌, యాంఫోటెనిసిన్‌ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం ఊపిరితిత్తిలో ఆస్పగిలస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నప్పుడు, మృతకణజాలం లేనప్పుడే ఇవి సమర్థంగా పనిచేస్తాయి. ఇలాంటి పరిస్థితిని ‘ఇన్‌వేసివ్‌ ఆస్పగిలోసిస్‌’ అంటారు. ఇలాంటివారికి రక్తనాళం ద్వారా మందులు ఇస్తే కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. కాకపోతే ఇది తాత్కాలికమే. శస్త్రచికిత్స ఒక్కటే దీనికి పరిష్కారమార్గమని గుర్తుంచుకోవాలి.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని