కాన్పయ్యాకా

‘హమ్మయ్య.. ఓ పనై పోయింది’. కాన్పయిన మరుక్షణం చాలామంది ఇలాగే ఊపిరి పీల్చుకుంటారు. తొమ్మిది నెలలు కడుపులో పెరిగిన నలుసు.. ఎప్పుడెప్పుడు కళ్ల ముందు కదలాడుతుందా అని ఆత్రుతగా ఎదురుచూసిన మనసులకు అంతకు మించిన ఊరటేముంటుంది? అయితే కథ అంతటితోనే అయిపోదు. తల్లి పాత్ర ఆరంభమయ్యేది అప్పుడే........

Published : 25 Dec 2018 00:46 IST

 

భద్రంబిడ్డా!

కాన్పయ్యాకా

‘హమ్మయ్య.. ఓ పనై పోయింది’. కాన్పయిన మరుక్షణం చాలామంది ఇలాగే ఊపిరి పీల్చుకుంటారు. తొమ్మిది నెలలు కడుపులో పెరిగిన నలుసు.. ఎప్పుడెప్పుడు కళ్ల ముందు కదలాడుతుందా అని ఆత్రుతగా ఎదురుచూసిన మనసులకు అంతకు మించిన ఊరటేముంటుంది? అయితే కథ అంతటితోనే అయిపోదు. తల్లి పాత్ర ఆరంభమయ్యేది అప్పుడే. బిడ్డను కంటికి రెప్పలా చూసుకోవటమే కాదు.. తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవటమూ కీలకమే. ఇన్‌ఫెక్షన్ల వంటి సమస్యల బారినపడకుండా చూసుకోవటం దగ్గర్నుంచి కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించటం వరకూ ప్రతిదీ ముఖ్యమే. అందుకే కాన్పు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమగ్ర కథనం అందిస్తోంది ఈవారం సుఖీభవ.

ప్రతి తల్లికీ ప్రసవం పునర్జన్మలాంటిది. పంటి బిగువున పురిటినొప్పులను భరిస్తూనే తన ప్రతిరూపాన్ని లోకానికి పరిచయం చేస్తుంది. గర్భధారణ సమయంలో కడుపులో నలుసు పెరగటానికి అనువైన వాతావరణాన్ని సృష్టించుకోవటమే కాదు.. కాన్పు తర్వాతా బిడ్డ పోషణకు ఆలంబనగానూ నిలుస్తుంది. ఇందుకోసం గర్భధారణ సమయంలోనే కాదు.. బిడ్డ పుట్టాకా తల్లి శరీరంలో ఎన్నెన్నో మార్పులు జరుగుతుంటాయి. అప్పటివరకూ పెద్దగా ఉన్న గర్భాశయం కుంచించుకుపోతూ క్రమంగా చిన్నగా అవుతూ వస్తుంటుంది. రొమ్ముల్లో మార్పులు సరేసరి. అయితే చాలామంది ప్రసవం కాగానే గండం గడించిందని, ఇక అంతా బాగానే ఉంటుందిలే అని భావిస్తుంటారు. నిజానికి ఈ సమయంలోనే మరింత జాగ్రత్త అవసరం. మనదగ్గర చాలామంది ఊళ్ల నుంచి పట్టణాలకు వచ్చి కాన్పు చేయించుకుంటుంటారు. సిజేరియన్‌ అయినా కూడా వెంటనే ఊళ్లకు వెళ్లిపోతుంటారు. కొందరైతే తిరిగి ఆసుపత్రి ముఖమే చూడరు. సిజేరియన్‌ అయితేనే డాక్టర్‌ దగ్గరికి ఎక్కువగా వెళ్లాల్సి ఉంటుందని, మామూలు కాన్పు అయితే అవసరం లేదని అనుకుంటుంటారు. బిడ్డ బయటకు వచ్చిన మార్గం వేరు కావొచ్చు గానీ సిజేరియన్‌ అయినా మామూలు కాన్పు అయినా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటే. సిజేరియన్‌ చేసినప్పుడే కాదు.. కొన్నిసార్లు సహజ కాన్పు కష్టమైనవారికీ చుట్టుపక్కల కణజాలం దెబ్బతినకుండా జననాంగం దగ్గర చిన్నకోత పెడతారు. అందువల్ల కుట్లు సరిగా మానుతున్నాయా? లేదా? చీము చేరిందా? నీరులాంటిదేమైనా వస్తోందా? అనేవి చూసుకోవాల్సి ఉంటుంది. గర్భధారణ సమయంలో మధుమేహం వంటి సమస్యలేవైనా ఉంటే మరింత జాగ్రత్త అవసరం. ఇక బిడ్డను పుట్టినప్పట్నుంచీ వెచ్చగా ఉంచటం, పాలు సరిగా పట్టటం వంటివీ కీలకమే. పాలు సరిపోతున్నాయా లేదా? బిడ్డ సరిగా ఎదుగుతోందా? అనేవీ చూసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల కాన్పు కాగానే అంతా బాగున్నట్టేనని అనుకోవటానికి లేదు. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లినా.. 15 రోజుల తర్వాత, అలాగే నెల తర్వాత డాక్టర్‌ను కలవటం తప్పనిసరి. ఒకవేళ ఆలోపు ఏదైనా ఇబ్బంది తలెత్తినా తక్షణం స్పందించాలి. ‘డాక్టర్‌ రెండు వారాల తర్వాత రమ్మన్నారు కదా. అప్పుడే చూపించుకోవచ్చులే’ అని నిర్లక్ష్యం చేయటం మంచిది కాదు. ముందే చూపించుకుంటే సమస్యలేవైనా ఉంటే వెంటనే జాగ్రత్త పడటానికి వీలుంటుంది.

కాన్పయ్యాకాపొరపాట్లు చేయొద్దు
బాలింతలు, పసిపిల్లల విషయంలో ఆది నుంచీ మనదగ్గర ఎన్నెన్నో అపోహలు నెలకొని ఉన్నాయి. ముర్రుపాలు పట్టకూడదని భావించేవారు కొందరైతే.. పథ్యం పేరుతో తల్లి కడుపు మాడ్చేవారు ఇంకొందరు. ఇవి తల్లికీ బిడ్డకూ ఎంతో హాని చేస్తాయి.

* వెంటనే స్నానం చేయించొద్దు: బిడ్డ పుట్టిన వెంటనే స్నానం చేయించటం తగదు. కనీసం 48 గంటలైనా ఆగాలి. ఆసుపత్రుల్లో పిల్లలు పుట్టిన వెంటనే పూర్తిగా శుభ్రం చేస్తారు. కాబట్టి ‘అయ్యో.. బిడ్డకు స్నానం చేయించలేదే’ అని అనుకోవాల్సిన పనిలేదు. ఆ తర్వాత కూడా గంటలకొద్దీ రుద్ది.. ఎక్కువసేపు స్నానం చేయించటం తగదు. దీంతో బిడ్డ ఒంట్లో ఉష్ణోగ్రత తగ్గిపోయే ప్రమాదముంది. ముఖ్యంగా చలికాలంలో నీళ్లలో బట్టను తడిపి తుడిస్తే ఇంకా మంచిది. గుర్తించాల్సిన విషయం ఏంటంటే- బిడ్డ ఎప్పుడూ వెచ్చగా ఉండేలా చూసుకోవటం. కొందరు పిల్లల ఒంటికి బాగా నూనె రాస్తుంటారు. ఇలా చేస్తే చెమట అంతగా బయటకు రాదు. ఎండకాలంలోనైతే ఇది పిల్లలకు మరింత చిరాకు కలిగిస్తుంది.
* అరగంటలోపే పాలు పట్టాలి: మామూలు కాన్పు అయినా సిజేరియన్‌ అయినా తొలి అరగంటలోపే బిడ్డకు చనుబాలు పట్టించటం తప్పనిసరి. మొదటి మూడు రోజుల్లో వచ్చే ముర్రుపాలలో (కొలెస్ట్రమ్‌) కొవ్వు పదార్థాలు, రోగనిరోధక కణాలు దండిగా ఉంటాయి. ఇవి బిడ్డ రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి. ముర్రుపాలు జీర్ణం కావని, బిడ్డకు జబ్బు చేస్తుందని కొందరు భావిస్తుంటారు. కానీ వీటిని ఇవ్వకపోతేనే బిడ్డ జబ్బుల పాలవుతుందని తెలుసుకోవాలి. కొందరైతే ఒకట్రెండు చుక్కలే వస్తున్నాయని, పాలు సరిపోవటం లేదని వెంటనే పోతపాలు మొదలెట్టేస్తుంటారు. ఇదీ మంచి పద్ధతి కాదు. తొలి మూడు రోజుల్లో పాలు పట్టకపోతే తర్వాత పాలు రావటం కష్టమైపోతుంది. పైగా శిశువులకు సోమరితనమూ అబ్బుతుంది. తల్లిపాలను తాగేప్పుడు పిల్లలు పెదాలతో చనుమొనలను గట్టిగా పట్టుకొని లోపలికి పీల్చుకుంటారు. అదే పోతపాలు తేలికగా గొంతులోకి దిగుతాయి. అందుకే పోతపాలు అలవాటైతే తల్లి రొమ్ము పట్టటానికి అంతగా ఇష్టపడరు. పిల్లలు బాగా ఏడ్చిన తర్వాతే పాలు పట్టాలని మరికొందరు భావిస్తుంటారు. ఇది తప్పు. ప్రతి రెండు గంటలకు ఓసారి బిడ్డకు పాలు పట్టాలి. బాగా ఏడ్చేంతవరకు ఆగకూడదు. బాగా ఏడుస్తున్నప్పుడు పిల్లలు రొమ్ము సరిగా పట్టరు. కొంచెం ఏడ్వగానే పాలు పడితే బాగా తాగుతారు. తల్లిపాలు ఇవ్వటం సులువు. ఎప్పుడంటే అప్పుడు ఇవ్వొచ్చు. పరిశుభ్రంగానూ ఉంటాయి. సూక్ష్మక్రిములకు ఆస్కారమే లేదు. పైగా బిడ్డకు కావాల్సిన పోషకాలన్నీ సమతూకంలో ఉంటాయి. అదే పోతపాలతోనైతే పిల్లలకు మలబద్ధకం రావొచ్చు. సీసా శుభ్రంగా లేకపోతే విరేచనాలు, వాంతుల వంటి సమస్యలూ పట్టుకోవచ్చు. కొందరు పథ్యం పేరుతో తల్లి కడుపు మాడుస్తుంటారు. ఇది పెద్ద పొరపాటు. సమతులాహారం తీసుకుంటేనే పాలు బాగా వస్తాయని తెలుసుకోవాలి.
* తల్లికీ మేలే: బిడ్డకు చనుబాలు పట్టటం తల్లికీ ఎంతో మేలు చేస్తుంది. బిడ్డ పాలు తాగుతున్నప్పుడు తల్లి రక్తంలోకి విడుదలయ్యే ఆక్సిటోసిన్‌ హార్మోన్‌ గర్భాశయం చిన్నగా అవటానికీ తోడ్పడుతుంది. అంతేకాదు.. తల్లీబిడ్డల మధ్య అనుబంధం, ప్రేమ, ఆప్యాయత పెరగటానికీ దోహదం చేస్తుంది. అందుకే ఆక్సిటోసిన్‌ను ‘ప్రేమ హార్మోన్‌’ అనీ అంటారు. తల్లి చనుబాలు పట్టేటప్పుడు బిడ్డను హత్తుకొని ఉంటుంది. దీంతో బిడ్డకు వెచ్చదనమూ లభిస్తుంది. ఇది బిడ్డ త్వరగా శక్తిని కోల్పోకుండా చూస్తుంది. ఫలితంగా బిడ్డ ఎదుగుదల, బరువు మెరుగవుతాయి. జలుబు, దగ్గు వంటివి ఉన్నా ముక్కుకు రుమాలు చుట్టుకొని పాలు పట్టాలి గానీ ఆపొద్దు.
* బంధువులు పోలోమని రావొద్దు: ఒకప్పుడు పురుడు అయ్యేంతవరకు తల్లీబిడ్డను విడిగా ఉంచేవారు. ఒకరో ఇద్దరో తల్లీబిడ్డల అవసరాలను ప్రత్యేకంగా చూసుకునేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆసుపత్రుల్లో కాన్పయిన మరుక్షణం నుంచే బంధువులంతా పోలోమని వచ్చేస్తుంటారు. చేతులు, కాళ్లు కడుక్కోకుండానే బిడ్డను ఎత్తుకుంటుంటారు. ముద్దులు పెడుతుంటారు. దీంతో బిడ్డకు ఇన్‌ఫెక్షన్లు రావొచ్చు. తల్లికీ సమస్యలు ముంచుకురావొచ్చు. కాబట్టి తల్లీబిడ్డల అవసరాలను చూసుకునేవారు తప్ప మిగతావాళ్లు దూరంగా ఉండటమే మంచిది. బంధువులంతా కట్టగట్టుకొని వస్తే తల్లికి విశ్రాంతి లభించదు కూడా. నలుగురిలో బిడ్డకు పాలివ్వటానికి తల్లి సంకోచించొచ్చు. కాబట్టి తల్లీబిడ్డలను చూడటానికి ఏదో ఒక సమయంలోనే రావాలి. దూరం నుంచే చూడాలి.
* టీకాలను మరవొద్దు: బిడ్డ పుట్టిన తర్వాత తప్పకుండా పిల్లల నిపుణులకు చూపించాలి. బీసీజీ, పోలియో వంటి టీకాలన్నీ వేయించాలి. పుట్టిన తొలి 10 రోజుల్లో ఒంట్లోంచి నీరు పోవటం వల్ల బిడ్డ బరువు తగ్గిపోవచ్చు. అయితే శిశువులు 10% కన్నా ఎక్కువ బరువు తగ్గకూడదు. అంతకన్నా ఎక్కువ తగ్గితే పాలు సరిగా పట్టటం లేదని, బిడ్డకు తగినన్ని కేలరీలు లభించటం లేదనే అర్థం. కాబట్టి పిల్లల డాక్టర్ల పర్యవేక్షణ అవసరం. ఈ సమయంలో పోషణ సరిగా లేకపోతే పిల్లలు బాగా దెబ్బతింటారు.

సమస్యలు- పలురకాలు
కాన్పు సమయంలో శరీరం మీద పడిన ఒత్తిడి కావొచ్చు.. అవయవాలు తిరిగి కుదురుకోవటం కావొచ్చు.. కాన్పు జరిగిన పద్ధతులు కావొచ్చు.. ఏదేమైనా తల్లికి కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. వీటిని నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండటం ఎంతైనా అవసరం.

* రక్తస్రావం: కాన్పు తర్వాత కొద్దిగా రక్తస్రావం జరగటం, స్రావాలు రావటం సహజమే. అయితే కొందరిలో ఎక్కువగా రక్తస్రావం కావొచ్చు. ప్రసవం కావటానికి ఎక్కువ సమయం పట్టినవారిలో, ఎక్కువమంది సంతానాన్ని కన్నవారిలో ఇలాంటిది తరచుగా కనబడుతుంది. మాయ పడిపోయిన తర్వాత గర్భాశయం సరిగా కుంచించుకోకపోవటం.. గర్భసంచి లేదా యోని చీరుకుపోవటం వంటివి రక్తస్రావానికి దారితీయొచ్చు. ఒకవేళ రక్తస్రావం మరీ ఎక్కువవుతున్నట్టు గమనిస్తే వెంటనే డాక్టర్‌ను కలవాలి. సాధారణంగా కాన్పయిన 20 నిమిషాల తర్వాత మాయ పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. అయితే కొందరిలో కొన్ని ముక్కలు లోపలే ఉండిపోవచ్చు. ఇది ఇన్‌ఫెక్షన్‌కు దారితీయొచ్చు. ఫలితంగా రక్తస్రావం జరగొచ్చు. అందువల్ల కాన్పయ్యాక 24 గంటల తర్వాత రక్తస్రావం ఎక్కువైతే ఆలస్యం అసలే పనికిరాదు. వీరికి అత్యవసరంగా చికిత్స చేయాల్సి ఉంటుంది.
* కుట్లు మానకపోవటం: సిజేరియన్‌లోనే కాదు ప్రసవం కష్టమైనప్పుడు సహజకాన్పులోనూ చిన్న కోత పెట్టాల్సి వస్తుంటుంది. ఇలాంటివాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. కాళ్లు దగ్గరగా పెట్టుకొని నడవాలి. నేల మీద కూచోకపోవటమే మేలు. సాధ్యమైనంత వరకు ఎత్తుగా ఉండే (వెస్టర్న్‌) టాయ్‌లెట్లు వాడుకోవాలి. తప్పనిసరైతే మామూలు టాయ్‌లెట్లు వాడుకోవచ్చు. మల విసర్జన సమయంలోనే కాదు.. మూత్రానికి వెళ్లిన ప్రతిసారీ నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. యాంటీసెప్టిక్‌ ద్రావణాల వంటివి అవసరం లేదు. ఇలాంటి ద్రావణాలతో కుట్లు వేసిన దారం కరిగిపోవచ్చు. ఇప్పుడు సిజేరియన్‌ చేసినప్పుడూ చాలావరకు ఒంట్లో కరిగిపోయే కుట్లే వేస్తున్నారు. తీసేసే కుట్లు అయినా కూడా తడిస్తే వచ్చిన ఇబ్బందేమీ లేదు. కాకపోతే రుద్ద కూడదు. కుట్లు తీసేసిన తర్వాత నిరభ్యంతరంగా రుద్దుకొని స్నానం చేయొచ్చు. లేకపోతే మురికి పేరుకుపోయి దురద వంటి సమస్యలు తలెత్తొచ్చు.
* గర్భిణి సమస్యలైతే మరింత జాగ్రత్త: గర్భధారణ సమయంలో మధుమేహం గలవారికి కాన్పు తర్వాత రక్తంలో గ్లూకోజు స్థాయులు పడిపోతాయి. వీరికి అవసరాన్ని బట్టి ఇన్సులిన్‌ మోతాదులు తగ్గించాల్సి ఉంటుంది. అలాగే గుర్రపువాతం(ప్రిఎక్లాంప్సియా) బారినపడ్డవారు రక్తపోటును చూసుకోవాలి. వీరిలో కాన్పు తర్వాత 28 రోజుల్లోపల ఎప్పుడైనా రక్తపోటు బాగా పెరిగిపోయి ఫిట్స్‌ ముంచుకొచ్చే ప్రమాదముంది. కాబట్టి గర్భిణి సమస్యలు గలవారు కాన్పు అయ్యాకా డాక్టర్లను క్రమం తప్పకుండా కలిసి పరీక్షలు చేయించుకోవాలి.
* రొమ్ముల్లో గడ్డలు: పాలు సరిగా ఇవ్వకపోతే రొమ్ముల్లో పాలు గడ్డకట్టొచ్చు. దీంతో సలపరింత, నొప్పి వేధిస్తాయి. కొందరికి జ్వరం కూడా రావొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆక్సిటోసిన్‌ హార్మోన్‌ ఇంజెక్షన్‌ ఇస్తే లేదా ఆక్సిటోసిన్‌లో దూదిని ముంచి వాసన చూపిస్తే రొమ్ములు కాస్త మెత్తబడతాయి. తర్వాత పంప్‌ ద్వారా పాలను బయటకు తీయాల్సి ఉంటుంది. చాలామంది రొమ్ముల్లో పాలు గడ్డకట్టినపుడు వేడి నీళ్లతో కాపడం పెడుతుంటారు. దీంతో పాలు ఎండిపోయే ప్రమాదముంది. మరీ నొప్పి పుడుతుంటే క్యాబేజీ పొరలను ఫ్రిజ్‌లో పెట్టి రొమ్ముల మీద పెట్టుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.

కుంగుబాటు కాన్పయ్యాక కొంతమందికి కుంగుబాటు (పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌) రావొచ్చు. వీరిలో బిడ్డను సరిగా చూసుకోకపోవటం, బిడ్డకు హాని చేయటం, దేని మీదా ధ్యాస లేకపోవటం, సరిగా తినకపోవటం, నీళ్లు తాగకపోవటం వంటి లక్షణాలు కనబడతాయి. పదిహేను రోజుల్లోపు ఆసుపత్రికి వస్తే దీన్ని తేలికగా గుర్తించొచ్చు. చికిత్స కూడా తేలికవుతుంది.

ఆ వెంటనే గర్భం ధరించొద్దు
కాన్పయిన వెంటనే తిరిగి గర్భం ధరించకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. ఎందుకంటే తల్లి అవయవాలన్నీ తిరిగి గర్భధారణకు ముందునాటి స్థితికి చేరుకోవటానికి కనీసం 18 నెలలు పడుతుంది. చాలామందికి ఈ విషయం తెలియదు. కొందరైతే ఆరు నెలల్లోనే గర్భం ధరిస్తుంటారు. ఇది తల్లికే కాదు బిడ్డకూ మంచిది కాదు. ఒకవైపు తల్లి అవయవాలు కుదురుకోవు. మరోవైపు మొదటి బిడ్డపై శ్రద్ధ తగ్గుతుంది. బిడ్డకూ బిడ్డకూ మధ్య మూడేళ్ల ఎడం ఉండేలా చూసుకోవాలి. సిజేరియన్‌ కాన్పు అయినవారికిది మరింత అవసరం. కాబట్టి డాక్టర్‌తో చర్చించి తగు పద్ధతులు పాటించాలి. ఇప్పుడు కాన్పయిన వెంటనే కాపర్‌ టీ వేస్తున్నారు కూడా. అయితే దీన్ని 48 గంటల్లోపే వేయాల్సి ఉంటుంది. బిడ్డకు చనుబాలు పడుతుంటే గర్భధారణ జరగదని కొందరు భావిస్తుంటారు. ఇది పూర్తిగా నిజం కాదు. రోజుకు 8-9 సార్లు బిడ్డకు పాలు పడుతుంటేనే ఇలాంటి రక్షణ కొంతవరకు లభించొచ్చు. అయితే కచ్చితంగా గర్భం రాదని మాత్రం చెప్పలేం.
* ఇద్దరు పిల్లలను కన్నవారిలో చాలామంది కాన్పయిన వెంటనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించేసుకుంటుంటారు. ఇదీ మంచి పద్ధతి కాదు. దురదృష్టవశాత్తు పుట్టిన బిడ్డకు ఏమైనా అయితే? అప్పుడు మళ్లీ పిల్లలను కనాలంటే ఎలా? కాబట్టి ముందు తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించి.. పిల్లలు కాస్త పెద్దయ్యాక, వారికి టీకాలవంటివన్నీ పూర్తిగా వేయించాక.. అప్పుడు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్‌ చేయించుకోవటం మంచిది.

దూరంగా పడుకోబెట్టొద్దు
కొందరు బిడ్డను తల్లి పక్కన కాకుండా దూరంగా పడుకోబెడుతుంటారు. ఇది పెద్ద పొరపాటు. బిడ్డను ఎప్పుడూ తల్లి పక్కనే పడుకోబెట్టాలి. తల్లి ఒంటి నుంచి లభించే వెచ్చదనం బిడ్డకు ఎంతో అవసరం. ముఖ్యంగా నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకిది అత్యావశ్యకం. శిశువుల చర్మంలోంచి ఉష్ణోగ్రత త్వరగా వెళ్లిపోతుంటుంది. దీంతో బిడ్డ శరీరం మరింత ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. ఇందుకు ఊదారంగు కొవ్వును (బ్రౌన్‌ ఫ్యాట్‌) వినియోగించుకోవటం ఆరంభిస్తుంది. ఈ కొవ్వు తగ్గిపోతే పిల్లలు వేగంగా బరువు కోల్పోయే ప్రమాదముంది. దీంతో పిల్లలు త్వరగా అలసిపోతారు. కాబట్టి బిడ్డ వెచ్చగా ఉండేలా చూసుకోవటం.. తల్లి పక్కనే పడుకోబెట్టటం మంచిది.

నీళ్లు బాగా తాగాలి
బాలింతలు నీళ్లు తాగితే పొట్ట పెరుగుతుందనేది కొందరి అపోహ. నిజానికి ఇప్పుడే నీటి అవసరం ఎక్కువ. గర్భంతో ఉన్నప్పుడు శరీరంలో చేరిన నీరంతా కాన్పయ్యాక బయటకు వెళ్లిపోతుంది. బిడ్డకు పాలిస్తున్నప్పుడు పాలతోనూ నీరు బయటకు పోతుంది. దీంతో దాహం ఎక్కువవుతుంది. కాబట్టి ఎంత ఎక్కువ నీళ్లు తాగితే అంత మంచిది. లేకపోతే ఒంట్లో నీటిశాతం తగ్గిపోవచ్చు. మూత్రం సరిగా రాకపోవచ్చు. ఇది మూత్ర ఇన్‌ఫెక్షన్లకు దారితీయొచ్చు. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగాలి.

నవజాత పరీక్షలు మేలే
ఇప్పుడు ఆసుపత్రుల్లో నవజాత శిశువులకు ముందస్తు పరీక్షలూ (నియోనేటల్‌ స్క్రీనింగ్‌) చేస్తున్నారు. ఇది చాలా మంచి పద్ధతి. పుట్టినపుడు థైరాయిడ్‌, కుషింగ్‌ సిండ్రోమ్‌ వంటి సమస్యలేవైనా ఉంటే తెలిసిపోతుంది. థైరాయిడ్‌ గ్రంథి సరిగా పనిచేయకపోతే పిల్లలకు బుద్ధిమాంద్యం తలెత్తొచ్చు. దీన్ని వెనక్కి మళ్లించటం అసాధ్యం. ఇటీవలికాలంలో గర్భిణుల్లో థైరాయిడ్‌ సమస్య తరచుగా చూస్తున్నాం. వీళ్లు థైరాయిడ్‌ మాత్రలు తీసుకుంటుంటారు కూడా. అందువల్ల పుట్టిన 48 గంటల నుంచి 5 రోజుల లోపు బిడ్డకు థైరాయిడ్‌ పరీక్ష చేయించటం మంచిది. ఒకవేళ థైరాయిడ్‌ మోతాదులు తక్కువగా ఉంటే వెంటనే చికిత్స మొదలెట్టొచ్చు. బుద్ధిమాంద్యం రాకుండా నివారించుకోవచ్చు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని