చదివిందిగుర్తుండదెందుకు?

నా వయసు 18 సంవత్సరాలు. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నాకు ఏం చదివినా సరిగా ...

Published : 14 Jan 2020 00:11 IST

సమస్య - సలహా

సమస్య: నా వయసు 18 సంవత్సరాలు. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నాకు ఏం చదివినా సరిగా గుర్తుండటం లేదు. త్వరగా మరచిపోతున్నాను. ఎవరైనా ఏదైనా పని చెబితే దాని గురించి కాకుండా వేరే ఏదో గుర్తుకొస్తుంటుంది. దీనికి పరిష్కారమేంటి?

-ప్రణీత్‌ (ఈ-మెయిల్‌ ద్వారా)

సలహా: మీరు చదివింది గుర్తుండటం లేదని, ఏదైనా చెబితే వేరేవి గుర్తుకొస్తున్నాయని అంటున్నారంటే ఆయా విషయాలపై మనసు పెట్టటం లేదనే అర్థం. ఇలా ఏకాగ్రత తగ్గటం మూలంగా చదివినవి, విన్నవి గుర్తుండవు. వాటి గురించి ఆలోచించటం కష్టమైపోతుంది. చిన్న వయసులో ఏకాగ్రత తగ్గటానికి ప్రధాన కారణాలు మానసిక ఒత్తిడి (స్ట్రెస్‌), ఆందోళన (ఆంగ్జయిటీ). కొన్నిసార్లు కుంగుబాటు (డిప్రెషన్‌) మూలంగానూ ఏకాగ్రత తగ్గిపోయే అవకాశముంది. అందువల్ల ఇలాంటి సమస్యలేవైనా ఉన్నాయా? అనేది తెలుసుకోవటానికి మానసిక నిపుణులను సంప్రదించటం మంచిది. కారణాన్ని గుర్తించి, అవసరమైతే మందులు ఇస్తారు. ఆందోళన, కుంగుబాటు తగ్గటానికి ఇప్పుడు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. భయపడాల్సిన పనిలేదు. అలాగే ఏకాగ్రత పెరగటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇందుకు ధ్యానం, ప్రాణాయామం, యోగా వంటివి బాగా ఉపయోగపడతాయి. శరీర కదలికలు, శ్వాస ఒక క్రమబద్ధంగా సాగేలా చేసే ఇవి ఏకాగ్రత పెరగటానికి తోడ్పడతాయి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయటమూ మంచిది. వీటితో కుంగుబాటు, ఒత్తిడి తగ్గుతాయి. మెదడుకు రక్త సరఫరా మెరుగవుతుంది, మెదడు చురుకుగా పనిచేస్తుంది. మంచి పోషకాహారం తినాలి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో నిండిన బాదంపప్పు, జీడిపప్పు, అక్రోట్ల వంటి గింజపప్పులు (నట్స్‌) మెదడుకు బలాన్ని చేకూరుస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని