Updated : 08 Dec 2020 01:16 IST

ఏంటీ కీళ్ల నొప్పి?

సమస్య-సలహా

సమస్య: నాకు 28 ఏళ్లు. గత 13 ఏళ్ల నుంచి కీళ్ల నొప్పులతో బాధపడుతున్నాను. నేను 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు హఠాత్తుగా మోకాలి కీళ్లలో నొప్పులు మొదలయ్యాయి. ఏడాది తర్వాత నెమ్మదిగా ఇతర కీళ్లలోనూ నొప్పులు ఆరంభమయ్యాయి. వెన్ను, తుంటి, భుజాలు, మోచేతులు, మెడ అన్నీ నొప్పి పుడుతున్నాయి. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నొప్పి తక్కువగానే ఉంటుంది గానీ పనిచేసినా, వ్యాయామం చేసినా ఎక్కువవుతుంది. ఏ పనైనా 2-3 నిమిషాలకు మించి చేయలేకపోతున్నాను. చాలామంది డాక్టర్లను కలిశాను. రకరకాల మందులు వాడాను. కానీ ఫలితం లేదు. ఇదేం సమస్య? దీనికి పరిష్కారమార్గమేంటి?

- సాయితేజ (ఇ-మెయిల్‌ ద్వారా)

సలహా: మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తుంటే జువెనైల్‌ రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌గా అనిపిస్తోంది. దీన్నే జువెనైల్‌ ఇడియోపథిక్‌ ఆర్థ్రయిటిస్‌ (జేఐఏ) అంటారు. ఇది 1-15 ఏళ్లలో మొదలవుతుంటుంది. ఇదో రకమైన స్వీయ రోగనిరోధక సమస్య (రోగనిరోధక శక్తి పొరపాటున మన మీదే దాడిచేయటం). ఇది ఎందుకొస్తుందనేది కచ్చితంగా తెలియదు. జేఐఏలో- 1-4 కీళ్లకు పరిమితయ్యేది (ఓలిగో ఆర్టిక్యులర్‌).. 5, అంతకన్నా ఎక్కువ కీళ్లకు విస్తరించేది (పాలీ ఆర్టిక్యులర్‌).. శరీరంలోని ఇతర భాగాలకూ పాకేది (సిస్టమిక్‌ ఆన్‌సెట్‌).. నడుంనొప్పికీ కారణమయ్యేది (జువెనైల్‌ స్పాండలో ఆర్థ్రయిటిస్‌).. సోరియాసిస్‌తో కూడినది (సొరియాటిక్‌).. ఇలా ఐదు రకాలున్నాయి. అల్లోపతిలో దీనికి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే సమస్యను కచ్చితంగా నిర్ధారించటం ముఖ్యం. కేవలం రక్త పరీక్షల ఆధారంగానే జేఐఏను నిర్ధారించటం కష్టం. రుమటాయిడ్‌ ఫ్యాక్టర్‌, హెచ్‌ఎల్‌ఏ బి27 వంటివి అందరిలోనూ పాజిటివ్‌గా ఉండాలనేమీ లేదు. కొందరిలో నెగెటివ్‌గానూ ఉండొచ్చు. అందువల్ల లక్షణాలు చాలా ముఖ్యం. మీరు దగ్గర్లోని రుమటాలజిస్టును సంప్రదించండి. లక్షణాలు, పరీక్షల ఆధారంగా సమస్యను నిర్ధారిస్తారు. ఇప్పటికే మీరు 13 సంవత్సరాలు ఆలస్యం చేశారు. మీకు సరైన వ్యాధి నిర్ధారణ జరగలేదని, తగు చికిత్స అందలేదని అనిపిస్తోంది. కాబట్టి కీళ్ల ఆకారంలో మార్పులూ వచ్చి ఉండొచ్చు. మందులతో ఎంత వరకు ఫలితం కనిపిస్తుందన్నది కచ్చితంగా చెప్పలేం. కానీ మెరుగైన ఫలితం కచ్చితంగా కనిపిస్తుంది. మందులతో పాటు మంచి ఆహారం తినటం, ఫిజియోథెరపీ తీసుకోవటం ద్వారా త్వరగా కోలుకుంటారు. మీరు నొప్పుల కారణంగా చాలావరకు ఇంట్లోనే ఉంటూ ఉండొచ్చు. దీంతో విటమిన్‌ డి లోపమూ తలెత్తి ఉండొచ్చు. దీన్ని కూడా ఒకసారి పరీక్షించుకొని, అవసరమైతే విటమిన్‌ డి మాత్రలు వేసుకోవాల్సి ఉంటుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని