Published : 26/05/2020 00:34 IST

క్లోరోక్విన్‌ మంచిదేనా?

సమస్య సలహా

సమస్య: వైద్య సిబ్బంది వంటి వాళ్లు కరోనా జబ్బు నివారణకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ వేసుకోవచ్చని ఐసీఎంఆర్‌ సూచించినట్టు ఇటీవల పత్రికల్లో చదివాను. క్లోరోక్విన్‌ మాత్రలు వేసుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పినట్టూ కథనాలు వచ్చాయి. కొవిడ్‌-19 నయం కావటానికి క్లోరోక్విన్‌ ఉపయోగపడటం లేదని, దీంతో గుండెజబ్బుల వంటి సమస్యలు తలెత్తుతున్నాయని కొన్ని విదేశీ అధ్యయనాల్లో తేలినట్టూ తెలుస్తోంది. ఇవన్నీ అయోమయంలో పడేసేలా ఉన్నాయి. నిజంగా కరోనా జబ్బు నివారణకు క్లోరోక్విన్‌ ఉపయోగపడుతుందా? దీన్ని వాడుకోవటం మంచిదేనా?

- వి.ఆర్‌. శివ, హైదరాబాద్‌

సలహా: మీరే కాదు, చాలామంది ఇలాగే అయోమయానికి గురవుతున్నారు. అధ్యయనాల్లో విరుద్ధ ఫలితాలు వస్తుండటమే దీనికి కారణం. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ వాడకంలో విదేశీ అనుభవాలు, మనదేశ అనుభవాలు వేర్వేరుగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. కొవిడ్‌-19 పుణ్యమాని ఇప్పుడంతా హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మీద పడ్డారు గానీ మనకిది కొత్త కాదు. మనదేశంలో సింకోనా బెరడు, క్వినైన్‌, క్లోరోక్విన్‌.. ఇలా వివిధ రూపాల్లో వందేళ్ల నుంచీ రకరకాల సమస్యలకు వాడుతూనే వస్తున్నాం. అంటే దీని వాడకంలో ఇతర దేశాలతో పోలిస్తే మన అనుభవమే ఎక్కువన్నమాట. దీన్ని మలేరియా, అమీబియాసిస్‌, కీళ్లవాతం, ల్యూపస్‌, మధుమేహ చికిత్సల్లో ఎప్పట్నుంచో వాడుతూనే ఉన్నాం. మన వైద్యరంగం అనుభవం ప్రకారం హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో దుష్ప్రభావాలేవీ పెద్దగా లేవనే చెప్పుకోవచ్ఛు ఆ మాటకొస్తే మధుమేహ చికిత్సలో వాడే మెట్‌ఫార్మిన్‌ మందునూ మొదట్లో విదేశాలు పక్కనపెట్టేశాయి. ఇది 1953లో ఫ్రాన్స్‌ నుంచి మనదేశానికి వచ్చింది. అప్పట్నుంచి 40 ఏళ్ల పాటు దీన్ని భారత్‌లో తప్ప మరెక్కడా విరివిగా వాడనేలేదు. ఇప్పుడు మధుమేహ చికిత్సలో మెట్‌ఫార్మిన్‌ అన్నిదేశాల్లోనూ ప్రధానమైన మందు కావటం గమనార్హం. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ విషయంలోనూ దాదాపు ఇలాంటి అనుభవాన్నే చవిచూస్తున్నాం. ప్రస్తుతం కొవిడ్‌-19 చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ వాడకంపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. దీంతో ఉపయోగం లేదని, పైగా నష్టం జరుగుతోందనే చాలా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా గుండె లయ తప్పటం, ఎడమ జఠరిక దెబ్బతినటం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నాయి. ఇటీవల ప్రముఖ వైద్య పత్రిక లాన్సెట్‌లో ప్రచురితమైన అధ్యయనం సైతం ఇదే విషయాన్ని పేర్కొంది. కొవిడ్‌ బాధితులకు క్లోరోక్విన్‌ ఉపయోగపడటం లేదని, మరణాలు పెరుగుతున్నాయని వివరించింది. కాకపోతే ఇవన్నీ చికిత్స చేస్తున్నప్పుడు నిర్వహిస్తున్న అధ్యయనాలే. కరోనా నివారణకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఉపయోగపడుతుందా? లేదా? అన్నది స్పష్టంగా తెలియదు. కానీ నివారణకు ఉపయోగపడొచ్చనే భావనతో గత్యంతరం లేక ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ, అన్ని ఆసుపత్రుల్లోనూ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ వాడుతూనే ఉన్నారు. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు సైతం ఈ దిశగానే ఉన్నాయి. అయితే ఇవి అందరి కోసం చేసిన సూచనలు కావు. కొవిడ్‌-19 సోకే ముప్పు ఎక్కువగా గల వైద్య సిబ్బంది, కరోనా ప్రబలిన ప్రాంతాల్లో విధులు నిర్వహించే పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది, కరోనా బాధితుల కుటుంబ సభ్యుల వంటి వాళ్లు ముందు జాగ్రత్తగా హైడ్రాక్సీక్లోరోక్విన్‌ వేసుకోవచ్చని సూచించింది. కొన్ని ఆధారాలతోనే ఈ సూచన చేసింది. హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో వైరస్‌ విభజన ప్రక్రియ తగ్గుతున్నట్టు పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ప్రయోగశాల పరీక్షలో తేలింది. ఇతర దేశాల్లో గుర్తించిన నష్టాలు, దుష్ప్రభావాలేవీ తలెత్తటం లేదని భారత ఔషధ నిఘా కార్యక్రమం పరిశీలనలో బయటపడింది. అతి తక్కువమందిలోనే గుండె సమస్యలు వచ్చినట్టు తేలింది. ఐసీఎంఆర్‌లో, దిల్లీలోని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాలల్లో, ఎయిమ్స్‌లో పనిచేసే వైద్య సిబ్బందికి హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఇవ్వగా జబ్బు నివారణ సాధ్యమవుతున్నట్టూ వెల్లడైంది. అందుకే ఐసీఎంఆర్‌ గతంలో జారీచేసిన మార్గదర్శకాలను మే 22న మరింత బలపరిచింది. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ కరోనా వైరస్‌ను ఎలా నిలువరిస్తుంది? ఎలా ఎదుర్కొంటుంది? అనేది కచ్చితంగా తెలియదు గానీ మొత్తమ్మీద ప్రభావమైతే చూపుతోంది. ఇది రోగనిరోధకశక్తి తగ్గకుండా, మరీ ఉద్ధృతం కాకుండా సమస్థితిలో ఉండటానికి తోడ్పడుతుంది. నేరుగా వైరస్‌ మీదా ప్రభావం చూపుతుంది. వైరస్‌ ప్రత్యుత్పత్తిని నిలువరిస్తుంది. వైరస్‌ కణాల్లోకి చేరకుండా అడ్డుకోవటమే కాదు, కణాల్లోకి చేరిన తర్వాతా నిర్వీర్యం చేయటానికి ప్రయత్నిస్తుంది. అయితే రెటినోపతీ, గుండె కండరం వాపు, గుండె లయ తప్పటం వంటి సమస్యలు గలవారు.. క్లోరోక్విన్‌ పడనివారు, డీ6పీడీ ఎంజైమ్‌ లోపం గలవారు, 15 ఏళ్ల లోపు పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు దీన్ని వేసుకోరాదు. ఎవరైనా సరే డాక్టర్‌ సలహాతోనే తీసుకోవాలి. అన్నింటికన్నా ముఖ్య విషయం- హైడ్రాక్సీక్లోరోక్విన్‌ వేసుకున్నంత మాత్రాన కొవిడ్‌ అసలే రాదనే అతి విశ్వాసం వద్ధు ఎప్పటి మాదిరిగానే ఇతరులకు దూరంగా ఉండటం, తరచూ చేతులు కడుక్కోవటం, ముఖానికి మాస్కు ధరించటం వంటి జాగ్రత్తలు విధిగా పాటించాల్సిందే.

మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను పంపాల్సిన చిరునామా

సమస్య-సలహా, సుఖీభవ,

ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ,

హైదరాబాద్‌ - 501 512

email: sukhi@eenadu.in


Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని