వ్యాయామానికి బ్యాక్టీరియా తోడు

ఒకసారి మధుమేహం వచ్చిందంటే నయం కావటం అసాధ్యం. దీన్ని నియంత్రణలో ఉంచుకోవటం తప్పించి చేయగలిగిందేమీ లేదు...

Published : 24 Dec 2019 00:14 IST

కసారి మధుమేహం వచ్చిందంటే నయం కావటం అసాధ్యం. దీన్ని నియంత్రణలో ఉంచుకోవటం తప్పించి చేయగలిగిందేమీ లేదు. అందుకే జీవనశైలి మార్పులతో దీని బారినపడకుండా చూసుకోవటమే మేలన్నది నిపుణుల సూచన. జీవనశైలి మార్పుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది వ్యాయామం. మధుమేహ నివారణలో దీని కన్నా తేలికైన, చవకైన మార్గం మరోటి లేదు. అయితే కొందరికి ఎంత వ్యాయామం చేసినా పెద్దగా ఫలితం కనిపించదు. ఎందుకిలా? హాంకాంగ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులకు ఇలాంటి అనుమానమే వచ్చింది. ముందస్తు మధుమేహ దశలో ఉన్న కొందరిని ఎంచుకొని.. వ్యాయామానికీ పేగుల్లోని బ్యాక్టీరియా, జీవక్రియలకూ గల సంబంధం మీద అధ్యయనం చేశారు. వ్యాయామంతో గ్లూకోజు జీవక్రియలు, ఇన్సులిన్‌ స్పందనలు మెరుగుపడినవారి పేగుల్లో భిన్నమైన బ్యాక్టీరియా ఉంటున్నట్టు గుర్తించారు. ఈ బ్యాక్టీరియా కొవ్వు ఆమ్లాలను మరింత ఎక్కువగా పుట్టిస్తుండటం, అమైనో ఆమ్లాలను ఇంకాస్త అధికంగా విడగొడుతుండటం విశేషం. వీరిలో జీవక్రియలు చురుకుగా సాగుతున్నాయనటానికి ఇది నిదర్శనం. పేగుల్లోని బ్యాక్టీరియాను మార్చుకోగలిగితే వ్యాయామ ఫలితాలను వీలైనంత ఎక్కువగా పొందే వీలుందని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. ఇకపై కేవలం వ్యాయామం మీదే కాకుండా పేగుల్లో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసే పెరుగు, మజ్జిగ వంటివి క్రమం తప్పకుండా తినటం పైనా దృష్టి సారించండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని