ఇదేం నిస్సత్తువ?

నాకు 61 ఏళ్లు. ఒక నెల నుంచి తీవ్రమైన నిస్సత్తువతో బాఢపడుతున్నాను. ఆసుపత్రికి వెళ్లి అన్ని రకాల పరీక్షలు చేయించుకున్నాను. ఎలాంటి జబ్బు లేదని డాక్టర్లు చెప్పారు. అయినా ఎప్పుడూ నీరసంగానే ఉంటోంది. గ్లూకోజు నీళ్లు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తాగుతున్నాను. ఎండు పండ్లు తింటున్నాను.

Updated : 20 Oct 2020 01:29 IST

సమస్య-సలహా

సమస్య: నాకు 61 ఏళ్లు. ఒక నెల నుంచి తీవ్రమైన నిస్సత్తువతో బాఢపడుతున్నాను. ఆసుపత్రికి వెళ్లి అన్ని రకాల పరీక్షలు చేయించుకున్నాను. ఎలాంటి జబ్బు లేదని డాక్టర్లు చెప్పారు. అయినా ఎప్పుడూ నీరసంగానే ఉంటోంది. గ్లూకోజు నీళ్లు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తాగుతున్నాను. ఎండు పండ్లు తింటున్నాను. ఫలితమేమీ కనిపించటం లేదు. నా సమస్యకు పరిష్కారం తెలియజేయండి.       

- ఎస్‌. అన్నపూర్ణ (ఈ-మెయిల్‌ ద్వారా)

సలహా: మీరు అన్ని పరీక్షలు చేయించుకున్నారు. ఎలాంటి సమస్య లేదు. ఆహారం బాగానే తీసుకుంటున్నారు. అయినా నీరసం వస్తోందంటే ఆందోళన, కుంగుబాటుతో బాధపడుతున్నారేమో చూడాల్సి ఉంటుంది. మనిషి సంఘజీవి. నలుగురితో కలసి ఉండటం అలవాటైన జీవనం మనది. ఒకప్పుడు ఇంటిల్లిపాదీ కలిసే ఉండేవారు. ఇప్పుడు రోజులు మారాయి. ఉద్యోగాలు, చదువుల పేరుతో పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్లటం మామూలై పోయింది. పెద్దవాళ్లు ఇంట్లో ఒంటరిగా ఉండటం ఎక్కువైంది. ఇలాంటి పరిస్థితులు రాన్రానూ కుంగుబాటుకు (డిప్రెషన్‌), ఆందోళనకు (ఆంగ్జయిటీ) దారితీస్తుంటాయి. వీటికిప్పుడు కరోనా జబ్బు భయమూ తోడైంది. ఎప్పుడూ ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తోంది. బయటకు వెళ్లి నలుగురితో కలవటానికి లేదు. మనసు విప్పి మాట్లాడుకోవటానికి లేదు. పిల్లలు ఎలా ఉన్నారోనని మనసు పీకుతుంటుంది. ఇవన్నీ కుంగుబాటు, ఆందోళనకు గురిచేసేవే. కుంగుబాటు ప్రధాన లక్షణం తీవ్రమైన నిస్సత్తువ. కుంగుబాటులో మెదడులో ఉత్పత్తయ్యే డొపమైన్‌, నార్‌ఎపినెఫ్రిన్‌, సెరటోనిన్‌ వంటి నాడీ సమాచార వాహకాల స్థాయులు అస్తవ్యవస్తమవుతాయి. ఉత్సాహం, నిద్ర, ఆకలి, ఆనందం వంటి వాటి విషయంలో కీలక పాత్ర పోషించే వీటి పనితీరు దెబ్బతింటే దిగులు, విచారం, నిరాశ, నిస్పహ, నిస్సహాయతకు దారితీస్తాయి. నిస్సత్తువ ఆవహిస్తుంది. ఉత్సాహం సన్నగిల్లుతుంది. దేని మీదా ఆసక్తి ఉండదు. పక్కింటికి వెళ్లాలన్నా పెద్ద పనిగానే తోస్తుంది. కంటి నిండా నిద్ర పట్టినా, బాగానే తింటున్నా ఇలాంటివి వేధిస్తుంటాయి. మీరు రాసిన వివరాలను బట్టి చూస్తుంటే మీరు ఇలాంటి స్థితిలోనే ఉన్నారని అనుకోవాల్సి వస్తోంది. ముందు మీరు అదేపనిగా నిస్సత్తువ గురించి ఆలోచించటం మానుకోండి. ధైర్యంగా ఉండటం అలవాటు చేసుకోండి. మంచి పుస్తకాలు చదువుకోండి. టీవీల్లో మానసిక ఆనందాన్నిచ్చే కార్యక్రమాలు, సినిమాలు చూడండి. హింసాత్మక, భయానక కార్యక్రమాలు చూడొద్దు. ఆధ్యాత్మిక చింతనపై నమ్మకముంటే భగవంతుడి ప్రార్థన చేయటం మంచిది. మానసిక ప్రశాంతతకు ధ్యానం బాగా ఉపయోగపడుతుంది. అప్పటికీ ఫలితం కనిపించకపోతే సైక్రియాటిస్టు సలహా తీసుకోవటం మేలు. కౌన్సెలింగ్‌ ద్వారా పూర్తిగా కోలుకునే అవకాశముంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని