Published : 24 Nov 2020 01:34 IST

మందులతో ఫిషర్‌ తగ్గదా?

సమస్య-సలహా

సమస్య: నా వయసు 52 సంవత్సరాలు. ఐదు నెలలుగా ఫిషర్‌తో బాధపడుతున్నాను. మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి పుడుతోంది. ఈ నొప్పి 4-5 గంటల వరకూ కొనసాగుతుంది. అన్ని రకాల మందులు వాడాను. ఎలాంటి ఫలితం లేదు. దీనికి శస్త్రచికిత్స ఒక్కటే పరిష్కారమా? మందులతో తగ్గే అవకాశం లేదా?

- విజయ్‌ కుమార్‌ కనిగిరి (ఇ-మెయిల్‌ ద్వారా)

సలహా: మలద్వారం గోడల వద్ద పలుచటి, జిగురుద్రవంతో కూడిన కణజాలంలో ఏర్పడే చీలికనే ఫిషర్‌ అంటారు. దీనికి ప్రధాన కారణం మలం గట్టిపడటం, పెద్ద మొత్తంలో విసర్జన కావటం. దీంతో కండరాల మీద ఒత్తిడి పడి చీలిక తలెత్తుతుంది. నొప్పి పుట్టటం, రక్తం పడటం వంటి ఇబ్బందులు వేధిస్తాయి. మలాన్ని పట్టి ఉంచే కండర వలయం (స్ఫింక్టర్‌) సైతం దెబ్బతినొచ్చు. ఆహారంలో పీచు మోతాదు పెంచుకోవటం, కాసేపు టబ్‌లో కూర్చోవటం వంటివి ఫిషర్‌ బాధల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కొందరికి మందులు అవసరమవ్వచ్చు. మీరు దీర్ఘకాలంగా ఫిషర్‌తో బాధపడుతున్నానని, చాలారకాల మందులు వాడానని అంటున్నారు. నిజానికి దీర్ఘకాలంగా ఫిషర్‌తో బాధపడేవారికి మందులు అంతగా ఉపయోగపడవనే చెప్పుకోవచ్చు. మలద్వారం లోపలికి రాసుకునే మలాములతో కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. కాకపోతే వీటిని 2-4 వారాల వరకే వాడుకోవాల్సి ఉంటుంది. మలాము వాడటం ఆపేస్తే సమస్య మళ్లీ మొదలవుతుంది. దీర్ఘకాలంగా ఫిషర్‌తో బాధపడేవారిలో 40% మందికే ఇలాంటి మందులతో ఫలితం కనిపిస్తుంది. మిగతావారికి లేటరల్‌ స్ఫింక్టెరోటమీ చేయాల్సి ఉంటుంది. ఇందులో లోపలి కండర వలయంలో కొంత భాగాన్ని ౖకత్తిరిస్తారు. దీంతో నొప్పి తగ్గుతుంది. క్రమంగా చీలిక నయమవుతుంది. శస్త్రచికిత్స చేయించుకున్నాక మొదట్లో కొందరికి తాత్కాలికంగా గ్యాస్‌, నీళ్లలాంటి మలం లీకవటం వంటి ఇబ్బందులు ఉండొచ్చు. క్రమంగా ఇవన్నీ 2, 3 నెలల్లో కుదురుకుంటాయి. ముందుగా మీరు పెద్దపేగు సమస్యలకు చికిత్స చేసే నిపుణులను సంప్రదించండి. అవసరాన్ని బట్టి మందులు ఇవ్వాలా? శస్త్రచికిత్స చేయాలా? అన్నది నిర్ణయిస్తారు. అలాగే నీళ్లు ఎక్కువగా తాగటం.. ఆకు కూరలు, కూరగాయలు తినటం.. మాంసం తగ్గించుకోవటం.. మద్యం అలవాటుంటే మానెయ్యటం వంటి జాగ్రత్తలూ తీసుకోవాలి.

సందేహాలను పంపాల్సిన చిరునామా: సమస్య-సలహా, సుఖీభవ, ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512
email: sukhi@eenadu.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు