ప్యారాసిటమాల్‌తో ప్రమాదమా?

నా వయసు 88 ఏళ్లు. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నాను. రోజూ ప్యారాసిటమాల్‌ మాత్రలు వాడుకుంటున్నాను. వీటిని ఎక్కువ కాలం వేసుకుంటే ఏమైనా ఇబ్బందులు వస్తాయా? కిడ్నీ, కాలేయం, గుండె మీద దుష్ప్రభావాలు ఉంటాయా?

Published : 02 Jun 2020 01:54 IST

సమస్య - సలహా

సమస్య: నా వయసు 88 ఏళ్లు. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నాను. రోజూ ప్యారాసిటమాల్‌ మాత్రలు వాడుకుంటున్నాను. వీటిని ఎక్కువ కాలం వేసుకుంటే ఏమైనా ఇబ్బందులు వస్తాయా? కిడ్నీ, కాలేయం, గుండె మీద దుష్ప్రభావాలు ఉంటాయా? - సిద్దారెడ్డి (ఈమెయిల్‌ ద్వారా)

సలహా: మీరు కీళ్ల నొప్పులతో బాధపడుతున్నానని తెలిపారు గానీ సమస్య ఎక్కడున్నదో తెలియజేయలేదు. మన శరీరంలో ఎముకల మద్య చాలా చోట్ల కీళ్లుంటాయి. ఇవి ఒకదాంతో మరోటి రాసుకుపోకుండా వీటి మధ్యలో మెత్తటి ఎముక (మృదులాస్థి) ఉంటుంది. ఇది వయసు పెరుగుతున్నకొద్దీ అరిగిపోవటం వల్ల ఎముకలు రాసుకుపోయి నొప్పి పుడుతుంది. చేతులు, మోకాళ్లు, తుంటి, వెన్నెముక ఎక్కడైనా ఇలాంటి నొప్పులు రావొచ్ఛు మీరు ప్యారాసిటమాల్‌ మాత్రలు వేసుకుంటున్నానని తెలిపారు. మిగతా నొప్పి నివారణ మందులతో పోలిస్తే ఇది అంత ప్రమాదకరమైంది కాదనే చెప్పుకోవచ్ఛు తాత్కాలికంగా నొప్పి నివారణకు వాడుకుంటే పెద్దగా ఇబ్బందేమీ ఉండకపోవచ్చు గానీ దీర్ఘకాలంగా వాడుకోవాలంటే మాత్రం నొప్పికి కారణమేంటన్నది నిర్ధారించటం చాలా కీలకం. అదీ డాక్టర్‌ సలహా మేరకే తీసుకోవాలి. సొంతంగా కొనుక్కొని వేసుకోవటం తగదు. నిజానికి ఏ మందైనా ఎక్కువ కాలం వాడితే దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం లేకపోలేదని తెలుసుకోవాలి. కొన్నిసార్లు మందు పని చేయకపోవచ్ఛు చేసినా ప్రభావం తక్కువగా ఉండొచ్ఛు ప్యారాసిటమాల్‌ను ఎక్కువకాలం వాడితే కాలేయం, కిడ్నీల మీద దుష్ప్రభావం చూపే అవకాశముంది. కొందరికి పేగుల్లో రంధ్రాలు పడి రక్తస్రావం కావొచ్ఛు అన్నింటికన్నా ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే- ప్యారాసిటమాల్‌ నొప్పి తగ్గేలా చేస్తుందే తప్ప సమస్యను తగ్గించలేదు. ప్రభావం ఉన్నంతవరకే నొప్పి తగ్గుతుంది. కొద్దిగంటల్లో మందు ప్రభావం తగ్గగానే నొప్పి మళ్లీ మొదలవుతుంది. కాబట్టి కీళ్ల నొప్పులకు అసలు కారణమేంటన్నది తెలుసుకొని, అవసరమైన మందులు వాడితే మంచి ఫలితం ఉంటుంది. వయసుతో పాటు కీళ్లు అరగటం వల్లనే కాదు, కీళ్లవాతం (రుమటాయిడ్‌) మూలంగానూ నొప్పులు రావొచ్ఛు కొందరు నాడీ సమస్యలతో తలెత్తే ఒళ్లు నొప్పులనూ కీళ్ల నొప్పులుగా భావిస్తుంటారు. అందువల్ల సమస్య ఏంటన్నది గుర్తించటం ముఖ్యం. వృద్ధాప్యంలో ఎక్కువగా కనిపించేవి మోకాళ్ల నొప్పులే. బహుషా మీరు వీటితోనే బాధపడుతుండొచ్ఛు ఇవి తగ్గటానికి ఇప్పుడు మంచి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కీళ్ల మధ్య జిగురుద్రవాన్ని, మెత్తటి ఎముకను పెంపొందించే కొత్తరకం మందులెన్నో వచ్చాయి. మీరు ముందుగా ఎముకల నిపుణులను సంప్రదించటం మంచిది. అవసరమైన పరీక్షలు చేసి సమస్యను నిర్ధారిస్తారు. తగు పరిష్కార మార్గాలను సూచిస్తారు.

ప్యారాసిటమాల్‌ నొప్పి తగ్గేలా చేస్తుందే తప్ప సమస్యను తగ్గించలేదు. ప్రభావం ఉన్నంతవరకే నొప్పి తగ్గుతుంది.


మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను పంపాల్సిన చిరునామా

సమస్య-సలహా, సుఖీభవ, ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ,

హైదరాబాద్‌ - 501 512 email: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని