గర్భిణికి పరీక్షా సమయం!

గర్భధారణ అనగానే తల్లి మనసు పులకిస్తుంది. ఇంటిల్లిపాదీ ఆనంద డోలికల్లో తేలియాడుతుంది. అదే సమయంలో ఎన్నో సందేహాలూ పుట్టుకొస్తుంటాయి. ఒకప్పుడు ఇంట్లో పెద్దవాళ్లు ఉండేవారు. మానసికంగా భరోసా ఇస్తుండేవారు. ప్రస్తుత చిన్న కుటుంబాల కాలంలో అమ్మలు, బామ్మలు వెంట ఉండటం కరవవుతోంది.

Updated : 07 Jun 2022 06:51 IST

గర్భధారణ అనగానే తల్లి మనసు పులకిస్తుంది. ఇంటిల్లిపాదీ ఆనంద డోలికల్లో తేలియాడుతుంది. అదే సమయంలో ఎన్నో సందేహాలూ పుట్టుకొస్తుంటాయి. ఒకప్పుడు ఇంట్లో పెద్దవాళ్లు ఉండేవారు. మానసికంగా భరోసా ఇస్తుండేవారు. ప్రస్తుత చిన్న కుటుంబాల కాలంలో అమ్మలు, బామ్మలు వెంట ఉండటం కరవవుతోంది. దీంతో ఏవేవో సంకోచాలు, అనుమానాలు మనసును పట్టి పీడిస్తుంటాయి. తొలిసారి గర్భం ధరించినవారికైతే మరీనూ. ఎప్పుడు డాక్టర్‌ దగ్గరికి వెళ్లాలి? ఏయే పరీక్షలు చేయించుకోవాలి?  ఇలాంటి అనుమానాలెన్నో కలవరం కలిగిస్తుంటాయి. ఈ నేపథ్యంలో గర్భిణులకు అవసరమైన పరీక్షలపై సమగ్ర కథనం మీకోసం.  

ఫలదీకరణ, గర్భధారణ, కాన్పు సహజంగా జరిగే ప్రక్రియలే. అయితే ఇవి అందరికీ అంతే సవ్యంగా సాగుతాయని చెప్పలేం. గర్భం ధరించినప్పట్నుంచీ కాన్పు పూర్తయ్యే వరకూ ఎప్పుడైనా ఇబ్బందులు తలెత్తొచ్చు. తల్లికి రక్తహీనత, అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు వస్తే బిడ్డ ఎదుగుదల మీద ప్రభావం చూపొచ్చు. పైకి అంతా బాగానే అనిపిస్తున్నా లోలోపల బిడ్డ శరీర నిర్మాణంలో లోపాలకు బీజం పడుతుండొచ్చు. వీటి విషయంలో అప్రమత్తత ఎంతైనా అవసరం. క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించటం, అవసరమైన పరీక్షలు చేయించుకోవటం తప్పనిసరి. వీటితో ఏవైనా సమస్యలు మొదలవుతుంటే ముందుగానే పట్టుకోవచ్చు. తగు జాగ్రత్తలతో పండంటి బిడ్డను కనొచ్చు.

ప్రణాళికా బద్ధంగా.. 

చాలామంది గర్భం ధరించిన తర్వాతే జాగ్రత్తల గురించి ఆలోచిస్తుంటారు. నిజానికి గర్భధారణకు ముందే ప్రణాళిక వేసుకోవాల్సి ఉంటుంది. పెళ్లి అవగానే పిల్లల్ని కనాలని అనుకోవటం మంచిదే కావొచ్చు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. భర్త ఒకచోట, భార్య ఒకచోట ఉద్యోగాలు చేస్తున్న రోజులివి. ఒకప్పటిలా ఇంట్లో పెద్దవాళ్ల అండ ఉండటం లేదు. కాబట్టి గర్భం ధరించటానికి ముందే పిల్లలను పెంచగలమా, లేదా? తగినంత సమయం ఇవ్వగలమా, లేదా? అనేది బేరీజు వేసుకోవటం మంచిది. వయసునూ దృష్టిలో పెట్టుకోవాలి. మరీ చిన్న వయసులో గానీ ఆలస్యంగా గానీ పిల్లలను కనటం తగదు. ఆడవారు 18 ఏళ్లలోపు గర్భం ధరిస్తే గుర్రపువాతం, నెలలు నిండకముందే కాన్పవ్వటం వంటి సమస్యల ముప్పు ఎక్కువ. జనన మార్గం చిన్నగా ఉంటే కాన్పు కష్టం కావొచ్చు, సిజేరియన్‌ చేయాల్సి రావొచ్చు. ఇక 37 ఏళ్ల తర్వాత గర్భం ధరించినా కష్టమే. సాధారణంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆడ పిల్లల్లో అండాలు ఏర్పడతాయి. ఆ తర్వాత వీటి సంఖ్య పెరగటమనేది ఉండదు. రజస్వల అయ్యాక రుతుక్రమం రూపంలో నెల నెలా అండాల సంఖ్య తగ్గుతూనే వస్తుంది. వయసు మీద పడుతున్నకొద్దీ అండాల వయసూ పెరుగుతూ వస్తుంది. మగవారికైతే ఈ సమస్య లేదు. వీర్యకణాలు రోజూ ఉత్పత్తి అవుతుంటాయి. ఇవి మూడు నెలల పాటు వృషణాలకు అంటుకొని ఉండే గొట్టంలో ఉండి, పరిపక్వమయ్యాకే విడుదలవుతాయి. వయసు మీద పడ్డా వీర్యకణాలు తాజాగానే ఉంటాయి. ఆడవారు ఆలస్యంగా.. అంటే 37 ఏళ్ల తర్వాత గర్భం ధరిస్తే వయసు మీరిన అండం, తాజా వీర్యం కలయికతో కొన్ని జన్యుపరమైన మార్పులు రావొచ్చు. పుట్టబోయే పిల్లలకు ఎదుగుదల లోపం (డౌన్‌ సిండ్రోమ్‌) వంటి జబ్బులు తలెత్తొచ్చు. కాబట్టి ఆడవాళ్లు 21 నుంచి 29 ఏళ్ల మధ్యలో గర్భం ధరించటం ఉత్తమం. ఈ సమయంలో అండాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఫలదీకరణ బాగా జరుగుతుంది. గర్భధారణ సమయంలో సమస్యలు తలెత్తే అవకాశం తక్కువ. అందువల్ల గర్భధారణకు సన్నద్ధం కావటానికి ముందే డాక్టర్‌ను కలిసి సలహా (ప్రికన్‌సెప్షన్‌ కౌన్సెలింగ్‌) తీసుకోవాలి. ఆరు వారాల ముందు నుంచే ఫోలిక్‌యాసిడ్‌ మాత్రలు ఆరంభించాలి. ఇవి పుట్టబోయే పిల్లల్లో నాడీ లోపాల వంటి అవకరాలు తలెత్తకుండా చూస్తాయి. కావాలంటే ఈ మాత్రలను 14 వారాల తర్వాత ఆపేయొచ్చు. అప్పటికి అవయవాలన్నీ తయారై ఉంటాయి. 

10 రోజులు దాటగానే.. 

గర్భం ధరించినట్టు అనిపిస్తే మూడు నెలల వరకూ ఎవరికీ చెప్పకూడదని, డాక్టర్‌ దగ్గరికి వెళ్లకూడదని చాలామంది భావిస్తుంటారు. ఇది తప్పు. రుతుక్రమం సరిగా అయ్యేవారు సమయానికి నెలసరి రాకపోతే 10 రోజులు దాటగానే డాక్టర్‌ను కలవాలి. తొలి మూడు నెలల్లోనే గర్భస్థ శిశువులో అవయవాలు తయారవుతాయి. ఈ సమయంలో తగినంత ఫోలిక్‌యాసిడ్‌ అందకపోతే బిడ్డకు అవకరాలు తలెత్తే ప్రమాదముంది. నెలసరి నిలిచాక 10వ రోజు నుంచే మూత్ర పరీక్షలో గర్భం ధరించిందీ లేనిదీ తెలిసిపోతుంది. గర్భం ధరించినప్పుడు శరీరంలో చాలా మార్పులు జరుగుతుంటాయి. వీటిల్లో ఒకటి హ్యూమన్‌ కోరియానిక్‌ గొనడోట్రోపిన్‌ (హెచ్‌సీజీ) విడుదల కావటం. ఇది కేవలం గర్భిణుల్లోనే ఉంటుంది. మూత్ర పరీక్ష ద్వారా దీన్ని గుర్తించొచ్చు. కొన్నిసార్లు మూత్రపరీక్షలో ఫలితం సరిగా రాకపోవచ్చు. గర్భం ధరించకపోయినా ధరించినట్టు, గర్భధారణ జరిగినా కానట్టు ఫలితం వెలువడొచ్చు. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో రక్త పరీక్ష (సీరం బీటా హెచ్‌సీజీ) ఉపయోగపడుతుంది. అవసరమైతే అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేసీ చూస్తారు. ఇందులో గర్భం ధరించిన విషయంతో పాటు పిండం గర్భసంచిలోనే ఉందా? బయట ఎక్కడైనా ఉందా? అనేదీ బయటపడుతుంది. 

ప్రాథమిక పరీక్షలు ప్రధానం 

మన శరీరంలో జరిగే జీవక్రియల ఆనవాళ్లన్నీ రక్తం, మూత్రంలో కనిపిస్తాయి. గర్భిణుల విషయంలో వీటిపై మరింత అప్రమత్తత అవసరం. ఏవైనా జబ్బులున్నా, జబ్బులు మొదలయ్యే అవకాశమున్నా తెలుసుకో వటానికివి ఉపయోగపడతాయి. 

* హిమోగ్లోబిన్‌: ఇది అన్నింటికన్నా అతి ముఖ్యమైన పరీక్ష. రక్తంలో ఆక్సిజన్‌ను మోసుకెళ్లేది హిమోగ్లోబినే. తల్లికిది తగ్గితే బిడ్డకు ఆక్సిజన్‌ అందటమూ పడిపోతుంది. ఎదుగుదల దెబ్బతింటుంది. జన్యుపరమైన మార్పులూ తలెత్తొచ్చు. బిడ్డ ఎదగాల్సినంతగా పెరగకపోతే పెద్దయ్యాక అధిక రక్తపోటు, మధుమేహం వంటి జబ్బుల ముప్పు ఎక్కువవుతుంది కూడా (ఫీటల్‌ ప్రోగ్రామింగ్‌ ఫర్‌ అడల్ట్‌ డిసీజెస్‌). అందువల్ల గర్భధారణ జరిగినట్టు తెలియగానే హిమోగ్లోబిన్‌ పరీక్ష చేయటం తప్పనిసరి. దీన్ని తిరిగి 5, 8, 9 నెలల్లోనూ.. కాన్పు గదిలోకి వచ్చినప్పుడూ చేస్తారు. సాధారణంగా గర్భిణులకు హిమోగ్లోబిన్‌ మోతాదులు 11 గ్రాములు ఉండాలి. రెండో త్రైమాసికంలో కనీసం 10 గ్రాములైనా ఉండాలి. ఏమాత్రం తగ్గినా మందులు వేసుకోవాల్సి ఉంటుంది. హిమోగ్లోబిన్‌ తక్కువగా ఉన్నవారికి కాన్పు తర్వాత రక్తస్రావమైతే రక్తపోటు పడిపోవటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి రక్తం ఎక్కించటానికి ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. 

* థైరాయిడ్‌: బిడ్డ మెదడు ఎదుగుదలకు థైరాయిడ్‌ హార్మోన్‌ చాలా ముఖ్యం. తొలి 12 వారాల్లో ఇది ఉత్పత్తి కాదు. తల్లి నుంచే అందాలి. కాబట్టి గర్భధారణ నిర్ధరణ కాగానే థైరాయిడ్‌ పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఈ హార్మోన్‌ ఉత్పత్తిని టీఎస్‌హెచ్‌ ప్రేరేపిస్తుంది. దీని మోతాదు 12 వారాల్లోపు 2.5 కన్నా తక్కువుండాలి. రెండో, మూడో త్రైమాసికంలో 3.5 కన్నా తక్కువుండాలి. మిగతావారికి టీఎస్‌హెచ్‌ 10 వరకు ఉన్నా మందులు ఆరంభించరు. కానీ గర్భిణుల విషయంలో అంతవరకు ఉపేక్షించకూడదు. ఒకవేళ అప్పటికే థైరాయిడ్‌ మాత్రలు వేసుకుంటుంటే మందు మోతాదు పెంచాల్సి ఉంటుంది. 

* ఇన్‌ఫెక్షన్‌ పరీక్షలు: హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ బి, హెచ్‌పీవీ, సుఖవ్యాధులను నిర్ధరించే పరీక్షలూ ముఖ్యమే. తల్లికి ఇలాంటి జబ్బులుంటే బిడ్డకూ సంక్రమించే అవకాశముంది. కాన్పు చేసే డాక్టర్‌, నర్సులకూ ప్రమాదమే. తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ సోకకుండా చూసే మందులు ఉన్నాయి. తల్లికి హెపటైటిస్‌ బి ఉంటే పుట్టగానే బిడ్డకు టీకా ఇవ్వాలి. 

* గ్లూకోజు ఛాలెంజ్‌ పరీక్ష: మనదేశంలో మధుమేహం చాలా ఎక్కువ. లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా మధుమేహం రావొచ్చు. మూడో నెలలోపే ఒకసారి రక్తంలో గ్లూకోజు పరీక్ష చేయిస్తారు. అప్పటికే గ్లూకోజు ఎక్కువగా ఉంటే ముందు నుంచే మధుమేహం ఉందని అర్థం. కొందరికి గర్భధారణ సమయంలోనే మధుమేహం మొదలవ్వచ్చు. కాబట్టి 5వ నెలలో గ్లూకోజ్‌ ఛాలెంజ్‌ పరీక్ష చేస్తారు. ఇందులో గ్లూకోజు ద్రావణాన్ని తాగించి, 2 గంటల తర్వాత రక్తంలో గ్లూకోజు మోతాదులను పరీక్షిస్తారు. ఇది 140 కన్నా ఎక్కువుంటే మధుమేహం ఉన్నట్టే. మధుమేహం ఉన్నట్టయితే నియంత్రణలో ఉంచుకోవటం ముఖ్యం. 

* యాంటీబాడీ పరీక్షలు: కొన్నిసార్లు తల్లి రక్తంలో యాంటీబాడీలు, ఆటోయాంటీబాడీలు ఉండొచ్చు. ఇవి బిడ్డ ఎదుగుదలను దెబ్బతీయొచ్చు. ఇన్‌డైరెక్ట్‌, డైరెక్ట్‌ కూంబ్స్‌ పరీక్షల ద్వారా వీటిని గుర్తించొచ్చు. 

* రక్తం గ్రూపు: కాన్పు సమయంలో రక్తస్రావమయ్యే అవకాశముంది. అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి, కాన్పు బాగానే అవుతుందని అనుకున్న సందర్భాల్లోనూ హఠాత్తుగా రక్తస్రావం కావొచ్చు. అలాంటప్పుడు రక్తం అందుబాటులో ఉండాలి కదా. ఏబీ పాజిటివ్‌, ఏబీ  నెగెటివ్‌ గ్రూపు రక్తం చాలా అరుదు. అప్పటికప్పుడు దొరక్కపోవచ్చు. ముందే ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.  అందువల్ల రక్తం గ్రూపు తెలుసుకొని ఉండటం ఎంతైనా అవసరం. కొందరు గర్భిణులకు రక్తం గ్రూపు నెగెటివ్‌గా ఉండొచ్చు. అప్పుడు భర్త రక్తం గ్రూప్‌నూ తెలుసుకోవాల్సి ఉంటుంది. భర్త రక్తం పాజిటివ్‌గా ఉంటే బిడ్డకూ చాలావరకు పాజిటివ్‌గానే ఉండొచ్చు. నెగెటివ్‌, పాజిటివ్‌ గ్రూప్‌లకు పడదు. మాయలోంచి కొన్ని రక్తకణాలు గర్భిణి రక్తంలో కలుస్తుంటాయి. వీటికి యాంటీబాడీలు తయారవుతాయి. ఇవి తేలికగా మాయలోంచి బిడ్డకు చేరుకొని, రక్తకణాలను దెబ్బతీస్తాయి. వీరికి 7వ నెలలో ‘యాంటీ డీ గామా గ్లాబులిన్‌’ ఇంజెక్షన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది తల్లి రక్తంలో కలిసే ఆర్‌హెచ్‌ పాజిటివ్‌ రక్తం కణాలను చంపుతుంది. యాంటీబాడీలు తయారుకాకుండా కాపాడుతుంది. కాన్పు తర్వాత బిడ్డ రక్తం గ్రూపునూ పరీక్షించాల్సి ఉంటుంది. బిడ్డ  రక్తం ఆర్‌హెచ్‌ పాజిటివ్‌గా ఉన్నట్టయితే తల్లికి మరోసారి ‘యాంటీ డీ గామా గ్లాబులిన్‌’ ఇంజెక్షన్‌ ఇస్తారు. దీన్ని 24 గంటల్లోపే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే కాన్పు సమయంలో బిడ్డ రక్తకణాలు తల్లి రక్తంలో కలిసే అవకాశాలు ఎక్కువ. ఇంజెక్షన్‌ ఇస్తే తల్లికి యాంటీబాడీలు తయారుకావు. తర్వాత గర్భం ధరించినప్పుడు ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవచ్చు. 

* క్రియాటిన్‌: దీంతో కిడ్నీ పనితీరు తెలుస్తుంది. మామూలుగానే గర్భధారణ సమయంలో కిడ్నీలకు ఎక్కువగా రక్తం సరఫరా అవుతుంది. దీంతో క్రియాటిన్‌ మోతాదులు చాలా తక్కువగా ఉంటాయి. కాన్పు తేదీ దగ్గర పడుతున్నప్పుడు దీని మోతాదులు రెట్టింపు అయితే కిడ్నీ దెబ్బతినే అవకాశం ఎక్కువ. 

* హెచ్‌పీఎల్‌సీ పరీక్ష: మనదగ్గర కొన్ని సమాజాల్లో థలసీమియా ఎక్కువ. దీనికి కారణమయ్యే జన్యువు ఉన్నా పైకి లక్షణాలేవీ ఉండవు. కానీ ఇది వీరి నుంచి పిల్లలకు సంక్రమిస్తుంది. దీన్ని గుర్తించటానికి తొలి త్రైమాసికంలో హెచ్‌పీఎల్‌సీ పరీక్ష చేస్తారు. తల్లికి మైనర్‌ రకం థలసీమియా ఉన్నట్టయితే భర్తకూ పరీక్ష అవసరం. భర్తకు కూడా మైనర్‌ రకం ఉన్నట్టయితే బిడ్డకు మేజర్‌ రకం థలసీమియా వచ్చే అవకాశం ఎక్కువ.     ఇది ప్రమాదకరం. ఈ పరీక్ష కాస్త ఖరీదైనదే అయినా చేయించుకుంటే మంచిది. నెగెటివ్‌ అయితే మనశ్శాంతిగా ఉండొచ్చు.
* కాలేయ సామర్థ్యం, కొలెస్ట్రాల్‌ పరీక్షలూ అవసరమవుతాయి.
* మూత్రంలో ప్రొటీన్‌, గ్లూకోజు, బిలిరుబిన్‌ను తెలిపే పరీక్షలూ చేయాల్సి ఉంటుంది.


క్రమం తప్పకుండా..

ఒకసారి డాక్టర్‌కు చూపించుకున్నాం, స్కానింగ్‌లో అంతా బాగానే ఉంది కదా. ఇక డాక్టర్‌ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదనుకోవద్దు. గర్భధారణకు ముందు, గర్భం ధరించిన తర్వాత క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఏడో నెల వరకు (28 వారాలు) నెల నెలా ఆసుపత్రికి వెళ్లాలి. 28-36 వారాల వరకు 15 రోజులకు ఒకసారి డాక్టర్‌ను కలవాలి. రక్తపోటు పెరగటం వంటి ఇబ్బందులు మొదలైతే ఈ సమయంలోనే తెలుస్తాయి. 36 నుంచి 40 వారాల మధ్యలో వారానికి ఒకసారి ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ సమయంలో కాన్పు ఎప్పుడైనా కావొచ్చు. ప్రతిసారీ రక్తపోటు పరీక్ష చేయటం తప్పనిసరి.


స్కానింగ్‌ కీలకం

స్కాన్‌ పరీక్షల్లో బొడ్డుతాడులో రక్త ప్రవాహం, మాయ నుంచి పిండం మెదడు, గుండెకు రక్త ప్రసరణ (డక్టస్‌ వీనోసస్‌ ఫ్లో), గర్భసంచిలో రక్తనాళాల తీరు తెన్నులూ తెలుస్తాయి. బొడ్డుతాడు నుంచి తగినంత రక్తం సరఫరా కాకపోతే పిండం ఎదుగుదల దెబ్బతింటుంది. ఈ పరీక్షల ఆధారంగా గర్భిణికి అధిక రక్తపోటు వచ్చే అవకాశాన్నీ గుర్తించొచ్చు. అధిక రక్తపోటు తలెత్తే అవకాశముంటే ముందే తక్కువ మోతాదు ఆస్ప్రిన్‌ ఆరంభించాల్సి ఉంటుంది. ఇది అధిక రక్తపోటు రాకుండా చేయదు గానీ మాయ దెబ్బతినకుండా కాపాడుతుంది. రక్తపోటు పెరిగినప్పుడు మాయలో రక్త ప్రసరణ సరిగా సాగదు. దీంతో పిండానికి రక్త సరఫరా తగ్గుతుంది. లోపలే చనిపోవచ్చు. ముందే జాగ్రత్త పడితే ప్రమాదాన్ని నివారించుకోవచ్చు.

మారుమూల ప్రాంతాల్లో స్కానింగ్‌ సదుపాయాలు అంతగా అందుబాటులో ఉండవు. కాబట్టి ఐదో నెలలోపు కనీసం ఒకసారైనా గర్భిణికి అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేయటం తప్పనిసరని ప్రపంచ ఆరోగ్యసంస్థ చెబుతోంది. పిండంలో ఏవైనా అవకరాలుంటే అప్పటికి బయటపడతాయి. నిజానికి మామూలుగానైతే గర్భధారణ సమయంలో ఐదు సార్లయినా స్కానింగ్‌ అవసరమవుతుంది. అందరికీ 28 రోజులవగానే నెలసరి రాదు. కొందరికి 35 రోజులకు, 40 రోజులకు రావొచ్చు. మరికొందరికి రెండు, మూడు నెలల వరకూ రాకపోవచ్చు. ఇలాంటివారు గర్భం ధరించిన విషయం వెంటనే తెలియదు. చివరి నెలసరి తేదీ కూడా కచ్చితంగా తెలియదు. కాబట్టి ఎవరికైనా సరే.. గర్భం ధరించినట్టు తేలితే తొలి 10-12 వారాల్లో స్కానింగ్‌ చేయటం మంచిది. దీన్నే ‘ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్‌’ అంటారు. ఇందులో పిండం తల నుంచి పిరుదుల వరకు పొడవును బట్టి కాన్పయ్యే తేదీని అంచనా వేస్తారు. కాన్పు తేదీని తెలుసుకోవటానికిదే ప్రామాణికం. మామూలుగా పిండానికి పైన మాయ ఉండాలి. అయితే కొందరికి కింద ఉండొచ్చు. దీంతో రక్తస్రావం, బిడ్డ ఎదగకపోవటం వంటి ఇబ్బందులు తలెత్తొచ్చు. స్కానింగ్‌లో మాయ ఎక్కడ ఉందనేదీ తెలుస్తుంది.
* ఎర్లీ టిఫా స్కానింగ్‌: దీన్ని 12-13.6 వారాల మధ్యలో చేస్తారు. పిండంలో అవకరాలైనా తలెత్తుతున్నాయా? గర్భిణికి మున్ముందు అధిక రక్తపోటు వచ్చే అవకాశముందా? అనేవి ఇందులో తెలుస్తాయి.
* లేట్‌ టిఫా స్కానింగ్‌: దీన్ని 5వ నెలలో (19-22 వారాల మధ్యలో) చేస్తారు. ఏవైనా అవకరాలుంటే చాలావరకు ఈ తొలి, మలి టిఫా స్కాన్లతోనే బయటపడతాయి. అయితే అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌లో అన్ని లోపాలు, సమస్యలు తెలుస్తాయని చెప్పలేం. కొన్ని గుండె సమస్యలు, వెన్ను లోపాల వంటివి 7, 8 నెలల్లోనే బయటపడుతుంటాయి. ఆటిజమ్‌, సెరిబ్రల్‌ పాల్సీ వంటి మానసిక సమస్యలు స్కానింగ్‌లో తెలియవు.  
* గ్రోత్‌ స్కాన్‌: దీన్ని 28-32 వారాల మధ్యలో చేస్తారు. ఇందులో బిడ్డ ఎదుగుదల తీరు తెన్నులు బయటపడతాయి.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని