సమస్య - సలహా

కరోనా వైరస్‌ నివారణకు హోమియో మందు ఉన్నట్టు ఇటీవల పత్రికల్లో చదివాను. ఇది నిజమేనా? మందును ఎలా వేసుకోవాలి?

Published : 04 Feb 2020 01:59 IST

కరోనాకు హోమియో టీకా?

సమస్య: కరోనా వైరస్‌ నివారణకు హోమియో మందు ఉన్నట్టు ఇటీవల పత్రికల్లో చదివాను. ఇది నిజమేనా? మందును ఎలా వేసుకోవాలి?

- వెంకటేశ్‌, హైదరాబాద్‌

సలహా: కరోనా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌కు ఆరెన్సికమ్‌ ఆల్బమ్‌ మందు వేసుకోవాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆయుష్‌ విభాగం సూచించింది. ఇది కరోనా ఇన్‌ఫెక్షన్‌ను నిరోధించటానికి తోడ్పడుతుంది. నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. ఆర్సెనికమ్‌ ఆల్బమ్‌ మందును 30 పొటెన్సీలో ఉదయం ఒక మోతాదు (ఐదారు మాత్రలు),  సాయంత్రం ఒక మోతాదు వేసుకోవచ్చు. ఇలా రెండు రోజుల పాటు వేసుకుంటే సరిపోతుంది. మందు వేసుకోవటానికి గంట ముందు, గంట తర్వాత ఏమీ తినకూడదు, నీళ్ల వంటివి తాగకూడదు. వీలైతే ఉదయం పూట పరగడుపున వేసుకుంటే మంచిది. సాయంత్రం 6 గంటల సమయంలో మరో మోతాదు వేసుకోవాలి. వారం తర్వాత తిరిగి ఈ మందును ఇదే మోతాదులో ఒకరోజు వాడుకోవాలి.


పాల పళ్లు తీస్తే చూపు దెబ్బతింటుందా?

సమస్య: మా పిల్లాడి వయసు 11 సంవత్సరాలు. కొన్ని పాల పళ్లు పుచ్చిపోయాయి. డాక్టర్‌కు చూపిస్తే వాటిని తీసేయాలని అంటున్నారు. పాల పళ్లను తొలగిస్తే కంటి చూపు దెబ్బతింటుందని కొందరు అంటున్నారు. ఇది నిజమేనా? మున్ముందు ఏవైనా సమస్యలు వస్తాయా?        

- ఆంజనేయులు, హైదరాబాద్‌

సలహా: సాధారణంగా 11 ఏళ్లు వచ్చేసరికి పాల పళ్ల అడుగున ఉండే శాశ్వత దంతాలు పైకి రావటానికి ప్రయత్నిస్తుంటాయి. పాల పళ్ల చుట్టూరా ఉండే ఎముక తగ్గిపోతూ వస్తుంది. దీంతో అవి కదలటం ఆరంభిస్తాయి. 14 ఏళ్లు వచ్చేసరికి జ్ఞానదంతాలు తప్ప మిగతా పాల పళ్లన్నీ ఊడిపోతాయి. క్రమంగా వాటి స్థానంలో శాశ్వత దంతాలు మొలుస్తాయి. మీ పిల్లాడి వయసు 11 ఏళ్లు అంటున్నారు. పాల పళ్లు ఆరోగ్యంగా ఉంటే పద్నాలుగేళ్ల వరకు వేచి చూడొచ్చు. కానీ మీరు కొన్ని పళ్లు పుచ్చిపోయాయని అంటున్నారు. ఇలాంటివారికి ముందుగా పళ్లు బలంగా ఉన్నాయా? లేవా? అనేది చూడాల్సి ఉంటుంది. మీరు ఒకసారి నిపుణులైన దంత వైద్యుడిని సంప్రదించటం మంచిది. అవసరమైతే ఆర్థోపాంటోమోగ్రామ్‌ (ఓపీజీ) ఎక్స్‌రే తీస్తారు. ఇందులో పళ్లు, వాటి చుట్టూరా ఉండే ఎముక తీరుతెన్నులు బయటపడతాయి. పాల పళ్ల అడుగున శాశ్వత దంతాలు ఎంత దూరంలో ఉన్నాయి? వాటి మీద ఎముక ఎంతవరకు కప్పుకొని ఉంది? పాల పళ్ల చుట్టూ ఎంత ఎముక ఉంది? అనేవి తెలుస్తాయి. దవడ ఎముక బలంగా ఉంటే పుచ్చిపోయిన పాల పళ్లకు తగు చికిత్స తీసుకుంటూ జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ పాల పళ్ల చుట్టూ ఎముక లేకుండా, కదులుతూ ఉంటే వాటిని తీసేయటమే ఉత్తమం. ఆ తర్వాత వాటి స్థానంలో శాశ్వత దంతాలు మొలుస్తాయి. కొందరికి లోపల శాశ్వత దంతాలు ఉండకపోవచ్చు. ఇలాంటివారిలో చాలావరకు పాల పళ్లు గట్టిగానే ఉంటాయి. వాటిని కదిలించాల్సిన అవసరం లేదు. పిప్పిపళ్ల వంటి సమస్యలుంటే మాత్రం చికిత్స చేయించుకోవాలి. దంతాలకు కంటికి ఎలాంటి సంబంధం లేదు. పాల పళ్ల మూలం చిన్నగా ఉంటుంది. వాటిని తీసేసినా వచ్చే ఇబ్బందేమీ లేదు. అసలు పాల పళ్లు దెబ్బతినకుండా చిన్నప్పట్నుంచే తగు జాగ్రత్తలు పాటించేలా చూసుకోవటం అన్నింటికన్నా ఉత్తమం. పాల పళ్లయినా అశ్రద్ధ చేయొద్దు. రోజుకు రెండు సార్లు.. ఉదయం, సాయంత్రం పళ్లను తోముకునేలా పిల్లలకు నేర్పించాలి. మిఠాయిలు, చాక్లెట్ల వంటివి ఎక్కువగా తినకుండా చూసుకోవాలి. ఒకవేళ తింటే వెంటనే పళ్లను శుభ్రం చేసుకోవటం అలవాటు చేయాలి.
మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను పంపాల్సిన చిరునామా
సమస్య - సలహా సుఖీభవ

ఈనాడు ప్రధాన కార్యాలయం,      

రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512
email: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని