సూక్ష్మంలోమోక్షం!

మన శరీరం క్రిముల నిలయం! ఆశ్చర్యంగా అనిపించినా ఇది ముమ్మాటికీ నిజం. మన శరీర కణాల కన్నా మనలో నివసించే బ్యాక్టీరియా...

Published : 15 Oct 2019 00:25 IST

న శరీరం క్రిముల నిలయం! ఆశ్చర్యంగా అనిపించినా ఇది ముమ్మాటికీ నిజం. మన శరీర కణాల కన్నా మనలో నివసించే బ్యాక్టీరియా కణాల సంఖ్యే ఎక్కువ. ఇవన్నీ మన చర్మం మీద, ముక్కులో, నోట్లో, పేగుల్లో, జననాంగాల్లో తిష్ఠ వేసుకొని, నిరంతరం వృద్ధి చెందుతూ ఉంటాయి. నిజానికి వీటిల్లో చాలావరకు మనకు మేలు చేసేవే. మనం ఆరోగ్యంగా ఉండటంలో కీలకపాత్ర పోషించేవే. రోగనిరోధకశక్తి పనితీరును నిర్దేశించటంలోనూ ఇవి పాలు పంచుకుంటాయి. అందుకే మన సూక్ష్మజీవ ప్రపంచంలో ఎలాంటి తేడాలు తలెత్తినా వాటి ప్రభావాలు తీవ్రంగానే ఉంటాయి. కొన్నిరకాల బ్యాక్టీరియా ఎక్కువగానూ, కొన్ని తక్కువగానూ ఉండటం వల్ల ఒంట్లో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) ప్రేరేపితమవుతున్నట్టు, ఇది రకరకాల జబ్బులకు దారితీస్తున్నట్టు అధ్యయనాలు ఘోషిస్తున్నాయి. పెద్దపేగు క్యాన్సర్‌ తలెత్తే తొలిదశలో పేగుల్లోని బ్యాక్టీరియా రకాలు మారిపోతున్నట్టు జపాన్‌లోని ఒసాకా విశ్వవిద్యాలయ అధ్యయనం పేర్కొంటుండటమే దీనికి నిదర్శనం. అంటే బ్యాక్టీరియా మార్పులు క్యాన్సర్‌కు బీజం వేస్తున్నాయన్నమాట. మల పరీక్ష ద్వారా పెద్దపేగు క్యాన్సర్‌ ఆనవాళ్లను తొలిదశల్లోనే గుర్తించటానికి ఈ అధ్యయన ఫలితాలు తోడ్పడగలవని భావిస్తున్నారు. మరోవైపు- పేగుల్లోని బ్యాక్టీరియాకూ ల్యూపస్‌ జబ్బుకూ బలమైన సంబంధమే ఉంటోందని న్యూయార్క్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సైతం చెబుతున్నారు. మిగతావారితో పోలిస్తే ల్యూపస్‌ బారినపడ్డ మహిళల పేగుల్లో రుమినోకాకస్‌ నావస్‌ అనే బ్యాక్టీరియా ఐదు రెట్లు అధికంగా ఉంటున్నట్టు తేలింది మరి. ఈ బ్యాక్టీరియా సంఖ్య ఎక్కువైనప్పుడల్లా జబ్బూ ఉద్ధృతం అవుతుండటం గమనించదగ్గ విషయం. ల్యూపస్‌ బాధితుల్లో రోగనిరోధక వ్యవస్థ పొరపాటున వారి మీదే దాడిచేస్తుంది. ఫలితంగా నొప్పితో పాటు కీళ్లు, చర్మం, కిడ్నీల వంటివీ దెబ్బతింటాయి. పేగుల్లోని బ్యాక్టీరియాను తిరిగి సమ స్థితికి తీసుకురావటం ద్వారా ల్యూపస్‌ను అదుపులో పెట్టే చికిత్సల రూపకల్పనకు తాజా పరిశోధన ఫలితాలు దారి చూపగలవని అనుకుంటున్నారు. కాబట్టే మున్ముందు చాలారకాల సమస్యలకు క్రిముల ప్రపంచం మనకు ‘సూక్ష్మ’ంలో మోక్షం చూపించగలదని ఆశిస్తున్నారు. పెరుగు, మజ్జిగ వంటి సజీవ బ్యాక్టీరియాతో కూడిన పదార్థాలు తీసుకోవటం ద్వారా మంచి బ్యాక్టీరియా పెంపొందేలా చూసుకోవచ్ఛు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు