పిల్లాడికి కడుపునొప్పి?

మా అబ్బాయికి ఐదేళ్లు. తరచూ కడుపునొప్పితో బాధపడుతుంటాడు. డాక్టర్‌కు చూపిస్తే అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేయించారు. పేగుల్లో చాలాచోట్ల కొద్దిగా గ్రంథులు ఉబ్బినట్టు తేలింది. శస్త్రచికిత్స నిపుణులకు చూపించమన్నారు. మాకు భయంగా ఉంది. ఇదేం సమస్య? దీనికి పరిష్కారమేంటి?

Published : 02 Feb 2021 00:40 IST

సమస్య-సలహా

సమస్య: మా అబ్బాయికి ఐదేళ్లు. తరచూ కడుపునొప్పితో బాధపడుతుంటాడు. డాక్టర్‌కు చూపిస్తే అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేయించారు. పేగుల్లో చాలాచోట్ల కొద్దిగా గ్రంథులు ఉబ్బినట్టు తేలింది. శస్త్రచికిత్స నిపుణులకు చూపించమన్నారు. మాకు భయంగా ఉంది. ఇదేం సమస్య? దీనికి పరిష్కారమేంటి?

- వెంకటేశ్‌, హైదరాబాద్‌

సలహా: మీరు తెలిపిన లక్షణాలను బట్టి చూస్తే పేగుల్లో లింఫ్‌ గ్రంథులు ఉబ్బినట్టు (ఎన్‌లార్జ్‌డ్‌ మెసెంట్రిక్‌ లింఫ్‌నోడ్స్‌) అనిపిస్తోంది. గ్రంథులు కొద్దిగానే ఉబ్బినట్టు తేలిందంటే సెంటీమీటరు కన్నా తక్కువ సైజులోనే ఉండి ఉండొచ్చు. ఇలాంటి చిన్న చిన్న ఉబ్బుల గురించి పెద్దగా భయపడాల్సిన పనేమీ లేదు. మన శరీరంలోని లింఫ్‌ వ్యవస్థ మనకు హాని చేసే క్రిముల వంటివి ప్రవేశిస్తే, వాటిని పట్టుకొని లింఫ్‌ గ్రంథులకు తరలిస్తుంది. అంటే పోలీసులు దొంగలను పట్టుకొని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చినట్టు అన్నమాట. పేగుల్లోని లింఫ్‌ గ్రంథులను మెసెంట్రిక్‌ లింఫ్‌ నోడ్స్‌ అంటారు. ఇవి చిన్నగానే ఉంటాయి. కడుపు మీద నొక్కి చూసినా చేతికి తగలవు. అల్ట్రాసౌండ్‌ పరీక్షలోనూ కనిపించవు. మీరు అల్ట్రాసౌండ్‌ పరీక్షలో గ్రంథులు ఉబ్బినట్టు తేలిందని అంటున్నారంటే లింఫ్‌ వ్యవస్థ ఇన్‌ఫెక్షన్‌తో గట్టిగా పోరాడుతోందనే అర్థం. సాధారణంగా పిల్లలు తరచూ ఏదో ఒకటి నోట్లో పెట్టుకుంటుంటారు. నీరు, ఆహారం ద్వారా లేదా నేరుగా నోట్లో చేతులు పెట్టుకోవటం ద్వారా పేగుల్లో ఇన్‌ఫెక్షన్‌ తలెత్తే అవకాశముంది. దీంతో లింఫ్‌ గ్రంథులు ఉబ్బుతాయి. మీ అబ్బాయికి వచ్చింది ఇలాంటి సమస్యే. గ్రంథుల కొద్దిగా ఉబ్బితే (సెంటీమీటరు కన్నా తక్కువ సైజు) ఆందోళన అవసరం లేదు. మందులతో పూర్తిగా తగ్గిపోతుంది. నిజానికి క్షయ వంటి తీవ్ర సమస్యల్లోనూ లింఫ్‌ గ్రంథులు ఉబ్బుతుంటాయి గానీ ఇవి కాస్త పెద్దగా ఉంటాయి. చాలావరకివి నొప్పి కలిగించవు. జ్వరం, బరువు తగ్గటం, ఆకలి తగ్గటం వంటి లక్షణాలూ ఉంటాయి. మీ అబ్బాయికి అలాంటివేవీ లేవు కాబట్టి తేలికగానే సమస్య తగ్గుతుంది. పిల్లల నిపుణులకు చూపించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని