Published : 23 Jun 2020 00:42 IST

పోషక ప్రసరణం

న ఒంట్లో ప్రతి కణానికీ తగినంత ఆక్సిజన్‌, పోషకాలు అవసరం. ఇవి రక్తం ద్వారానే అందుతాయి. లేకపోతే అవయవాలన్నీ చతికిల పడిపోతాయి. రక్తం సరిగా సరఫరా కాకపోతే కాళ్లు, చేతులు చల్లబడిపోతాయి. మొద్దుబారతాయి. చర్మమైతే పొడిబారిపోతుంది. గోళ్లు పెళుసుగా తయారవుతాయి. మగవారిలో స్తంభన లోపం తలెత్తొచ్ఛు మధుమేహుల్లో పుండ్లు మానకుండా వేధిస్తుంటాయి. అందువల్ల రక్త ప్రసరణ వ్యవస్థ బాగుండటం చాలా కీలకం. కొన్ని జాగ్రత్తలతో దీన్ని కాపాడుకోవటం పెద్ద కష్టమేమీ కాదు.

అదేపనిగా కూర్చోవద్దు

గంటలకొద్దీ కదలకుండా కూర్చోవటం రక్త ప్రసరణకు, వెన్నెముకకు మంచిది కాదు. అదేపనిగా కూర్చుంటే కాళ్ల కండరాలు బలహీనపడతాయి. కాళ్లకు రక్త సరఫరా మందగిస్తుంది. రక్తనాళాల్లో గడ్డలూ ఏర్పడొచ్ఛు ఇది పెద్ద సమస్య. రక్తనాళాలు ఉబ్బిపోయి చూడటానికి ఇబ్బందిగానూ ఉంటుంది. తీవ్రమైతే కాళ్ల మీద పుండ్లు పడొచ్ఛు అందువల్ల కూర్చొని పనులు చేసేవాళ్లు మధ్యమధ్యలో లేచి నాలుగడుగులు వేయటం మంచిది. దీంతో కాలి సిరల్లోని కవాటాలు సరిగా పనిచేస్తాయి. గుండెకు రక్తాన్ని బాగా చేరవేస్తాయి.

పొగకు దూరంగా: పొగాకులోని నికొటిన్‌ రక్తనాళాల గోడలను దెబ్బతీస్తుంది. రక్తం చిక్కగా అయ్యేలా చేస్తుంది. దీంతో రక్తం సరిగా ముందుకు సాగదు. కాబట్టి సిగరెట్లు, బీడీలు, చుట్టల జోలికి వెళ్లొదు. ఒకవేళ వీటిని కాల్చే అలవాటుంటే వెంటనే మానెయ్యటం ఉత్తమం.

రక్తపోటు నియంత్రణ: అధిక రక్తపోటుతో రక్తనాళాలు గట్టిపడతాయి. ఇది రక్త ప్రసరణను దెబ్బతీస్తుంది. కాబట్టి రక్తపోటు 120/80 కన్నా మించకుండా చూసుకోవాలి. ఇంతకన్నా తక్కువున్నా మంచిదే. వృద్ధాప్యం, ఇతరత్రా సమస్యలను బట్టి రక్తపోటు పరిమితి ఆధారపడి ఉంటుంది. డాక్టర్‌ను సంప్రదించి ఎవరికి, ఎంత వరకు ఉండొచ్చో నిర్ణయించుకోవాలి.

తగినంత నీరు: రక్తంలో దాదాపు సగం వరకు నీరే ఉంటుంది. నీటి శాతం తగ్గితే రక్తం చిక్కబడి సరఫరాకు ఇబ్బంది కలగొచ్ఛు అందువల్ల తగినంత నీరు తాగటం మంచిది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరైనా తాగాలి. వ్యాయామం చేసేవారికి, బయట తిరిగే పనులు చేసేవారికి మరింత ఎక్కువ నీరు అవసరం.

వ్యాయామం: శారీరక శ్రమ, వ్యాయామంతో రక్త ప్రసరణ వేగం పుంజుకుంటుంది. నడక, పరుగు, సైకిల్‌ తొక్కటం, ఈత వంటి వ్యాయామాల మూలంగా కండరాలకు మరింత ఎక్కువగా ఆక్సిజన్‌ అందుతుంది. గుండె వేగంగా కొట్టుకోవటం వల్ల గుండె కండరం దృఢమవుతుంది. రక్తపోటూ తగ్గుతుంది. రోజుకు కనీసం అరగంట సేపు వ్యాయామం చేయటం ఎంతైనా మంచిది. ఒక మాదిరి వేగంతో గంటకు మూడు మైళ్లు నడిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

యోగా: రక్త ప్రసరణకు యోగాసనాలూ ఎంతో మేలు చేస్తాయి. శరీరం అటూఇటూ తిరగటం వల్ల అవయవాలకు రక్తం బాగా అందుతుంది. కాళ్లు పైకి ఉండేలా వేసే ఆసనాల మూలంగా శరీరం కింది భాగం నుంచి రక్తం గుండె, మెదడుకు చేరుకుంటుంది.

సమతులాహారం: తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. సంతృప్త కొవ్వులతో కూడిన మాంసం, చికెన్‌, ఛీజ్‌ వంటివి తగ్గించుకోవాలి. ఉప్పు పరిమితి మించకుండా చూసుకోవాలి. ఇది బరువు, కొలెస్ట్రాల్‌, రక్తపోటు అదుపులో ఉండటానికి తోడ్పడుతుంది. ఫలితంగా రక్తనాళాల ఆరోగ్యమూ మెరుగవుతుంది.

గింజ పప్పులు: బాదం, అక్రోట్ల వంటి గింజ పప్పుల్లో ఎ, బి, సి, విటమిన్లు ఉంటాయి. వీటిల్లో మెగ్నీషియం, ఐరన్‌ సైతం ఎక్కువగానే ఉంటాయి. ఇవన్నీ వాపు ప్రక్రియను నివారిస్తూ రక్త ప్రసరణ బాగా సాగేలా చేసేవే.

మర్దన: ఇది హాయిని, విశ్రాంతిని కలిగించటంతో పాటు రక్త సరఫరానూ పెంపొందిస్తుంది. మర్దన చేస్తున్నప్పుడు పడే ఒత్తిడికి అప్పటివరకూ వెళ్లని చోట్లకూ రక్తం చేరుకుంటుంది. కండరాల్లోంచి ల్యాక్టిక్‌ యాసిడ్‌ వెలువడి లింఫ్‌ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. దీంతో జీవవ్యర్థాలు తేలికగా బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా రక్తపోటు తగ్గుతుంది, రక్త ప్రసరణ ఇనుమడిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు