Published : 02 Jul 2019 00:36 IST

పిల్లలకెంత వ్యాయామం?

వ్యాయామం, శారీరకశ్రమను చాలామంది పెద్దల వ్యవహారంగానే చూస్తుంటారు. పిల్లలకూ వ్యాయామం అత్యవసరం. ఎదిగే వయసులో కండరాలు, ఎముకలు బలపడటానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఆరేళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు పిల్లలు రోజుకు కనీసం గంట సేపు వ్యాయామం, శారీరకశ్రమ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు ఆటలంటే చాలా ఇష్టం. ఇవీ వ్యాయామాలుగా ఉపకరిస్తాయి. రక్తంలో ఆక్సిజన్‌ స్థాయులను పెంచే నడక, పరుగు, ఈత, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, టెన్నిస్‌, డ్యాన్స్‌.. ఇలాంటివేవైనా ఎంచుకోవచ్చు. అలాగే కాస్త కష్టమైన వ్యాయామాలను వారానికి కనీసం మూడు రోజుల పాటైనా చేసేలా చూసుకోవాలి. 3-5 ఏళ్ల పిల్లలనైతే రోజంతా చురుకుగా కదిలేలా, రకరకాల ఆటలు ఆడుకునేలా ప్రోత్సహించాలి. ఎక్కువసేపు ఒకేదగ్గర కూర్చోకుండా చూసుకోవటం ముఖ్యం. చిన్నప్పుడే వ్యాయామం చేయటం అలవడితే అది జీవితాంతం కొనసాగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నప్పట్నుంచే వ్యాయామం పట్ల మక్కువను పెంచితే, దాన్ని క్రమం తప్పకుండా కొనసాగించేలా చేస్తే మున్ముందు మంచి ఆరోగ్యానికి బాటలు వేసినట్టే.

వ్యాయామ లాభాలు..
* వయసుకు తగ్గ ఎదుగుదల పుంజుకుంటుంది
* కండరాలు, ఎముకలు బలోపేతమవుతాయి
* అధికబరువు ముప్పు తగ్గుతుంది
* శరీర సౌష్ఠవం మెరుగవుతుంది
* పెద్దయ్యాక మధుమేహం వచ్చే అవకాశం తగ్గుతుంది
* రక్తపోటు, రక్తంలో కొలెస్ట్రాల్‌ తక్కువవుతాయి
* చురుకుదనం, ఉత్సాహం ఇనుమడిస్తాయి
* ఆశావహ దృక్పథం, ఆత్మ విశ్వాసం పెంపొందుతాయి
* ఏకాగ్రత, చదువుల్లో నైపుణ్యం పెరుగుతాయి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని