ఇదేం తలతిప్పు?

గత ఐదేళ్లుగా తీవ్రమైన తలతిప్పుతో బాధపడుతున్నాను. చెవిలో రింగుమనే మోత, తలనొప్పి సైతం వేధిస్తున్నాయి. బాగా తలతిప్పినప్పుడు వాంతులవుతాయి. చాలామంది డాక్టర్లకు చూపించాను. సీటీ, ఎంఆర్‌ఐ పరీక్షలు కూడా చేశారు. అయినా ఫలితం లేదు. దీనికి పరిష్కారమేంటి?

Published : 19 Jan 2021 00:54 IST

సమస్య-సలహా

ఎ. పోగుపడిన నీరు వాపు, ఒత్తిడికి దారితీస్తుంది.
బి. శరీర నిలకడకు సంబంధించిన సమాచారాన్ని వాపు అస్తవ్యస్తం చేస్తుంది.
సి. వాపుతో వినికిడి సమాచారం దెబ్బతింటుంది.
డి. మెదడుకు చేరే సమాచారం అస్తవ్యస్తమవుతుంది.

సమస్య: గత ఐదేళ్లుగా తీవ్రమైన తలతిప్పుతో బాధపడుతున్నాను. చెవిలో రింగుమనే మోత, తలనొప్పి సైతం వేధిస్తున్నాయి. బాగా తలతిప్పినప్పుడు వాంతులవుతాయి. చాలామంది డాక్టర్లకు చూపించాను. సీటీ, ఎంఆర్‌ఐ పరీక్షలు కూడా చేశారు. అయినా ఫలితం లేదు. దీనికి పరిష్కారమేంటి?

- అశోక్‌ హనుమల్ల, జగిత్యాల

సలహా: వివరాలను బట్టి చూస్తే మీరు మెనియర్స్‌ డిసీజ్‌తో బాధపడుతున్నారని తోస్తోంది. ఇందులో తలతిప్పు వచ్చిపోతూ ఉంటుంది. విచారం, బాధ, విపరీత ఆలోచనలు, ఒత్తిడి వంటివి వేధిస్తున్నప్పుడు ఇది ఎక్కువగా వస్తుంటుంది. ఒకోసారి నెలకు నాలుగైదు సార్లు రావొచ్చు. కొన్నిసార్లు ఆరు నెలలు, ఏడాది వరకైనా రాకపోవచ్చు. తల తిప్పటం 15, 20 నిమిషాల నుంచి 2, 3 గంటల వరకూ ఉండొచ్చు. తర్వాత వికారం, వాంతి మొదలవుతాయి. తలతిప్పటానికి ముందు చెవిలో మోత ఎక్కువవుతుంది. లోపలి చెవిలో ద్రవం పోగుపడటం వల్ల వినికిడిలోపం తలెత్తుతుంది. మామూలుగా నాడీకణాలు దెబ్బతింటే వినికిడి లోపం తిరిగి మెరుగవ్వదు. కానీ మెనియర్స్‌ డిసీజ్‌లో తలతిప్పు తగ్గాక వినికిడి మెరుగుపడుతుంది. దీనికి కారణం లోపలి చెవిలో ద్రవం ఒత్తిడి తగ్గటం. అయితే సమస్య ముదురుతున్నకొద్దీ క్రమేపీ వినికిడి తగ్గుతూ వస్తుంటుంది. మెరుగు పడదు. దీన్ని గుర్తించటానికి లక్షణాలే ముఖ్యం. ప్యూర్‌టోన్‌ ఆడియోమెట్రీ పరీక్ష ద్వారా సమస్యను నిర్ధారిస్తారు. అలాగే ఎలెక్ట్రో కోక్లియోగ్రఫీ, వెంప్‌ పరీక్షల ద్వారా లోపలి చెవిలో ద్రవం పోగుపడటాన్ని గుర్తించొచ్చు. మెనియర్స్‌ డిసీజ్‌లో తలనొప్పి ఉండదు. మీరు తలనొప్పితో బాధపడుతున్నారంటే అధిక రక్తపోటు, పార్శ్వనొప్పి వంటి సమస్యలేవైనా ఉన్నాయేమో కూడా చూడాల్సి ఉంటుంది. పార్శ్వనొప్పిలోనూ వాంతులు రావొచ్చు. కొందరికి తలతిప్పు రావొచ్చు. తలతిప్పు బాగా ఉన్నప్పుడు బీటాహిస్టీన్‌ మాత్రలు ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఇవి నోట్లో కరిగిపోయే పట్టీల రూపంలోనూ అందుబాటులో ఉన్నాయి. పట్టీని నాలుక మీద పెట్టుకుంటే వెంటనే కరిగిపోతుంది. త్వరగా ఫలితం కనిపిస్తుంది. ప్రోక్లోర్‌పెరజైన్‌ మాత్రలూ మేలు చేస్తాయి. మందులతో ఫలితం లేకపోతే కర్ణభేరి ద్వారా లోపలికి స్టిరాయిడ్‌ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతోనూ గుణం కనిపించకపోతే వారానికి ఒకసారి చొప్పున 3 సార్లు లోపలి చెవిలోకి జెంటామైసిన్‌ ఇంజెక్షన్‌ ఇస్తే తలతిరగటం పూర్తిగా నయమవుతుంది. అయితే కొందరికి కొంతకాలం శరీరం తూలిపోతుండొచ్చు. కొందరికి పాక్షికంగా వినికిడి తగ్గొచ్చు. అందుకే జెంటామైసిన్‌ ఇంజెక్షన్లను చివరి ప్రయత్నంగానే ఇస్తారు. పార్శ్వనొప్పి అయితే తగు మందులు వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆహారంలో ఉప్పు తగ్గించాలి. కాఫీ, టీలు ఎక్కువగా తాగరాదు. మద్యం, పొగతాగే అలవాట్లుంటే మానెయ్యాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని