Updated : 23 Jul 2019 00:40 IST

తీయ(ర)ని చికాకులు!

మధుమేహం తీయని శత్రువు! చడీ చప్పుడు లేకుండా.. చాపకింద నీరులా.. ప్రతి కణాన్ని, ప్రతి అవయవాన్ని దెబ్బతీస్తుంది. ఎన్నెన్నో దుష్ప్రభావాలను తెచ్చిపెడుతుంది. మధుమేహం ఉన్నా వెంటనే బయటపడకపోవచ్చు. బయటపడ్డా చాలా ఏళ్ల పాటు దుష్ప్రభావాల ఆనవాళ్లేవీ కనబడకపోవచ్చు. ఏవైనా లక్షణాలు కనబడినా ఇతరత్రా సమస్యలుగానూ పొరపడొచ్చు. ఇలా తెలిసి కొంత, తెలియక కొంత ఎంతోమంది ‘తీయని’ చిక్కుల్లో పడిపోతున్నారు. నాడులు దెబ్బతినటం, రోగ నిరోధకశక్తి తగ్గుముఖం పట్టటం వంటివన్నీ వీటికి దోహదం చేస్తుంటాయి. మధుమేహ దుష్ప్రభావాలనగానే గుండెజబ్బులు, కిడ్నీ జబ్బుల వంటివే గుర్తుకొస్తాయి. అంత తీవ్రమైనవి, ప్రాణాంతకరమైనవి కాకపోయినా కొన్ని సమస్యలు ‘తీరని’ చికాకులకు గురిచేస్తుంటాయి. ఒకపట్టాన వదలకుండా నిరంతరం మనసును తొలిచేస్తుంటాయి. వీటిల్లో కొన్ని వయసుతో పాటు వచ్చే సమస్యలే అయినా మధుమేహం మూలంగా ఇంకాస్త త్వరగానూ దాడిచేస్తుంటాయి. అయినా కూడా గ్లూకోజును అదుపులో ఉంచుకోగలిగితే చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఇన్సులిన్‌తోనైతే సుమారు 50% వరకూ తగ్గిపోతాయి. ఆయా సమస్యలను బట్టి తగు మందులూ వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తగు జాగ్రత్తలతో తీయ(ర)ని చికాకులను హాయిగా జయించొచ్చు.

పాదాల మంట

దీనికి ప్రధాన కారణం నాడులు దెబ్బతినటం. ముఖ్యంగా స్పర్శ నాడులు దెబ్బతిన్నప్పుడు పాదాలు మొద్దుబారినట్టూ, దూది మీద నడుస్తున్నట్టూ అనిపిస్తుంటుంది. మేకుల వంటివి గుచ్చుకున్నా తెలియదు. కొందరికి చర్మానికి ఏమీ తాకకపోయినా తాకినట్టు ఉంటుంది. గాజు పెంకుల మీద నడుస్తున్నట్టు, చీమలు పాకుతున్నట్టు, సూది పెట్టి గుచ్చినట్టు ఉంటుంది. ఫ్యాను గాలి తగిలినా పాదాలు మండినట్టు అనిపించొచ్చు. ఇలాంటి సమస్యలు మధుమేహం బయటపడిన తొలిరోజు నుంచే ఎంతో కొంత ఉండటం గమనార్హం. మధుమేహుల్లో ప్రత్యేకించి కనబడే మరో సమస్య మెరాల్జియా పారెస్తిటికా. ఇందులో తొడల పక్కన.. ప్యాంటు పక్క జేబులు తగిలే చోట నిరంతరం మంట పుడుతుంటుంది. 
చికిత్స: గ్లూకోజు నియంత్రణలో ఉంచుకోవటం ముఖ్యం. దీంతో పాటు ఫ్లూఆక్సిటిన్‌, ఎమిట్రిప్టిలిన్‌, గాబాపెంటిన్‌, మిథైల్‌కోబలమైన్‌ రకం మందులూ వేసుకోవాల్సి ఉంటుంది.

విరేచనాలు-మలబద్ధకం 

తిన్న ఆహారం సాధారణంగా 30-45 నిమిషాల్లో జీర్ణాశయం నుంచి కిందికి వెళ్లిపోతుంది. మధుమేహుల్లో ఇందుకు చాలా సమయం పడుతుంది (గ్యాస్ట్రో పెరెసిస్‌). చిన్న, పెద్ద పేగుల కదలికలూ మందగిస్తాయి. దీంతో కడుపుబ్బరం, మంట, తేన్పుల వంటివి ఇబ్బంది పెడతాయి. గ్లూకోజు నియంత్రణకు వాడే మెట్‌ఫార్మిన్‌, గ్లిప్టిన్‌ రకం మందులూ వీటికి దోహదం చేయొచ్చు. పేగుల్లో ఆహారం నెమ్మదిగా కదలటం వల్ల మలబద్ధకం, విరేచనాలు మార్చి మార్చి వేధిస్తుంటాయి. పేగుల్లో ఆహారం ఎక్కువకాలం నిల్వ ఉన్నప్పుడు శరీరం దాన్ని నీళ్ల విరేచనాల రూపంలో బయటకు పంపించటానికి ప్రయత్నిస్తుంది. విరేచనాలతో పేగులు ఖాళీ కాగానే మళ్లీ రెండు, మూడు రోజుల పాటు మలబద్ధకం వేధిస్తుంది. ఇంట్లో ఏమో గానీ ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడివి చిక్కులు తెచ్చిపెడతాయి. 
చికిత్స: పేగుల కదలికలను మెరుగు పరచే మందులు బాగా ఉపయోగపడతాయి. వీటితో మల విసర్జన సాఫీగా అవుతుంది. ఫలితంగా మల బద్ధకం, విరేచనాలు మార్చి మార్చి వేధించటం తగ్గుతుంది. 

జననాంగ ఇన్‌ఫెక్షన్లు

వీటికి ప్రధాన కారణం తెల్ల రక్తకణాల పనితీరు అస్తవ్యస్తం కావటం, యాంటీబాడీల ఉత్పత్తి తగ్గటం. ఫలితంగా రోగనిరోధక శక్తి తగ్గిపోయి.. జననాంగ భాగాల్లో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు తలెత్తుతాయి. మగవారిలో అంగం మీద తెల్లటి పొర ఏర్పడి, పగిలినట్టు అవుతుంది (బెలనైటిస్‌). ఆడవారిలో ఇది తెల్లబట్ట (వజైనల్‌ మొనీలియాసిస్‌) రూపంలో కనబడుతుంది. గ్లూకోజు నియంత్రణలో ఉంచుకోవటం వీరికి మేలు చేస్తుంది. గ్లూకోజు నియంత్రణలోకి వచ్చిన మూడో రోజే వాటంతటవే తగ్గిపోతాయి. చిక్కేంటంటే ఇవి తరచుగా వచ్చి, పోతుండటం. దీంతో మగవారు అంగం మంట, ఆడవారు తెల్లబట్టతో నిరంతరం సతమతమవుతూ ఉంటారు. చర్మం తడిగా ఉండే గజ్జలు, కాలి వేళ్ల మధ్యలోనూ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు అదేపనిగా వేధిస్తుంటాయి. మందులు వాడినా తగ్గకుండా ఇబ్బంది పెడుతుంటాయి. కొందరికి చర్మం మీద తెల్ల పొడ (టీనియా కార్పోరిస్‌) కూడా రావొచ్చు. ఇవేవీ ఒక రోజులో తగ్గేవి కావు. మందులతో అప్పటికి తగ్గినా తిరిగి మళ్లీ వస్తుంటాయి. 
చికిత్స: జననాంగ భాగాలను, చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవటం మంచిది. కాలి వేళ్ల మధ్య తడి లేకుండా చూసుకోవటం మరీ ముఖ్యం. ఇన్‌ఫెక్షన్లకు యాంటీ ఫంగల్‌ లేపనాలు వాడుకుంటే సరిపోతుంది.

మాటిమాటికీ మూత్రం

చికాకుకు గురిచేసే సమస్యల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇదే. ఆడవాళ్లను మరింతగా ఇబ్బంది పెడుతుంది. ఎక్కడికన్నా వెళ్లాలన్నా భయపడిపోతుంటారు. రక్తంలో గ్లూకోజు మోతాదులు ఎక్కువుంటే శరీరం దాన్ని మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంటుంది. దీంతో మూత్రం ఎక్కువగా వస్తుంది. గ్లూకోజు నియంత్రణలో ఉంటే పగటిపూట తగ్గొచ్చు గానీ రాత్రిపూట వేధిస్తూనే ఉంటుంది. నాలుగైదు సార్లు నిద్రలోంచి లేవాల్సీ రావొచ్చు. మధుమేహులకు సహజంగానే మూత్రకోశ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువ. దీనికి తోడు స్వయం చాలిత నాడీవ్యవస్థ దెబ్బతినటం వల్ల మూత్రాశయం సరిగా సంకోచించదు. ఫలితంగా మూత్రం పూర్తిగా ఖాళీ కాదు. కొంత లోపలే ఉండిపోతుంటుంది. ఇది మూత్రాశయాన్ని చికాకుకు గురిచేయటం వల్ల ఎప్పుడూ మూత్రం వస్తున్నట్టు అనిపిస్తుంటుంది. మగవారిలో ప్రోస్టేట్‌ గ్రంథి ఉబ్బటమూ దీనికి దోహదం చేస్తుంది.
చికిత్స: కాస్త సమయం పట్టినా మూత్రం పూర్తిగా పోసేలా చూసుకోవాలి. ఇన్‌ఫెక్షన్లు తగ్గటానికి తగు యాంటీబయోటిక్స్‌ వేసుకోవాలి. కొన్నిసార్లు వీటిని దీర్ఘకాలం వాడుకోవాల్సి ఉంటుంది. 

నోటి దుర్వాసన

దీనికి మూలం నోరు ఎండిపోవటం. మధుమేహంలో లాలాజలం ఉత్పత్తి తగ్గిపోయి.. నోట్లో రక్షణ వ్యవస్థ, శుభ్రత దెబ్బతింటాయి. అలాగే పేగుల్లో ఆహారం ఎక్కువసేపు నిల్వ ఉండటం, రోగనిరోధక శక్తి తగ్గటం వల్ల తలెత్తే చిగుళ్లవాపు దీనికి మరింత ఆజ్యం పోస్తుంటాయి. మధుమేహుల్లో ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గటం కూడా సమస్యే. దీంతో శ్వాస ద్వారా బయటకు వచ్చే గాలి పరిమాణం తగ్గి.. స్రావాలు లోపలే ఉండిపోతుంటాయి. ఇవన్నీ దుర్వాసన కలగజేస్తాయి. మంచి విషయం ఏంటంటే- నోటి దుర్వాసనను, చిగుళ్ల వాపును నివారించుకున్నా.. తగు చికిత్స తీసుకున్నా మందులతో పనిలేకుండానే రక్తంలో గ్లూకోజు మోతాదులు సగానికి సగం తగ్గిపోవటం. అంతేకాదు, గుండెజబ్బులూ దరిజేరవు. వచ్చినా అంత తీవ్రంగా ఉండవు.
చికిత్స: నోటి శుభ్రత ముఖ్యం.  రెండు పూటలా పళ్లు తోముకోవాలి. డెంటల్‌ యాంటీసెప్టిక్‌ ద్రావణాలతో నోరు పుక్కిలించాలి. పేగుల కదలికలు, ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడటానికి తగు మందులు వేసుకోవాలి.

స్తంభన లోపం

మగవారిలో అంగం సరిగా గట్టిపడకపోవటం మరో సమస్య. దీనికి ముఖ్య కారణం స్వయం చాలిత నాడీ వ్యవస్థ దెబ్బతినటం. అంగం గట్టిపడినా కొందరికి స్ఖలనం వెంటనే అవుతుంటుంది. కొన్నిసార్లు వీర్యం మూత్రాశయంలోకి వెనక్కి మళ్లిపోవచ్చు. వీటి గురించి బయటకు చెప్పుకోలేక చాలామంది లోలోపలే సతమతమైపోతుంటారు. అప్పటికే పిల్లలు ఉండటం, పిల్లలు పెద్దగా అవ్వటం, ఇతరత్రా సమస్యలతో బాధపడుతుండటం వల్ల దీన్ని పెద్దగా పట్టించుకోరు. కొందరు డాక్టర్ల సలహా లేకుండా వయాగ్రా వంటి మాత్రలనూ ఆశ్రయిస్తుంటారు గానీ గుండెజబ్బులు గలవారికివి చాలా ప్రమాదకరంగా పరిణమిస్తాయి.
చికిత్స: హెచ్‌బీఏ1సీ నార్మల్‌గా ఉంచుకోగలిగితే స్తంభన దానంతటదే మెరుగుపడుతుంది. సమస్య మరీ తీవ్రంగా గలవారికి అంగానికి రక్త సరఫరా మెరుగుపడేలా శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుంది.

మగత

మధుమేహం బారినపడ్డ చాలామందికి గురక, నిద్రలో శ్వాస అడ్డంకి (స్లీప్‌ అప్నియా) కూడా ఉంటుంది. దీంతో శ్వాస సరిగా అందక తరచుగా మెలకువ వచ్చేస్తుంటుంది. మరోవైపు మూత్రానికి ఎక్కువసార్లు లేవాల్సి రావటంతోనూ నిద్ర దెబ్బతింటుంది. ఇవన్నీ పగటి పూట నిద్ర మత్తుకు, మగతకు దారితీస్తుంది. కొందరు ట్రాఫిక్‌ లైట్లు పడిన కొద్దిసేపట్లోనే నిద్రలోకి జారుకుంటారు కూడా. ఆఫీసుల్లోనూ తరచుగా కునికిపాట్లు పడుతుంటారు. ఇది తీవ్రమైన చికాకుకు గురిచేస్తుంటుంది.
చికిత్స: నిపుణుల సలహాతో తగు నిద్ర మందులు వేసుకోవాలి. స్లీప్‌ అప్నియా గలవారు  అవసరమైతే శ్వాస సరిగా ఆడటానికి తోడ్పడే సీప్యాప్‌ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. 
నిద్రకు మధుమేహానికి పెద్ద సంబంధమే ఉంది. మధుమేహానికి ప్రధాన కారణం నిద్ర సరిగా పట్టకపోవటమేనని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. మధుమేహం వచ్చాక గుండెజబ్బులు తలెత్తటానికీ ఇదే కారణమని వివరిస్తున్నాయి. ఆకలి, నిద్ర అనేవి మన మెదడులోని హైపోథాలమస్‌కు సంబంధించిన పనులు. దీని పనితీరు అస్తవ్యస్తం కావటమే అన్ని జబ్బులకూ మూలమన్న భావన పుంజుకుంటోంది. కాబట్టి రాత్రిపూట 7-8 గంటలు నిద్రపోయేలా చూసుకోవటం అత్యవసరం.

జ్ఞాపకశక్తి తగ్గటం

మధుమేహంలో ఇబ్బంది పెట్టే మరో సమస్య విషయ గ్రహణ సామర్థ్యం (కాగ్నిషన్‌) తగ్గిపోవటం. అల్జీమర్స్‌తో వచ్చే మతిమరుపూ ఇందులో భాగమే. అందుకే అల్జీమర్స్‌ను ఇప్పుడు మెదడు మధుమేహం (సెరిబ్రల్‌ డయాబెటీస్‌) అనీ అంటున్నారు. దీనికి మూలం మెదడులో ప్రోటీన్ల పనితీరు అస్తవ్యస్తం కావటం. మధుమేహుల్లో స్వల్ప కాలిక, దీర్ఘ కాలిక జ్ఞాపకశక్తి రెండూ దెబ్బతింటాయి. విశ్లేషణా సామర్థ్యమూ తగ్గిపోతుంటుంది. దీంతో గడియారాన్ని చూసి సమయం చెప్పటానికి ఎక్కువసేపు పడుతుంది. ప్రతిస్పందనలూ తగ్గుతాయి. కొందరు ట్రాఫిక్‌లో ఎర్రలైటు పడినా వెంటనే ఆగరు. ఫోన్‌ డయల్‌ చేసి.. ఎవరికి చేశామా అనీ ఆలోచిస్తుంటారు. నిర్ణయాలు సరిగా తీసుకోవటమూ తగ్గుతుంది. వయసుతో పాటు  మతిమరుపు సహజమే గానీ మధుమేహుల్లో ఇంకాస్త త్వరగా ముంచుకొస్తుంది. రక్తంలో గ్లూకోజు బాగా పడిపోయినవారికి (హైపోగ్లైసీమియా) దీని ముప్పు ఎక్కువ. 
చికిత్స: క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం.. మద్యం, పొగ అలవాట్లకు దూరంగా ఉండటం.. సమతులాహారం తీసుకోవటం ముఖ్యం. మెదడుకు పదునుపెట్టే సుడోకు, పదకేళీలు పూరించటం.. చదరంగం వంటివి ఆడటం మంచిది. చేత్తో రాయటం ఇంకా మంచిది. ఇది అల్జీమర్స్‌ నివారణకూ తోడ్పడుతుంది. 

నిస్సత్తువ

మధుమేహుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య సాయంత్రం అవుతూనే నీరసం, నిస్సత్తువ ఆవరించటం. నిజానికి సుమారు 70% మందిలో సాయంత్రం వేళల్లో నీరసం, నిస్సత్తువ, త్వరగా అలసిపోవటం వంటి లక్షణాలతోనే మధుమేహం తొలిసారి బయట పడుతుంటుంది. వీటికి మూలం జీర్ణక్రియ దెబ్బతినటం. శ్వాస సరిగా తీసుకోకపోవటం వంటి కారణాలతో మధుమేహుల్లో అప్పటికే రక్తంలో ఆక్సిజన్‌ స్థాయులు తగ్గిపోతూ వస్తుంటాయి. దీనికి తోడు తిన్న ఆహారం గ్లూకోజుగా మారి రక్తం ద్వారా కాలేయంలోకి చేరుకోవటం, కాలేయంలోకి వెళ్లిన గ్లూకోజు అక్కడ పరిణామం చెందటం, పాంక్రియాస్‌ నుంచి ఇన్సులిన్‌ ఉత్పత్తి కావటం, గ్లూకోజు కణాల్లోకి చేరాక శక్తిగా మారటం.. ఇలాంటి దశలన్నీ అస్తవ్యస్తమవుతాయి. దీంతో కణాలకు అవసరమైన శక్తి అందదు. ఇది నిస్సత్తువ, నీరసానికి దారితీస్తుంది. చిన్న పనులకే అలసట ముంచుకొస్తుంది.
చికిత్స: తక్కువ తక్కువగా ఎక్కువసార్లు తినటం.. సమతులాహారం తీసుకోవటం.. కంటి నిండా నిద్ర పోవటం ఎంతో మేలు చేస్తాయి. క్యాల్షియం, బి12, బి10, డి విటమిన్ల లోపాలు ఉన్నట్టయితే భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది.

దురద

దీనికి మూలం చర్మం పొడిబారటం. మధుమేహం గలవారిలో చెమట పోయటం చిత్రంగా ఉంటుంది. చర్మం మడతల్లో, దుస్తులు ఉన్నచోట చెమట ఎక్కువగా పోస్తే.. మిగతా చోట్ల అసలేమీ పోయదు. ఇలా చర్మం పొడినబారిన చోట దురదలు వస్తుంటాయి. కాలేయ సమస్యలు, రక్తకణాల్లో లోపాలూ ఇందుకు దోహదం చేయొచ్చు. రోగనిరోధక శక్తి తగ్గటం వల్ల తలెత్తే చర్మ సమస్యలూ దురదను తెచ్చిపెడతాయి. 
చికిత్స: నీటిలో కరిగే కోల్డ్‌ క్రీములు రాసుకోవాలి. చాలామంది కొబ్బరినూనెల వంటివి రాసుకుంటుంటారు. ఇది తప్పు. ఎందుకంటే ఇవి నీటిలో కరగవు. తేమగా ఉండే చోట కోల్డ్‌ క్రీములు రాసుకుంటే దాని మీద పౌడర్‌ చల్లుకోవాలి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు