మళ్లీ గర్భం ధరించొచ్చా?

పరగడుపున నడవాలా? ఏదైనా తిన్న తర్వాతైనా నడవొచ్చా? రోజులో ఏ సమయంలోనైనా నడవొచ్చా? ఇంట్లో కూడా నడవొచ్చా?నడక అనగానే చాలామందికి ఇలాంటి సందేహాలు వస్తుంటాయి. సాధారణంగా ఉదయం పూట నడవటం మంచిది. ఎందుకంటే ఉదయం వేళ కాలుష్యం తక్కువగా ఉంటుంది. చల్లటి, తాజా గాలి

Updated : 19 Nov 2019 07:43 IST

సమస్య - సలహా

సమస్య: నా వయసు 24 సంవత్సరాలు. ఇటీవలే కాన్పు అయ్యింది. కానీ పిల్లాడు చనిపోయి పుట్టాడు. చివరి నెలలో రక్తంలో ఇన్‌ఫెక్షన్‌ రావటం వల్ల ఇలా జరిగిందని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు మరోసారి సంతానాన్ని కనాలని అనుకుంటున్నాం. మునుపటి గర్భధారణ సమయంలో నాకు ఎలాంటి సమస్యలు లేవు. మామూలు కాన్పే అయ్యింది. ఇప్పుడు మళ్లీ మేం గర్భధారణకు ప్రయత్నించొచ్చా? ఏవైనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందా?

- ప్రియ బత్తుల (ఈ-మెయిల్‌ ద్వారా)

సలహా: మునుపటి గర్భధారణ సమయంలో మీకు ఎలాంటి సమస్యలు లేవంటున్నారు. మామూలు కాన్పే అయినా పిల్లాడు చనిపోయి పుట్టాడని అంటున్నారు. దీనికి రకరకాల కారణాలు దోహదం చేసి ఉండొచ్చు. అవేంటన్నది క్షుణ్నంగా పరిశీలించటం అత్యవసరం. అరుదే అయినా గర్భస్థ శిశువుల్లో కొందరికి పుట్టుకతోనే జీవక్రియల్లో తేడాలు ఉంటుంటాయి. ఇలాంటివి గలవారిలో కొన్ని ఎంజైమ్‌లు లోపిస్తాయి. ఇవి పిండం మీద దుష్ప్రభావం చూపే అవకాశముంది. కొన్నిరకాల జన్యు సమస్యలూ విపరీత ప్రభావం చూపొచ్చు. ఈ సమస్యలు మున్ముందు గర్భం ధరించినా తిరిగి తలెత్తొచ్చు. అందువల్ల మీరు గైనకాలజిస్టును, శిశు నిపుణులను సంప్రదించి అవసరమైన అన్ని పరీక్షలు చేయించుకోవటం మంచిది. తొలిసారి గర్భం ధరించినప్పుడు, కాన్పు సమయంలో చేసిన చికిత్సల వివరాలన్నీ డాక్టర్లకు పూర్తిగా తెలియజేయాలి. అలాగే మీరు తిరిగి గర్భధారణకు సిద్ధంగా ఉన్నారో లేదో తెలుసుకోవటానికి మీ ఆరోగ్య పరిస్థితినీ పూర్తిగా పరీక్షించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే గర్భధారణకు ప్రయత్నించాలి. మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టయితే పండంటి సంతానాన్ని కనటానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

ఎప్పుడు నడవాలి?

సమస్య: పరగడుపున నడవాలా? ఏదైనా తిన్న తర్వాతైనా నడవొచ్చా? రోజులో ఏ సమయంలోనైనా నడవొచ్చా? ఇంట్లో కూడా నడవొచ్చా?

- ఆర్‌.ఎం.సుబ్బారావు, విజయవాడ

సలహా: నడక అనగానే చాలామందికి ఇలాంటి సందేహాలు వస్తుంటాయి. సాధారణంగా ఉదయం పూట నడవటం మంచిది. ఎందుకంటే ఉదయం వేళ కాలుష్యం తక్కువగా ఉంటుంది. చల్లటి, తాజా గాలి మనసుకు ఉత్తేజం కలిగిస్తుంది. పరగడుపున నడవాలా అంటే అవసరం లేదు. చిన్న బ్రెడ్డు ముక్కలాంటిది తిని నడవొచ్చు. మధుమేహంతో బాధపడేవారికిది మరీ ముఖ్యం. ఇలా చేయటం వల్ల రక్తంలో గ్లూకోజు మోతాదులు బాగా పడిపోతాయనే భయం ఉండదు. అలాగని ఎవరైనా సరే కడుపు నిండా తిని నడవటం మంచిది కాదు. భోజనం చేసినప్పుడు జీర్ణకోశ వ్యవస్థకు రక్త ప్రసరణ బాగా జరగాలి. కడుపు నిండా తిని వడివడిగా నడిస్తే గుండె మీద ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. ఇది మంచిది కాదు. సాయంత్రం పూట నడవకూడదనేమీ లేదు. ఇదేమీ నిషిద్ధం కాదు. కాకపోతే పొద్దుట్నుంచీ పనిచేసి ఉండటం వల్ల శరీరం అలసిపోయి ఉంటుంది. దీంతో నడక అంత ఉత్సాహంగా సాగదు. అలాగే రాత్రిపూట నడవాలంటే చీకటి మూలంగా సరిగా కనిపించక ఇబ్బందులు తలెత్తొచ్చు. కాలికి ఏదైనా తగిలి కింద పడిపోవచ్చు. ఎముకలు పెళుసుగా ఉండే వృద్ధులకు ఇది ప్రమాదకరం. ఆరుబయటే నడవాలని లేదు. ఇంట్లోనూ నడవొచ్చు. గదులలో కాకుండా పొడవాటి వరండాలో, పెరటిదొడ్డిలో లేదూ డాబా మీద నడవొచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది రోజుకు 10వేల అడుగులు నడవటం. ఎప్పుడు నడిచినా, ఎక్కడ నడిచినా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి.

 ఆరోగ్య సమస్యలను పంపాల్సిన చిరునామా:
సమస్య - సలహా, సుఖీభవ, ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512

email: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని