‘కొత్త’గా బాసించాలంటే..

బరువు తగ్గుతాను. పొగ మానేస్తాను. మద్యం జోలికి వెళ్లను. మంచి తిండి తింటాను. కొత్త సంవత్సరంలో ఇలాంటి ఆరోగ్య బాసలు, తీర్మానాలు చేసుకోవటం మామూలే.

Published : 07 Jan 2020 00:36 IST

బరువు తగ్గుతాను. పొగ మానేస్తాను. మద్యం జోలికి వెళ్లను. మంచి తిండి తింటాను. కొత్త సంవత్సరంలో ఇలాంటి ఆరోగ్య బాసలు, తీర్మానాలు చేసుకోవటం మామూలే. రెండు మూడు వారాలు దాటగానే వాటిని అటక మీదికి ఎక్కించేయటమూ షరా మామూలే. మరి మనకు మనమే చేసుకున్న ‘కొత్త’ బాసలకు కట్టుబడి ఉండటమెలా?
* ఆచరణ సాధ్యమయ్యేలా : ఒక కచ్చితమైన సమయంలోగా సాధించే విధంగా తీర్మానించుకోవటం మంచిది. అదీ ఆచరించటానికి వీలుగా ఉండాలి. ఉదాహరణకు 3 నెలల్లో 5 కిలోల బరువు తగ్గాలి, 30 రోజుల్లో సిగరెట్లు మానెయ్యాలని అనుకోవచ్చు. ఇలాంటి కచ్చితమైన తీర్మానాలు మున్ముందుకు నడిపిస్తాయి. మార్పు కనిపిస్తుంటే తోటివాళ్లూ ప్రోత్సహిస్తారు. ఇది మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.
* సాధించామనే ఊహ: బరువు తగ్గిన తర్వాత ఎలా ఉంటాను? దురలవాట్లు మానేశాక ఆరోగ్యం ఎలా ఉంటుంది? తీసుకున్న నిర్ణయాన్ని సాధించిన తర్వాత ఎలా ఉంటామనే దృశ్యాలను ఇలా మనసులో ఊహించుకోవటం ఎంతగానో ప్రోత్సహిస్తుంది.
* మిత్రులతో పంచుకుంటే: తీసుకున్న నిర్ణయాలను స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవటం మేలు. ఏదైనా మార్పు కనిపిస్తే ఓ సందేశం పంపమనో, ఫోన్‌ చేయమనో చెబితే ఇంకా మంచిది. ఇది తీర్మానాలకు కట్టుబడేలా చేస్తుంది. రోజూ చూసేవారి కన్నా ఎప్పుడో అప్పుడు కలిసేవారైతే మార్పులను ఇట్టే పట్టేస్తారు.
* లక్ష్య విభజన: ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది కదా. అందువల్ల ఏదైనా సాధించాలని తీర్మానించుకున్నాక దాన్ని చిన్న చిన్న లక్ష్యాలుగా విడగొట్టుకోవటం ఉత్తమం. 3 నెలల్లో 5 కిలోల బరువు తగ్గాలని అనుకుంటే నెలకు ఎంత? వారానికి ఎంత? అనేది నిర్ణయించుకుంటే సాధించటం తేలికవుతుంది. అనుకున్న ఫలితం కనిపిస్తే మున్ముందుకు సాగటానికి మరింత హుషారు కలుగుతుంది. అతిగా ఊహించుకొని ప్రయత్నించటం, అతి త్వరగా సాధించాలని అనుకోవటం వల్లనే చాలా నిర్ణయాలు నీరుగారిపోతాయనే సంగతిని గుర్తుంచుకోవాలి. రోజుకు 30 నిమిషాల సేపు వ్యాయామం చేయాలని అనుకున్నవారు సమయం దొరక్కపోతే 10 నిమిషాల చొప్పున విభజించుకోవచ్చు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో వ్యాయామం చేయొచ్చు.
* మరచిపోవద్దు: పనుల్లో పడిపోయో, తీరిక లేకనో కొన్నిసార్లు తీర్మానాలను పక్కన పడేయొచ్చు. ఒకరోజు వ్యాయామం చేయకపోతే  ఏమవుతుందిలే అనుకోవచ్చు. ఇది పెద్ద పొరపాటు. ఈ నిర్లక్ష్య ధోరణి ఒకరోజుతో ఆగేది కాదు. కాబట్టి తీసుకున్న నిర్ణయాన్ని ఒక కాగితం మీద రాసుకొని స్పష్టంగా కనిపించేలా గోడకు అతికించుకోవాలి. రోజూ ఎంతవరకు సాధించామన్నది రాసుకుంటే మనకు మనమే ప్రోత్సహించుకున్నట్టూ అవుతుంది.
* ఆత్రుత వద్దు: పాత అలవాటును విడిచిపెట్టటానికి, కొత్త అలవాటుకు కట్టుబడి ఉండటానికి కనీసం 30-60 రోజులు పడుతుందని తెలుసుకోవాలి. అందువల్ల ఆత్రుత, తొందర వద్దు. అన్నిసార్లూ సరిగా చేయాలనేమీ లేదు. కొన్నిసార్లు పొరపాట్లు దొర్లినా నీరుగారిపోవద్దు. రోజూ క్రమం తప్పకుండా సాధన చేస్తే అదే అలవాటవుతుంది. నెమ్మదిగానైనా మంచి ఫలితం కనిపిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని