తొలిపోషణ తొలిరక్షణ

అమృతం.. అద్భుతం.. అద్వితీయం! తల్లిపాలకు ఎన్ని విశేషణాలైనా తక్కువే. నవమాసాలు తనలో పెరిగిన నలుసు.. కడుపులోంచి బయటపడి, కళ్ల ముందు కదలాడిన క్షణాన అమ్మ గుండెల్లోంచి అప్రయత్నంగా పొంగుకొచ్చే చనుబాలకు సాటి మరోటి లేదు. బిడ్డకు తొలి పోషణ, తొలి రక్షణ ఇచ్చేది ఇవే. శిశువు ఎదుగుదలకు అత్యవసరమైన పోషకాలను అందించటమే కాదు..

Updated : 30 Jul 2019 01:09 IST

ఆగస్టు 1-7 ప్రపంచ తల్లిపాల వారం

అమృతం.. అద్భుతం.. అద్వితీయం! తల్లిపాలకు ఎన్ని విశేషణాలైనా తక్కువే. నవమాసాలు తనలో పెరిగిన నలుసు.. కడుపులోంచి బయటపడి, కళ్ల ముందు కదలాడిన క్షణాన అమ్మ గుండెల్లోంచి అప్రయత్నంగా పొంగుకొచ్చే చనుబాలకు సాటి మరోటి లేదు. బిడ్డకు తొలి పోషణ, తొలి రక్షణ ఇచ్చేది ఇవే. శిశువు ఎదుగుదలకు అత్యవసరమైన పోషకాలను అందించటమే కాదు.. రోగనిరోధకశక్తి బలోపేతానికి బీజం వేసేదీ ఇవే. పెద్దయ్యాకా కొన్ని జబ్బుల ముప్పు తగ్గటానికీ పునాది వేస్తాయి. అందుకే పుట్టిన గంటలోపే తల్లిపాలు ఆరంభించటం తప్పనిసరని వైద్యరంగం చాలాకాలంగా ఘోషిస్తోంది. ప్రపంచ తల్లిపాల వారం కూడా దీన్నే నినదిస్తోంది. చనుబాల ప్రాధాన్యాన్ని గుర్తించటం, దీన్ని తల్లిదండ్రులు అవగతం చేసుకోవటం ముఖ్యమని నొక్కి చెబుతోంది. ఈ నేపథ్యంలో తల్లిపాల ప్రాముఖ్యతపై సమగ్ర కథనం ఈ వారం మీకోసం.

బిడ్డకు తల్లే ఆధారం. కడుపులో ఉన్నప్పుడైనా, బయటపడ్డప్పుడైనా శిశువు అన్ని అవసరాలను తీర్చేది తల్లే. కాన్పు సమయంలో సుమారు 3 కిలోల బరువుండే బిడ్డ.. ఐదు నెలలు వచ్చేసరికి రెట్టింపు బరువు పెరుగుతుంది. ఈ సమయంలో శరీర భాగాలు, మెదడు, అవయవాలన్నీ శరవేగంగా వృద్ధి చెందుతుంటాయి. ఇందుకు తగిన పోషకాలన్నీ ఒక్క తల్లిపాలతోనే లభించటం విశేషం. అయినా కూడా ఎంతోమంది పిల్లలకు తల్లిపాల భాగ్యం అంతగా దక్కటం లేదు. మనలాంటి దేశాల్లో కేవలం 37% మంది పిల్లలే ఆరునెలల వరకు పూర్తిగా తల్లిపాలు తాగుతున్నారు. చనుబాల గొప్పతనం తెలియకపోవటమో, ఇచ్చే వెసులుబాటు లేకపోవటమో, బయటకు పనులకు వెళ్లటమో, రొమ్ముల బిగువు తగ్గుతుందని అనుకోవటమో.. కారణమేదైనా చాలామంది శిశువులు తల్లిపాలకు నోచుకోవటం లేదు. నిజానికి చనుబాలను శిశువుల ప్రత్యేకమైన ఔషధమని చెప్పుకోవచ్చు! వీటిని సరిగా ఇవ్వగలిగితే ప్రపంచవ్యాపంగా ఏటా 8.23 లక్షల మంది పిల్లలను ఐదేళ్ల లోపు మరణించకుండా చూసుకోవచ్చు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌తో సంభవిస్తున్న 20వేల మరణాలనూ నివారించుకోవచ్చు. తక్కువకాలం తల్లి పాలు తాగిన పిల్లలతో పోలిస్తే ఎక్కువకాలం తల్లిపాలు తాగిన పిల్లలకు ఇన్‌ఫెక్షన్లు, మరణాల ముప్పు తగ్గటమే కాదు.. తెలివి తేటలూ ఎక్కువేనని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రయోజనాలు అప్పటికే పరిమితం కావటం లేదు. మున్ముందూ కొనసాగుతూ వస్తుండటం విశేషం. అంతేకాదు.. పెద్దయ్యాక అధిక బరువు, మధుమేహం ముప్పులూ తగ్గుముఖం పడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిపాల వైశిష్ట్యాన్ని తెలుసుకోవటం, పూర్తికాలం ఇచ్చేలా చూసుకోవటం, ప్రోత్సహించటం అత్యవసరం.

ప్రత్యేకం..
తల్లిపాలలో ‘హ్యూమన్‌ ఓలిగోసాక్రైడ్లు’ అనే చక్కెరలు ఉంటాయి. పాలిచ్చే జంతువుల్లో వేటిల్లోనూ ఇవి ఉండవు. అంటే కేవలం తల్లిపాలకే ప్రత్యేకమన్నమాట. నిజానికి వీటిని శిశువులు జీర్ణం చేసుకోలేరు. అలాగని చెడ్డవేమీ కావు. పేగుల్లో హాని కారక బ్యాక్టీరియాను నిలువరించి.. మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. రోగనిరోధక ప్రతిస్పందనలనూ నేర్పిస్తాయి. ఇలా శిశువులు ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా కాపాడతాయి.

సంపూర్ణ పోషణ!
తల్లిపాలలో బిడ్డ ఎదుగుదలకు అవసరమైన అన్ని పోషకాలూ ఉంటాయి. పైగా తేలికగానూ జీర్ణమవుతాయి. గొప్ప విషయం ఏంటంటే- బిడ్డ అవసరాలకు అనుగుణంగా తల్లిపాలు మారుతూ వస్తుండటం. కాన్పయిన మొదటిరోజు నుంచి నాలుగు రోజుల వరకు వచ్చే ముర్రుపాలు (కొలస్ట్రమ్‌) అమృతంతో సమానం. బిడ్డకు తొలి పోషణ, రక్షణ లభించేది వీటి నుంచే. 5-14 రోజుల్లో- వేగంగా పెరిగే శిశువు అవసరాలకు అనుగుణంగా పాలు మారిపోతాయి. ముర్రుపాల కన్నా కాస్త పలుచగా ఉన్నప్పటికీ.. మరింత శక్తినిస్తాయి. వీటిలో ల్యాక్టోజ్‌, కొవ్వులు దండిగా ఉంటాయి. రెండు వారాల సమయంలో పాలు పరిపక్వ దశకు చేరుకుంటాయి. ఇందులో 90% నీరు.. పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు 8%.. ఖనిజాలు, విటమిన్లు 2% ఉంటాయి. ఇవన్నీ బిడ్డ సంపూర్ణ ఎదుగుదలకు సాయం చేస్తాయి.

తొలి గంటలోనే ఆరంభం
బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు మొదలెట్టాలి. ఈ సమయంలో వచ్చే ముర్రుపాలను ఒకరకంగా తొలి టీకా అనీ అనుకోవచ్చు. ఇందులో శిశువు ఎదుగుదలకు అత్యవసరమైన పోషకాలతో పాటు రోగనిరోధకశక్తిని పెంపొందించే యాంటీబాడీలూ ఉంటాయి. జీర్ణకోశ వ్యవస్థ వృద్ధి చెందటానికి, దాని పనితీరుకు ముర్రుపాలు తోడ్పడతాయి. తొలిగంటలో ఒక్క తల్లిపాలు పట్టటం ద్వారానే సుమారు 10 లక్షల శిశు మరణాలను నివారించుకోవచ్చు. సిజేరియన్‌ కాన్పు అయినా వీలైనంత త్వరగా తల్లిపాలు ఆరంభించాలి. ఏవైనా సమస్యలతో శిశువును ఇంక్యుబేటర్‌లో పెట్టాల్సి వచ్చినా తల్లిపాలను పిండి ట్యూబ్‌ ద్వారానో, చెంచాతోనో తాగించటానికి ప్రయత్నించాలి.

6 నెలల వరకూ తల్లిపాలే
ప్రేమతో, ఆప్యాయతతో ఇచ్చే తల్లిపాలకు సాటి వచ్చే ఆహారం మరోటి లేదు. ఆరు నెలలు నిండేంతవరకు తల్లిపాలు తప్ప మరేదీ ఇవ్వాల్సిన అవసరం లేదు. తల్లిపాలతోనే బిడ్డకు కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. ఆరు నెలల తర్వాత బిడ్డకు ఘనాహారం ఆరంభించాలి. అలాగని పాలు పట్టటం మానెయ్యరాదు. రెండేళ్ల వరకూ తల్లిపాలు కొనసాగించాలి. వీలైతే ఆ తర్వాత కూడా ఇవ్వచ్చు.

కడుపు నిండటానికే కాదు..
ఆకలి వేసినప్పుడే కాదు.. దాహం వేసినప్పుడూ పిల్లలు తల్లిపాల కోసం ఏడుస్తారు. తమకేదైనా అసౌకర్యంగా ఉన్నప్పుడు, తల్లి ప్రేమ కావాల్సి వచ్చినప్పుడు, తల్లి కళ్లలోకి కళ్లు పెట్టి చూడాలని అనుకున్నప్పుడూ పాల కోసం పరితపిస్తుంటారు. పిల్లలు స్థిమిత పడటానికి, విశ్రాంతి పొందటానికి, హాయిగా నిద్రపోవటానికీ తల్లిపాలే కీలకం.

సీసాల బెడద ఉండదు
తల్లిపాలు చాలా సురక్షితం. ఎలాంటి ఖర్చూ ఉండదు. ఎప్పుడంటే అప్పుడు ఇవ్వచ్చు. అదే పోతపాలతో చాలా చిక్కులు ముంచుకొస్తాయి. సీసాలను సరిగా శుభ్రం చేయకపోవటం వంటి వాటి వల్ల విరేచనాలు, చెవిలో చీము, గొంతు నొప్పి, ఊపిరితిత్తుల్లో నిమ్ము, పిప్పిపళ్లు.. ఇలా రకరకాల సమస్యలు తలెత్తుతాయి. కేవలం సీసాల మూలంగానే మనదేశంలో ప్రతి సంవత్సరం 5-6 లక్షల మంది పిల్లలు మరణిస్తున్నారు. తల్లిపాలు పడితే వీటిని పూర్తిగా నివారించుకోవచ్చు.

పాలు సరిపోవని అనుకోవద్దు

పుట్టినపుడు శిశువు జీర్ణాశయం రేగు పండంతే ఉంటుంది. ఒక మిల్లీలీటరు ముర్రుపాలు తాగినా సరిపోతాయి. మూడు రోజులకు జీర్ణాశయం ఉసిరికాయంత, పది రోజులకు నిమ్మకాయంత, రెండు వారాలకు గుడ్డంత పెద్దగా అవుతుంది. 5-10 మిల్లీలీటర్ల పాలు తాగినా కడుపు నిండుతుంది. కాబట్టి పాలు సరిపోవని అనుకోవటం తగదు. ఎంత ఎక్కువగా పాలు పడితే అంత బాగా వస్తాయి. పగటి పూట మాత్రమే కాదు, రాత్రిపూటా బిడ్డకు తప్పనిసరిగా పాలు పడుతుండాలి.

ఇరువురికీ లాభమే

చనుబాలు పట్టటం బిడ్డ ఎదుగుదలకే కాదు.. తల్లి ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. తల్లిపాలలోని యాంటీబాడీలు ఆరంభం నుంచే బిడ్డకు సహజ రక్షణ కవచంగా నిలుస్తాయి. బిడ్డకు పాలు పట్టటమనేది తల్లికి క్యాన్సర్లు.. జబ్బుల నివారిణిగానూ తోడ్పడుతుంది.

బిడ్డకు..
* అలర్జీలు దూరం: చనుబాలతో అలర్జీలు, ఆస్థమా ముప్పు తగ్గుతుంది. ఆరు నెలల వరకు పూర్తిగా తల్లిపాలే తాగిన పిల్లలకు అలర్జీలతో పాటు చెవి ఇన్‌ఫెక్షన్లు, శ్వాసకోశ జబ్బులు, విరేచనాల సమస్యలు వచ్చే అవకాశం తక్కువ.
* తెలివి తేటలు: తల్లిపాలు తాగిన పిల్లలకు తెలివి తేటలు (ఐక్యూ) ఎక్కువగా ఉంటున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
* మంచి బరువు: వయసుకు తగ్గ బరువు ఉండేలా చూడటంలోనూ తల్లిపాలు కీలకపాత్ర పోషిస్తాయి. అంటే బరువు తక్కువగా, ఎక్కువగా లేకుండా చూస్తాయన్నమాట. పెద్దయ్యాకా అధిక బరువు బారినపడకుండా కాపాడతాయి.
* మధుమేహం ముప్పు తక్కువ: తల్లిపాలు తాగిన పిల్లలకు పెద్దయ్యాక మధుమేహం ముప్పూ తక్కువే.

తల్లికి..
* గర్భసంచి యథాస్థితికి: బిడ్డ రొమ్ము పట్టినపుడు తల్లి మెదడు నుంచి సంకేతాలు వెలువడి.. ఆక్సిటోసిన్‌ హార్మోన్‌ విడుదలవుతుంది. ఇది పాలు పడటానికే కాకుండా గర్భాశయం త్వరగా సంకోచించటానికీ దోహదం చేస్తుంది. దీంతో కాన్పు తర్వాత రక్తస్రావమూ తగ్గుతుంది. మాతృ మరణాల్లో చాలావరకు రక్తస్రావం ఆగకపోవటమే ప్రధాన కారణం.
* బరువు తగ్గటం: బిడ్డకు పాలు పట్టటం ద్వారా ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. దీంతో గర్భధారణ సమయంలో పెరిగిన బరువు త్వరగా తగ్గుతుంది.
* కుంగుబాటు దూరం: కాన్పు తర్వాత వేధించే కుంగుబాటుకు పాలు పట్టటం కళ్లెం వేస్తుంది.
* వెంటనే గర్భం ధరించకపోవటం: బిడ్డకు పాలు పడుతున్నప్పుడు నెలసరి కాస్త ఆలస్యంగా వస్తుంది. ఫలితంగా ఆ వెంటనే గర్భం ధరించే అవకాశమూ కొంతవరకు తగ్గుతుంది.
* క్యాన్సర్ల నివారణ: బిడ్డకు పాలిచ్చిన మహిళలకు రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయ క్యాన్సర్‌ ముప్పు తక్కువ. గుండెజబ్బులు, ఎముకలు గుల్లబారే అవకాశమూ తక్కువే.
* కమ్మటి నిద్ర: చనుబాలు పట్టటం వల్ల నిద్ర కూడా హాయిగా పడుతుంది. చక్కటి మానసిక ఆరోగ్యానికీ, భావోద్వేగాల నియంత్రణకూ తోడ్పడుతుంది.
* మధుమేహానికి కళ్లెం: పాలు పట్టటం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు బారినపడే అవకాశం తగ్గుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని