Updated : 21 Apr 2020 00:29 IST

పసి గుండె పదిలం

సమస్య-సలహా

సమస్య: నా కుమారుడి వయసు 8 సంవత్సరాలు. గుండె కవాటాల సమస్యతో పుట్టాడు. చాలాకాలం కిందటే ఆపరేషన్‌ చేయించాం. ప్రస్తుతం స్వల్పంగా రక్తం లీక్‌ అవుతోంది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా నివారణకు క్లోరోక్విన్‌ వాడొచ్చా? టీకాల వంటివి యథావిధిగా ఇప్పించొచ్చా? అసలు పుట్టుకతో గుండె సమస్యలు గలవారి విషయంలో ఎవరైనా ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ఎస్‌. రాజీవ్‌, హైదరాబాద్‌

సలహా: గుండెజబ్బులు గలవారికి కరోనా ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటోందనే హెచ్చరికలు వినిపిస్తున్న తరుణంలో మీకు ఇలాంటి సందేహాలు రావటం సహజమే. నిజానికి కొవిడ్‌-19 విషయంలో పుట్టుకతో గుండెజబ్బులు గల పిల్లలందరినీ ఒకే గాటన కట్టేయలేం. ముప్పు ఎవరికి ఎక్కువన్నదాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గుండెలో రంధ్రాలు, కవాటాలు బిగుసుకుపోవటం, కవాటాల్లోంచి రక్తం లీక్‌ అవటం వంటి సమస్యలు మామూలుగా ఉన్నవారికి.. ఇప్పటికే ఆపరేషన్‌ చేయించుకున్న పిల్లలకు కరోనా ఇన్‌ఫెక్షన్‌ ముప్పు తక్కువనే చెప్పుకోవచ్ఛు ఇలాంటివాళ్లు ఇంట్లోనే ఉండటం, చేతులు కడుక్కోవటం, ఇతరులకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు పాటిస్తే చాలు. ఒక్క పొరతో కూడిన గుడ్డ మాస్కులు వైరస్‌ను అంత సమర్థంగా అడ్డుకోలేవు కాబట్టి మూడు పొరలతో కూడిన సర్జికల్‌ మాస్కులు ధరించాలి. లోపాలకు ఆపరేషన్‌ చేయించుకోని పిల్లలకు, సంక్లిష్ట గుండె లోపాలు గలవారికి కరోనా ముప్పు ఎక్కువ. రంధ్రాలు పెద్దగా గలవారికి, చర్మం నీలంగా మారినవారికి, గుండె ఆపరేషన్‌ అన్ని దశలు పూర్తికానివారికి, గుండె సరిగా పనిచేయనివారికీ ముప్పు ఎక్కువే. ఊపిరితిత్తుల్లోకి రక్తం ఎక్కువగా వెళ్తుండటం, రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుండటం వల్ల వీరికి ఇన్‌ఫెక్షన్‌ త్వరగా సోకే ప్రమాదముంది. ఇలాంటివారి విషయంలో టెలిఫోన్‌ లేదా సామాజిక మాధ్యమాల ద్వారా డాక్టర్‌ను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరముంటే తప్ప ఆసుపత్రులకు వెళ్లకపోవటమే మంచిది. డాక్టర్‌ సూచించిన మందులన్నీ క్రమం తప్పకుండా వేసుకోవాలి. జ్వరం, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తే తాత్సారం చేయకుండా వెంటనే డాక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలి. ఇలాంటి పిల్లలను ప్రత్యేకంగా పరిశీలించి, అవసరమైన పరీక్షలు చేయిస్తారు. కొవిడ్‌-19 మూలంగా తలెత్తే శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు ఉన్నాయేమో అనేది నిర్ధారించటం చాలా ముఖ్యం. ఆసుపత్రికి వచ్చే ముందే పిల్లలు, వారి తల్లిదండ్రులు విధిగా సర్జికల్‌ మాస్క్‌లు ధరించాలి. తరచూ చేతులకు శానిటైజర్‌ రాసుకోవాలి. ఇతర రోగులకు కనీసం 1.5 మీటర్ల దూరంలో ఉండాలి. జ్వరం, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు మామూలువే అయితే పిల్లలను ఇంట్లోనే ఉంచి, డాక్టర్‌ రాసిచ్చిన మందులు వేస్తే చాలు. ఆయాసం వంటివి ఇబ్బంది పెడుతుంటే మాత్రం పరిస్థితిని బట్టి ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించాలి. కరోనా జబ్బు సోకినట్టు అనుమానిస్తే పరీక్ష ఫలితాలు వచ్చేంతవరకు ఇంట్లో (మామూలు సమస్యల్లో) లేదా ప్రత్యేక వార్డుల్లో విడిగా ఉంచాల్సి ఉంటుంది.

కొవిడ్‌-19 వ్యాపిస్తున్న సమయంలో ఉద్యోగానికి వెళ్లే తల్లిదండ్రులు (పోలీసులు, వైద్య సిబ్బంది, అత్యవసర సేవల విభాగాల్లో పనిచేసేవారు) పూర్తి జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లోకి వచ్చాక చేతులను సబ్బుతో కడుక్కోకుండా దేన్నీ ముట్టుకోరాదు. విధిగా స్నానం చేయాలి. విడిచిన దుస్తులను విడిగా ఉంచాలి. వైరస్‌ అంటుకునే అవకాశమున్న చోట్ల సర్ఫ్‌ వంటి వాటితో శుభ్రంగా కడగాలి. వీలైనంతవరకు పిల్లలకు దూరంగా ఉండాలి. ఇంట్లోనూ మాస్కు ధరించాలి.

పిల్లలకు ముందు జాగ్రత్తగా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఇవ్వాలని ఎవరైనా సూచిస్తే ముందుగా ఈసీజీ పరీక్ష చేయించటం మంచిది. గుండెజబ్బు గల పిల్లలు క్లోరోక్విన్‌ తీసుకుంటే కొన్నిసార్లు ప్రమాదకరంగా పరిణమించొచ్ఛు మూత్రం వచ్చేలా చేసే మందులను పిల్లలకు ఎక్కువగా ఇవ్వకూడదు. ఆయా సందర్భాలను బట్టి.. ముఖ్యంగా జ్వరం, జలుబు వంటివి ఉన్నప్పుడు వీటి మోతాదులను మార్చాల్సి ఉంటుంది. డాక్టర్‌ను అడిగి వీటి వివరాలు తెలుసుకోవాలి. జలుబు లక్షణాలు ఉన్నా కూడా రక్తం గడ్డకట్టకుండా చూసే మందులను కొనసాగించాలి. కాకపోతే వీటి ప్రభావ సమయాన్ని ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సి ఉంటుంది. డాక్టర్‌ సలహా తీసుకోకుండా కొత్తమందులేవీ వాడకూడదు.

ఫ్లూ టీకాతో సహ అన్ని టీకాలను క్రమం తప్పకుండా ఇప్పించాలి. వీటిని ఆపకూడదు.

ఆపరేషన్‌ లేదా గొట్టాన్ని గుండెలోకి పంపించి చేసే చికిత్సలు అవసరమని గుర్తించినవారి విషయంలో- ఫోన్‌ ద్వారా డాక్టర్‌ను సంప్రదించి పిల్లల పరిస్థితిని వివరించాలి. ఆపరేషన్‌ వాయిదా వేసే అవకాశముంటే కరోనా ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి తగ్గేంతవరకు ఆగటమే మంచిది. గుండె వైఫల్యం, తరచూ శరీరం నీలంగా మారుతుండటం వంటి అత్యవసర కేసుల్లోనే తగు జాగ్రత్తలతో ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది.

పిండానికి చేసే ఎకో కార్డియోగ్రామ్‌, గర్భిణి పరీక్షలను వీలైనంతవరకు తగ్గించుకోవాలి. గర్భస్థ శిశువుకు గుండె సమస్యలు ఉండొచ్చని అనుమానం గలవారికి, టిఫా పరీక్ష చేసేటప్పుడు గుండెలయలో తేడాలు కనిపించినవారికి మాత్రమే ఫీటల్‌ ఎకోకార్డియోగ్రామ్‌ చేయాల్సి ఉంటుంది. గర్భిణులు, వారి వెంట ఆసుపత్రులకు వచ్చేవారు విధిగా సర్జికల్‌ మాస్కులు ధరించాలి. గర్భిణుల వెంట ఒకరు మాత్రమే తోడుగా రావాలి.

మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను పంపాల్సిన చిరునామా

సమస్య-సలహా, సుఖీభవ, ఈనాడు ప్రధాన కార్యాలయం,

రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512

email: sukhi@eenadu.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు