పరిపూర్ణత్వం వేధిస్తోంది?

నేను పరిపూర్ణత్వ సమస్యతో బాధపడుతున్నా. అన్నీ సరిగా ఉండాలని, అన్నీ సరిగా చేయాలని భావిస్తుంటాను. నా ప్రవర్తన సరైంది కాదనే...

Published : 29 Oct 2019 00:24 IST

సమస్య - సలహా

సమస్య: నేను పరిపూర్ణత్వ సమస్యతో బాధపడుతున్నా. అన్నీ సరిగా ఉండాలని, అన్నీ సరిగా చేయాలని భావిస్తుంటాను. నా ప్రవర్తన సరైంది కాదనే సంగతి తెలుస్తున్నా ఆలోచనల తీరు మారటం లేదు. దీంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందరి దృష్టిలో చెడ్డవాడిని అవుతున్నా. తరచూ ఇంట్లో వాళ్లతో గొడవ పడి, కోపంతో బయటకు వెళ్లిపోతుంటాను. అన్నింటికీ మించి నాకు ఎంతో నైపుణ్యం ఉన్నా ఏమీ చేతకానివాడిగా మిగిలిపోయాననే బాధ వెంటాడుతోంది. నా సమస్యకు పరిష్కారమేంటి?

- మోహన్‌ (ఈ- మెయిల్‌ ద్వారా)

సలహా: మీరు పర్‌ఫెక్షనిస్టిక్‌ వ్యక్తిత్వ సమస్యను పరిపూర్ణత్వంగా భావిస్తున్నట్టు అనిపిస్తోంది. దీన్ని అబ్సెసివ్‌ కంపల్సిన్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ (ఓసీపీడీ) అనీ అంటారు. అన్ని పనులూ కచ్చితంగా సరిగానే చేయాలని భావించటం దీని ప్రత్యేకత. అంతేకాదు, ఏదైనా పని ముందేసుకున్నారనుకోండి. అది పూర్తయ్యేదాకా అక్కడ్నుంచి కదలరు. ఇది మంచిదే కావొచ్ఛు సమస్యేంటంటే అందరూ తమలాగే ఉండాలని, చేయాలని అనుకోవటం. అంతా ఒక పద్ధతి ప్రకారమే నడచుకోవాలని పట్టుపట్టటం. ఇదే చిక్కులు తెచ్చిపెడుతుంది. నిజానికి ఓసీపీడీ గలవారు దాన్నొక సమస్యగా గుర్తించరు. వీరితో పక్కవాళ్లు బాధపడుతుంటారు గానీ తాము చేస్తున్నది తప్పని తెలియదు. పైగా తాము చెప్పినట్టు నడచుకోవటం లేదని, పనులు జరగటం లేదని చింతిస్తుంటారు. అంతా తమను మోసం చేస్తున్నారని భావిస్తుంటారు. మీరేమో చేసేది తప్పనే విషయం మీకు తెలుస్తోందని అంటున్నారు. మీ సమస్యను మీరు గుర్తించగలుగుతున్నారు. ప్రవర్తనను మార్చుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. అందువల్ల మీకు పర్‌ఫెక్షనిస్టిక్‌ వ్యక్తిత్వ సమస్య లేదనే అనిపిస్తోంది. మీరు అబ్సెసివ్‌ కంపల్సరీ డిజార్డర్‌(ఓసీడీ)తో బాధపడుతున్నారని తోస్తోంది. ఓసీడీ గలవారిలో సిమెట్రీ లక్షణం కనిపిస్తుంది. ఎక్కడ్నుంచి వస్తువును తీస్తే అక్కడే పెట్టటం, ఎక్కడ ఎలా ఉన్నవి అక్కడే ఉంచటం వంటి పనులు చేస్తుంటారు. అన్నీ సరిగా ఉండాలని అనుకుంటుంటారు. మాటిమాటికీ సర్దుకుంటారు. చేసిన పనే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. గడియ వేశానా, లేదా? గ్యాస్‌ కట్టేశానా, లేదా? అని మాటిమాటికీ తనిఖీ చేస్తుంటారు. అలా లేకపోతే అసహనానికి గురవుతారు. వీరికి ఏదైనా ఒక ఆలోచన మొదలైతే ఒకపట్టాన పోదు. అలాగే వెంటాడుతుంది. ఆ పని చేసేంతవరకు మనసు కుదుటపడదు. సరిగా చేశామోలేదననే భావనతో పనుల విషయంలో తృప్తి పడరు. తీవ్రమైన ఆందోళనకు గురవుతుంటారు. ఇలాంటి ప్రవర్తనతో విసుగు వస్తున్నా తమ ప్రవర్తననను మార్చుకోలేరు. ఓసీడీ సమస్య మానసికంగా వేధించేదే అయినా ఇది మెదడు సమస్య. మెదడులో కొన్ని రసాయన మార్పులు తలెత్తటం దీనికి మూలం. దీనికి మంచి చికిత్సలు ఉన్నాయి. ఆందోళన, కుంగుబాటు తగ్గించే మందులు బాగా ఉపయోగపడతాయి. కాగ్నిటివ్‌ బిహేవియర్‌ చికిత్సతో ప్రవర్తనను మార్చుకోవచ్ఛు అలాగే కుటుంబ సభ్యులకూ కౌన్సెలింగ్‌ అవసరం. సరైన చికిత్స తీసుకుంటే సమస్య పూర్తిగా నయమైపోతుంది. మీరు మానసిక నిపుణులని సంప్రదిస్తే సమస్యను విశ్లేషించి, తగు చికిత్స సూచిస్తారు.

మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను పంపాల్సిన

చిరునామా

సమస్య - సలహా సుఖీభవ ఈనాడు ప్రధాన కార్యాలయం,

రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512 email: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని