Updated : 22 Mar 2022 05:36 IST

బైపాస్‌ తర్వాత మళ్లీ పూడిక!

తీవ్ర గుండెపోటు వచ్చింది. అదృష్టవశాత్తు బయటపడ్డారు. డాక్టర్లు బైపాస్‌ చేసి ప్రాణాపాయం తప్పించారు. అంతమాత్రాన సమస్య నయమైనట్టు కాదు. గుండెపోటుకు కారణమైన పూడికలు ఏర్పడే ముప్పు అలాగే ఉంటుంది. గుండె రక్తనాళాల్లో వేరే చోటనో, అతికించిన నాళంలోనో తిరిగి పూడికలు ఏర్పడొచ్చు. కాబట్టి ఏమరుపాటు తగదు. బైపాస్‌ తర్వాతా జాగ్రత్తలు మరవద్దు. ఒకవేళ మళ్లీ పూడికలు ఏర్పడినా భయపడాల్సిన పనిలేదు. వీటికీ చికిత్సలు ఉన్నాయి.

గుండెకు ప్రధానంగా మూడు రక్తనాళాలు రక్తాన్ని సరఫరా చేస్తుంటాయి. వీటిల్లో దేనిలోనైనా పూడికలు ఏర్పడి మూసుకుపోతే గుండెపోటుకు దారితీస్తుంది. ఇది తీవ్రమైతే ప్రాణాపాయమూ సంభవించొచ్చు. దీన్ని తప్పించటానికి బైపాస్‌ సర్జరీ ఎంతగానో ఉపయోగపడుతుంది. సాధారణంగా ప్రధాన రక్తనాళంలో (లెఫ్ట్‌ మెయిన్‌ కరోనరీ ఆర్టరీ) పూడిక ఉన్నా, ఇతర రక్తనాళాల్లో పలు పూడికలున్నా బైపాస్‌ సర్జరీ చేస్తుంటారు. ఇందులో శరీరంలో వేరే చోటు నుంచి రక్తనాళాన్ని తీసుకొచ్చి.. మూసుకుపోయిన భాగానికి పైనా, కిందా అతికిస్తారు. దీంతో గుండెకు తిరిగి రక్తం సరఫరా అవుతుంది. ఛాతీలో నొప్పి, ఆయాసం వంటి లక్షణాలు, ప్రాణాపాయం ముప్పు తగ్గుతాయి. రోజువారీ జీవితం మెరుగవుతుంది. అయితే బైపాస్‌ సర్జరీ తర్వాతా తిరిగి పూడికలు ఏర్పడకూడదనేమీ లేదు. సాధారణంగా 8-10 ఏళ్ల తర్వాత తిరిగి పూడికలు ఏర్పడటం చూస్తుంటాం. ఇది అతికించిన రక్తనాళం (గ్రాఫ్ట్‌) తీరును బట్టీ ఉంటుంది. కాళ్ల నుంచి తీసుకొచ్చిన సిరలు త్వరగా.. ఏటా 5% మేర మూసుకుపోతుంటాయి. అదే గుండెకు దగ్గరగా ఉండే రొమ్ము ధమని గ్రాఫ్ట్‌ అయితే 15-20 ఏళ్ల వరకు ఇబ్బందేమీ ఉండదు. కొన్నిసార్లు గుండె రక్తనాళాల్లోనే కొత్తగా వేరే చోటా పూడికలు ఏర్పడొచ్చు.

మళ్లీ పూడికలు ఎందుకు?

జన్యుపరంగా పూడికలు ఏర్పడే స్వభావం గలవారిలో, వంశపారంపర్యంగా చెడ్డ కొలెస్ట్రాల్‌ మరీ ఎక్కువగా ఉండేవారిలో తిరిగి పూడికలు ఏర్పడటం ఎక్కువ. బైపాస్‌ తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటమూ దీనికి కారణం కావొచ్చు. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌ వంటి గుండెజబ్బు ముప్పు కారకాలను అదుపులో ఉంచుకోకపోవటం.. పొగ తాగటం వంటివన్నీ దీనికి దోహదం చేయొచ్చు. కొందరికి బైపాస్‌ అనంతరం ఒకట్రెండు ఏళ్లలోనే సమస్య తిరగబెట్టొచ్చు. దీనికి ప్రధాన కారణం రక్తనాళం సరిగ్గా అతుక్కోకపోవటం.

లక్షణాలు అవే

తిరిగి ఏర్పడే పూడికల్లోనూ ఛాతీలో నొప్పి, ఆయాసం వంటి లక్షణాలే కనిపిస్తాయి. అయితే చాలామందిలో విశ్రాంతిగా ఉన్నప్పటి కన్నా కష్టమైన పనులు చేస్తున్నప్పుడు ఇవి తలెత్తుతుంటాయి. కొందరిలో (3% మందిలో) హఠాత్తుగానూ గుండెపోటు సంభవించొచ్చు. వీరిలో ఉన్నట్టుండి ఛాతీలో తీవ్రమైన నొప్పి, చెమట్లు, వాంతి వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు మామూలుగా డాక్టర్‌ను సంప్రదించినప్పుడు చేసే గుండె పరీక్షల్లోనూ పూడికల ఆనవాళ్లు బయటపడుతుంటాయి. గుండె పంపింగ్‌ సామర్థ్యం క్రమంగా తగ్గుతుంటే వీటిల్లో తెలుస్తుంది.


చికిత్స కష్టమే కానీ..

రెండోసారి బైపాస్‌ చేయటం కాస్త కష్టమైన పనే. ఎందుకంటే అప్పటికే వయసు మీద పడి ఉండొచ్చు. తొలిసారి సర్జరీ చేసినప్పుడు కుట్లు వేయటం, రక్తస్రావం జరగటం వల్ల గుండె కండరం చుట్టుపక్కల భాగాలకు అతుక్కొని ఉండొచ్చు. ఛాతీని తెరుస్తున్నప్పుడే వీటిని వేరు చేయాల్సి ఉంటుంది. ఇది సంక్లిష్టమైన ప్రక్రియ. జాగ్రత్తగా చేయకపోతే ప్రాణాపాయానికీ దారితీయొచ్చు. రెండో బైపాస్‌లో ఎక్కువ రక్తనాళాలను అతికించాల్సి ఉంటుంది. కోలుకోవటానికీ ఎక్కువ రోజులు పట్టొచ్చు. నొప్పులు ఎక్కువగానూ ఉండొచ్చు. అందుకే వీలైనంత వరకు తిరిగి బైపాస్‌ చేయకుండా చూడటానికే ప్రాధాన్యం ఇస్తారు. యాంజియోప్లాస్టీతోనే పూడికలను తొలగించటానికి ప్రయత్నిస్తారు. గుండె ప్రధాన రక్తనాళానికి (లెఫ్ట్‌ యాంటీరియర్‌ డిసెండింగ్‌ ఆర్టరీ- ఎల్‌ఏడీ) అతికించిన గ్రాఫ్ట్‌ బాగుండి, మిగతా గ్రాఫ్ట్‌లో పూడికలు ఏర్పడితే తిరిగి బైపాస్‌ చేయకపోవటమే మంచిది.

* ప్రస్తుతం యాంజియోప్లాస్టీలో సీటీఓ పర్‌క్యుటేనియస్‌ కరోనరీ ఇంటర్వెన్షన్‌ ప్రక్రియ వంటి అధునాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. వీటితో సంక్లిష్టమైన పూడికలను కూడా తొలగించి, స్టెంట్‌ అమర్చొచ్చు. క్యాల్షియం మోతాదు ఎక్కువగా ఉంటే ముందు దీన్ని పూర్తిగా చెక్కేస్తారు. రోటాబ్లేషన్‌, ఐవీఎల్‌ వంటి మైక్రో బ్లాస్టింగ్‌ పద్ధతుల సాయంతో పేల్చేస్తారు. లేజర్‌తో వీటిని ఆవిరయ్యేలా కూడా చేయొచ్చు. ఇలా అనువైన పరిస్థితిని సృష్టించుకున్నాక స్టెంట్‌ అమర్చి, విప్పుకునేలా చేస్తారు.

* ఎల్‌ఏడీ ఆర్టరీలో పూడిక ఉన్నా యాంజియోప్లాస్టీకి అనువుగా ఉంటే స్టెంటు అమర్చటానికే ప్రాధాన్యమిస్తారు. అతికించిన రక్తనాళాలు 70-80% పూడుకుంటే దాన్ని తొలగించి, స్టెంట్‌ వేయొచ్చు. అదే 8, 10 ఏళ్లు దాటితే మాత్రం గ్రాఫ్ట్‌ను సరిచేయటం అంత సమంజసం కాదు. వయసు పెరిగే కొద్దీ వేరేచోట్ల పూడికలు ఏర్పడే ప్రమాదముంది. ఇలాంటి పరిస్థితుల్లో మొదట్లో పూడిక తలెత్తిన రక్తనాళాన్ని తెరవటానికి ప్రయత్నిస్తారు. ‘అది పూడుకుపోవటం వల్లనే బైపాస్‌ చేశారు కదా, మళ్లీ ఎలా తెరుస్తారు’ అనే అనుమానం రావొచ్చు. కాస్త జాగ్రత్తగా చేయగలిగితే దీన్ని కూడా తెరవచ్చు. ముందు నుంచి, బైపాస్‌ గ్రాఫ్ట్‌లోంచి వచ్చి వెనక నుంచి రక్తనాళాన్ని తిరిగి తెరవొచ్చు. దీనికి ప్రత్యేక నైపుణ్యం అవసరం.

* ఒకట్రెండు ఏళ్లలో సమస్య తిరగబెడితే ముందుగా బైపాస్‌ నాళం సరిగా అతికిందో లేదో చూస్తారు. దీన్ని తేలికగానే సరిచేయొచ్చు. బెలూన్‌ను ఉబ్బించి రక్తనాళం తెరచుకునేలా చేయొచ్చు.


భిన్నంగానే చూడాలి

* మళ్లీ ఏర్పడే పూడికలను భిన్నంగానే పరిగణించాల్సి ఉంటుంది. చాలావరకివి సంక్లిష్టంగా ఉంటాయి. సుమారు 50% మందిలో  పూడిక రక్తనాళాన్ని పూర్తిగా మూసేసి ఉంటుంది. పైగా పూడికలో క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల గట్టిగా అవుతుంది. కొందరికి పూడికలు రక్తనాళంలో పొడవుగా పరచుకొనీ ఉండొచ్చు.

* ఇంతకుముందు ఎక్కడ, ఏ రక్తనాళాన్ని జోడించారనేదీ జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇక్కడ పాత రిపోర్టులు ఎంతగానో ఉపయోగపడతాయి. సమస్యను త్వరగా, తేలికగా అంచనా వేయటం సాధ్యమవుతుంది. పాత రిపోర్టులు లేకపోతే నేరుగా సీటీ యాంజియోగ్రామ్‌ చేసి విశ్లేషించాల్సి రావచ్చు. ఎక్కువెక్కువ పరీక్షలూ అవసరమవుతాయి. అదే మునుపటి వివరాలు ఉన్నట్టయితే సాధారణ యాంజియోగ్రామ్‌తోనే సమస్యను గుర్తించొచ్చు. కాబట్టి గత బైపాస్‌ సర్జరీ రిపోర్టులను పడేయకూడదు.


నివారణ కీలకం

బైపాస్‌ చేయించుకున్నవారిలోనే కాదు.. గతంలో స్టెంట్‌ అమర్చినవారిలోనూ పూడికలు ఏర్పడొచ్చు. స్టెంట్‌కు ముందో వెనకాలో తిరిగి పూడిక ఏర్పడొచ్చు. లేదూ ఇతర రక్తనాళాల్లో కొత్తగా పూడికలు ఏర్పడొచ్చు. కాబట్టి ఇవి ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవటం కీలకం. వీరికి మళ్లీ పూడికలు ఏర్పడకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించే స్టాటిన్స్‌, రక్తాన్ని పలుచబరచే మందులు డాక్టర్లు సూచిస్తారు. వీటిని క్రమం తప్పకుండా వాడుకోవాలి. అలాగే మధుమేహం, అధిక రక్తపోటును కచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి. రక్తంలో మూడు నెలల గ్లూకోజు సగటును తెలిపే హెచ్‌బీఏ1సీ 7 కన్నా తక్కువగా ఉండాలి. రక్తంలో గ్లూకోజు పరగడుపున 140 కన్నా తక్కువ, భోజనం చేశాక 180 కన్నా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. రక్తపోటు 140/90 కన్నా మించనీయకూడదు. ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ 50 కన్నా తక్కువగా ఉండాలి. వీటి విషయంలో మందులతో పాటు జీవనశైలిని మార్చుకోవటం ఎంతగానో ఉపయోగపడుతుంది.

* సమతులాహారం తినాలి.

* క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

* బరువు అదుపులో ఉంచుకోవాలి.

* పొగ తాగే అలవాటుంటే మానెయ్యాలి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని