సమస్య-సలహా

నా వయసు 20 సంవత్సరాలు. వరిబీజంతో బాధపడుతున్నాను. నొప్పి వస్తుంటుంది.

Published : 07 Jul 2020 00:41 IST

వరిబీజం ఆపరేషన్‌ చేయించుకుంటే పిల్లలు పుట్టరా?

సమస్య: నా వయసు 20 సంవత్సరాలు. వరిబీజంతో బాధపడుతున్నాను. నొప్పి వస్తుంటుంది. మాత్రలు వేసుకుంటున్నా తగ్గటం లేదు. ఆపరేషన్‌ చేస్తే తగ్గుతుందని చెబుతున్నారు. ఆపరేషన్‌ చేయించుకుంటే వీర్యకణాలు తగ్గుతాయని, పిల్లలు పుట్టరని కొందరు అంటున్నారు. ఇది నిజమేనా?

- రాజేశ్‌ ఎం (ఈ మెయిల్‌)

సలహా: వరిబీజం ఆపరేషన్‌ చేయించుకుంటే పిల్లలు పుట్టకపోవటమనేది అపోహ. సమస్య ఏమిటి? చేసే చికిత్స ఏమిటి? అనేవి తెలియకపోవటం ఇలాంటి అవాస్తవాలు ప్రచారం కావటానికి తావిస్తోంది. వరిబీజం అంటే వృషణాల చుట్టూ తిత్తిలాంటి భాగంలో నీరు చేరటం. దీంతో అది బెలూన్‌లా ఉబ్బిపోతుంది. ఇది చూడ్డానికి ఇబ్బందిగా ఉండొచ్చు గానీ పెద్దగా నొప్పేమీ ఉండదు. వృషణాల తిత్తి బాగా ఉబ్బిపోతే మాత్రం అసౌకర్యం, నొప్పి తలెత్తొచ్ఛు వరిబీజాన్ని తగ్గించే మందులేవీ లేవు. బాగా ఇబ్బంది పెడుతుంటే ఆపరేషన్‌ చేయించుకోవచ్ఛు నొప్పి పుడుతున్నా, ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా, వరిబీజం బాగా పెద్దగా ఉన్నా ఆపరేషన్‌ ఉపయోగపడుతుంది. ఇందులో వృషణాల వద్ద కోత పెట్టి లోపల ఉన్న నీటిని తొలగిస్తారు. ఇది చిన్న ఆపరేషన్‌. ఆ రోజే ఇంటికి వెళ్లిపోవచ్ఛు ఆపరేషన్‌ అంతా వృషణాల చుట్టే జరుగుతుంది. వృషణాల లోపల దేన్నీ ముట్టుకోరు. అందువల్ల వృషణాల పనితీరులో ఎలాంటి మార్పూ ఉండదు. అంతకుముందు మాదిరిగానే పనిచేస్తాయి. అంతకుముందు వీర్యకణాల సంఖ్య బాగా ఉంటే ఆపరేషన్‌ తర్వాతా అలాగే ఉంటాయి. తగ్గటమనేది ఉండదు. అందువల్ల ఆపరేషన్‌తో వీర్యకణాలు తగ్గుతాయని గానీ పిల్లలు పుట్టరని అనుకోవటం గానీ పూర్తిగా అబద్ధం. ఆపరేషన్‌ చేయించుకుంటే సైజు తగ్గుతుంది. నొప్పి తగ్గుతుంది. అయితే మీకు వచ్చింది వరిబీజం అవునో కాదో కచ్చితంగా నిర్ధారణ చేసుకోవటం చాలా ముఖ్యం. అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ పరీక్ష చేస్తే సమస్య బయటపడుతుంది. మీరు ముందుగా నిపుణులైన డాక్టర్‌ను సంప్రదించి సమస్యను నిర్ధారించుకోవటం మంచిది. తగు పరీక్షలు చేసి ఆపరేషన్‌ అవసరమా? కాదా? అన్నది నిర్ణయిస్తారు. అపరేషన్‌ అవసరం లేకపోతే నొప్పి మాత్రలు సూచిస్తారు. నాటు వైద్యం జోలికి వెళ్లకపోవటం తగదని గుర్తుంచుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని