రత్నాలకు రాళ్ల బాధ!

ఇంటికి రత్నాలు పిల్లలే. అలాంటి రత్నాలకు ఇప్పుడు రాళ్ల బాధ మొదలవుతోంది! పెద్దల్లోనే ఎక్కువనుకునే కిడ్నీ రాళ్ల సమస్య ఇటీవల పిల్లల్లోనూ పెరిగిపోతోంది మరి. పుట్టుకతో వచ్చే లోపాలు, జన్యుపరమైన అంశాలకు తోడు మారిపోతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు,, అపరిశుభ్రత, విటమిన్ల లోపం వంటివెన్నో దీనికి ఆజ్యం పోస్తున్నాయి. పెద్దవారికైనా, పిల్లలకైనా కిడ్నీ రాళ్ల బాధ ఒకటే గానీ చిన్నారుల్లో దీన్ని గుర్తించటం కాస్త కష్టం. నొప్పి ఎక్కడ్నుంచి వస్తోందో, ఎటు నుంచి ఎటు వెళ్తోందో పిల్లలు ...

Updated : 13 Aug 2019 05:07 IST

ఇంటికి రత్నాలు పిల్లలే. అలాంటి రత్నాలకు ఇప్పుడు రాళ్ల బాధ మొదలవుతోంది! పెద్దల్లోనే ఎక్కువనుకునే కిడ్నీ రాళ్ల సమస్య ఇటీవల పిల్లల్లోనూ పెరిగిపోతోంది మరి. పుట్టుకతో వచ్చే లోపాలు, జన్యుపరమైన అంశాలకు తోడు మారిపోతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు,, అపరిశుభ్రత, విటమిన్ల లోపం వంటివెన్నో దీనికి ఆజ్యం పోస్తున్నాయి. పెద్దవారికైనా, పిల్లలకైనా కిడ్నీ రాళ్ల బాధ ఒకటే గానీ చిన్నారుల్లో దీన్ని గుర్తించటం కాస్త కష్టం. నొప్పి ఎక్కడ్నుంచి వస్తోందో, ఎటు నుంచి ఎటు వెళ్తోందో పిల్లలు సరిగా చెప్పలేరు. కొందరిలో అపెండిక్స్‌ వాపు వంటి ఇతరత్రా సమస్యల మాదిరిగానూ కనబడొచ్చు. నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలో వాపు, ఇన్‌ఫెక్షన్లు, కిడ్నీ వైఫల్యం వంటి తీవ్ర దుష్పరిణామాలకూ దారితీయొచ్చు. కాబట్టి ‘చిన్న’ సమస్యేనని కొట్టిపారేయటం తగదు. 
కిడ్నీలు మహా గట్టి పిండాలు. శరీరానికి పనికిరాని మలినాలను విసర్జించే అవయవాల్లో ఇవి చాలా కీలకమైనవి. నిరంతరం రక్తాన్ని శుద్ధి చేస్తూ.. జీవక్రియల అనంతరం మిగిలిపోయే యూరియా, యూరిక్‌ ఆమ్లం వంటి వాటిని వడగడుతూ.. పనికిరాని వాటిని మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోయేలా చేస్తాయి. కిడ్నీల్లో తయారయ్యే మూత్రం ముందుగా మూత్రనాళం గుండా మూత్రాశయానికి చేరుకొని.. అక్కడ్నుంచి మూత్ర మార్గం ద్వారా వెలుపలికి వచ్చేస్తుంది. ఈ క్రమంలో ఎక్కడ అడ్డంకి తలెత్తినా మూత్రకోశ వ్యవస్థ మొత్తం ప్రభావితమవుతుంది. కిడ్నీలో రాళ్లు ఇలాంటి సమస్యే. ఇవి కిడ్నీలో ఏర్పడి అక్కడే తిష్ఠ వేసుకోవచ్చు. లేదూ మూత్రనాళం, మూత్రాశయంలో చిక్కుకోవచ్చు. దీంతో మూత్రం సరిగా రాక.. నొప్పి, మంట వంటివి తీవ్రంగా వేధిస్తాయి. నిజానికి కిడ్నీ రాళ్లు పెద్దవారిలోనే ఎక్కువ. అలాగని పిల్లలకు రాకూడదనేమీ లేదు. ఇటీవల ఒకింత ఎక్కువగానూ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల్లో కిడ్నీ రాళ్లు, వాటితో కలిగే నష్టాలు, నివారణ మార్గాల గురించి తెలుసుకొని ఉండటం ఎంతైనా అవసరం. 
ఎక్కడివీ రాళ్లు? 
కిడ్నీలో రాళ్లు ఎక్కడో బయటి నుంచి వచ్చి చేరేవి కావు. లోపల తయారయ్యేవే. నీటిలో బాగా ఉప్పు వేసి మరిగించారనుకోండి. కొంతసేపటికి నీరంతా ఇగిరిపోయి.. గిన్నెలో ఉప్పు రాళ్లు ఏర్పడతాయి కదా. కిడ్నీ రాళ్లూ ఇలాగే తయారవుతాయని అనుకోవచ్చు. వీటికి మూలం- మూత్రంలో క్యాల్షియం, ఆక్సలేట్‌, యూరిక్‌ ఆమ్లం వంటి లవణాలు, ఖనిజాలు, రసాయనాల స్థాయులు పెరగటం. దీంతో మూత్రం చిక్కబడుతుంది. క్రమంగా దానిలోని లవణాలు, రసాయనాలన్నీ చిన్న చిన్న స్ఫటికాలుగా గూడుకట్టుకోవటం ఆరంభిస్తాయి. ఇవి మొదట్లో కిడ్నీలో మూత్రం నిల్వ ఉండే వ్యవస్థలో పోగుపడి.. లోపలి పైపొర మీద అంటుకుంటాయి. దాని మీద మరొక స్ఫటికం.. దానిపై మరోటి.. ఇలా చేరుకుంటూ వచ్చి, చివరికి రాళ్ల మాదిరిగా గట్టిపడిపోతాయి. 
లక్షణాలు 
నొప్పి, మంట: మూత్రనాళం ఒంపుల్లో రాళ్లు చిక్కుపడితే తీవ్రమైన నొప్పి తలెత్తుతుంది. నొప్పి నడుం దగ్గర పక్కలవైపు మొదలై.. గజ్జల వరకూ పాకుతుంది. మూత్రం పోస్తున్నప్పుడు మంట పుట్టొచ్చు. చిక్కేంటంటే- నొప్పి పుడుతున్నా పిల్లలు ఎక్కడ్నుంచి వస్తుందో సరిగ్గా చెప్పలేకపోవటం. నొప్పి ఎక్కుడ్నుంచి వస్తుందని అడిగితే కడుపు చూపిస్తారు. దీంతో ఒక్కోసారి అపెండిక్స్‌ వాపుగానూ పొరపడొచ్చు. 
మూత్రం సరిగా రాకపోవటం: ముఖ్యంగా మూత్రనాళంలో గానీ మూత్రమార్గంలో గానీ రాయి చిక్కుపడితే మూత్రం పోయటానికి ఇబ్బంది పడతారు. కొన్నిసార్లు మూత్రంలో రక్తం కనపడొచ్చు. 
వాంతి, వికారం: సమస్య తీవ్రంగా ఉంటే వాంతి, వికారం వేధిస్తుంటాయి. 
తరచూ మూత్రం: పిల్లలు తరచుగా మూత్రం పోస్తుంటారు. కొంతమంది మగపిల్లలు అదేపనిగా అంగాన్ని పట్టుకొని లాగుతుంటారు. 
జ్వరం: మూత్రం నిల్వ ఉండటం వల్ల ఇన్‌ఫెక్షన్‌ తీవ్రమైతే జ్వరం, చలి, బలహీనత ముంచుకురావొచ్చు. మూత్రం చెడువాసన కొట్టొచ్చు. 
దుష్పరిణామాలతో జాగ్రత్త! 
కిడ్నీ రాళ్లు ఇతరత్రా దుష్ప్రభావాలకూ దారితీస్తాయి. 
మూత్రనాళంలో అడ్డంకి మూలంగా మూత్రం వెనక్కి వెళ్లిపోయి కిడ్నీ వాపు (హైడ్రోనెఫ్రోసిస్‌) తలెత్తొచ్చు. చివరికిది కిడ్నీ దెబ్బతినటానికీ దారితీయొచ్చు. 
మూత్రాశయంలో మూత్రం ఎక్కువసేపు నిల్వ ఉంటే దీర్ఘకాల ఇన్‌ఫెక్షన్‌ (సిస్టైసిస్‌) రావొచ్చు. 
మూత్రనాళం సంకోచించటం వల్ల ఇతర అవయవాలకు దారులు (ఫిస్ట్యులా) ఏర్పడొచ్చు. 
మూత్రాశయం ఉబ్బిపోయి తరచూ మూత్రం రావొచ్చు.

ప్రధానంగా నాలుగు రకాలు 
కిడ్నీ రాళ్లలో ప్రధానంగా నాలుగు రకాలు కనబడుతుంటాయి.  
క్యాల్షియం రాళ్లు: మూత్రంలో క్యాల్షియం, ఆక్సలేట్‌, యూరియా మోతాదులు అధికంగా.. సిట్రేట్‌ చాలా తక్కువగా ఉండడం వల్ల ఇవి ఏర్పడతాయి. 
స్ట్రువైట్‌ రాళ్లు: వీటికి మూలం దీర్ఘకాల మూత్ర ఇన్‌ఫెక్షన్లు. ఇన్‌ఫెక్షన్‌ కారక బ్యాక్టీరియా మూత్రంలో రసాయనాల స్థాయులను అస్తవ్యస్తం చేయటం వల్ల ఇవి పుట్టుకొస్తాయి. 
యూరిక్‌ ఆమ్లం రాళ్లు: మూత్రంలో ఆమ్ల గుణం పెరిగినప్పుడు యూరిక్‌ ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది స్ఫటికాలుగా మారి రాళ్లు ఏర్పడతాయి. 
సిస్టిన్‌ రాళ్లు: జన్యుపరంగా కొందరికి రక్తంలోని సిస్టిన్‌ రసాయనం సరిగా బయటకు వెళ్లిపోదు. ఫలితంగా దీని మోతాదులు పెరిగి రాళ్లుగా మారుతుంటాయి.

కారణాలు ఎన్నెన్నో..

పుట్టుకతో వచ్చే మూత్రకోశ లోపాల దగ్గర్నుంచి విటమిన్ల లోపం, ఆహార అలవాట్ల వరకూ ఎన్నెన్నో కారణాలు కిడ్నీరాళ్లకు దారితీయొచ్చు. 
జన్యుపరంగా: కొందరికి జన్యుపరంగా మూత్రంలో సిస్టిన్‌ ఎక్కువగా పోవటం రాళ్లకు దారితీయొచ్చు. 
మూత్రం ఆపుకోవటం: టీవీ చూస్తూనో, ఆటల్లో మునిగిపోయో కొందరు చాలాసేపు మూత్రం ఆపుకొంటూ ఉంటారు. ఇలా మూత్రం నిల్వ ఉంటే ఇన్‌ఫెక్షన్లు రావొచ్చు. లవణాలు పెద్దమొత్తంలో పేరుకుపోవచ్చు. ఇవి రెండూ రాళ్లకు దారితీసేవే. 
నీటిశాతం తగ్గటం: పిల్లలు ఏదో వ్యాపకంలో  మునిగిపోయి నీళ్లు తాగటం మరచిపోతుంటారు. కొందరికి చిన్నపేగుల్లో ఇన్‌ఫెక్షన్ల మూలంగానూ ద్రవాలు సరిగా గ్రహించక ఒంట్లో నీటిశాతం తగ్గొచ్చు. దీంతో మూత్రం గాఢంగా, చిక్కగా తయారై.. రాళ్లు ఏర్పడే ప్రమాదముంది. 
ఉప్పు ఎక్కువగా తినటం: ప్రస్తుతం జంక్‌ఫుడ్‌ తినటం ఎక్కువైంది. పేద కుటుంబాల్లో పచ్చళ్ల వంటివి తినటమూ ఎక్కువే. వీటిల్లో ఉప్పు (సోడియం) పెద్దమొత్తంలో ఉంటుంది. సోడియంతో మూత్రంలో క్యాల్షియం మోతాదులు పెరిగిపోయి రాళ్లకు దారితీయొచ్చు. 
యూరిక్‌ ఆమ్లం పెరగటం: జంతువుల ప్రోటీన్‌ మూలంగా యూరిక్‌ ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. మూత్రంలో దీని మోతాదులు పెరిగిపోయి రాళ్లు ఏర్పడొచ్చు. మూత్రంలో ఎక్కువ ఆమ్ల స్వభావం ఉన్నా ఇవి ఏర్పడొచ్చు.  
మూత్రనాళం ఇరుకు: కొందరికి పుట్టుకతో మూత్రనాళంలో కొన్నిచోట్ల సన్నగా, ఇరుకుగా ఉంటుంది. కొందరికి కిడ్నీ, మూత్ర నాళం కలుసుకునే చోట అడ్డంకి ఉండొచ్చు. దీంతో మూత్రం కిందికి సరిగా వెళ్లక, ఎక్కువసేపు నిల్వ ఉండటం వల్ల ఇన్‌ఫెక్షన్లు.. ఫలితంగా రాళ్లు ఏర్పడొచ్చు. 
ఊబకాయం: ఇది ఇన్సులిన్‌ నిరోధకతకు దారితీస్తుంది. దీంతో మూత్రంలో క్యాల్షియం మోతాదులూ ఎక్కువవుతాయి. ఇది రాళ్ల ముప్పు పెరిగేలా చేస్తుంది. 
కొన్ని మందులు: అసిటిజోలమైడ్‌, యాంటాసిడ్లు, గ్లూకోకార్టికాయిడ్ల వంటి మందులూ రాళ్లకు దారితీయొచ్చు. మూర్ఛతో బాధపడేవారు ఎక్కువగా మందులు తీసుకోవటమూ కారణం కావొచ్చు. 
వెన్నుపాము లోపాలు: వెన్నుపాము లోపాలతో పుట్టిన పిల్లల్లో మూత్రాశయం సరిగా పనిచేయకపోవటం మూలంగా మూత్రం ఎక్కువసేపు అక్కడే ఉండిపోయి రాళ్లు ఏర్పడొచ్చు.  
నివసించే ప్రదేశం: భూగర్భంలో ‘కఠిన జలం’ ఉన్న ప్రాంతాల్లో నివసించేవారికి కిడ్నీ రాళ్లు వచ్చే అవకాశం ఎక్కువ. 
పేదరికం: పేద పిల్లలకు కిడ్నీ రాళ్ల ముప్పు ఎక్కువ. దీనికి ప్రధాన కారణం అపరిశుభ్రత, సరైన పోషకాహారం తీసుకోకపోవటం.  

విటమిన్‌ ఎ లోపం: విటమిన్‌ ఎ లోపం మూలంగా మూత్రాశయం లోపలి గోడ పొరలు పొరలుగా ఊడుతుంటుంది. వీటిల్లో ఏదైనా పొర ఎక్కడైనా స్థిరపడితే దాని చుట్టూ వ్యర్థాలు పేరుకుపోయి చివరికి రాయిగా మారుతుంది.

నిర్ధారణ

నొప్పి, మూత్రం మంట వంటి లక్షణాలతోనే కిడ్నీ రాళ్లను అనుమానిస్తారు. రాళ్లు ఉన్నట్టు అనిపిస్తే తగు పరీక్షలు చేసి నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. 
ఎక్స్‌రే: ఇది ప్రధానమైన పరీక్ష. మూత్రకోశం ఎక్స్‌రే తీస్తే రాళ్లు ఎక్కడున్నాయనేది తెలుస్తుంది. 80% వరకు రాళ్లు ఎక్స్‌రేలోనే కనపడతాయి. అవసరమైతే అల్ట్రాసౌండ్‌, సీటీస్కాన్‌ పరీక్షలూ చేయాల్సి వస్తుంది. వీటితో రాయి ఉందా లేదా? ఉంటే ఎక్కడుంది? మూత్రపిండాలు ఎలా పనిచేస్తున్నాయి? ఎక్కడైనా ఉబ్బాయా? అనేవి బయటపడతాయి. 
మూత్రపరీక్ష: రసాయనాలు, లవణాల మోతాదులు.. ఇన్‌ఫెక్షన్‌ కారక బ్యాక్టీరియా ఇందులో తెలుస్తాయి. 
మూత్ర పరిమాణం: పిల్లల విషయంలో 24 గంటల వ్యవధిలో మూత్రం ఎంత వస్తోందనేది చూడటం చాలా ముఖ్యం. 
థైరాయిడ్‌ పరీక్ష: అవసరమైతే పారాథైరాయిడ్‌ గ్రంథి పనితీరు పరీక్ష చేస్తారు.

చికిత్స- రాయిని బట్టి..

చిన్న చిన్న రాళ్లు వాటంతటవే బయటకొచ్చేస్తాయి. కొన్నిసార్లు ఇవి మూత్రనాళంలో, మూత్రమార్గంలో చిక్కుకొని పోవచ్చు. కొన్ని రాళ్లు.. ముఖ్యంగా ఆక్సలేట్‌ రకం రాళ్లు కిడ్నీ లోపలి పొర కణజాలానికి కరచుకొని అలాగే ఉండిపోతుంటాయి. పెద్దగానూ అవుతుంటాయి. అందువల్ల రాయి పరిమాణం, అది ఎక్కడుంది? ఇతరత్రా ఇబ్బందులేంటి? అనేవి దృష్టిలో పెట్టుకొని చికిత్స చేయాల్సి ఉంటుంది. 
చిన్నరాళ్లకు.. 
సాధారణంగా 3-5 మి.మీ. సైజు రాళ్ల విషయంలో పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదు. పిల్లలు నీళ్లు ఎక్కువగా తాగేలా చూసుకుంటే క్రమంగా బయటకు వచ్చేస్తాయి. అదే రాయి కాస్త పెద్దగా (5-8 మి.మీ.) ఉందనుకోండి. మూత్రపిండాలు సరిగా పనిచేస్తూ.. పెద్దగా వాపు, నొప్పి లేవనుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో నొప్పి మాత్రలు, నార్కొటిక్స్‌తో మంచి ఉపశమనం లభిస్తుంది. వాంతి, వికారం తగ్గటానికి తగు మందులు వాడుకోవాల్సి ఉంటుంది. 
పెద్దరాళ్లకు.. 
రాళ్లు 8 మి.మీ. కన్నా పెద్దగా ఉండి.. మూత్రపిండాల పనితీరు దెబ్బతింటూ.. తీవ్రమైన నొప్పి (రీనల్‌ కోలిక్‌), జ్వరం వేధిస్తున్నట్టయితే వెంటనే రాళ్లను బయటకు తీయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆపరేషన్‌ అవసరం లేకుండానే రాళ్లను తొలగించే పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. 
ఎక్స్‌ట్రాకార్పొరల్‌ షాక్‌ వేవ్‌ లిథోట్రిప్సీ: ఇందులో బయటి నుంచి శబ్ద లేదా షాక్‌ తరంగాల సాయంతో రాళ్లను పగలగొడతారు. దీంతో అవి ముక్కలు ముక్కలై మూత్రం ద్వారా పడిపోతాయి. ముక్కలు లోపల చిక్కుకోకుండా మూత్రనాళంలో స్టెంట్‌ అమర్చుతారు. దీంతో అవి తేలికగా బయటకు వచ్చేస్తాయి. ఈ చికిత్సకు సుమారు 45 నిమిషాలు పడుతుంది. 
యురెతెరోస్కోపిక్‌ పద్ధతి: మూత్రనాళంలో రాయి చిక్కుకున్నవారికిది ఉపయోగపడుతుంది. ఇందులో మూత్రమార్గం ద్వారా యురెతోరోస్కోపీని లోపలికి పంపించి రాయిని తీయొచ్చు లేదా పగలగొట్టొచ్చు. 
ఆపరేషన్‌: 2 సెం.మీ. కన్నా ఎక్కువుండే రాళ్లకు కీహోల్‌ విధానంలో చిన్న రంధ్రం చేసి లోపలికి వెళ్లి రాయిని ముక్కలు చేయాల్సి ఉంటుంది. కిడ్నీలో మూత్రనాళం కలిసే చోట ఏర్పడే రాళ్లు (స్టాగ్‌హార్న్‌) కదలకుండా అక్కడే అతుక్కుపోతాయి. ఇలాంటివాటిని చిన్న కోతతో నెఫ్రోలిథాటమీ పద్ధతిలో ఆపరేషన్‌ చేసి తీస్తారు.
నివారణ ఉత్తమం 
నీళ్లు, ద్రవాలు ఎక్కువగా తీసుకునేలా చూడాలి. కూల్‌డ్రింకుల వంటి వాటికి దూరంగా ఉంచటం మంచిది. 
ఉప్పు, కొవ్వులు మితంగా తినేలా చూసుకోవాలి. 
రోజూ తప్పకుండా ఆరుబయట ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి. 
రాళ్లు ఏర్పడే స్వభావం ఉన్న పిల్లలకు టమోటా, క్యాబేజీ, పాలకూర తక్కువగా ఇవ్వాలి. 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని