Updated : 27 Aug 2019 01:05 IST

వెంటనే కీమోథెరపీతీసుకోవాల్సిందేనా?

సమస్య - సలహా

సమస్య: మా సోదరికి రొమ్ముక్యాన్సర్‌. ఒక రొమ్ము తొలగించారు. బయాప్సీలో క్యాన్సర్‌ రెండో దశలో ఉన్నట్టు తేలింది. కీమోథెరపీ తీసుకోవాలని డాక్టర్‌ చెప్పారు. మరో రెండు నెలల్లో మా సోదరి కుమారుడి పెళ్లి ఉంది. అందుకని కీమోథెరపీ వద్దంటోంది. వెంటనే కీమో తీసుకోకపోతే ఏవైనా ఇబ్బందా? ప్రత్యామ్నాయ మార్గాలేవైనా ఉన్నాయా?

- హర్షిత (ఈమెయిల్‌ ద్వారా)

సలహా: కీమోథెరపీ అనగానే అందరికీ ప్రధానంగా జట్టు ఊడిపోవటమే గుర్తుకొస్తుంటుంది. చాలామంది దీన్ని తలచుకొని బాధపడుతుంటారు, భయపడుతుంటారు. మీ సోదరి కూడా ఇలాగే కీమోథెరపీని వాయిదా వేసుకోవాలని అనుకుంటున్నట్టు తోస్తోంది. కీమోథెరపీ మందులు ఒంట్లో అతి వేగంగా వృద్ధి చెందే కణాలను నిర్వీర్యం చేస్తాయి. ఈ క్రమంలో శరీరంలోని అన్ని భాగాలపైనా ప్రభావం చూపుతాయి. ఇవి క్యాన్సర్‌ కణాలను నిర్వీర్యం చేయటంతో పాటు మామూలు కణాలనూ దెబ్బతీస్తాయి. వెంట్రుకల కుదుళ్లు దెబ్బతింటే జుట్టు ఊడిపోతుంటుంది. అలాగని అన్ని కీమోథెరపీ మందులు అదే స్థాయిలో ప్రభావం చూపుతాయని అనుకోవద్ధు ముందుగా మీ సోదరికి ఈఆర్‌ పీఆర్‌ హెచ్‌ఇఆర్‌2 పరీక్ష చేయించటం మంచిది. కణితిలో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ గ్రాహకాలు (ఈఆర్‌), ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ గ్రాహకాలు (పీఆర్‌).. హ్యూమన్‌ ఎపిడెర్మల్‌ గ్రోత్‌ ఫ్యాక్టర్‌ రిసెప్టర్‌ 2 (హెచ్‌ఈఆర్‌2) వివరాలు ఇందులో తేలుతాయి. రొమ్ముక్యాన్సర్లలో సుమారు 80% ఈఆర్‌ పాజిటివ్‌, 65% పీఆర్‌ పాజిటివ్‌ ఉంటాయి. దాదాపు 20% హెచ్‌ఇఆర్‌2 పాజిటివ్‌గా ఉంటాయి. ఈఆర్‌/పీఆర్‌ నెగెటివ్‌ కణితులతో పోలిస్తే పాజిటివ్‌ కణితులు హార్మోన్‌ చికిత్సకు బాగా స్పందిస్తాయి. మీ సోదరికి ఈఆర్‌ 80%, పీఆర్‌ 80% పాజిటివ్‌గా.. హెచ్‌ఇఆర్‌2 నెగెటివ్‌గా.. క్యాన్సర్‌ కణాల వ్యాప్తి, వృద్ధిని సూచించే కెఐ-67 ప్రొటీన్‌ మోతాదులు తక్కువగా ఉంటే నేరుగా హార్మోన్‌ చికిత్స తీసుకోవచ్ఛు హెచ్‌ఇఆర్‌2 పాజిటివ్‌గా ఉంటే హర్‌సెప్టిన్‌ మందు ఉపయోగపడుతుంది. దీంతో కీమోథెరపీని కొంతకాలం వాయిదా వేసుకోవచ్ఛు ఒకవేళ కీమో అవసరమైనా ఇప్పుడు జుట్టు అంతగా ఊడిపోకుండా చూసే మందులూ అందుబాటులో ఉన్నాయి. పెగిలేటెడ్‌ లైపోసోమల్‌ డాక్సోరుబిసిన్‌ మందుతో పెద్దగా జుట్టేమీ ఊడిపోదు. ఆ తర్వాత అవసరమైతే ఇతరత్రా మందులతో మిగతా మోతాదుల కీమోథెరపీ తీసుకోవచ్ఛు ఇప్పుడు జుట్టు అంతగా ఊడిపోకుండా చూసే కీమో మందులూ ఉన్నాయి. పెగిలేటెడ్‌ లైపోసోమల్‌ డాక్సోరుబిసిన్‌(తో పెద్దగా జుట్టేమీ ఊడిపోదు.

మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను పంపాల్సిన చిరునామా

సమస్య - సలహా సుఖీభవ ఈనాడు ప్రధాన కార్యాలయం,

రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512

email: sukhi@eenadu.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు