కరోనాసుర హస్తం!

మన చేతులే మన శత్రువులైతే? కరోనా వైరస్‌ భయంతో ఇప్పుడిలాంటి పరిస్థితే నెలకొంది. కరోనా జబ్బు గలవారు...

Published : 21 Apr 2020 00:19 IST

న చేతులే మన శత్రువులైతే? కరోనా వైరస్‌ భయంతో ఇప్పుడిలాంటి పరిస్థితే నెలకొంది. కరోనా జబ్బు గలవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లను పీల్చటం ద్వారా వైరస్‌ ఇతరులకు సోకుతుంది. అంతేకాదు, వైరస్‌ చుట్టుపక్కల వస్తువుల మీద అంటుకుంటే దాన్ని ముట్టుకున్న చేతులతో ముఖాన్ని తాకినా సంక్రమిస్తుంది. అందుకే తరచూ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవటమే కాదు, వీలైనంతవరకు ముఖానికి చేతులు తాకకుండా చూసుకోవటమూ ముఖ్యమే. ఇది చెప్పినంత సులభం కాదు ఆచరించటం. మనకు తెలియకుండానే ముక్కును, నోటిని తాకుతూనే ఉంటాం. గంటకు కనీసం 23 సార్లయినా ముఖాన్ని తాకుతుంటామని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి దీన్ని అదుపులో ఉంచుకోవటమెలా?

ఎప్పుడెప్పుడు, ఎలా చేతులను తాకుతుంటామో అనేది గ్రహించటం ప్రధానం. ఇతరులను గమనించటం ద్వారా దీన్ని తెలుసుకోవచ్ఛు కొందరు బోర్‌ కొట్టినప్పుడు చుబుకాన్ని చేతులకు ఆనిస్తుండొచ్ఛు ఏదైనా విచారంతో నుదురు రుద్దుకోవచ్ఛు విసుగుపుట్టి గోర్లు కొరుకుతుండొచ్ఛు ఇలాంటి సందర్భాల్లో మనమూ అలాగే చేస్తుండొచ్ఛు దీన్ని గుర్తిస్తే ఒకింత పరిష్కారం లభించినట్టే.

చేతులకు సువాసనతో కూడిన సబ్బు, లోషన్‌ లేదా పరిమళ ద్రవ్యాన్ని రాసుకోవచ్ఛు దీంతో చేయి ముఖం దగ్గరికి రాగానే వాసన తగులుతుంది. అప్పుడు వెంటనే చేతులను దూరంగా జరపొచ్చు.

బయటకు వెళ్లినప్పుడు ముఖానికి గుడ్డ మాస్కు ధరిస్తే ముక్కు, నోటిని అంతగా తాకకుండా చూసుకోవచ్చు.

చేయటానికి ఏ పనీ లేకపోతే స్ట్రెస్‌ బంతి, ఫిట్జెట్‌ స్పిన్నర్‌, రబ్బరు బ్యాండు వంటివి చేతిలోకి తీసుకుంటే సరి. ఆ పనుల్లో పడిపోయి ముఖానికి చేయి తగలకుండా జాగ్రత్త పడొచ్చు.

డెస్క్‌ లేదా బల్ల ముందు కూర్చుంటే చేతులను వాటి మీద ఆనించొద్ధు ఒడిలోనో, తొడల కిందో చేతులను పెడితే వెంటనే ముఖం దగ్గరికి రాకుండా చూసుకోవచ్చు.

టిష్యూ కాగితం లేదా రుమాలు అందుబాటులో ఉంచుకోవటం మంచిది. ముక్కు మీద దురద పెట్టినా.. కళ్లు, ముక్కు, నోరు తుడుచుకోవాలన్నా ఇది ఉపయోగపడుతుంది.

ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత ప్రయత్నించినా ముఖానికి ఏమాత్రం చేతులు తాకకుండా చూసుకోవటం కష్టం. కానీ ఇతరులకు దూరంగా ఉండటం, తరచూ చేతులను కడుక్కుంటుంటే పెద్ద ఇబ్బందేమీ ఉండదు. అందువల్ల చేతులు కడుక్కోవటం, దూరం పాటించటం ప్రధానమనే సంగతిని గుర్తుంచుకొని ఆచరించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని