రాత్రి పూట మూత్రమేల?

నాకు 33 ఏళ్లు. రెసిడెన్షియల్‌ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. చాలా ఆరోగ్యంగా ఉంటాను. రోజుకు 3 లీటర్ల నీళ్లు తాగుతాను. నాకు రాత్రిపూట మూత్రం ఎక్కువగా వస్తుంది.

Published : 15 Sep 2020 01:36 IST

సమస్య  సలహా

సమస్య: నాకు 33 ఏళ్లు. రెసిడెన్షియల్‌ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. చాలా ఆరోగ్యంగా ఉంటాను. రోజుకు 3 లీటర్ల నీళ్లు తాగుతాను. నాకు రాత్రిపూట మూత్రం ఎక్కువగా వస్తుంది. దీంతో ఒకోసారి 3 సార్లు నిద్రలోంచి లేవాల్సి వస్తోంది. కొన్నిసార్లు రాత్రిపూట కాలేజీలోనే పడుకోవాల్సి ఉండటం వల్ల ఇది ఇబ్బందిగా ఉంటోంది. రాత్రి భోజనం చేశాక నీళ్లు కూడా తాగను. నా సమస్యకు పరిష్కారం చెప్పండి.- ప్రేమ దివ్యసాయి (ఈ మెయిల్‌)

సలహా: మీరు రాసిన వివరాలను బట్టి చూస్తుంటే ఎక్కువ నీళ్లు తాగటమే సమస్యగా అనిపిస్తోంది. ఇది ఎండకాలం కాదు కాబట్టి రోజుకు 3 లీటర్ల నీళ్లు తాగటమంటే ఎక్కువే. ప్రస్తుత వాతావరణంలో 1.5 నుంచి 2 లీటర్ల నీళ్లు తాగినా సరిపోతుంది. నీళ్లు ఎక్కువగా తాగితే మూత్రం, చెమట రూపంలోనే బయటకు రావాలి. మరో మార్గమేదీ లేదు. మన శరీర బరువు, చర్మం విస్తీర్ణం వంటి వాటిని బట్టి కిడ్నీలు శరీరానికి ఎంత నీరు అవసరమో నిర్ణయించుకొని, ఆ మేరకు నియంత్రిస్తుంటాయి. అవసరమైన దాని కన్నా ఎక్కువ నీరు తాగితే మూత్రం అధికంగా రావటం సహజమే. రాత్రిపూట వాతావరణం చల్లగా ఉంటుంది. చెమట ఎక్కువగా పోయదు. విశ్రాంతి తీసుకుంటాం. దీంతో ఒంట్లో ఎక్కువగా ఉన్న నీళ్లు మూత్రంగా మారి ఎక్కువగా వచ్చే అవకాశముంది. అయినా కూడా మీరు ఒకసారి పరగడుపున రక్తంలో గ్లూకోజు పరీక్ష చేయించుకోవటం మంచిది. దీంతో మధుమేహం ఉందో లేదో తెలుస్తుంది. మధుమేహం మూలంగానూ మూత్రం ఎక్కువగా రావొచ్చు. సాధారణంగా 33 ఏళ్ల వయసులో మధుమేహం లేకపోవచ్చు గానీ ఇప్పుడు ఎంతోమంది చిన్న వయసులోనే దీని బారినపడుతున్నారు. అలాగే మూత్ర పరీక్ష చేయించుకోవాలి. ఇన్‌ఫెక్షన్‌ ఏదైనా ఉంటే బయటపడుతుంది. మూత్ర ఇన్‌ఫెక్షన్‌తో తరచూ మూత్రానికి వెళ్లాలనే భావన కలుగుతుంది. గ్లూకోజు, మూత్ర పరీక్ష ఫలితాలు నార్మల్‌గా ఉన్నట్టయితే జీవనశైలిని మార్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాత్రి 7.30 గంటల తర్వాత నీరు తాగటం మానెయ్యాలి. మామూలుగా మనం తాగిన నీళ్లు మూత్రం రూపంలో బయటకు రావటానికి కనీసం 3-4 గంటలు పడుతుంది. భోజనం చేసే సమయంలో అరకప్పు నీరు తాగొచ్చు. మీరు భోజనం చేశాక నీళ్లు తాగనని చెబుతున్నారు. మీ సమస్య పరంగా చూస్తే ఇది మంచిదే. అయితే భోజనంలో మజ్జిగ, చారు వంటివి ఎక్కువగా తీసుకుంటున్నారేమో చూసుకోండి. ఇవీ ద్రవాలేనని తెలుసుకోవాలి. కూరల్లోనూ ద్రవాలు ఉంటాయి. అలాగే రాత్రిపూట మెలకువగా ఉండటానికి పాలు, టీ, కాఫీ వంటివేవైనా తాగుతున్నారేమో చూసుకోండి. వీటితోనూ మూత్రం ఎక్కువగా రావొచ్చు. అందువల్ల రాత్రిపూట టీ, కాఫీ వంటివేమైనా తాగుతుంటే ఆపెయ్యండి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నా సమస్య తగ్గకపోతే యూరాలజిస్టును సంప్రదించండి. అవసరమైతే మూత్రాశయం మీద ఒత్తిడిని తగ్గించే మందులు సూచిస్తారు. అప్పటికీ ఫలితం కనిపించకపోతే మూత్రం ఉత్పత్తిని తగ్గించే మాత్రలు సూచిస్తారు. వీటిని రాత్రి పూట వేసుకుంటే మూత్రం ఎక్కువగా రావటం ఆగుతుంది. అయితే మందులన్నీ తాత్కాలికంగా పనిచేసేవే. వేసుకున్నంత కాలమే ప్రభావం ఉంటుంది. వీటి కన్నా జీవనశైలిని మార్చుకోవటమే ప్రధానం.
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని