దవడ పట్టేస్తుందేం?

మా అబ్బాయికి 20 ఏళ్లు. ఎప్పుడైనా పళ్లు బిగపట్టినప్పుడు కింది, పై దవడలు కలిసే చోట టక్‌ టక్‌మని చప్పుడు వస్తుందని అనేవాడు. ఎముకల డాక్టర్‌ దగ్గరికి వెళ్తే చెవి, ముక్కు, గొంతు సమస్యని చెప్పారు. ఇప్పుడు దంత సమస్యని అంటున్నారు.

Updated : 15 Dec 2020 01:18 IST

సమస్య-సలహా

సమస్య: మా అబ్బాయికి 20 ఏళ్లు. ఎప్పుడైనా పళ్లు బిగపట్టినప్పుడు కింది, పై దవడలు కలిసే చోట టక్‌ టక్‌మని చప్పుడు వస్తుందని అనేవాడు. ఎముకల డాక్టర్‌ దగ్గరికి వెళ్తే చెవి, ముక్కు, గొంతు సమస్యని చెప్పారు. ఇప్పుడు దంత సమస్యని అంటున్నారు. కరోనా మూలంగా దంత వైద్యుడిని సంప్రదించలేకపోయాం. ఇటీవల మా అబ్బాయి ఉదయం నిద్ర లేస్తూనే దవడ పట్టేసి, నోరు పూర్తిగా తెరవలేక ఇబ్బంది పడుతున్నాడు. కాసేపయ్యాక దానంతటదే పట్టు వదులుతుంది. ఇదేం సమస్య? దీనికి పరిష్కారమేంటి?

- రామ్‌ వి. (ఇ-మెయిల్‌)

సలహా: మీరు తెలిపిన వివరాలను బట్టి ఇది దవడ కీలు (టెంపరో మాండిబ్యులార్‌ జాయింట్‌) సమస్యగా అనిపిస్తోంది. కీలు మీద ఒత్తిడి పడటం దీనికి మూలం. సాధారణంగా ఒత్తిడి, ఆందోళన, వాపు, దెబ్బలు తగలటం వంటివి దీనికి కారణమవుతుంటాయి. నములుతున్నప్పుడు కింది పళ్లు, పై పళ్లు సరిగా తాకకపోయినా కీలు మీద ఒత్తిడి పడి సమస్యకు దారితీయొచ్చు. మరీ అతిగా నమలటం మూలంగానూ కీలు కండరాలపై విపరీత ప్రభావం పడొచ్చు. నోరు తెరచుకోవటానికి తోడ్పడే దవడ కీలు మన భుజం, మోకాలి కీళ్ల మాదిరిగా బంతి గిన్నె కీలే. ఇది కదలటానికి చుట్టుపక్కల ఉండే కండరాలు తోడ్పడుతుంటాయి. వీటిల్లో ఎక్కడ ఇబ్బంది తలెత్తినా నొప్పి, బిగుసుకుపోవటం వంటివి తలెత్తుతాయి. కారణమేంటన్నది విశ్లేషిస్తే గానీ మీ అబ్బాయి సమస్యేంటో బయటపడదు. మీరు వీలైనంత త్వరగా దంత వైద్యుడిని సంప్రదించండి. ఎక్స్‌రే తీసి కీలు అమరిక ఎలా ఉందన్నది గుర్తిస్తారు. కింది పళ్లు, పై పళ్లు సరిగా కలుసుకోక పోవటం వల్ల కీలు మీద ఒత్తిడి పడుతోందా? గతంలో ఎప్పుడైనా దెబ్బలు తగలం వల్ల మార్పులేవైనా తలెత్తాయా? అనేవి బయటపడతాయి. పళ్లు సరిగా కలుసుకోలేకపోతుంటే, వాటిని గుర్తించి సరిచేస్తే కీలు మీద ఒత్తిడి తగ్గి సమస్య కుదురుకుంటుంది. తినేటప్పుడు ఒక పక్కనే నమలటం, నిద్రలో పళ్లు కొరకటం వంటివీ చేటు తెచ్చేవే. ఇవీ కీలు మీద ఒత్తిడి పెరిగేలా చేసేవే. వీటిని మానుకుంటే కీలు బిగుసుకుపోవటమూ తగ్గుతుంది. ఒకవేళ మీ అబ్బాయికి దంత, ఎముక సమస్యలేవీ లేకపోతే మానసిక నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒత్తిడి, ఆందోళనతోనూ దవడ కీలు బిగుసుకుపోవచ్చు. మీ అబ్బాయి వయసు 20 ఏళ్లు అంటున్నారు. చదువుకునే వయసులో పరీక్షల మూలంగానో, ఇతర కారణాలతోనో ఒత్తిడి, ఆందోళన వంటివి ఎదుర్కొంటుండొచ్చు. వీటితో బాధపడేవారు తరచూ ముఖం, దవడ కండరాలు బిగపడుతుంటారు. పళ్లు కూడా కొరుకుతుండొచ్చు. ఇవి దవడ కీలు మీద విపరీత ప్రభావం చూపుతాయి. కొందరికి కీళ్లు అరగటం మూలంగానూ ఇలాంటి సమస్య తలెత్తొచ్చు. మీ అబ్బాయిది చిన్న వయసే కాబట్టి ఇలాంటిదేమీ ఉండకపోవచ్చు. ఏదేమైనా సమస్యను గుర్తిస్తే చికిత్స తేలికవతుంది. దవడ బిగువు సడలటానికి కొన్ని ప్రత్యేక వ్యాయామాలు ఉపయోగపడతాయి. అవసరమైతే మందులు వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే నోరు బాగా తెరవాల్సి వచ్చినప్పుడు (ఆవలింత వంటివి) దవడ కింద చేయి పెట్టుకొని నోరు పెద్దగా తెరవకుండా చూసుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్లక్ష్యం చేయటం తగదు. సమస్య ముదిరితే కీలు తెరచుకొని అలాగే ఉండిపోవచ్చు. చేత్తో కదిలిస్తే గానీ మూసుకోకపోవచ్చు (సబ్‌లగ్జేషన్‌). కొందరికి బంతి గిన్నె నుంచి కీలు జారిపోవచ్చు (డిస్‌లొకేషన్‌). దీంతో నోరు తెరచుకునే ఉంటుంది. దీన్ని ఆసుపత్రిలోనే సరిచేయాల్సి వస్తుంది.

మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను పంపాల్సిన చిరునామా

సమస్య - సలహా, సుఖీభవ, ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, 

హైదరాబాద్‌ - 501 512. email: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని