తల్లి కడుపులో ఉండగానే గుండె జబ్బు నివారణ

గుండె జబ్బు ముప్పు కారకాలు అనగానే జన్యువులు, పొగ తాగటం, మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం వంటివే గుర్తుకొస్తాయి. ఇవే కాదు, మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు పిండం ఎదిగే సున్నితమైన దశలో ఎదురయ్యే ...

Published : 22 Sep 2020 01:22 IST

గుండె జబ్బు ముప్పు కారకాలు అనగానే జన్యువులు, పొగ తాగటం, మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం వంటివే గుర్తుకొస్తాయి. ఇవే కాదు, మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు పిండం ఎదిగే సున్నితమైన దశలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులూ గుండె జబ్బుకు బీజం వేస్తున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జి అధ్యయనం పేర్కొంటోంది. గర్భిణుల్లో కొందరికి గర్భసంచిలో ఆక్సిజన్‌ మోతాదులు తగ్గుతుంటాయి (ఫీటల్‌ హైపాక్సియా). దీనికి గర్భవాతం, మాయ ఇన్‌ఫెక్షన్‌, గర్భిణి మధుమేహం, గర్భిణి ఊబకాయం వంటి పలు అంశాలు దోహదం చేస్తుంటాయి. ఎదుగుతున్న దశలో పిండానికి తగినంత ఆక్సిజన్‌ అందకపోతే విశృంఖల కణాలు, యాంటీ ఆక్సిడెంట్ల మధ్య సమతుల్యత అస్తవ్యస్తమవుతుంది (ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌). దీంతో గుండె, రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదముంది. ఇది పెద్దయ్యాక గుండె జబ్బు ముప్పు పెరిగేలా చేస్తుందని అధ్యయన నేత ప్రొఫెసర్‌ డినో గియుసాని చెబుతున్నారు. పిండానికి సరిగా ఆక్సిజన్‌ అందటం లేదనే విషయాన్ని స్కానింగ్‌లో తెలుసుకోవచ్ఛు పిండం ఎదుగుదల సక్రమంగా లేకపోతే తగినంత ఆక్సిజన్‌ అందటం లేదనే అర్థం. ఇలాంటి గర్భిణులకు మైటోకాండ్రియా మీద ప్రభావం చూపే యాంటీఆక్సిడెంట్‌ మాత్రలను ఇస్తే అనర్థాలను తగ్గించుకోవచ్చన్నది గియుసాని అభిప్రాయం. ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ చాలావరకు కణాలకు శక్తినిచ్చే మైటోకాండ్రియాలోనే తలెత్తుతుంది. దీన్ని నివారించటానికి మైటోక్యూ అనే ప్రత్యేక యాంటీఆక్సిడెంట్‌నూ రూపొందించారు. ఇది ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ను తగ్గిస్తూ పిండం ఎదుగుదల దెబ్బతినకుండా, రక్తపోటు పెరగకుండా కాపాడుతున్నట్టు జంతువులపై చేసిన అధ్యయనంలో రుజువైంది. దీన్ని మనుషులపైనా ప్రయోగించి చూస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే తల్లి కడుపులో ఉండగానే పెద్దయ్యాక వచ్చే గుండె జబ్బులను నివారించుకోవటం సాధ్యమవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని