పాపా.. పాపా.. ఎందుకేడుస్తున్నావ్‌?

పసి పిల్లలకు వచ్చిన ఏకైక భాష ఏడుపే! ఆకలేస్తున్నా, ఉక్కపోస్తున్నా, చలిపెడుతున్నా, అలసిపోయినా అన్నింటికీ ఏడుస్తూనే ఉంటారు. ఆశ్చర్యంగా అనిపించినా ఒంటరిగా ఉన్నప్పుడు, ఆందోళన పడుతున్నప్పుడు, బోర్‌ కొట్టినప్పుడూ ఏడుపు లంకించుకుంటారు! కారణమేదైనా పిల్లలు ఏడిస్తే పెద్దవాళ్లకు ఎక్కడలేని భయం పుట్టుకొస్తుంది. కొన్నిసార్లు బుజ్జగించినా ఊరుకోరు. వెక్కివెక్కి ఏడుస్తుంటారు. తొలిసారి సంతానాన్ని కన్నవారికిది మరింత ఆందోళన కలిగిస్తుంది. పిల్లలు ఏడ్వటానికి ఆకలి వంటి మామూలు విషయాలే కాదు..

Updated : 19 Apr 2022 02:21 IST

పసి పిల్లలకు వచ్చిన ఏకైక భాష ఏడుపే! ఆకలేస్తున్నా, ఉక్కపోస్తున్నా, చలిపెడుతున్నా, అలసిపోయినా అన్నింటికీ ఏడుస్తూనే ఉంటారు. ఆశ్చర్యంగా అనిపించినా ఒంటరిగా ఉన్నప్పుడు, ఆందోళన పడుతున్నప్పుడు, బోర్‌ కొట్టినప్పుడూ ఏడుపు లంకించుకుంటారు! కారణమేదైనా పిల్లలు ఏడిస్తే పెద్దవాళ్లకు ఎక్కడలేని భయం పుట్టుకొస్తుంది. కొన్నిసార్లు బుజ్జగించినా ఊరుకోరు. వెక్కివెక్కి ఏడుస్తుంటారు. తొలిసారి సంతానాన్ని కన్నవారికిది మరింత ఆందోళన కలిగిస్తుంది. పిల్లలు ఏడ్వటానికి ఆకలి వంటి మామూలు విషయాలే కాదు.. తీవ్రమైన సమస్యలూ కారణం కావొచ్చు. మరి వీటిని గుర్తించటమెలా? అసలు పిల్లల ఏడుపును ఎప్పుడు తీవ్రంగా పరిగణించాలి?

శిశువులు తొలి మూణ్నెళ్ల వరకు కాస్త ఎక్కువగానే ఏడుస్తుంటారు. పుట్టిన తర్వాత తొలి వారాల్లో రోజుకు 2 గంటల సేపు ఏడ్వటం మామూలే. ఇది క్రమంగా తగ్గుతూ వస్తుంది. తమ అవసరాలు, అసౌకర్యాలు వేటి గురించి చెప్పాలన్నా పిల్లలు ఏడుపుతోనే తెలియజేస్తుంటారు. పిల్లల్లో ఏడుపును ప్రధానంగా మూడు రకాలుగా విభజించుకోవచ్చు. 1. ఆకలి ఏడుపు. 2. నిద్ర ఏడుపు.   3. నొప్పి ఏడుపు. ఆకలి, దాహం వేసినప్పుడు.. అలసిపోయినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎక్కడైనా నొప్పి పుడుతున్నప్పుడు ఏడ్వటం సాధారణమే. సాయంత్రం వేళల్లో కొన్నిసార్లు మారాం చేస్తుంటారు కూడా. కానీ తరచూ, అదేపనిగా ఏడుస్తున్నా.. ఓదార్చినా ఏడుపు ఆపకున్నా ఏదో ఆరోగ్య సమస్య కారణం కావొచ్చని అనుమానించాలి.

అసలు ఎందుకు ఏడుస్తారు?
* ఆకలి:
శిశువులు ఎక్కువగా ఏడ్వటానికి ప్రధాన కారణం ఆకలే. నిజానికి ఆకలితో ఏడ్వటమనేది చివరి ప్రయత్నమే. అంతకన్నా ముందే పెదాలు చప్పరించటం, తల ఇటూఇటూ కదల్చటం వంటి పనులు చేస్తుంటారు. అప్పటికీ పాలు పట్టకపోతే ఏడుపు లంకించుకుంటారు. కొన్నిసార్లు మరీ ఎక్కువగానూ ఏడ్వచ్చు. పాలివ్వటం మొదలెట్టగానే ఏడుపు ఆపేస్తారు. కడుపు నిండాక సంతోషంతో కేరింతలు కొడతారు. దీన్ని బట్టే తెలుసుకోవచ్చు అది ఆకలి ఏడుపు అని.
* గాలి మింగటం: త్వరత్వరగా పాలు తాగే క్రమంలో కొన్నిసార్లు గాలిని కూడా మింగుతుంటారు. ఇది పొట్టలో నిండి అసౌకర్యానికి, చికాకుకు దారితీస్తుంది. దీంతో ఆకలి తీరినా పిల్లలు నిద్రపోకుండా ఏడుపు ఆరంభించొచ్చు. భుజం మీద వేసుకొని, వీపు మీద నెమ్మదిగా నిమిరితే తేన్పు వచ్చి కుదుట పడతారు.
* నిద్ర రావటం:  పక్క సరిగా లేకపోయినా, దుప్పటి కప్పకపోయినా, అనువైన వాతావరణం లేకపోయినా పిల్లలు నిద్ర పోలేక ఏడుపు లంకించుకోవచ్చు.
* కడుపుబ్బరం: కొందరు తల్లులు ఎక్కువగా పాలు పట్టటమూ ఇబ్బందికరంగా పరిణమించొచ్చు. దీంతో కడుపు ఉబ్బి ఏడుస్తుంటారు.
* ముక్కు దిబ్బడ: జలుబు చేసినప్పుడు పిల్లలు చిరాకు పడుతుంటారు. ముక్కు బిగుసుకుపోవటం వల్ల శ్వాస సరిగా తీసుకోరు. దీంతో అదేపనిగా ఏడుస్తుంటారు.
* దుస్తులు: బాగా ఉక్కపోస్తున్నా లేదూ చలివేస్తున్నా బిడ్డ ఏడ్వచ్చు. కాబట్టి సరైన దుస్తులు వేయాలి. ఎండకాలంలో వదులుగా ఉండే నూలు దుస్తులు వేస్తే గాలి బాగా ఆడుతుంది. చలికాలంలో ఉన్ని దుస్తులు బిడ్డను వెచ్చగా ఉంచుతాయి.
* డైపర్‌ మార్చకపోవటం: మలం చర్మాన్ని బాగా చికాకుకు గురిచేస్తుంది. అందువల్ల మల విసర్జన తర్వాత డైపర్‌ మార్చేంతవరకూ పిల్లలు ఏడుస్తూనే ఉండొచ్చు.
* ఇతర నొప్పులు: సాధారణంగా జలుబు వచ్చిన తర్వాత చెవి నొప్పి వంటి వాటితో పిల్లలు ఇబ్బంది పడుతుంటారు. దీంతో బాగా ఏడుస్తుంటారు. తరచూ చేతిని చెవులకు తాకిస్తుంటారు. నోట్లో పుండ్లు, డైపర్‌ దద్దు వంటి వాటితో తలెత్తే నొప్పి సైతం ఏడ్వటానికి కారణం కావొచ్చు. మగపిల్లల్లో కొందరు అంగం చివర పుండుతో, వృషణాలు మెలి తిరగటంతోనూ ఏడుస్తుండొచ్చు. మలద్వారం వద్ద చీలికలు, పేగులు పక్కపేగు భాగంలోకి చొచ్చుకుపోవటం, పేగులు సరిగా ఏర్పడకపోవటం, పేగులు సరైన దిశకు తిరిగి ఉండకపోవటం, కడుపుగోడను దాటుకొని వచ్చి పేగు కిందికి జారటం, పెద్దపేగులో మలం సరిగా కదలకపోవటం వంటి తీవ్ర సమస్యలూ అతిగా ఏడ్వటానికి కారణం కావొచ్చు.
* పాలు పడకపోవటం: తల్లి తినే ఆహార పదార్థాలు గానీ పోత పాలు గానీ పడకపోవటం మూలంగా పిల్లల్లో అలర్జీ తలెత్తే అవకాశముంది. తల్లి తీసుకునే పాలు, గుడ్లు, గింజపప్పులు, గోధుమల వంటివి చనుబాల తీరుపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఒకవేళ ఇవి శిశువుకు సరిపడకపోతే అలర్జీకి దారితీస్తుంది. దీంతో కడుపునొప్పి, విరేచనాల వంటి సమస్యలు తలెత్తొచ్చు. ఆవు పాలు పడుతుంటే దీనిలోని ప్రొటీన్‌ కొందరు శిశువులకు అలర్జీ తెచ్చిపెట్టొచ్చు. తల్లి తీసుకునే పాల పదార్థాలూ దీనికి కారణం కావొచ్చు. ఆవు పాల ప్రొటీన్‌ అలర్జీ మూలంగా చిరాకు, మలంలో రక్తం పడటం వంటివి తలెత్తుతాయి.

అతిగా ఏడ్వటమంటే?
పిల్లల్లో అతి ఏడుపును కచ్చితంగా నిర్వచించటం కష్టం. తల్లిదండ్రులకు బాధ కలిగించే స్థాయిలో ఏడుస్తుంటే అతిగా భావించొచ్చనేది కొందరి భావన. అయితే చాలామంది అనుసరిస్తున్నది ‘మూడు సూత్రాల విధానం’. రోజుకు కనీసం 3 గంటల కన్నా ఎక్కువసేపు అతిగా ఏడ్వటం.. వారానికి 3 సార్ల చొప్పున వరుసగా 3 వారాల పాటు అతిగా ఏడ్వటం.. ఇది 3 నెలల పాటు కొనసాగటం. వీటి ఆధారంగా పిల్లల్లో అతి ఏడుపును కొంతవరకు నిర్ణయిస్తుంటారు.

సముదాయిస్తే ఊరుకుంటారు
పిల్లలు అదేపనిగా ఏడుస్తుంటే ఎవరికైనా కాలూ చేయీ ఆడదు. బిడ్డకు ఏమైందో ఏమో అనే ఆందోళనతో ఏం చేయాలో పాలు పోదు. అలాగని పిల్లలను సముదాయించే మార్గాలు లేకపోలేదు. అన్నింటికన్నా ముందుగా చూడాల్సింది జ్వరం ఏమైనా ఉందేమోనని. జ్వరం లేనట్టయితే ఆకలి వేస్తుందేమో గమనించాలి. పోతపాలు తాగే పిల్లలకైతే- అప్పటికి పాలు పట్టి 2 గంటలు దాటితే వెంటనే పాలు పట్టాలి. చనుబాలు తాగే పిల్లలకైతే- గంటన్నర కన్నా ఎక్కువ సమయం మించకుండా చూసుకోవాలి. అలాగే డైపర్‌ తడిగా అయ్యిందేమో చూడాలి. అన్నీ బాగానే ఉన్నా బిడ్డ ఏడుస్తున్నట్టయితే కొన్ని ఉపశమన చర్యలు తీసుకోవాలి.
* ఒళ్లోకి తీసుకోవటం: బిడ్డను ఒళ్లో పడుకోబెట్టుకొని కడుపు మీద, వీపు మీద నెమ్మదిగా నిమరాలి. దీంతో తల్లి దగ్గర ఉన్నాననే ధైర్యం కలుగుతుంది. శ్వాస వేగం నెమ్మదిస్తుంది. ఏడుపు ఆపటానికి తోడ్పడుతుంది.
* పాలపీక: వీలుంటే నోట్లో పాలపీక పెట్టటం మంచిది. ఇది త్వరగా సాంత్వన కలిగిస్తుంది. చిరాకు పడటం, ఏడ్వటం తగ్గుతుంది.
* దుప్పటి చుట్టు: బిడ్డ చుట్టూ వదులుగా దుప్పటిని చుట్టటం (స్వాడ్లింగ్‌) మరో పద్ధతి. చేతులను పక్కలకు పెట్టి, దుప్పటి అంచులను మధ్యలోకి తెస్తూ బిడ్డ చుట్టూ చుట్టాలి. అయితే కాళ్లు తేలికగా కదిలించేలా తుంటి వదులుగా ఉండేలా చూసుకోవాలి. ఇది పిల్లలకు వెచ్చదనాన్ని, హాయిని కలిగిస్తుంది. తల్లి కడుపులో ఉన్న భావన కలిగిస్తుంది.  
* జోల పాట: పిల్లలు ఏడుస్తున్నప్పుడు జోల పాట పాడటం మామూలే. ఇది పిల్లలకు ఎంతో ఓదార్పు కలిగిస్తుంది. తల్లి కడుపులో ఉమ్మనీటిలో ఉన్నప్పుడు శిశువులకు బయటి శబ్దాలు అలల హోరు మాదిరిగా వినిపిస్తుంటాయి. అందువల్ల తల్లి గొంతును పోలిన మాటలు లేదా హోరు మాదిరిగా వినిపించే చప్పుళ్లు విన్నప్పుడు గర్భంలో ఉన్నామనే భావన కలుగుతుంది. దీంతో చిరాకు తగ్గుతుంది. ప్రశాంతత కలుగుతుంది.
* ఊయలలో ఊపటం: పిల్లలను  చేతిలో వేసుకొని అటూఇటూ ఊపినా.. ఊయలలో వేసి ఊపినా మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలా చేసినప్పుడు తల్లి కడుపులో ఉమ్మనీటిలో అటూఇటూ తిరుగుతున్న భావన కలుగుతుంది. సాంత్వన చేకూరుతుంది. అయితే చేతుల్లో వేసుకొని ఊపేటప్పుడు తల, మెడ స్థిరంగా ఉండేలా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ గట్టిగా కుదపకూడదు.
* బోర్లా పడుకోబెట్టటం: శిశువులను బోర్లా పడుకోబెట్టటం మంచి పద్ధతి కాదు. కానీ మారాం చేసే పిల్లలను దగ్గరుండి కాసేపు బోర్లా పడుకోబెడితే ఏడుపు ఆపేసే అవకాశముంది.

డాక్టర్‌ దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్లాలి?
పిల్లలు అదేపనిగా ఏడుస్తున్నప్పటికీ చాలామందిలో మామూలు విషయాలే కారణం కావొచ్చు. తీవ్రమైన జబ్బులేమీ ఉండకపోవచ్చు. కానీ ఏడుపు ఆపకుండా అదేపనిగా ఏడుస్తుంటే మాత్రం వెంటనే జాగ్రత్త పడాలి.
* రెండు గంటలకు పైగా ఆపకుండా ఏడుస్తున్నా
* బిడ్డ బలహీనంగా కనిపిస్తున్నా
* కింద పడటం లేదా గాయం తగలటం వల్ల ఏడుస్తున్నా
* 100.4 డిగ్రీలు, అంతకన్నా ఎక్కువ జ్వరం ఉన్నా
* కొద్ది గంటలుగా శిశువు తినటానికి, తాగటానికి నిరాకరిస్తున్నా
* పెద్దగా వాంతి చేసుకున్నా. లేదూ ఆకుపచ్చగా గానీ పసుపు పచ్చగా గానీ వాంతి అయినా
* మూత్రం సరిగా పోయకపోతున్నా (ఇది ఒంట్లో నీటిశాతం తగ్గిందనటానికి సూచన)
* ప్రవర్తన మారినా. నిస్సత్తువగా ఉన్నా లేదా స్పందించటం తగ్గినా
* ఒంట్లో ఎక్కడైనా వాపు, ఉబ్బు ఉన్నా
* మగపిల్లల్లో వృషణాలు లేదా గజ్జల్లో ఉబ్బినా
* తాకినా, పట్టుకున్నా, కదిపినా బిడ్డ ఏడుపు పెరుగుతున్నా
* అప్పటికే గుండె, మెదడు సమస్యల వంటివి గల పిల్లలు ఏడుస్తున్నా

- ఇలాంటివన్నీ ప్రమాదకర సంకేతాలు. వీటిని గుర్తిస్తే వెంటనే పిల్లల డాక్టర్‌ను సంప్రదించాలి.


కడుపు నొప్పి: తొలి నెలల్లో పిల్లలు తరచూ ఏడ్వటానికి ప్రధాన కారణం కడుపు నొప్పి. శిశువులు ఏడ్వటం మామూలే గానీ రోజుకు 3 గంటల కన్నా ఎక్కువసేపు ఏడుస్తుంటే కడుపునొప్పిగా భావించొచ్చు. ఇందులో పిల్లలు ఉన్నట్టుండి ఏడుస్తుంటారు. మామూలుగా కన్నా బిగ్గరగా ఏడుస్తుంటారు. కాళ్లు పైకి లాక్కొంటారు. సాధారణంగా సాయంత్రం వేళల్లో ఇలాంటి నొప్పి ఎక్కువ. ఎంత ఓదార్చినా ఊరుకోరు. కాసేపు ఏడుపు ఆపినా చిరాకుగా ఉంటారు. మలద్వారం నుంచి గ్యాస్‌ పోయిన తర్వాత లేదా మల విసర్జన తర్వాత ఏడుపు ఆపుతుంటారు. ఏడ్వనప్పుడు మాత్రం హాయిగా, ఆనందంగా ఉంటారు.


నిశిత పరిశీలన ముఖ్యం

పుట్టినప్పట్నుంచీ బిడ్డను గమనిస్తుండటం వల్ల పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారనేది తల్లికి చాలావరకు తెలుస్తుంది. ఏడుపు తీవ్రత, బిడ్డ హావభావాలు, వెన్నెముక పైకి లేపటం, కళ్లు గట్టిగా మూసుకోవటం, కళ్లు నులుముకోవటం, పిడికిళ్లు బిగించటం వంటివన్నీ బిడ్డ శారీరక, మానసిక స్థితిని తెలియజేసేవే. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తే బిడ్డ శాంతిస్తుందో, ఏడుపు ఆపుతుందో సహజంగానే క్రమంగా అర్థమవుతూ వస్తుంది. అయితే అతిగా ఏడుస్తుంటే మాత్రం నిర్లక్ష్యం చేయరాదు. ముందుగా బిడ్డను ఓదార్చటానికి ప్రయత్నించాలి. అదే సమయంలో దుస్తులు విప్పి తల నుంచి కాళ్ల వరకు నిశితంగా పరిశీలించాలి. కళ్లు ఏమైనా ఎర్రబడ్డాయా? చెవిలోంచి చీము వంటివి కారుతున్నాయా? శ్వాస తేలికగా ఆడుతోందా? పిల్లికూతల వంటివేవైనా వస్తున్నాయా? కడుపు మీద ఎక్కడైనా ఉబ్బు, గడ్డ వంటివి ఉన్నాయా? గజ్జల్లో వాపు ఉందా? జననాంగ భాగాల వద్ద ఎరుపు వంటి తేడాలేవైనా ఉన్నాయా? మలద్వారం, జననాంగ భాగాల మధ్య దద్దు ఏదైనా ఉందా? మలద్వారం వద్ద చీలికల వంటివి ఉన్నాయా? అనేవి గమనించాలి. ఏదైనా అనుమానం వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని