ప్లీహం పెద్దగా అయ్యిందెందుకు?

ఇటీవల మా స్నేహితుడు ప్లేట్‌లెట్లు తగ్గాయని ఆసుపత్రికి వెళ్లాడు. డాక్టర్‌కు అనుమానం వచ్చి అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేయించారు. అందులో ప్లీహం పెద్దగా (15 సెం.మీ.)....

Updated : 02 Jul 2019 03:16 IST

సమస్య - సలహా

సమస్య: ఇటీవల మా స్నేహితుడు ప్లేట్‌లెట్లు తగ్గాయని ఆసుపత్రికి వెళ్లాడు. డాక్టర్‌కు అనుమానం వచ్చి అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేయించారు. అందులో ప్లీహం పెద్దగా (15 సెం.మీ.) అయినట్టు తేలింది ఇదేం సమస్య? ఇలా ఎందుకు జరుగుతుంది? దీనికి పరిష్కారమేంటి?

- జి.లక్ష్మణ్‌, హైదరాబాద్‌


సలహా: దీన్ని స్ప్లీనోమెగాలే అంటారు. అంటే ప్లీహం (స్ప్లీన్‌) పెద్దగా అవటం. నిజానికి ఇదొక లక్షణమే. అసలు సమస్య ఇతర అవయాల్లో ఉంటుందని గుర్తించాలి. ప్లీహం మన లింఫ్‌ వ్యవస్థలో భాగం. ఇది రక్తం ఆరోగ్యంగా ఉండటానికి, ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికి తోడ్పడుతుంది. తనలోంచి రక్తం ప్రవహించే సమయంలో రక్తంలోని బ్యాక్టీరియా, మృత కణజాలం వంటి వాటినిది తినేస్తుంది. తెల్ల రక్తకణాలు, ఎర్ర రక్తకణాలు, ప్లేట్‌లెట్లు ఆరోగ్యంగా ఉండటానికీ దోహదం చేస్తుంది. మామూలుగా ప్లీహం పిడికెడంతే ఉంటుంది. కొందరిలో దీని సైజు పెరిగి పెద్దగా అవుతుంటుంది. ఇందుకు రకరకాల అంశాలు దోహదం చేయొచ్చు. కాలేయ జబ్బు, కాలేయం గట్టిపడటం (సిరోసిస్‌), కాలేయానికి రక్తాన్ని తీసుకెళ్లే సిరలో రక్తం గడ్డకట్టటం వంటి సమస్యలెన్నో ప్లీహం పెద్దగా అవటానికి దారితీయొచ్చు. మలేరియా వంటి ఇన్‌ఫెక్షన్లు, రక్తకణాలు చిట్లిపోయేలా చేసే రక్త సమస్యల్లోనూ ఇలా జరగొచ్చు. కొందరికి లింఫ్‌ వ్యవస్థలో క్యాన్సర్‌ (లింఫోమా) మూలంగానూ ప్లీహం పెరగొచ్చు. కాబట్టి ముందు కారణాలేంటన్నది నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. కాలేయ సామర్థ్య పరీక్ష, అల్ట్రాసౌండ్‌ చేయాల్సి ఉంటుంది. వీటి ఫలితాలు నార్మల్‌గా ఉంటే రక్త సమస్యలేవైనా ఉన్నాయేమో పరీక్షించాల్సి ఉంటుంది. రక్తకణాల సంఖ్య, రక్తం చిట్లిపోవటం వంటివి ఉంటే ఇందులో బయటపడతాయి. ఇవన్నీ నార్మల్‌గా ఉంటే గతంలో వచ్చిన ఇన్‌ఫెక్షన్లు కారణమవుతున్నాయేమో పరిశీలిస్తారు. ఇలా కారణాలన్నీ విశ్లేషించిన తర్వాతే తగు చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇన్‌ఫెక్షన్లతో ముడిపడిందైతే జనరల్‌ ఫిజిషియన్‌, కాలేయంతో ముడిపడిందైతే గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు, రక్త సమస్యలైతే హెమటాలజిస్టు, లింఫోమా కారణమైతే క్యాన్సర్‌ నిపుణులు చికిత్స చేస్తారు.


అర్ధరాత్రి దాటాక భోజనం..
పరగడుపు మాత్రలు వేసుకోవచ్చా?

సమస్య: ఎప్పుడైనా అర్ధరాత్రి దాటిన తర్వాత భోజనం చేస్తే.. మర్నాడు పరగడుపున వేసుకోవాల్సిన మాత్రలు వేసుకోవచ్చా?

-విఘ్నేశ్‌, హైదరాబాద్‌


సలహా: అర్ధరాత్రి దాటాక భోజనం చేసినవారిలో చాలామందికి ఇలాంటి సందేహం వస్తుంటుంది. సాధారణంగా మనం తిన్న ఆహారం 45 నిమిషాల్లో జీర్ణాశయంలోంచి చిన్న పేగుల్లోకి వెళ్లటం ఆరంభిస్తుంది. మధుమేహం, నాడీ సమస్యలు గలవారిలోనైతే ఇంకాస్త ఎక్కువ సమయం పడుతుంది. కొన్ని మాత్రలు జీర్ణాశయంలోనే విచ్ఛిన్నమవుతాయి, కొన్ని చిన్న పేగుల్లో విడిపోతాయి. ఏదేమైనా పరగడుపున వేసుకునే మాత్రలకు భోజనం చేసిన తర్వాత 2-4 గంటల సమయం ఉంటే సరిపోతుంది. అప్పుడు ఖాళీ కడుపుతో వేసుకోవాల్సిన మాత్రలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఒకవేళ పరగడుపున మాత్ర వేసుకోవటం మరచిపోతే వీలైనంత త్వరగా వేసుకోవచ్చు. ఒకవేళ అల్పాహారం లేదా భోజనం చేస్తే.. ఆ తర్వాత 2 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి.


మీ ఆరోగ్య సమస్యలను
సందేహాలను పంపాల్సిన చిరునామా
సమస్య - సలహా సుఖీభవ ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512

email:  sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని