గాలి రక్ష

చిన్న మార్పయినా చాలు. పెద్ద ఫలితమే చూపిస్తుంది. కొత్త కరోనా జబ్బు విషయంలోనూ ఇది ముమ్మాటికి నిజం. ఉదాహరణకు గాలి ప్రవాహాన్నే తీసుకోండి. భవనాల్లో గానీ ఇళ్లలో గానీ ధారాళంగా గాలి వచ్చేలా చూసుకుంటే కొవిడ్‌-19 ముప్పును చాలావరకు తగ్గించుకోవచ్ఛు కరోనా వైరస్‌...

Published : 02 Jun 2020 01:54 IST

చిన్న మార్పయినా చాలు. పెద్ద ఫలితమే చూపిస్తుంది. కొత్త కరోనా జబ్బు విషయంలోనూ ఇది ముమ్మాటికి నిజం. ఉదాహరణకు గాలి ప్రవాహాన్నే తీసుకోండి. భవనాల్లో గానీ ఇళ్లలో గానీ ధారాళంగా గాలి వచ్చేలా చూసుకుంటే కొవిడ్‌-19 ముప్పును చాలావరకు తగ్గించుకోవచ్ఛు కరోనా వైరస్‌ గాలిలో కలిసే తుంపర్ల ద్వారానూ వ్యాపించొచ్ఛు ఇది వైరస్‌ వ్యాప్తికి ఎంతవరకు దోహదం చేస్తుందన్నది కచ్చితంగా తెలియదు గానీ ముప్పయితే పొంచి ఉంటుందన్నది మాత్రం ఖాయం. గాలి, వెలుతురు అంతగాలేని చోట్ల ఎవరైనా కరోనా బాధితులు ఉన్నారనుకోండి. అక్కడ ఎక్కువసేపు గడిపితే ఇతరులకు వైరస్‌ అంటుకునే అవకాశం ఎక్కువ. చాలామంది ఉద్యోగులు, కార్మికులు పనిచేసే చోట్ల ఇలాంటి ప్రమాదం లేకపోలేదు. అందుకే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవటం, ఇతరులకు దూరాన్ని పాటించటం వంటి వాటితో పాటు గాలి ధారాళంగా వచ్చేలా చూసుకోవాలన్నది నిపుణుల సూచన. వైరస్‌ బయటకు వెళ్లటానికిది ఎంతగానో ఉపయోగపడుతుంది. కరోనా బారినపడ్డవారు దగ్గినా, తుమ్మినా, మాట్లాడినా, పాడినా, చివరికి శ్వాస వదిలినప్పుడూ తుంపర్లు బయటకు వస్తాయి. వీటిల్లోని వైరస్‌ గాలిలోనూ కలుస్తుంది. ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముంది. ముఖ్యంగా కరోనా బాధితులకు దగ్గరగా ఉన్నవారికి కళ్లు, నోరు, ముక్కు ద్వారా వైరస్‌ అంటుకునే అవకాశముంటుంది. కరోనా చికిత్స కేంద్రాల్లో బాధితులకు శ్వాసమార్గంలో గొట్టాన్ని అమర్చటం వంటి సందర్భాల్లోనే చిన్న తుంపర్ల ద్వారా వైరస్‌ గాలిలో కలిసే అవకాశముంటుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొంటోంది. కానీ భవనాలు, కార్యాలయాలు, హోటళ్లలోనూ చిన్న తుంపర్లతో వైరస్‌ వ్యాపించొచ్ఛు చైనా, అమెరికా వంటి దేశాల్లో ఇలాంటి ఉదంతాలు వెలుగుచూశాయి కూడా. పెద్ద తుంపర్లతో పోలిస్తే చిన్న తుంపర్లు గాలిలో ఎక్కువ దూరం ప్రయాణించొచ్చు గానీ దూరానికి వెళ్తున్నకొద్దీ దానిలోని వైరస్‌ సంఖ్య పడిపోతుంటుంది. అందుకే ఆరుబయట ఇలాంటి వైరస్‌ అంతగా ఇన్‌ఫెక్షన్‌కు దారితీయకపోవచ్ఛు తలుపులు, కిటికీలు మూసి ఉండే భవనాలు, ఫ్యాక్టరీల్లో మాత్రం ముప్పు ఎక్కువేనని చెప్పుకోవచ్ఛు దక్షిణకొరియాలో ఒకరి నుంచి 94 మందికి కరోనా వైరస్‌ సోకటమే దీనికి నిదర్శనం. వీరంతా ఒకే అంతస్తులో పనిచేసేవారే కావటం గమనార్హం. గాలిలో కరోనా వైరస్‌ కనీసం 30 నిమిషాల సేపు ఉండగలదని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాబట్టే బ్రిటన్‌ వంటి దేశాల్లో కొన్ని సంస్థలు సెంట్రలైజ్డ్‌ ఏసీలకు బదులు బయటి గాలి లోపలికి వచ్చేలా చూసుకోవటానికే ప్రాధాన్యమిస్తున్నాయి. మనదగ్గరా అలాంటి ప్రయత్నాలు చేయటమే మంచిది. స్వచ్ఛమైన గాలిలో ఆక్సిజన్‌ ఎక్కువగా ఉంటుంది. ఇందులో వైరస్‌ ఉన్నా ఎక్కువసేపు జీవించి ఉండలేదు. ఒకవేళ ఉన్నా గాలి వీస్తుంటే కిటికీలు, తలుపుల ద్వారా బయటకు వెళ్లిపోతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని