నాన్న ఆట ప్రవర్తన బాట!

మంచి నడవడి. భావోద్వేగాల అదుపు. ఏ రంగంలో రాణించటానికైనా ఇవెంతో ముఖ్యం. వీటికి పునాది బాల్యంలోనే పడుతుంది.

Published : 07 Jul 2020 00:41 IST

మంచి నడవడి. భావోద్వేగాల అదుపు. ఏ రంగంలో రాణించటానికైనా ఇవెంతో ముఖ్యం. వీటికి పునాది బాల్యంలోనే పడుతుంది. ఇందుకు తండ్రితో కలిసి ఆడుకోవటం విశేషంగానూ తోడ్పడుతుంది! చిన్న వయసు నుంచే తండ్రితో కలిసి ఆడుకునే పిల్లలు పెద్దయ్యాక భావోద్వేగాలను, ప్రవర్తనను తేలికగా నియంత్రించుకుంటున్నారని తాజాగా తేలింది మరి. సుమారు 40 ఏళ్ల ఆధారాలను క్రోడీకరించి మరీ దీన్ని కనుగొన్నారు. తల్లితో, తండ్రితో ఆడుకోవటం దాదాపు ఒకలాంటి ఫలితాలే చూపిస్తున్నప్పటికీ తండ్రితో ఆడుకోవటం కాస్త భిన్నంగా ఉంటుండటం గమనార్హం. తండ్రులు పిల్లలతో ఆడుకునేటప్పుడు వెంట పరుగెట్టటం, వీపున మోసుకెళ్లటం, గిలిగింతలు పెట్టటం వంటివి చేస్తుంటారని.. శారీరక శ్రమతో కూడుకున్న ఇలాంటి ఆటలు భావోద్వేగాలను నియంత్రించుకోవటాన్ని నేర్చుకోవటానికి తోడ్పడుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. పెద్దయ్యాక, ముఖ్యంగా బడిలో చేరాక, ప్రవర్తనను అదుపులో పెట్టుకోవటానికీ దోహదం చేస్తున్నాయని వివరిస్తున్నారు. అంతమాత్రాన తండ్రుల కోణంలో అధ్యయన ఫలితాలను అతిగా అంచనా వేయటం తగదని హెచ్చరిస్తూనే పిల్లలతో గడపటానికి తండ్రులు తగినంత సమయం కేటాయించటం ముఖ్యమనే విషయాన్ని మరవరాదంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని